జిల్లాలో భూగర్భ నీటి మట్టం పెరిగింది. ఆగస్టులో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిశాయి. ముసురు పెట్టడంతో నీరు భూమిలోకి ఇంకి పోయింది. జూలై మాసానికి పోల్చుకుంటే సగటున 3.31 మీటర్లు నీట మట్టం పెరిగింది.
సాక్షి, నిజామాబాద్ : పాతాల గంగ పైపైకి వచ్చింది. ఆగస్టు మాసంలో కురిసిన భారీ వర్షాలకు భూగర్భ జల మట్టం భారీగా పెరిగింది. జూలై మాసంతో పోల్చితే జిల్లాలో సగటున 3.31 మీటర్లు పైకి వచ్చింది. జూలైలో సగటున 12.28 మీటర్ల లోతులో ఉంటే., ఇప్పుడు 8.97 మీటర్లు పైకి వచ్చాయి. గత ఏడాది 2019 ఆగస్టు మాసంలో 11.64 మీటర్ల లోతులో ఉండగా, ఇప్పుడు 8.97 మీటర్ల వరకు పెరగడంతో అన్నదాతల్లో ఆనందం వ్యక్తమవుతోంది. గత నెలలో జిల్లాలో విస్తారంగా వర్షాలు పడ్డాయి. వారం రోజుల పాటు ఎడతెరపి లేకుండా వర్షం కురిసింది. వాగులు వంకలు పొంగి ప్రవహించాయి. ప్రధానంగా రోజుల తరబడి ముసురు పెట్టడంతో వర్షం నీరు క్రమంగా భూమిలోకి ఇంకి పోయింది. ముప్కాల్, బాల్కొండ మండలాలు మినహా, మిగిలిన 23 మండలాల్లో సాధారణ వర్షపాతం రికార్డు అయింది. వేల్పూర్, నవీపేట్, ఎడపల్లి, రెంజల్ మండలాల్లో ఎక్సెస్ వర్షపాతం నమోదైంది. దీంతో భూగర్భ నీటి మట్టం పైకి వచ్చాయి. జిల్లా వ్యాప్తంగా 49 చోట్ల ఏర్పాటు చేసిన ఫీజో మీటర్లలో తాజా నీటి మట్టాలను భూగర్భ జలశాఖ వారం రోజుల క్రితం లెక్కించింది.
సిరికొండలో అత్యధికంగా..
జిల్లాలో సిరికొండ మండలంలో భూగర్భ నీటి మట్టం లోతులో ఉంటుంది. ఇలాంటి మండలాల్లో కూడా ఈసారి భూగర్భ జలాలు భారీగా పెరగడం గమనార్హం. చీమన్‌పల్లిలో ఏకంగా 12.9 మీటర్లు పైకి వచ్చాయి. ఇక్కడ జూలైలో 23.70 మీటర్ల లోతులో నీటి మట్టం ఉండేది. ఆగస్టు మాసానికి వచ్చేసరికి 10.80 మీటర్లపైకి నిళ్లు వచ్చాయి. అలాగే పాకాలలో కూడా 5.7 మీటర్లు పెరిగాయి. ఇక్కడ 20.55 మీటర్ల లోతులో ఉన్న నీరు.. నెల రోజుల్లో 14.85 మీటర్ల పైకి వచ్చాయి.
ఎండా కాలంతో పోల్చితే..
ఎండా కాలంతో పోల్చితే జిల్లాలో స్వల్పంగానే పెరిగినట్లు భూగర్భ జలశాఖ తాజా నివేదికలో పేర్కొంది. ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభం కాకముందు మే మాసంలో జిల్లాలో సగటున 11.95 మీటర్ల లోతులో ఉన్న నీటి మట్టం ఇప్పుడు 8.97 మీటర్లకు పెరిగింది. అంటే సగటున 2.98 మీటర్లు పెరిగింది.
నివేదికల్లో గందరగోళం...
భూగర్భ జల శాఖ విడుదల చేసిన తాజా నివేదికలో కొన్ని గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సాధారణంగా వర్షాలు కురిస్తే భూగర్భ జల మట్టం పెరుగుతుంది. కానీ కొన్ని ఫీజో మీటర్ల పరిధిలో తగ్గినట్లు నివేదికలో పేర్కొనడం గమనార్హం.
⇔ భీంగల్ మండలం గోన్‌గొప్పులలో మే మాసంలో 29.55 మీటర్ల లోతులో నీటి మట్టం ఉందని పేర్కొనగా, ఆగస్టుకు వచ్చే సరికి మూడు నెలలు భారీ వర్షాలు కురిసినా.. ఇక్కడ 32.47 మీటర్లకు పడిపోయినట్లు రికార్డుల్లో పేర్కొన్నారు. జూన్, జూలై, ఆగస్టు మాసాల్లో భారీ వర్షాలు కురిసాయి. దీంతో ఇక్కడ నీటి మట్టం పెరగాల్సి ఉండగా, అధికారులు మాత్రం 2.92 మీటర్లు ఇంకా లోతుకు పడిపోయినట్లు చూపారు. తాళ్లపల్లిలో కూడా ఇలాగే ఎండా కాలం కంటే వర్షా కాలంలో నీటి మట్టం పడిపోయినట్లు చూపారు.
⇔ డిచ్‌పల్లి మండలం యానంపల్లిలో కూడా వర్షాలు కురిసాక భూగర్భ జల మట్టం తగ్గినట్లు పేర్కొన్నారు. అలాగే కోటగిరి మండలం కల్లూరులో కూడా ఎండాకాలం కంటే వర్షాకాలంలో నీటి మట్టం పడిపోయినట్లు తెలిపారు. అయితే కొన్ని ఫీజో మీటర్ల పరిధిలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయని, ప్రత్యేక పరిశీలన చేస్తామని భూగర్భ జలశాఖ వర్గాలు పేర్కొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment