
ఆడపిల్ల జన్మోత్సవాల్లో ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్
‘మా పాప – మా ఇంటి మణిదీపం’పేరిట వినూత్న కార్యక్రమం
ఆడపిల్ల పుడితే తల్లిదండ్రులకు సన్మానం
ఖమ్మం: భగవంతుడు అవకాశం ఇస్తే తమకు ఆడపిల్ల పుట్టాలని కోరుకుంటానని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ పేర్కొన్నారు. పాలనలో వినూత్న విధానాలతో తనదైన శైలి కనబరుస్తున్న ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ మరో నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆడపిల్ల భారమని భావించకుండా వరంలా పరిగణించేలా తల్లిదండ్రులను ప్రోత్సహించేందుకు ‘మా పాప – మా ఇంటి మణిదీపం’కార్యక్రమాన్ని రూపొందించారు.
ఇందులో భాగంగా జిల్లాలో ఆడపిల్లకు జన్మనిచ్చిన దంపతులను జిల్లా యంత్రాంగం తరపున సన్మానించి.. స్వీట్ బాక్స్, ప్రశంసాపత్రం ఇచ్చేలా ఆడపిల్ల జన్మోత్సవాలను బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ తల్లాడ మండలం రామచంద్రాపురంలో 26 రోజుల క్రితం ఆడశిశువుకు జన్మనిచి్చన బానోత్ కృష్ణవేణిని ఆమె తల్లి, అత్తయ్యతో కలిపి సత్కరించారు. వారికి స్వీట్ బాక్స్, పండ్లతో పాటు.. ‘అభినందనలు.. మీ ఇంట్లోకి మహాలక్ష్మి వచ్చింది’అంటూ ముద్రించిన సరి్టఫికెట్ అందజేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఆడపిల్లలు చూపించే ప్రేమ మగపిల్లలు చూపించరని స్పష్టం చేశారు. చదువులోనూ అమ్మాయిలే రాణిస్తున్నారని ప్రశంసించారు.
తల్లిదండ్రులు ఆడపిల్లను అదృష్టంగా భావిస్తూ, సమానంగా చూస్తూ చదివించాలని కోరారు. సమానంగా ఆస్తిలో వాటా ఇవ్వాలని సూచించారు. జిల్లాలో ఏ ఇంట్లో ఆడపిల్ల పుట్టినా జిల్లా అధికారులు వెళ్లి తల్లిదండ్రులకు స్వీట్ బాక్స్ ఇచ్చి అభినందిస్తారని తెలిపారు. కాగా, అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ, జెడ్పీ సీఈవో దీక్షారైనాతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు జిల్లాలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.