nizmabad district
-
ఫొటోలు తీయడమే కర్తవ్యమన్నట్లుగా.. ఏంది సారూ ఇది!
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : శాంతిభద్రతల పరిరక్షణ ఎంత ముఖ్యమో ట్రాఫిక్ నియంత్రణకు అంతటి ప్రాధాన్యత ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలో జిల్లా పోలీసులు ట్రాఫిక్ ని యంత్రణలో తూతూమంత్రంగా వ్యవహరిస్తున్నారు. ట్రాఫి క్ నియంత్రణ సక్రమంగా నిర్వహించకపోగా పోలీసులే ట్రా ఫిక్ సమస్యలు సృష్టించే పరిస్థితి నడుస్తోంది. ప్రతి కూ డలిలో ట్రాఫిక్ పోలీసులు ఉన్నప్పటికీ ట్రాఫిక్ మాత్రం నియంత్రణలో ఉండడం లేదు. పట్టపగలు భారీ వాహనాలు వెళ్తున్నా పట్టింపులేదు. ట్రాఫిక్ చలాన్ల ఫొటోలు తీయడం లక్ష్యంతోనే పనిచేస్తున్నారు. ఎక్కడ చూసినా, ఏ సమయంలోనైనా, ఏ పోలీసు కానిస్టేబుల్ అయినా ఫొటోలు తీయడమే తమ కర్త వ్యమన్నట్లుగా వ్యవహరిస్తూ కనిపిస్తుండడం గమనార్హం. ఇక పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల వసూళ్లకు సంబంధించి పోలీసులు పలు చోట్ల తిష్ట వేసి తనిఖీలు చేస్తుండడంతో ప్రధాన రహదారులపై ట్రాఫిక్ సమస్యలు ఎక్కువవుతున్నాయి. ఫొటోలు తీసి, చలాన్లు వేసి, అందుకు సంబంధించిన జరిమానాలు వసూళ్లు చేయడమే లక్ష్యంగా ముందుకు వెళుతుండడం విశేషం. ఇదిలా ఉండగా మరోవైపు బార్ షాపుల వద్ద కొందరు కానిస్టేబుళ్లు మఫ్టీలో ఉండి సమీపంలో ఉన్న పోలీసులకు సమాచారం ఇస్తున్నారు. అందుకు అనుగుణంగా పోలీసులు అడ్డాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ ద్వారా భారీగా జరిమానాలు వసూలు చేస్తున్నారు. ► ట్రాఫిక్ చలాన్లు పంపే విషయంలో ఒక విధానం లేకుండా పోయింది. ఇటీవల నిజామాబాద్ జిల్లా నందిపేటకు చెందిన గ్లామర్ బైక్ కలిగి ఉన్న ఒక వ్యక్తికి హెల్మెట్ ధరించనందుకు చలాన్ విధించినట్లు మెసేజ్ వచ్చింది. అయితే ఈ ఫొటో తీసింది మాత్రం హన్మకొండ జిల్లా కాజీపేటలో కావడం గమనార్హం. అది కూడా షైన్ బైక్ కావడం విశేషం. అసలు హన్మకొండకు వెళ్లని బైక్‌కు జరిమానా రావడం విడ్డూరం. పోలీసు శాఖ తప్పిదం అయినప్పటికీ చలాన్ మొత్తం చెల్లించాలని జిల్లా పోలీసులు చెబుతుండడం చిత్రంగా ఉంది. చెప్పుకుంటూ పోతే ఇలా ఇష్టం వచ్చినట్లు చలాన్లు వేసిన కేసులు కోకొల్లలు.కాగా ట్రాఫిక్ పెండింగ్ చలాన్లు వసూలు చేసే విషయంలో పోలీసులు కొందరు వాహనదారుల పట్ల దురుసుగా ప్రవర్తి స్తుండడంపై తీవ్ర విమర్శలు ఉన్నాయి. -
Football: అదరగొట్టిన సౌమ్య గుగులోత్.. భారత్ శుభారంభం
Women's Olympic Football Tournament Paris 2024- Asian Qualifiers బిష్కెక్: ఆసియా ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఎఫ్సీ) మహిళల ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీ రౌండ్–1లో భారత జట్టు శుభారంభం చేసింది. గ్రూప్ ‘జి’లో భాగంగా మంగళవారం కిర్గిజ్ రిపబ్లిక్‌తో జరిగిన తొలి లీగ్ మ్యాచ్‌లో భారత్ 5–0 గోల్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. భారత్ తరఫున తెలంగాణ అమ్మాయి సౌమ్య గుగులోత్ విశేషంగా రాణించింది. నిజామాబాద్ బిడ్డ నిజామాబాద్ జిల్లాకు చెందిన సౌమ్య ఈ మ్యాచ్‌లో ఒక గోల్ చేయడంతోపాటు సహచరిణి అంజు తమాంగ్ రెండు గోల్స్ చేయడంలో సహాయం చేసింది. భారత జట్టుకు అంజు తమాంగ్ (6వ, 42వ ని.లో) రెండు గోల్స్ అందించగా... సౌమ్య గుగులోత్ (45+3వ ని.లో), షిల్కీ దేవి (61వ ని.లో), రేణు (63వ ని.లో) ఒక్కో గోల్ సాధించి పెట్టారు. శుక్రవారం కిర్గిజ్ రిపబ్లిక్ జట్టుతోనే భారత్ రెండో లీగ్ మ్యాచ్ ఆడుతుంది. గ్రూప్ ‘జి’లోని మూడో జట్టు తుర్క్మెనిస్తాన్ టోర్నీ నుంచి వైదొలిగింది. చదవండి: థండర్‌బోల్ట్.. దెబ్బకు బ్యాట్ విరిగిపోయింది! వీడియో వైరల్ అందుకే అక్షర్‌తో బౌలింగ్ చేయించలేదు.. మా నుంచి అతడు మ్యాచ్ లాగేసుకున్నాడు! IPL 2023: చెత్తగా ఆడుతున్నాడు.. వాళ్లను చూసి నేర్చుకో! సెహ్వాగ్ ఘాటు విమర్శలు -
నిజామాబాద్ లో వైద్య విద్యార్థి ఆత్మహత్య
-
వదినమ్మ కనిపించడం లేదని.. ఆఖరికి అతడే!
సాక్షి, మోర్తాడ్: తన వదినమ్మ కనిపించడం లేదు.. ఎలాగైనా వెతికి పెట్టండి అంటూ రోజు పోలీసు స్టేషన్ చుట్టూ తిరుగుతూ అమాయకుడిగా నటించిన వ్యక్తే వివాహిత హత్య కేసులో ప్రధాన సూత్రధారి అని పోలీసులు తేల్చారు. ఏమి ఎరగని వాడిలా తిరుగుతున్న నిందితుడిని పక్కా వ్యూహంతో ఊచలు లెక్కించేలా చేశారు. సుంకెట్‌కు చెందిన అంజమ్మ(35) జనవరి 24న అదృశ్యం అయింది. ఆమె కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అంజమ్మ తన చిన్న మామ కుమారుడు నరేష్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇద్దరి మధ్య డబ్బుల విషయంలో వివాదం ముదరడంతో నరేష్ పక్కా ప్లాన్‌తో ఆమెను పెర్కిట్ శివారులోని గుట్టపై హత్య చేశాడు. ఇదంతా చేసిన నరేష్ తనకు ఏమి తెలియనట్లు ఇంటికి చేరుకుని అంజమ్మ అత్త, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి పోలీసు స్టేషన్‌కు వచ్చి మిస్సింగ్ కేసు నమోదు చేయించాడు. అంతేకాక తరుచూ స్టేషన్‌కు వచ్చి తన వదిన మిస్సింగ్ కేసులో ఏమైనా వివరాలు తెలిశాయా అంటూ అడిగేవాడు. నరేష్ వ్యవహారశైలిపై అనుమానం రావడంతో పోలీసులు తమదైన శైలిలో విచారించారు. దీంతో నరేష్ తప్పు ఒప్పుకొని పెర్కిట్ శివారులో దాచి ఉంచిన మృతదేహాన్ని చూపించాడు. -
14 నెలలుగా రైతు కుటుంబం గ్రామ బహిష్కరణ..
సాక్షి, వేల్పూరు(నిజామాబాద్): నిజామాబాద్ జిల్లా వేల్పూరు మండలం వాడిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గత 14 నెలలుగా అంకం కిషన్ అనే రైతు కుటుంబానికి గ్రామాభివృద్ధి కమిటీ గ్రామ బహిష్కరణ విధించింది. నిత్యావసరాలు పాలు నీళ్ళు బియ్యము కిరాణా వస్తువులు ఏవీ ఇవ్వకుండా ఆంక్షలు విధించింది. చెంగల్ అనే గ్రామంలో కిషన్ మేనల్లుడు కొనుగోలు చేసిన భూమి విషయంలో కిషన్ సాయం చేశారని గ్రామాభివృద్ధి కమిటీ కక్ష్య కట్టింది. ఈ కమిటీ కిషన్ కుటుంబానికి ఐదు లక్షల 20 వేల రూపాయల జరిమానా వేసింది. కిరాణా షాపుల్లో కనీసం పిల్లలకు పాల ప్యాకెట్లు కూడా ఇవ్వని దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి.. అత్త కోడళ్ళ కు బీడీ కార్ఖానాలలో పని ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారు. కిషన్ దంపతులు, ఇద్దరు కొడుకులు కోడళ్ళు నలుగురు పిల్లలు ఎనలేని కష్టాలు పడుతున్నారు. గ్రామాభివృద్ధి కమిటీ కట్టుబాట్లతో గ్రామస్తులు అందరూ సహాయ నిరాకరణ చేస్తున్నారు.14 నెలలుగా గ్రామంలో సహాయ నిరాకరణ కొనసాగుతోంది. వ్యవసాయంలో కూడా ఇబ్బందులు తలెత్తి ఐదు ఎకరాల జొన్న పంట కూడా నష్టపోయాం అని బాధితుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 14 నెలలుగా తీవ్ర మనస్థాపానికి గురైన బాధితులు…గ్రామ బహిష్కరణ ఎత్తి వేయించి తమకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్‌ను కలిసి వేడుకున్నారు. మరోవైపు వాడి గ్రామాన్ని యాదవ సంఘం జాతీయ అధ్యక్షుడు రాములు సంఘ ప్రతినిదులు సందర్శించి బాధితులను పరామర్శించారు. చదవండి: ఫోన్ సిగ్నల్ కోసం చెట్టెక్కిన పిల్లలు..కానీ ఇంతలోనే -
తల్లి మృతదేహాన్ని స్మశానంలోనే వదిలేసిన కొడుకు
సాక్షి, నిజామాబాద్: కరోనా వైరస్ సోకిందని ఇంట్లో నుంచి వెళ్లగొట్టిన సంఘటనలు చూశాం. ఇక కోవిడ్‌తో మరణిస్తే మృతదేహాలను సైతం వదిలివెళ్లిన వార్తలను కూడా విన్నాం. అయితే తాజాగా నిజామాబాద్ జిల్లాలో ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది. కన్న తల్లి చనిపోతే దహనం చేయకుండా స్మశాన వాటికలో మృతదేహాన్ని వదిలేసి వెళ్లాడు. ఈ ఘటన జిల్లాలోని ప్రగతినగర్ సర్వజనిక్ స్మశాన వాటికలో జరిగింది. ఓ వృద్ధురాలి మృతదేహాన్ని దహన సంస్కారాల కోసం తీసుకొచ్చిన ముగ్గురు వ్యక్తులు స్మశానంలోనే వదిలిపెట్టి వెళ్లిపోయారు. మృతదేహాన్ని స్మశానవాటికలో వదిలేసి కట్టెలు తీసుకు వస్తామని చెప్పిన ముగ్గురు వ్యక్తులు మళ్లీ తిరిగిరాని రాలేదు. ఎంత సమయం గడిచినా వాళ్లు తిరిగి రాకపోవడంతో స్మశానవాటిక వాచ్‌మెన్‌కి అనుమానం వచ్చిది. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో వృద్ధురాలి మృతదేహాన్నిపోలీసులు ఆస్పత్రి మార్చురీకి తరలించారు. స్మశానంలో మృతదేహాన్ని వదిలి వెళ్లిన వ్యక్తుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. అయితే ఆ ముగ్గురు వ్యక్తుల్లో వృద్ధురాలి కన్న కొడుకు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. తన తల్లి కరోనా సోకి మరణించిందనే అనుమానంతో స్మశానంలో మృతదేహాన్ని వదిలివెళ్లినట్లు తెలుస్తోంది. చదవండి: ఓఎల్ఎక్స్ వేదికగా సోఫా కొంటానని.. -
దొంగలతో వీరోచిత ఫైటింగ్, ముంబై పోలీసుల అభినందనలు
భిక్కనూరు: మహారాష్ట్రలోని నివసిస్తున్న భిక్కనూరుకు చెందిన బూర్ల నగేశ్‌ను ముంబై పోలీసులు అభినందించారు. వివరాలు.. భిక్కనూరుకు నగేష్15 ఏళ్లుగా ముంబైలో నివాసం ఉంటున్నాడు. ప్రస్తుతం జోగేశ్వర్ ఈస్ట్ ఏరియాలోని శాటిలైట్ ఏస్టేట్‌లో ఆరో అంతస్తులో నివాసం ఉంటున్నాడు. ఆయన పక్క ఫ్లాట్‌లో డాక్టర్ రమేశ్ యాదవ్ దంపతులు ఉంటున్నారు. ఈనెల 15న మధ్యాహ్నం తన పక్క ఫ్లాట్‌లోకి దొంగలు చొరబడి ఓ మహిళను కత్తితో హతమార్చబోగా నగేశ్ వారితో తలబడ్డాడు. మహిళను కాపాడిన నగేశ్‌ను అక్కడి పోలీసులు అభినందించారు. నగేశ్ ‘సాక్షి’తో మాట్లాడుతూ ఘటనకు సంబంధించిన వివరాలు తెలిపారు. ఇద్దరు వ్యక్తులు కొరియర్ పేరిట అపార్టుమెంట్లోకి చొరబడి మహిళను తల్వార్‌తో హతమార్చేందుకు యత్నించారన్నారు. ఆమె అరవడంతో తాను వెళ్లి దొంగలతో పోరాడనని చెప్పారు. దీంతో వారు అక్కడి నుంచి పరుగులు తీయగా స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారన్నారు. రెండో వ్యక్తిని పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారని చెప్పారు. చదవండి: డబ్బు ఇవ్వలేదని.. కన్నతండ్రినే బకెట్‌తో కొట్టి హత్య -
హైదరాబాద్‌లో కృష్ణ జింక వేటగాళ్లు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: ముగ్గురు కృష్ట జింక వేటగాళ్లను హైదరాబాద్ సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వస్తుండగా పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు వేటగాళ్లు ఓ జింకను నిజామాబాదులోని వేటాడి చంపారు. మరొక జింకనుతో పాటుగా చంపిన జింక మాంసాన్ని తీసుకువస్తుండగా సమాచారం అందుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వేటగాళ్ల చెర నుంచి కృష్ణజింకను పోలీసులు రక్షించారు. చదవండి: ఆరోగ్యం బాగుచేస్తానని..ఆభరణాలతో మాయం! చదవండి: 'భర్తకు రెండో పెళ్లి చేయాలని చూస్తున్నారు' -
