ఊటబావికి పెట్టిన మోటార్ పైప్‌లైన్ నుంచి పసుపు పంటలోకి ఎగిసి పడుతున్న జలాలు
ఐదొందల నుంచి వెయ్యి ఫీట్ల లోతు వరకు బోరు వేసినా చాలా చోట్ల చుక్కనీరు పడని పరిస్థితి. దీంతో రైతన్నలు అప్పులపాలై ఆగమైన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. కానీ.. ఇక్కడ మాత్రం ఒక్క బోరు లేకుండా ఊరంతా పచ్చని పంటలతో కళకళలాడుతోంది. యాసంగిలోనూ కనుచూపు మేర పసుపు, పత్తి, మొక్కజొన్న, గోధుమ పంటలతో కనువిందు చేస్తోంది. అదెలా సాధ్యమంటారా..? ఎప్పుడో ఏళ్ల క్రితం ఆ గ్రామస్తులు పెట్టుకున్న ఓ ‘కట్టుబాటే’నేటికీ నీటి కష్టాన్ని తెలియనివ్వడం లేదు. ఊర్లో ఎవరూ బోర్లు వేయకూడదని నిర్ణయించారు. ఇప్పటికీ దాన్ని పాటిస్తూ ఊట బావులపైనే వారు ఆధారపడుతున్నారు.
సాక్షి, నిర్మల్ : అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న బోరిగాం గ్రామం నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలంలో ఉంటుంది. సాధారణంగా ఏ ఊరు.. ఏ పంట చేలకు వెళ్లినా.. బోరుబావుల ద్వారానే సాగు చేయడం చూస్తుంటాం. బోరిగాంలో మాత్రం ఎక్కడ చూసినా ఊటబావులే దర్శనమిస్తాయి. 40 అడుగుల లోతు ఉన్న ఆ బావుల్లో ఎప్పుడూ సగానికి పైగా నీరు ఉంటుంది. మూడు కాలాలు ఆ బావుల్లో నీళ్లు ఊరుతూనే ఉంటాయి. ఎప్పుడు చూసినా పంట పొలాలు పచ్చగా కళకళలాడుతాయి.
కట్టుబాటే ఊటైంది
‘మన ఊళ్లో ఎప్పటికీ నీటి కష్టం రావొద్దంటే.. ఎవరు కూడా బోర్లు వేయొద్దు. ఎన్నాళ్లయినా బావులను తవ్వుకునే సాగు చేసుకోవాలె..’అంటూ ఎప్పుడో బోరిగాం గ్రామస్తులు ముందు చూపుతో పెట్టుకున్న ఆ కట్టుబాటు ఇప్పటికీ జలసిరులకు ఢోకా లేకుండా చేస్తోంది. 30–40 ఏళ్ల క్రితం తవ్విన బావులూ ఉన్నాయి. కుటుంబాలు విడిపోయి, వేరుపడిన అన్నదమ్ములు సైతం పంపకాల్లో తమకు వచ్చిన భూముల్లో మళ్లీ బావులనే తవ్వుకున్నారు తప్ప బోర్లు వేయలేదు. ఇలా తమ పెద్దలు పెట్టిన కట్టుబాటునే కొనసాగిస్తూ ఊట నీటితో పోటాపోటీగా పంటలు పండిస్తున్నారు.
చెరువులే అండ..
ఓరుగల్లు కాకతీయుల ఏలుబడి ప్రభావం నిర్మల్ ప్రాంతం పైనా ఉంది. నిర్మల్ కేంద్రంగా పాలించిన రాజులు సైతం చెరువుల తవ్వకాలను ప్రోత్సహించారు. బోరిగాం గ్రామంలోనూ మూడు చెరువులు ఉన్నాయి. ఈ చెరువులే గ్రామంలో ఊటబావులకు అండగా ఉంటున్నాయి. గ్రామానికి ఓ వైపు కొండ ప్రాంతం ఉండటంతో వానాకాలంలో వాటిపై నుంచి వచ్చే నీరు చెరువులలో చేరుతుంది. అలాగే.. సమీపంలో ఎస్సారెస్పీ కెనాల్ కూడా ఉండటంతో భూగర్భ జలాలు అడుగంటకుండా ఉంటున్నాయి. ఊటలకు ఇవి కూడా ఒక కారణమై ఉండొచ్చని గ్రామస్తులు చెబుతున్నారు. వర్షాభావ పరిస్థితులు తీవ్రంగా ఉండి, చెరువులు నిండని రోజుల్లోనే బావుల్లో కొంత నీటిమట్టం తగ్గుతుందని రైతులు పేర్కొంటున్నారు. అయితే.. ఏనాడూ నీటి సమస్య ఉత్పన్నం కాలేదని చెబుతున్నారు.
బావుల్లో చేపలు సైతం..
బోరిగాం గ్రామంలో ఊట బావులను రైతులు సాగుతో పాటు చేపల పెంపకానికి కూడా ఉపయోగించుకుంటున్నారు. తమ చేలల్లో పండిన మొక్కజొన్న తదితర పంట దాణాలనే వేస్తుండటంతో ఖర్చు లేకుండా కొద్దికాలంలోనే చేపలు పెరిగి అదనపు ఆదాయాన్ని ఇస్తున్నాయి. కాగా, బోరిగాంలో మొత్తం వ్యవసాయ సాగు విస్తీర్ణం 594 ఎకరాలు. ఇందులో పత్తి 325 ఎకరాలు, వరి 231 ఎకరాలు, పసుపు 60 ఎకరాలు, సోయా ఐదెకరాలు, కందులు 32 ఎకరాలలో సాగు చేస్తున్నారు. రెండో పంటగా మొక్కజొన్న, గోధుమ, నువ్వులు సాగు చేస్తున్నారు. చాలామంది అంతర పంటలుగా కూరగాయలను సాగు చేస్తున్నారు.
కలసికట్టుగా ఉండటం వల్లే..
మా గ్రామంలోని రైతులందరం గతంలో చేసిన తీర్మానానికి కట్టుబడి ఉన్నాం. ఇప్పటి వరకు వ్యవసాయ చేనుల్లో ఒక్క బోరును వేయించలేదు. దీంతోనే ఊట బావులలో పుష్కలంగా నీళ్లు ఉంటున్నాయి.
– అమరేశ్వర్, రైతు, బోరిగాం
్ఞఊట బావుల ద్వారానే..
ఏళ్లుగా మా గ్రామంలో ఊటబావుల ద్వారానే సాగు కొనసాగుతోంది. ఇప్పటితరం రైతులమైనా వాటి ద్వారానే సాగు చేస్తున్నాం. మేము కూడా బోర్లు గురించి ఆలోచన ఎప్పుడూ చేయలేదు.
– అనిల్, యువ రైతు, బోరిగాం
చేపల పెంపకం చేపట్టా..
నాకున్న ఎకరంన్నర భూమిలో పసుపు సాగు చేస్తున్నా. బావిలో నీళ్లు పుష్కలంగా ఉండటంతో చేపల పెంపకం చేపట్టా. చేనులో పండిన మక్కలనే దాణాగా వేస్తున్నా. గత ఏడాది 10 క్వింటాళ్ల వరకు చేపల దిగుబడి వచ్చింది.
–శంకర్, రైతు, బోరిగాం
Comments
Please login to add a commentAdd a comment