
సినిమాలో కథానాయకలుగా రాణించడం అంత సులభం కాదు. అందం ఉండాలి, ప్రతిభ ఉండాలి. అంతకు మించి అవకాశాలు రావాలి. ఇవన్నీ కలగలిపిన తారలు ఎప్పటికీ అభిమానుల గుండెల్లో గూడు కట్టుకుని ఉండిపోతారు. అలాంటి వారిలో నటి మీనా, రోజా, రంభ వంటి 1990 క్రేజీ కథానాయకలుగా గుర్తింపు పొందారు. నటి మీనా బాల నటిగా రంగప్రవేశం చేసి అందరి మనసులను గెలుచుకున్నారు. ఆ తరువాత తెలుగు, తమిళం, మలయాళం తదితర భాషల్లో కథానాయకిగా అగ్రస్ధానంలో రాణించారు. ఇక నటి రోజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లోనూ రాణించిన తార.
అదే విధంగా అందాలకు చిరునామాగా మారిన నటి రంభ. వీరందరూ తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో స్టార్ హీరోల సరసన నటించి పేరు గడించిన బ్యూటీలే. కాగా స్టార్ హీరోయిన్‌గా రాణిస్తున్న తరుణంలోనే నటి మీనా విద్యాసాగర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని సంసార జీవితంలో సెటిల్ అయ్యారు. వీరికి నైనిక అనే కూతురు కూడా ఉంది. అలా ఆనందమయంగా సాగుతున్న మీనా జీవితంతో విధి ఆడుకుంది. ఆమె భర్త అనారోగ్యం కారణంగా కన్ను మూశారు. ఆ సంఘటన నుంచి బయట పడటానికి నటి మీనా చాలా కాలం పట్టింది.
కాగా ఇటీవలే మళ్లీ బయట ప్రపంచంలోకి వస్తున్న మీనా ఆదివారం సాయంత్రం చెన్నైలో నటి రోజా, రంభ, సంగీత, మహేశ్వరి, శ్రీదేవి వంటి స్నేహితురాళ్లను కలిశారు. వీరితో పాటు డాన్సింగ్ స్టార్ ప్రభుదేవా, నటుడు భరత్ తదితరులు ఉన్నారు. వీరంతా మాటా ఆట పాటలతో సరదాగా గడిపారు. ఆ ఫొటోలను నటి మీనా తన ఇన్‌స్టా గ్రామ్‌లో పోస్ట్ చేశారు. అందులో ప్రేమ, ఆదరణ, గత మధుర జ్ఞాపకాలతో ఒక అందమైన సాయం సమయం అని పేర్కొన్నారు. కాగా ఆ ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment