
క్షేమంగా రావాలని..
►బోరుబావిలో పడిన బాలిక కోసం ప్రార్థనలు
►పాప ప్రాణాలను రక్షించేందుకు ముమ్మర యత్నాలు
►ఇక్కారెడ్డిగూడెంలో కొనసాగుతున్న సహాయక చర్యలు
► సాంకేతిక పరిజ్ఞానం వినియోగం .. ఫలించని ప్రయత్నాలు
►బోరుబావికి సమాంతరంగా మరో గొయ్యి తవ్వకం
►సంఘటన స్థలంలోనే మంత్రి మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, కలెక్టర్
చిట్టి తల్లీ.. క్షేమంగా రామ్మా.. నీవు నిండు నూరేళ్లూ బతకాలి.. మా కళ్లేదుట తిరుగుతూ.. ముద్దు ముద్దు మాటలు వినిపించాలి తల్లీ.. అంటూ అనేకమంది చిన్నారి కోసం ప్రార్థనలు చేస్తున్నారు. బోరుగుంత నీకెన్ని కష్టాలు తెచ్చిందమ్మా. నీవు తప్పకుండా మా మధ్యకు వస్తావు చిన్నారి. ఆ దేవుడు కరుణిస్తాడు అంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.
చేవెళ్ల/మొయినాబాద్/షాబాద్: చేవెళ్ల మండలంలోని చనువెళ్లి గ్రామ పరిధి ఇక్కారెడ్డిగూడెంలో గురువారం సాయంత్రం బోరుబావిలో పడిన 18నెలల ‘చిన్నారి’ని ప్రాణాలతో కాపాడేందుకు అధికార యంత్రాంగం ముమ్మరంగా చర్యలు చేపట్టింది. ఎన్ని ప్రయత్నాలు, ప్రయోగాలు చేస్తున్నా ఫలించడం లేదు. దీంతో ఎప్పటికప్పుడు ప్రత్యామ్నాయ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. శుక్రవారం సాయంత్రం బోరుబావికి సమాంతరంగా గోయి తీస్తుండగా వర్షం కురిసింది. దీంతో కొంత సేపు అంతరాయం ఏర్పడినా పనులను కొనసాగించారు. మరోపక్క బోరుగుంతలో పడిన చిన్నారి క్షేమంగా బయట పడాలని వేలాదిమంది ప్రార్థనలు చేశారు.
రెస్క్యూ టీం బృందం విఫలయత్నం..
బోరుబావిలో పడిన చిన్నారి ప్రాణాలను కాపాడేందుకు ఆధికార యంత్రాంగం, రెస్క్యుటీం బృందం తీవ్రంగా కృషి చేస్తోంది. గురువారం రాత్రి 7 గంటల నుంచి నిర్విరామంగా సహాయక చర్యలు చేపట్టింది. బోరుబావి ఉన్న ప్రాంతం రాళ్లతో కూడి ఉండటంతో దానికి సమాంతరంగా గోయి తీసేందుకు జేసీబీలకు, ఇటాచ్‌లను వినియోగించారు. నేల గట్టిగా ఉండటంతోపాటు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకునేందుకు గురువారం అర్థరాత్రి నుంచి గోయితీసే పనులు నిలిపి వేశారు. బోరుబావిలో సింగిల్‌ఫేజ్ మోటర్ ఉండడం వల్ల 40 అడుగుల లోతులోనే పాప చిక్కుకుంది. బోరుమోటర్ పైనే పాప ఉండటంతో మోటర్‌ను బయటకు తీస్తే పాపకూడా బయటకు వస్తుందని భావించారు. కానీ ఈ ప్రయత్నంలో బోరుమోటర్ మాత్రమే బయటకు వచ్చింది.
పాప అందులోనే ఉండిపోయింది. శుక్రవారం సాయంత్రం వరకు సాంకేతిక పరిజ్ఞాన సేవలను ఉపయోగించినా ఫలితం లేకపోవటంతో మళ్లీ సాయంత్రం నుంచి సమాంతరంగా గోయి తీసే పనులు ప్రారంభించారు. ఈ పనులు జోరుగా సాగుతున్నాయి. బోరుమోటర్‌ను బయటకు తీసిన తర్వాత ఇటాచీలతో తవ్వకాలు చేస్తున్న క్రమంలో పాప మరింత లోపలికి వెళ్లినట్లు అధికారులు చెబుతున్నారు. సాయంత్రం వర్షం పడటంతో సహాయక చర్యలకు కొంత అంతరాయం ఏర్పడినా చర్యలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర మంత్రి మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి, కలెక్టర్ రఘునందన్‌రావు, సైబరాబాద్ సీపీ సందీప్‌శాండిల్యా, జిల్లా ఫైర్ అధికారి హరినాథ్‌రెడ్డి, డీసీపీ, ఏసీపీలు, ఆర్డీఓలతో పాటు అన్ని శాఖ అధికారులు పరివేక్షణలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఎడతెగని ఉత్కంఠ..