3 బార్లకు 3 దరఖాస్తులే.. ఆ 10 బార్ల పై ఆరా..?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని కొత్త మున్సిపాలిటీల్లో బార్ల ఏర్పాటు కోసం ఎక్సైజ్ శాఖ చేపట్టిన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం చర్చనీయాంశమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో వెల్లువలా దరఖాస్తులు వ చ్చినా కేవలం నిజామాబాద్ కార్పొరేషన్, బోధన్ మున్సిపాలిటీలో నోటిఫై చేసిన బార్లకు చాలా తక్కువ దరఖాస్తులు రావడం ఇప్పుడు ఎక్సైజ్ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో కొత్తగా 7 బార్లను నోటిఫై చేస్తే అక్కడ కేవలం 10 దరఖాస్తులే వచ్చాయి. ఇక బోధన్ మున్సిపాలిటీలో అయితే 3 బార్లకు గాను 3 దరఖాస్తులే వచ్చాయి. కానీ, రాష్ట్రంలోని ఇతర మున్సిపాలిటీల్లో మాత్రం వందల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా 72 మున్సిపాలిటీల్లోని 159 కొత్త బార్లకు నోటిఫికేషన్ ఇస్తే 7,400 వరకు దరఖాస్తులు రావడం గమనార్హం. ఈ పరిస్థితుల్లో నిజామాబాద్, బోధన్‌లలో చాలా తక్కువగా ఎందుకు దరఖాస్తులు వచ్చాయన్న దానిపై ఎక్సైజ్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ ఆ శాఖ ఉన్నతాధికారుల వద్ద ఆరా తీసినట్టు తెలిసింది. నిజామాబాద్‌లో 7 బార్లకు గాను చివరిరోజు వరకు ఒక్కటే దరఖాస్తు వచ్చిందని, చివరి రోజు కూడా 9 మాత్రమే ఎలా వచ్చాయని, అలాగే బోధన్‌లో అయితే మూడు బార్లకు చివరిరోజే మూడు దరఖాస్తులు రావడం ఎలా సాధ్యమైందని ఆయన అంతర్గతంగా పరిశీలన జరుపుతున్నట్టు సమాచారం. కాగా, ఇక్కడ తక్కువ దరఖాస్తులు రావడానికి సిండికేట్ కారణమైందని తెలుస్తోంది. ఇక రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా నోటిఫై అయిన బార్లకు దరఖాస్తు చేసుకునే గడువును ఈ నెల 16 వరకు పొడిగించారు. ఇక ఈ నెల 19న లాటరీలు తీసి.. అందులో వచ్చిన వారికి 25వ తేదీన కేటాయిస్తారని ఎక్సైజ్ వర్గాలు వెల్లడించాయి. చదవండి: సముద్రం నీరూ తాగొచ్చు! -
దుబాయ్‌లో నిజామాబాద్ వాసి అరెస్ట్
సాక్షి, నిజామాబాద్: జిల్లాలోని ఇందల్వాయి మండలం నల్లవెల్లి గ్రామానికి చెందిన తాళ్ల ప్రభాకర్ అనే వలస కూలీని షార్జా పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. కరోనా ప్రభావంతో ప్రభాకర్ పని చేస్తున్న కంపెనీలో వేతనాలు లేక కనీసం భోజనం సైతం లేక బయట మరో చోట పనులు చేసుకుంటున్నాడు. అయితే పాస్ పోర్టు, కంపెనీ వీసాలో సరైన వివరాలు చెప్పకుండా బయట తిరుగుతున్నాడనే అభియోగాలపై షార్జా పోలీసలు అతన్ని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో బాధితుడు కుటుంబ సభ్యులు గల్ఫ్ వెల్ఫేర్ కల్చరల్ అధ్యక్షుడు పాట్కూరి బసంత్ రెడ్డిని కలిసి ప్రభాకర్‌ను విడిపించాలని కోరారు. అక్కడి ప్రభుత్వంతో మాట్లాడి ప్రభాకర్‌ను విడిపించి తమ స్వగ్రామానికి చేరేలా చూడాలని బసంత్‌రెడ్డిని కుటుంబ సభ్యులు వేడుకున్నారు. -
పకడ్బందీ వ్యూహం.. కారుదే జోరు
ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కారు జోరు స్పష్టంగా కనిపించింది. మొత్తం 823 మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తమ ఓటు హక్కు ను వినియోగించుకున్నారు. వంద శాతం ఓట్లు పోలయ్యాయి. తమ అభ్యర్థి కల్వకుంట్ల కవిత గెలుపు ఖాయమని, ప్రత్యర్థి పార్టీలకు డిపాజిట్లు కూడా దక్కవని మంత్రి ప్రశాంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. పోలింగ్ ముగిసిన వెంటనే బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్‌కు తరలించారు. సాక్షి, నిజామాబాద్ : నిజామాబాద్ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఉప ఎన్నికలో ప్రధాన ఘట్టమైన పోలింగ్ శుక్రవారం ప్రశాంతంగా, సజావుగా ముగిసింది. కోవిడ్–19 నిబంధనల మేరకు జిల్లా అధికార యంత్రాంగం పోలింగ్ ప్రక్రియను నిర్వహించింది. మొత్తం 824 ఓట్లు ఉండగా ఇటీవల బోధన్ మున్సిపాలిటీకి చెందిన కౌన్సిలర్ ఒక్కరు మృతి చెందారు. దీంతో 50 పోలింగ్ కేంద్రాల్లో 823 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కరోనా సోకిన ఓటర్లు చివరి గంటలో పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఓట్లేశారు. ఇద్దరు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేశారు. ఉదయం తొమ్మిది గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా, తొలి గంటలో నామమాత్రంగా ఓట్లు పోలయ్యాయి. మధ్యాహ్నం 12 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ ఊపందుకుంది. మధ్యాహ్నం రెండు గంటలకు దాదాపు 98 శాతం ఓట్లు పోలయ్యాయి. పోలింగ్ సరళిని జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి సి నారాయణరెడ్డి పరిశీలించారు. పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించిన ఆయన అధికారులు, సిబ్బందికి ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేశారు. కలెక్టరేట్లో వెబ్‌క్యాస్టింగ్‌ను పరిశీలించారు. పోలింగ్ ముగిసిన వెంటనే బ్యాలెట్ బాక్సులను జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంకు తరలించారు. ఈనెల 12న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. పకడ్బందీ వ్యూహంతో.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కారు జోరు స్పష్టంగా కనిపించింది. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత భారీ మెజారిటీతో విజయం సాధిస్తారని ఆ పార్టీ శ్రేణులు ధీమాలో ఉన్నారు. ఎన్నిక పోలింగ్ తేదీని ప్రకటించిన వెంటనే అప్రమత్తమైన అధికార పార్టీ పకడ్బందీ వ్యూహాన్ని అమలు చేసింది. తమ పార్టీ ప్రజాప్రతినిధులను క్యాంపునకు తరలించడంతో పాటు, కాంగ్రెస్, బీజేపీల నుంచి చేరికలపై ప్రత్యేక దృష్టి సారించింది. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్, బీజేపీల నుంచి పెద్ద ఎత్తున చేరికలు జరిగాయి. కమలం పార్టీకి పట్టున్న నిజామాబాద్ కార్పొరేషన్లో కూడా బీజేపీ కార్పొరేటర్లకు గులాబీ రంగు కండువాలు కప్పడం ద్వారా నగర పాలక సంస్థలోనూ టీఆర్ఎస్ పట్టు నిలుపుకుంది. ఈ ఎన్నికల్లో ప్రజాప్రతినిధులు తమ అంతరాత్మ ప్రభోదం మేరకు పార్టీలకు అతీతంగా టీఆర్ఎస్ను ఆదరించారని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రకటించారు. జిల్లా పరిషత్ పోలింగ్ కేంద్రం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడుతూ పోలింగ్ సరళిని బట్టి చూస్తే సుమారు 90 శాతం ఓట్లు తమ పార్టీ అభ్యర్థి కవితకు వేశారని అన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు డిపాజిట్లు కూడా దక్కవని అన్నారు. పసుపు రైతులను, జిల్లా ప్రజలను నయవంచన చేసిన పార్టీలకు, నిబద్ధతతో పనిచేస్తున్న పార్టీలకు మధ్య పోరులో టీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందన్నారు. పోలీసుల తీరుపై బీజేపీ నేతల ఆగ్రహం.. జిల్లా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆధ్వర్యంలో బీజేపీ కార్పొరేటర్లు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ పార్టీ నుంచి కార్పొరేటర్లుగా గెలిచి ఎన్నికల వేళ టీఆర్ఎస్లో చేరిన కార్పొరేటర్లు ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్త వెంట వచ్చి తమ ఓటు వేశారు. పోలింగ్ సమయంలో ఎమ్మెల్యే బిగాల క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్ కార్పొరేటర్లు ఉండటం పట్ల బీజేపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీసుల తీరు పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీని తరిమికొట్టే సమయం దగ్గర పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ వెంట బీజేపీ అభ్యర్థి పి లక్ష్మినారాయణ, జిల్లా అధ్యక్షులు బస్వ లక్ష్మినర్సయ్య, రాష్ట్ర నాయకులు ధన్పాల్ సూర్యనారాయణగుప్తలు ఉన్నారు. కనిపించని కాంగ్రెస్ నాయకత్వం.. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల వలసలతో కాంగ్రెస్ పార్టీ కుదేలైన నేపథ్యంలో ఆ పార్టీ ముఖ్యనేతలెవరూ పోలింగ్ కేంద్రాల వద్ద కనిపించలేదు. అక్కడక్కడ ఆ పార్టీకి చెందిన ఒకరిద్దరు ప్రజాప్రతినిధులు కేంద్రాలకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. బీజేపీ ముఖ్యనాయకుల హడావుడి అక్కడక్కడా కనిపించింది. నిజామాబాద్ జిల్లా పరిషత్ పోలింగ్ కేంద్రం వద్ద ఆ పార్టీ జిల్లా ముఖ్యనేతలు ఓటర్లతో కలిసి వచ్చారు. కానీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలెవరూ కేంద్రాల వద్ద కనిపించలేదు. బీజేపీ కంటే కాంగ్రెస్‌కే స్థానిక సంస్థల్లో ఎక్కువ మంది ప్రజాప్రతినిధులు ఉన్నారు. అయినప్పటికీ ఆ పార్టీ నేతలెవరూ అటువైపు తొంగి చూడలేదు. కామారెడ్డిలో వంద శాతం! సాక్షి, కామారెడ్డి: ఉమ్మడి జిల్లాకు సంబంధించిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ శుక్రవారం ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో 341 మంది ఓటర్లు ఉండగా, 339 మంది పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేయగా, మిగతా ఇద్దరు సభ్యులు ఆస్పత్రుల్లో ఉండడంతో వారు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ శుక్రవారం ఉదయం 9 గంటలకు మొదలైంది. కాగా 10 గంటలలోపు కేవలం 12 మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. 3.52 శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది. మధ్యాహ్నం 12 గంటల వరకు 193 మంది ఓటు వేయగా, 56.60 శాతం పోలింగ్ నమోదైంది. మధ్యాహ్నం 2 గంటల వరకు 333 మంది ఓటు వేయగా, 97.65 శాతం పోలింగ్ జరిగింది. సాయంత్రం 4 గంటలకు 335 మంది ఓటు వేశారు. 98.24 శాతం పోలింగ్ నమోదైంది. 5 గంటల వరకు 339 మంది ఓటు వేయగా, 99.41 శాతం పోలింగ్ నమోదైనట్టు కలెక్టర్ శరత్ పేర్కొన్నారు. గాంధారి, రాజంపేట జెడ్పీటీసీ సభ్యులు అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉండి పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీంతో నూరు శాతం పోలింగ్ జరిగింది. జిల్లా కేంద్రంతో పాటు వివిధ మండలాల్లో పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి బాన్సువాడ మున్సిపాలిటీలో ఎక్స్ అఫీషియో సభ్యుడిగా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే ప్రభు త్వ విప్ గంప గోవర్ధన్ కామారెడ్డి మున్సిపాలిటీలో ఎక్స్ అఫీసియో మెంబర్‌గా ఓటు వేశారు. ఎల్లారెడ్డి లో ఎమ్మెల్యే జాజాల సురేందర్, నిజాంసాగర్ మండలంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ దపేదార్ శోభ, బీబీపేట మండలంలో జెడ్పీ వైస్ చైర్మన్ ప్రేంకుమార్ ఓటు వేశారు. కామారెడ్డి మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్పర్సన్ నిట్టు జాహ్నవి, వైస్ చైర్పర్సన్ ఇందుప్రియ, ఎల్లారెడ్డిలో మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ, బాన్సువాడలో చైర్మన్ గంగాధర్ ఓటు వేశారు. భారీ బందోబస్తు శాసన మండలి ఎన్నికల సంద ర్భంగా ఎస్పీ శ్వేత పర్యవేక్షణ లో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం వద్ద ఎల్లారెడ్డి డీఎస్పీ శశాంక్‌రెడ్డి ఆ ధ్వర్యంలో బందోబస్తు నిర్వ హించారు. అలాగే ఎల్లారెడ్డి, బాన్సువాడ పట్టణాలతో పాటు జిల్లాలోని ఆయా మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. కోవిడ్ నిబంధన ప్రకారం ఎన్నికలు కామారెడ్డి టౌన్: ఎమ్మెల్సీ ఎన్నికలను జిల్లాలో 22 పోలింగ్ కేంద్రాల్లో కోవిడ్ నిబంధనల ప్రకారం నిర్వహించామని కలెక్టర్ శరత్ తెలిపారు. కామారెడ్డి మున్సిపల్ కార్యాలయ పోలింగ్ కేంద్రాన్ని ఎన్నికల తీరును పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్రాలలో శానిటైజర్లు, గ్లౌజ్‌లు ఏర్పాటు చేసి ఓటింగ్ నిర్వహించామన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా పూర్తయ్యేలా కృషి చేసిన ప్రతిఒక్కరికి అభినందనలు తెలిపారు. ఓటింగ్ సరళిని పరిశీలించిన కవిత స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సరళిని టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత పరిశీలించారు. కామారెడ్డి, బోధన్‌లోని పోలింగ్ కేంద్రాలను ఆమె సందర్శించారు. కామారెడ్డిలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, బోధన్‌లో ఎమ్మెల్యే షకీల్ ఆమె వెంట ఉన్నారు. -
పల్లె పార్క్‌లకు స్థల సమస్య
సాక్షి, నిజామాబాద్ : నగరాలు, పట్టణాల మా దిరిగా గ్రామీణ ప్రాంత ప్రజలకు కూడా అహ్లాదాన్ని పంచేందుకు ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రకృతి వనాలకు స్థలాల సమస్య వెంటాడుతోంది. వీటిని ఏర్పాటు చేసేందుకు సౌకర్యవంతమైన ప్రభుత్వ భూమి గ్రామాల్లో అందుబాటులో లేకపోవడంతో చాలా చోట్ల ఇబ్బందులు ఎదురవుతున్నా యి. జిల్లాలో మొత్తం 530 గ్రామ పంచాయతీలకు గాను, సుమారు 70 గ్రామ పంచాయతీల్లో స్థలాలు అందుబా టులో లేవు. దీంతో స్థలాలు లేనిచోట్ల పనులు ప్రారంభం కావడం లేదు. ఒక్కో ప్రకృతి వనాన్ని కనీసం ఎకరం స్థలంలో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామానికి మూడు కిలోమీటర్ల లోపు వీటిని ఏర్పాటు చేయాలని భావించింది. అయితే పలు గ్రామాల్లో ఎకరం విస్తీర్ణం లేకపోవడంతో అర ఎకరం స్థలంలో ఏర్పాటు చేస్తున్నారు. పనులు చేపట్టిన 460 గ్రామాల్లోని 59 గ్రామాల్లోని అటవీభూముల్లో ఈ పార్కులను నిర్మిస్తున్నారు. 401 గ్రామాల్లో మాత్రమే రెవెన్యూ, ఆబాదీభూములున్నాయి. పట్టణాలు, నగరాల్లో ప్రభుత్వ భూముల కొరత ఉండటం సాధారణం. కానీ గ్రామాల్లో మాత్రం ప్రభుత్వ భూములు అందుబాటులో ఉంటాయి. కానీ ఇప్పుడు పల్లె ప్రకృతి వనాల విషయానికి వస్తే గ్రామాల్లో సైతం ప్రభుత్వ భూముల సమస్య తెరపైకి రావడం గమనార్హం. ఆర్డీవోలకు బాధ్యతలు.. పల్లె ప్రకృతి వనాల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించిన జిల్లా అధికార యంత్రాంగం అన్ని గ్రామాల్లో వీటి నిర్మాణం కోసం చర్యలు చేపట్టింది. నిర్మాణం ప్రారంభం కాని గ్రామ పంచాయతీల్లో భూముల గుర్తింపు బాధ్యతలను కలెక్టర్ సి నారాయణరెడ్డి ఆర్డీవోలకు అప్పగించారు. వీలైనంత త్వరగా భూములను గుర్తించి పనులు ప్రారంభమయ్యేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పనులు ప్రారంభం కాని గ్రామాల్లో ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైతే ఆ భూములను స్వాధీనం చేసుకుని పార్కుకు కేటాయిస్తారు. సమీపంలో అటవీభూములుంటే కూడా వాటిలో ఈ పార్కులను నిర్మిస్తారు. ఇవేవీ అందుబాటులో లేనిపక్షంలో గ్రామాల్లో దాతల నుంచి భూములు సేకరించాలని భావిస్తున్నారు. వేగంగా పనులు.. జిల్లాలో పల్లె ప్రకృతి వనాల పనులు వేగంగా సాగుతున్నాయి. స్థలాలు అప్పగించిన 460 గ్రామాల్లో వీటి నిర్మాణం పనులు చకచకా సాగుతున్నాయి. ఈ పనులపై జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ ఈ పనులు వేగవంతం అయ్యేలా చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు సుమారు 60 గ్రామాల్లో ఈ వనాల నిర్మాణం దాదాపుగా పూర్తయిందని జిల్లా గ్రామీణాభివృద్ది శాఖాధికారి శ్రీనివాస్ పేర్కొన్నారు. కాగా ఒక్కో ప్రకృతి వనాన్ని రూ.5.90 లక్షల అంచనా వ్యయంతో నిర్మిస్తున్నారు. రెండు సంవత్సరాల వరకు నిర్వహణ నిధులు కూడా కేటాయిస్తున్నారు. ఉపాధి హామీ పథకం నిధులను వెచ్చిస్తున్నారు. ఈ వనాల్లో ప్రతి మూడు ఫీట్లకు ఒకటి చొప్పున మొక్కలు నాటుతున్నారు. వనం చుట్టూ ఫెన్సింగ్ చేస్తున్నారు. నడక కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. -
పాతాల గంగా పైపైకి..
జిల్లాలో భూగర్భ నీటి మట్టం పెరిగింది. ఆగస్టులో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిశాయి. ముసురు పెట్టడంతో నీరు భూమిలోకి ఇంకి పోయింది. జూలై మాసానికి పోల్చుకుంటే సగటున 3.31 మీటర్లు నీట మట్టం పెరిగింది. సాక్షి, నిజామాబాద్ : పాతాల గంగ పైపైకి వచ్చింది. ఆగస్టు మాసంలో కురిసిన భారీ వర్షాలకు భూగర్భ జల మట్టం భారీగా పెరిగింది. జూలై మాసంతో పోల్చితే జిల్లాలో సగటున 3.31 మీటర్లు పైకి వచ్చింది. జూలైలో సగటున 12.28 మీటర్ల లోతులో ఉంటే., ఇప్పుడు 8.97 మీటర్లు పైకి వచ్చాయి. గత ఏడాది 2019 ఆగస్టు మాసంలో 11.64 మీటర్ల లోతులో ఉండగా, ఇప్పుడు 8.97 మీటర్ల వరకు పెరగడంతో అన్నదాతల్లో ఆనందం వ్యక్తమవుతోంది. గత నెలలో జిల్లాలో విస్తారంగా వర్షాలు పడ్డాయి. వారం రోజుల పాటు ఎడతెరపి లేకుండా వర్షం కురిసింది. వాగులు వంకలు పొంగి ప్రవహించాయి. ప్రధానంగా రోజుల తరబడి ముసురు పెట్టడంతో వర్షం నీరు క్రమంగా భూమిలోకి ఇంకి పోయింది. ముప్కాల్, బాల్కొండ మండలాలు మినహా, మిగిలిన 23 మండలాల్లో సాధారణ వర్షపాతం రికార్డు అయింది. వేల్పూర్, నవీపేట్, ఎడపల్లి, రెంజల్ మండలాల్లో ఎక్సెస్ వర్షపాతం నమోదైంది. దీంతో భూగర్భ నీటి మట్టం పైకి వచ్చాయి. జిల్లా వ్యాప్తంగా 49 చోట్ల ఏర్పాటు చేసిన ఫీజో మీటర్లలో తాజా నీటి మట్టాలను భూగర్భ జలశాఖ వారం రోజుల క్రితం లెక్కించింది. సిరికొండలో అత్యధికంగా.. జిల్లాలో సిరికొండ మండలంలో భూగర్భ నీటి మట్టం లోతులో ఉంటుంది. ఇలాంటి మండలాల్లో కూడా ఈసారి భూగర్భ జలాలు భారీగా పెరగడం గమనార్హం. చీమన్‌పల్లిలో ఏకంగా 12.9 మీటర్లు పైకి వచ్చాయి. ఇక్కడ జూలైలో 23.70 మీటర్ల లోతులో నీటి మట్టం ఉండేది. ఆగస్టు మాసానికి వచ్చేసరికి 10.80 మీటర్లపైకి నిళ్లు వచ్చాయి. అలాగే పాకాలలో కూడా 5.7 మీటర్లు పెరిగాయి. ఇక్కడ 20.55 మీటర్ల లోతులో ఉన్న నీరు.. నెల రోజుల్లో 14.85 మీటర్ల పైకి వచ్చాయి. ఎండా కాలంతో పోల్చితే.. ఎండా కాలంతో పోల్చితే జిల్లాలో స్వల్పంగానే పెరిగినట్లు భూగర్భ జలశాఖ తాజా నివేదికలో పేర్కొంది. ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభం కాకముందు మే మాసంలో జిల్లాలో సగటున 11.95 మీటర్ల లోతులో ఉన్న నీటి మట్టం ఇప్పుడు 8.97 మీటర్లకు పెరిగింది. అంటే సగటున 2.98 మీటర్లు పెరిగింది. నివేదికల్లో గందరగోళం... భూగర్భ జల శాఖ విడుదల చేసిన తాజా నివేదికలో కొన్ని గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సాధారణంగా వర్షాలు కురిస్తే భూగర్భ జల మట్టం పెరుగుతుంది. కానీ కొన్ని ఫీజో మీటర్ల పరిధిలో తగ్గినట్లు నివేదికలో పేర్కొనడం గమనార్హం. ⇔ భీంగల్ మండలం గోన్గొప్పులలో మే మాసంలో 29.55 మీటర్ల లోతులో నీటి మట్టం ఉందని పేర్కొనగా, ఆగస్టుకు వచ్చే సరికి మూడు నెలలు భారీ వర్షాలు కురిసినా.. ఇక్కడ 32.47 మీటర్లకు పడిపోయినట్లు రికార్డుల్లో పేర్కొన్నారు. జూన్, జూలై, ఆగస్టు మాసాల్లో భారీ వర్షాలు కురిసాయి. దీంతో ఇక్కడ నీటి మట్టం పెరగాల్సి ఉండగా, అధికారులు మాత్రం 2.92 మీటర్లు ఇంకా లోతుకు పడిపోయినట్లు చూపారు. తాళ్లపల్లిలో కూడా ఇలాగే ఎండా కాలం కంటే వర్షా కాలంలో నీటి మట్టం పడిపోయినట్లు చూపారు. ⇔ డిచ్పల్లి మండలం యానంపల్లిలో కూడా వర్షాలు కురిసాక భూగర్భ జల మట్టం తగ్గినట్లు పేర్కొన్నారు. అలాగే కోటగిరి మండలం కల్లూరులో కూడా ఎండాకాలం కంటే వర్షాకాలంలో నీటి మట్టం పడిపోయినట్లు తెలిపారు. అయితే కొన్ని ఫీజో మీటర్ల పరిధిలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయని, ప్రత్యేక పరిశీలన చేస్తామని భూగర్భ జలశాఖ వర్గాలు పేర్కొన్నాయి. -
వాట్సాప్‌లో హోంవర్క్
మోర్తాడ్(బాల్కొండ): కరోనా వైరస్ విస్తరిస్తున్న కారణంగా పాఠశాలల పునఃప్రారంభానికి ప్రభుత్వం ఇంకా తేదీని ఖరారు చేయలేదు. నెలల తరబడి పాఠశాలలు బంద్ ఉండడంతో గతంలో నేర్చుకున్న పాఠాలను విద్యార్థులు మరిచిపోకుండా ఉండడానికి ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఒకరు వినూత్న పంథాను ఎంచుకున్నారు. వాట్సాప్‌ను వేదికగా చేసుకుని తన పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు రోజూ హోంవర్క్ ఇచ్చి వారికి పాఠాలు జ్ఞాపకం ఉండేలా చొరవ తీసుకుంటున్నారు. ఆయనే బాల్కొండ మండలం బస్సాపూర్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు బోయిడ నర్సయ్య. తమ పాఠశాలలో 110 మంది విద్యార్థులు ఉండగా వారి తల్లితండ్రుల వాట్సాప్ నంబర్లను సేకరించారు. వాట్సాప్ నంబర్లతో తరగతుల వారీగా గ్రూపులను ఏర్పాటు చేసి విద్యార్థులకు రోజూ హోం వర్క్‌ను ఇస్తున్నారు. సోమవారం తెలుగు, మంగళవారం ఇంగ్లిష్ బుధవారం గణితం, గురువారం సైన్స్, శుక్రవారం సాంఘిక శాస్త్రం, శనివారం డ్రాయింగ్ హోంవర్క్‌లను విద్యార్థులకు ఇస్తున్నారు. వాట్సాప్‌లలో హోంవర్క్ ఇచ్చిన తరువాత మరుసటి రోజున ఆ హోంవర్క్ కాపీలను మళ్లీ వాట్సాప్ గ్రూపులలో పోస్టు చేయిస్తున్నారు. అలా రోజువారీగా విద్యార్థుల ప్రతిభను గుర్తించి వారికి మార్కులు వేస్తున్నారు. ఆన్లైన్లో పాఠాలను చెప్పవద్దని ప్రభుత్వం చెబుతుందని అయితే విద్యార్థులు తాము చదువుకున్న పాఠాలను మరిచిపోకుండా ఉండడానికి సామాజిక మాద్యామాల ద్వారా హోంవర్క్ చేయిస్తున్నానని నర్సయ్య వివరించారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా సహకరించడంతో ఇప్పటి వరకు విద్యార్థులు పాఠాలను జ్ఞాపకం ఉంచుకున్నారని నర్సయ్య వివరించారు. తమ చిన్నారుల చదువుపై ఉపాధ్యాయుడు నర్సయ్య చూపిన శ్రద్ధ ఎంతో బాగుందని విద్యార్థుల తల్లిదండ్రులు అభినందిస్తున్నారు. విద్యార్థులు పాఠాలను మరిచిపోవడం లేదు ఏప్రిల్ నుంచి రోజు హోంవర్క్‌ను వాట్సాప్‌లో సంబంధిత స్కూల్ ఉపాధ్యాయుడు పోస్టు చేస్తున్నారు. దీనికి అనుగుణంగా మేము మా చిన్నారులతో హోంవర్క్‌ను రాయి స్తున్నా. దీంతో పాఠాలను ఎవరూ మరచిపోకుండా ఉన్నారు. ఉపాధ్యాయుల చొరవ మరువలేనిది. – గజ్జెల భాస్కర్, ఎస్ఎంసీ చైర్మన్ విద్యార్థులకు మేలు జరిగింది లాక్డౌన్ వల్ల బడులు ఇప్పట్లో తెరుచుకునే సూచనలు కనిపించడం లేదు. ఇలాంటి సమయంలో ఉపాధ్యాయుడు నర్సయ్య తీసుకున్న చొరవతో విద్యార్థులకు మేలు జరిగింది. ఉపాధ్యాయుడు నర్సయ్యకు కృతజ్ఞతలు. – భోగ లతాశ్రీ, ఎస్ఎంసీ వైస్ చైర్మన్ -
టీడీపీలో.. ఒక్కరూ నామినేషన్ వెయ్యలే
మోర్తాడ్(బాల్కొండ): ముందస్తు శాసనసభ ఎన్నికల్లోనూ ముగిసిపోయిన టీడీపీ కథ పార్లమెంట్ ఎన్నికల్లోను పునరావృతమైంది. ఒకప్పుడు నిజామాబాద్ ఎంపీ స్థానాన్ని దక్కించుకున్న టీడీపీకి ఈ ఎన్నికల్లో నామినేషన్ వేయడానికి అభ్యర్థులే కరువయ్యారు. ఫలితంగా ఎప్రిల్ 11న నిర్వహించనున్న పోలింగ్‌లో సైకిల్ గుర్తు కనిపించడం ఉండదు. టీడీపీకి పూర్వ వైభవం తీసుకవస్తామని ఆ పార్టీ నాయకులు గతంలో గొప్పలు చెప్పుకున్నా చివరకు నామినేషన్ వేసే అభ్యర్థులే కరువు కావడంతో జిల్లాలో టీడీపీ కథ కంచికి చేరిందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. నిజామాబాద్ ఎంపీ స్థానానికి టీఆర్ఎస్ తరపున సిట్టింగ్ ఎంపీ కల్వకుంట్ల కవిత, కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ ఎంపీ మధుయాష్కిగౌడ్, బీజేపీ తరపున డీఎస్ తనయుడు ధర్మపురి అర్వింద్‌లు నామినేషన్లు దాఖలు చేశారు. అలాగే పసుపు, ఎర్రజొన్నలకు మద్దతు ధర కోరుతూ అందరి దృష్టిని మరల్చుతూ రైతులు మూకుమ్మడిగా నామినేషన్లు వేశారు. రాష్ట్రంలో ఏ పార్లమెంట్ స్థానంలోనూ దాఖలు కానన్ని నామినేషన్లు నిజామాబాద్ స్థానానికి దాఖలైనా టీడీపీ తరపున మాత్రం ఏ ఒక్కరు కూడా నామినేషన్‌ను వేయలేకపోవడం విశేషం. ఒకప్పుడు జిల్లాలో బలమైన పార్టీగా ఉన్న టీడీపీ దశలవారిగా తన ప్రభావాన్ని కోల్పోయింది. ముందస్తు శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్‌తో పొత్తు కారణంగా టీడీపీ అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేయలేదు. