చిన్నారిని కబళించిన బోరుబావి
డక్కిలి : అప్పటి వరకు ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న చిన్నారి శశిరేఖ అకస్మాత్తుగా కనిపించకుండాపోయింది. పిల్లలతో కలిసి ఎక్కడోదగ్గర ఆడుకుంటూ ఉంటుందిలే అనుకున్నారు తల్లిదండ్రులు. చీకటిపడిన తర్వాత కూడా రాకపోవడంతో వారిలో ఆందోళన మొదలైంది. గ్రామంలోని అన్ని చోట్ల, బంధువులు, స్నేహితుల ఇళ్లలో వెదికారు. ఎవరిని ఆరా తీసినా ఫలితం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. అయినా ఎక్కడో చోట క్షేమంగా ఉంటుందనే ఆశతో రెండో రోజూ గాలింపు కొనసాగించారు. ఇంతలో వారి చెవిన పిడుగులాంటి వార్త ఒకటిపడింది.
పొలంలోకి తాటిపండు కోసం వెళ్లగా పాప బోరుబావిలో పడిందని ఓ బాలుడు చెప్పడంతో గుండె ఆగినంత పనయిపోయింది. అయినా బిడ్డ బతికుండాలనుకుంటూ దేవుళ్లందరికీ మొక్కు తూ అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్‌లో చిన్నారి మృతదేహమై బయటకు రావడంతో తల్లిదండ్రులతో పాటు డక్కిలి మండలంలోని కుప్పాయిపాళెం వాసులూ విషాదంలో మునిగిపోయారు. గ్రామానికి చెందిన నావూరు పెంచలనరసయ్య, శ్రీలక్ష్మిల కుమార్తె శశిరేఖ(4). ఆదివారం మధ్యాహ్నం అదృశ్యమైన ఈ చిన్నా రి బోరుబావిలో విగతజీవిగా మారింది. రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిన అధికారులు సోమవారం రాత్రి 7 గంటల సమయంలో బయటకు తీశారు.
వెలుగులోకి వచ్చిందిలా..
ఆదివారం మధ్యాహ్నం నుంచి శశిరేఖ ఆచూకీ కోసం తల్లిదండ్రులతో పాటు గ్రామస్తులు గాలిస్తున్నారు. పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం గ్రామానికే చెందిన తిరుమల అనే మతిస్థిమితం లేని బాలుడు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. శశిరేఖ బోరుబావిలో పడిన విషయాన్ని పిల్లలతో ఆడుకుంటున్న సమయంలో తిరుమల వెల్లడించాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు పొలంలోకి వెళ్లి చూడగా బోరుబావికి రాయి అడ్డుగా పెట్టివుండడం గమనించారు.
బాలికను ఎవరైనా బోరులో పడేసి ఉంటారనే అనుమానంతో పోలీసులు, అధికారులకు సమాచారం అందించారు. వెంకటగిరి సీఐ నరసింహరావు, డక్కిలి ఎస్సై జిలాని, రెవిన్యూ శాఖ సిబ్బంది మూడు జేసీబీలతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. బోరుబావిలో నుంచి చిన్నారిని వెలికితీసేందుకు రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించా రు. అయితే అగ్నిమాపక సిబ్బంది తమ వద్ద ఉ న్న గేలం లాంటి పరికరాన్ని బోరుబావిలోకి వ దలగా 10 అడుగుల లోతులోనే చిక్కుకుని మృతిచెందిన శశిరేఖ ఆచూకీ తెలిసింది. వెంటనే గేలం సాయంతోనే పాప మృతదేహాన్ని వెలికితీశారు.
రైతు నిర్లక్ష్యమే కారణం..
రైతు నిర్లక్ష్యం కారణంగానే చిన్నారి ప్రాణాలు కోల్పోయిందని గ్రామస్తులు ఆరోపించారు. కుప్పాయిపాళేనికి చెందిన రైతు మందాటి కేశవులు తన పొలంలో బోరు వేశాడు. నీరు పడలేదనే ఉద్దేశంతో బావికి ఏర్పాటు చేసిన కేసింగ్ పైపును అలాగే వదిలేశాడు. బావిని పూడ్చకపోవడంతో పాటు ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టలేదు. సాధారణంగా ఈ ప్రాంతంలో నీళ్లు పడకపోతే బోరుబావులను వెంటనే పూడ్చివేస్తారు.అయితే కేశవులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే శశిరేఖ బోరుబావిలో పడి మృతిచెందిందని అధికారులకు గ్రామస్తులు వివరించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని గూడూరు ఆర్డీఓ శ్రీనివాసులు తెలిపారు. బోర్లు వేసుకునే రైతులు తప్పనిసరిగా అధికారుల అనుమతి పొందాల్సిదేనని ఆయన స్పష్టం చేశారు. రైతు కేశవులుపై కేసు నమోదు చేశామని ఎస్సై జిలాని తెలిపారు.