పాపను ప్రాణాలతో బయటకు తీయడంలో అందరిలో ఉత్కంఠ నెలకొంది. ఏ క్షణంలో చిన్నారి బయటకు వస్తుందోనని అధికారులు,చిన్నారి తల్లిదండ్రులు, ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. పాప కనిపించకుండా పోయి 24 గంటలు దాటడంతో మరింత ఉత్కంఠ నెలకొంది.
రాత్రి నుంచి సంఘటన స్థలంలోనే మంత్రి
గురువారం రాత్రి సంఘటన స్థలానికి చేరుకున్న రాష్ట్ర మంత్రి మహేందర్‌రెడ్డి, కలెక్టర్ రఘునందన్‌రావు, ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డిలు ఉన్నతాధికారులను అదేశించడంతో హుటాహుటిన సహాయక బృందాలు రంగంలోకి దిగాయి.
గురువారం రాత్రినుంచి మంత్రి, ఎమ్మెల్యే, కలెక్టర్, పలువురు ప్రజాప్రతినిధులు ఇక్కడే ఉన్నారు. జిల్లా అధికారులు కూడా అక్కడే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
సహాయక చర్యల్లో ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం
చిన్నారిని కాపాడేందుకు గురువారం రాత్రే ఎన్‌డీఆర్‌ఎఫ్ (నేçషనల్ డిజాస్టర్ ర్యాపిడ్ పోర్స్) బృందం రంగంలోకి దిగింది పరిస్థితని పరిశీలించి చేపట్టాల్సిన సహాయక చర్యలు తీసుకుంది. 108అంబులెన్స్‌ల ద్వారా పాపకు ఆక్సిజన్‌ను అందిస్తున్నారు. బోరుబావిలో పడిన వారిని బయటకు తీసేందుకు ఉపయోగించే రోబోటిక్ యంత్రాలను ఉపయోగించారు. విజయవాడలోని మంగళగిరి నుంచి తెల్లవారుజామున మూడు గంటలకు ఈ యంత్రాలను తెప్పించారు.అప్పటి నుంచి శుక్రవారం సాయంత్రం వరకు పాపను బయటకు తీసేందుకు తీవ్రంగా కృషి చేశారు. సీసీ కెమెరాలను లోపలికి పంపించి లోపలి దృశ్యాలను ల్యాప్‌టాప్‌లో ఎప్పటికప్పుడు వీక్షించి చర్యలు చేపట్టారు. కానీ, వారి కృషి ఫలించలేదు.
అదేవిధంగా టీవీల్లో వస్తున్న ప్రమాద వార్త చూసిన నల్లగొండ జిల్లాకు చెందిన పుట్ట కరుణాకర్ ప్రమాద స్థలానికి చేరుకున్నారు. సీసీ కెమెరాల ఆధారంతో రాడ్‌ల సహాయంతో తాడు కట్టి చిన్నారిని బయటకు తీసేందుకు తీసేందుకు ప్రయత్నించాడు. అతని ఫలితం కూడా ఫలించలేదు. అలాగే చిన్నారిని కాపాడేందుకు సింగరేణి నుంచి నిపుణులను పిలిపించారు. వారు కూడా చిన్నారిని కాపాడేందుకు అన్నివిధాలుగా ప్రయత్నిస్తున్నారు.
చిన్నారీ.. భయపడకమ్మా.. తాడు పట్టుకో.. ఏడవకు
నల్లగొండ నుంచి వచ్చిన బృందం సభ్యులు ఇనుప రాడ్‌కు తాడుకట్టి బోరుబావిలోకి వదిలి చిన్నారి చేతులకు దానిని కట్టి పైకి లాగే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో 40 అడుగుల లోపల ఉన్న చిన్నారిలో కదలికలు కనిపించాయి. ఏడుపు వినిపించింది. దీంతో అధికారులు చిన్నారి తల్లి రేణుకతో పాపకు వినబడేలా ‘‘చిన్నారీ భయపడకు.. తాడు పట్టుకోమ్మా..’’ అంటూ చెప్పించారు. చిన్నారీ.. ఏడవకు అంటూ తల్లి చేస్తున్న సైగలతో లోపల ఉన్న చిన్నారి రోదనలు బయటకు వినిపించాయి. దీంతో పాప బతికే ఉందని సంకేతాలు అందుతున్నాయని.. పాప క్షేమంగా బయటకు వస్తుందని అందరూ ఆశగా ఉన్నారు. అయితే, చిన్నారి తాడును పట్టుకునేందుకు సహకరించకపోవడంతో ఆ ప్రయత్నమూ ఫలించలేదు.