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీల మధ్య ఎలాంటి పొత్తు కుదరలేదు. దీంతో టీడీపీ నిజామాబాద్ స్థానం నుంచి పోటీ చేస్తుందని అందరు భావించారు. కాని నాయకులు కరువు కావడంతో టీడీపీ పోటీకి దూరంగానే ఉండిపోయింది. దీనికి తోడు టీడీపీ జిల్లా అధ్యక్షుడు అధికార టీఆర్ఎస్లో చేరడంతో పార్టీని నడిపించేవారు కరువైనారు. దీంతో జిల్లాలో టీడీపీ పూర్తిగా తుడిచిపెట్టుకపోయిందని పలువురు భావిస్తున్నారు. కేశ్‌పల్లితోనే టీడీపీకి వైభవం.. నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి గతంలో జరిగిన ఎన్నికలను పరిశీలిస్తే టీడీపీ తరపున ఏడుమార్లు అభ్యర్థులు పోటీ చేస్తే మూడుమార్లు మాత్రమే ఎంపీగా ఆ పార్టీ అభ్యర్థి గెలిచారు. అయితే మూడుమార్లు టీడీపీ తరపున కేశ్‌పల్లి గంగారెడ్డి ఒక్కరే గెలవడాన్ని పరిశీలిస్తే అతని మూలంగానే ఆ పార్టీకి వైభవం దక్కిందని స్పష్టం అవుతుంది. 1984లో టీడీపీ తరపున అప్పట్లో నారాయణరెడ్డి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 1989లో ప్రస్తుత స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి టీడీపీ తరపున ఎంపీగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 1996లో మండవ వెంకటేశ్వర్రావు, 2004లో సయ్యద్ యూస్ఫ్ అలీ టీడీపీ తరపున పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 1991, 1998, 1999 ఎన్నికల్లో పోటీ చేసిన కేశ్‌పల్లి గంగారెడ్డి టీడీపీ ఎంపీగా పార్లమెంట్లో అడుగుపెట్టారు. టీడీపీ తరపున పోటీ చేసిన వారిలో కేశ్‌పల్లి గంగారెడ్డి మినహా ఇతర అభ్యర్థులు ఎవరు గెలవకపోవడాన్ని పరిశీలిస్తే కేవలం గంగారెడ్డి అతని సొంత ప్రాబల్యంతోనే గెలిచినట్లు పరిశీలకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా టీడీపీ అభ్యర్థులు పోటీలో లేక పోవడాన్ని గమనిస్తే జిల్లాలో ఆ పార్టీ కథ ముగిసిపోయిందని చెప్పవచ్చు. -
తెరపైకి కాంగ్రెస్ కొత్త ముఖాలు
సాక్షి, నిజామాబాద్: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపిక విషయంలో ఆసక్తికరమైన మలుపులు చోటు చేసుకుంటున్నాయి. జుక్కల్ మాజీ ఎమ్మెల్యే సౌదాగర్ గంగారాం పేరు ప్రముఖంగా వినిపించగా, తాజాగా రహీంసైఫీ పేరు తెరపైకి వచ్చింది. అనూహ్యంగా ఈ పేరు వినిపిస్తుండటంతో ఆ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అభ్యర్థిత్వాలను ఖరారు చేసే కేంద్ర ఎన్నికల కమిటీకి టీపీసీసీ పంపిన జాబితాలో గంగారాంతో పాటు, రహీంసైఫీ పేరును చేర్చినట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. రహీం చాలా ఏళ్లుగా టీఆర్ఎస్ పార్టీలో కొనసాగారు. ఉమ్మడి జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నాయకులతో రహీంసైఫీకి సంబంధాలున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆయన పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. హైదరాబాద్‌లో ఉత్తమ్ కుమార్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అభ్యర్థిత్వం ఎంపికలో రహీంసైఫీ పేరు అనూహ్యంగా తెరపైకి రావడం వెనుక పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఇద్దరు సీనియర్ నేతలు చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. రహీంసైఫీ పేరు తెరపైకి రావడంతో కాంగ్రెస్ పార్టీలో మరో వర్గం నేతలు రగులుతున్నారు. కాగా కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ శుక్రవా రం ఎనిమిది మంది అభ్యర్థులను ప్రకటించిం ది. మిగిలిన తొమ్మిది పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థుల జాబితాను శనివారం ఖరారు చేసే అవకాశాలున్నాయని భావించారు. కానీ ఎలాం టి ప్రకటన రాలేదు. ఆది, సోమ వారాల్లో ప్రకటించే జాబితాలో నిజామాబాద్ అభ్యర్థి పేరు ను ప్రకటిస్తారా.? లేక మరో ఒకటీ రెండు రో జులు వాయిదా వేస్తారా? అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. చివరకు మధుయాష్కియేనా..? నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ ఎంపీ మధుయాష్కిగౌడ్ ఈసారి ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు వెనుకంజ వేస్తున్నారు. భువనగిరి నుంచి బరిలోకి దిగాలని భావించిన ఆ యన ఆ స్థానం టికెట్ కోసం ప్రయత్నాలు చే శారు. అయితే భువనగిరి స్థానం కోమటిరెడ్డికి ఖరా రయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నా యి. అక్కడి అభ్యర్థిత్వం దక్కకపోతే నిజా మాబాద్ బరిలో మళ్లీ మధుయాష్కే ఉండే అవకా శాలున్నట్లు ఆ పార్టీలో చర్చ జరుగుతోంది. తా ను భువనగిరి నుంచి పోటీ చేస్తున్నానని, నిజా మాబాద్ స్థానం క్యాడర్‌కు ప రోక్షంగా సంకేతాలు పంపానని, ఇప్పుడు తి రిగి నిజా మాబాద్ నుంచి పోటీ చేయాల్సిన ప రిస్థితి ఏర్పడితే ఎలా ఉంటుంది.. అని మధుయాష్కి ఆ యన సన్నిహితులతో చర్చించినట్లు తెలు స్తోం ది. ఈ స్థానం అభ్యర్థిత్వం కోసం మధుయాష్కికి ప్రత్యామ్నాయంగా ప్రారంభంలో మాజీ మంత్రి పి సుదర్శన్‌రెడ్డి, టి జీవన్‌రెడ్డి, మహేష్ కుమార్‌గౌడ్, షబ్బీర్‌అలీ తదితరుల పేర్లు వినిపించాయి. పార్టీ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో వీరంతా చేతులెత్తేయడంతో అధిష్టానానికి అభ్యర్థిత్వం ఎంపిక సవాల్‌గా మారింది. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరవుతారనే అంశంపై ఉత్కంఠ ఒకటీ రెండు రోజుల వరకు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
ఆయకట్టు గట్టెక్కేనా..?
