చిన్నారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్న అగ్నిమాపక దళం
బోరు బావిలో పడ్డ చిన్నారిని వీరోచిత శ్రమతో అగ్నిమాపక సిబ్బంది, సహాయ బృందాలు రక్షించాయి. రెండున్నర గంటలు పోరాడి రెండేళ్ల చిన్నారిని మృత్యుంజయురాల్ని చేశారు. ఆదివారం నాగపట్నం జిల్లా పుదుపల్లం గ్రామంలో ఈ ఘటనచోటుచేసుకుంది.
సాక్షి, చెన్నై : నీళ్లు లేని బోరు బావుల్ని మూసివేయాలని, కొత్తగా బోరు బావులు ఏర్పాటు చేస్తే తప్పనిసరిగా అధికారుల అనుమతి పొందాలనే ఆదేశాలు ఉన్నా, వాటిని అమలుపరిచే వారు గతంలో కరువయ్యారు. అధికారుల నిర్లక్ష్యానికి ప్రతిఏటా రాష్ట్రంలో ఇద్దరు లేదా, ముగ్గురు పిల్ల ల్ని బోరు బావులు మింగేశాయి. ముక్కు పచ్చలారని చిన్నారులు ఆడుకుంటూ బోరు బావుల్లో పడి తల్లిదండ్రులకు కడుపు కోతను మిగుల్చుతుండడం క్రమంగా పెరిగింది. ఒకరిద్దరు మినహా తక్కిన వాళ్లందరూ బోరు బావిలోనే తుది శ్వాస విడిచారు. రెండేళ్ల క్రితం హైకోర్టు కొరడా ఝుళిపించడంతో బోరు బావుల వైపు అధికార వర్గాలు పరుగులు తీశాయి. నిరుపయోగంగా ఉన్న వాటిని శాశ్వతంగా మూసివేసే పనిలో పడ్డాయి. అలాగే, ఎక్కడ బడితే అక్కడ, ఎవరు బడితే వాళ్లు బోరు బావుల్ని తవ్వేయకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. బోరు బావి తవ్వాల్సి ఉంటే, ప్రభుత్వ నిబంధనల మేరకు అన్ని అనుమతుల పొందే విధంగా చర్యలు తీసుకున్నారు. దీంతో ఏడాదిన్నర కాలంగా బోరు బావుల్లో చిన్నారులు పడ్డ ఘటనలు చోటు చేసుకోలేదు. ఈ నేపథ్యంలో ఆదివారం నాగపట్నంలోని బోరు బావిలో చిన్నారి పడ్డ సమాచారం మళ్లీ బోరు బావుల వైపు దృష్టిని మరల్చింది.
వీరోచితంగా శ్రమించిన బృందం
నాగపట్నం జిల్లా పుదుపల్లం గ్రామానికి చెందిన కార్తికేయన్ కుమార్తె శివదర్శిని ఉదయం పదిన్నర గంటలకు ఇంటికి సమీపంలోని బోరు బావిలోపడింది. పొలంలోనే నివాసం ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్న కార్తికేయన్ హఠాత్తుగా తన కుమార్తె కనిపించకపోవడంతో ఆందోళన చెందాడు. ఇటీవల తవ్వి వదలి పెట్టిన బోరు బావి వైపు పరుగులు తీశాడు. అందులో నుంచి శివదర్శిని ఏడుపులు వినిపించడంతో ఆందోళన చెందాడు. ఆ గ్రామస్తులు అక్కడికి చేరుకుని తమ వంతు ప్రయత్నాలు చేపట్టారు. సమాచారం అందుకున్న నాగపట్నం, వేలాంగనిలకు చెందిన అగ్నిమాపక సిబ్బంది, రెవెన్యూ, వైద్య అధికారులతో కూడిన బృందం పరుగులు తీసింది. రెండు గంటల్లో అధికారులు అక్కడికి చేరుకున్నారు.
రెండేళ్ల ఆ చిన్నారి పదిహేను అడుగుల లోతులో ఉన్నట్టు గుర్తించారు. ఆ చిన్నారికి ఆక్సిజన్ అందించారు. మరోవైపు ఆ బోరు బావికి సమాంతరంగా గోతిని తవ్వారు. ఆ చిన్నారి కిందకు జారి పడకుండా పైన నుంచి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఓ వైపు ఆక్సిజన్ అందిస్తూనే మరో వైపు కిందకు జారిపోని రీతిలో లోనికి అడ్డుగా ఉండే వస్తువుల్ని పంపించారు. రెండున్నర గంటల పాటు వీరోచితంగా శ్రమించారు. సమాంతరంగా తవ్విన గోతి ద్వారా, బోరు బావికి వేసిన పైప్ లైన్‌ను కత్తిరించారు.చిన్న పొరబాటు కూడా జరగకుండా జాగ్రత్త పడ్డారు. ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి ఆ చిన్నారిని తమ గుప్పెట్లోకి తీసుకున్నారు. తక్షణం అక్కడున్న అంబులెన్స్‌లో ఎక్కించి వైద్య పరీక్షలు అందించారు. హుటాహుటిన మెరుగైన చికిత్స నిమిత్తం నాగపట్నం ఆస్పత్రికి తరలించారు. అక్కడ శివదర్శినికి వైద్య చికిత్సలు అందిస్తున్నారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, చిన్నారి ఆరోగ్యంగా ఉన్నట్టు వైద్య వర్గాలు పేర్కొన్నాయి. కాగా, సకాలంలో స్పందించడమే కాకుండా, చాకచక్యంగా వ్యవహరించి చిన్నారిని రక్షించిన సహాయ బృందాల్ని ఆ పరిసర గ్రామస్తులు కరతాళ ధ్వనులతో అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment