
200 అడుగుల కిందికి జారిన చిన్నారి
రంగారెడ్డి: చిన్నారి మీనా ఇంకా బోరుబావిలోనే ఉంది. నిన్న(శుక్రవారం) మధ్యాహ్నం 40 అడుగుల దగ్గర కనిపించిన చిన్నారి ప్రస్తుతం 200 అడుగుల వద్ద కూడా కెమెరాకు కనిపించడం లేదు. బోరు బావి 490 అడుగులు ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. కెమెరా ద్వారా కొక్కెం సాయంతో చిన్నారిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. పాపను సజీవంగానే బయటకు తీసేందుకు అంతా శతవిధాల ప్రయత్నిస్తున్నారు. మూడో రోజు మంత్రి మహేందర్ రెడ్డి దగ్గరుండి పనులు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఓఎన్జీసీ సిబ్బందితో చర్చిస్తూ సహాయక చర్యలను మంత్రి ముమ్మరం చేశారు.
ఈ నెల 22న సాయంత్రం 4.45గంటల ప్రాంతంలో ఆడుకుంటూ వెళ్లిన చిన్నారి ప్రమాదవశాత్తు బోరు బావిలో పడింది. ఆటోమేటిక్ రోబో, మాన్యువల్ రోబో ద్వారా పాపను బయటకు తీసేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. మోటర్ తో సహా చిన్నారిని తీసేందుకు ఎన్డీఆర్‌ఎఫ్ విఫలయత్నం చేసింది. అయితే, మోటర్ మాత్రం బయటకు రాగా చిన్నారి మరింత లోతులోకి పడిపోయింది. ప్రస్తుతం నిరంతరాయంగా బోరుబావిలోకి ఆక్సిజన్ పంపిస్తున్నారు. బోరుబావికి సమాంతరంగా తవ్వకాలు కొనసాగుతున్నాయి. ఘటనాస్థలిని ఓఎన్‌జీసీ వాళ్లు సందర్శించారు. చిన్నారి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ సందర్భంగా మంత్రి మహేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అత్యాధునిక కెమెరాలను బోరుబావిలోకి పంపించామని చెప్పారు. 210 అడుగుల వరకు కెమెరాలను పంపిస్తామన్నారు. చిన్నారి ఎలా ఉన్నా బయటకు తీసి కుటుంబానికి అప్పగిస్తాం అని చెప్పారు.