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు కింద సాగవుతున్న పంటలకు చివరి వరకు నీరందుతుందా..? యాసంగి పంటలు చేతికొస్తాయా? అంటే అనుమానంగానే ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టులో ఉన్న నీటిమట్టాన్ని చూస్తే యాసంగి పంటలు చేతికి రావడం అనుమానమేనని రైతాంగం ఆందోళన చెందుతోంది. ఉత్తర తెలంగాణ జిల్లాల కల్పతరువుగా పేరు గాంచిన శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో నీటి నిల్వలు వేగంగా తగ్గిపోతున్నాయి. ప్రస్తుత యాసంగిలో వారబందీ ప్రకారం నాలుగు తడుల నీరు పంటలకు అందించేందుకు ప్రాజెక్ట్ అధికారులు ప్రణాళిక రూపొందించి శివమ్ కమిటీకి పంపించారు. కమిటీ సూచన మేరకు ప్రభుత్వం యాసంగి పంటలకు నీటి విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఫిబ్రవరి 1 నుంచి నీటి విడుదల ప్రారంభించడంతో నీటి మట్టం పడిపోతోంది. మరోవైపు. ఎగువ ప్రాంతాల నుంచి ప్రస్తుతం చుక్క నీరు వచ్చే అవకాశం లేదు. ప్రస్తుతం ప్రాజెక్ట్‌లో 19 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. యాసంగిలో ఎల్ఎండీ ఎగువ భాగం వరకు కాకతీయ కాలువ కింద 3.91 లక్షల ఎకరాలు, గుత్ప అలీసాగర్ ఎత్తిపోతల కింద 21 వేల ఎకరాలు, లక్ష్మి కాలువ ద్వారా 16500 ఎకరాలు, సరస్వతి కాలువ ద్వారా 24 వేల ఎకరాలకు సాగు నీరు అందించాలని నిర్ణయించారు. అయితే, ప్రస్తుతమున్న పంటలకు చివరి తడి వరకు నీరు అందడం గగనమేనని అటు రైతులు, ఇటు అధికారులు పేర్కొంటున్నారు. కాకతీయ కాలువ ద్వారా ఒక తడి నీరు ఇవ్వడానికి 4.5 టీఎంసీల నీరు అవసరమవుతుంది. ఇప్పటివరకు ఒక తడి మాత్రమే నీరు ఇచ్చారు. ప్రస్తుతం రెండవ తడి కోసం నీటి విడుదల కొనసాగుతోంది. ఎండలు ఎక్కువ పెరగడంతో రెండవ తడిలో కనీసం 5 టీఎంసీల నీరు అవసరమవుతుందని ప్రాజెక్ట్ అధికారులు అంచనా వేస్తున్నారు. మూడు, నాలుగు తడుల సమయంలో నీటి వినియోగం మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ లెక్క ప్రకారం మూడు తడులకు కలిపి కనీసం 15 టీఎంసీల నీరు అవసరని భావిస్తున్నారు. అయితే, ఎస్సారెస్పీలో ప్రస్తుతం 19 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. ఈ లెక్కన పంటల కోసం 15 టీఎంసీల నీటిని విడుదల చేసే అవకాశం లేదు. ఎందుకంటే తాగు నీటి అవసరాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. డెడ్ స్టోరేజీ 5 టీఎంసీలు, ఆవిరి రూపంలో 2 టీఎంసీలు పోతుంది. ఇక, మిషన్ భగీరథకు 6.5 టీఎంసీల నీటిని కేటాయించారు. అవన్ని పోనూ మిగిలేది 5 టీఎంసీలు మాత్రమే. అంటే, ఈ లెక్కన చూస్తే ఆయకట్టుకు రానున్న రోజుల్లో నీటి విడుదల చేయడం కష్టంగానే కనిపిస్తోంది పడిపోయిన నిల్వ సామర్థ్యం వాస్తవానికి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిల్వ సామర్థ్యంపై అనేక అనుమానాలున్నాయి. ప్రాజెక్టు మొదట్లో 120 టీఎంసీలుగా పేర్కొన్నారు. అయితే, 1994లో నిర్వహించిన సర్వే మేరకు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలు అని అధికారులు చెబుతున్నారు. 2015లో చేపట్టిన సర్వే ప్రకారం నిల్వ సామర్థ్యం 80 టీఎంసీలకు పడిపోయినట్లు తేలింది. పూడికను పరిగణనలోకి తీసుకుంటే అది మరింత తగ్గుతుంది. తాజా సర్వేను లెక్కల్లోకి తీసుకోకుండా అధికారులు పాత లెక్కలు చెబుతుండడం గమనార్హం. దీంతో నీటి లెక్కలన్నీ కాకి లెక్కలేనని ఆయకట్టు రైతులు విమర్శిస్తున్నారు. -
హస్తం గుర్తుకు ఓటెయ్యండి..
సాక్షి, కామారెడ్డి: ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ మేనమామ ఆర్గొండ కమలాకర్‌రావును ఓటు అభ్యర్థించారు కాంగ్రెస్ కార్యకర్తలు. కామారెడ్డి పట్టణానికి సమీపంలోని దేవి విహార్‌లో కమలాకర్‌రావు నివసిస్తుంటారు. ఆదివారం దేవునిపల్లి గ్రామ కాంగ్రెస్ నాయకులు నీలం వెంకటి, సుధాకర్, నాగరాజు, మునీర్, ఆరిఫ్, నౌసిన్ తదితరులు ఆయన ఇంటికి వెళ్లారు. కాంగ్రెస్ అభ్యర్థి షబ్బీర్అలీకి ఓటు వేయాలని కోరారు. కాంగ్రెస్ అభ్యర్థి షబ్బీర్అలీకి గతంలో కేసీఆర్ మేనమామ కమలాకర్‌రావుతో సన్నిహిత సంబంధాలు ఉండేవి. ఆయన కాంగ్రెస్ కార్యకర్తలు ఇచ్చిన కరపత్రాన్ని చూసి, వారితో మాట్లాడి పంపించారు. -
మోపెడ్‌పై.. ఎంపి కవిత
సాక్షి,బోధన్ (నిజామాబాద్ ): అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం బోధన్ పట్టణంలో గంగపుత్ర కుల సంఘం ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమ్మేళన సభ నిర్వహించారు. ఆత్మీయ సమ్మేళన సభ విచ్చేసిన ఎంపీ కవిత టీఆర్ఎస్ ప్రభుత్వం మత్స్యకారులకు అందించిన మోపెడ్‌ను సరదాగా నడిపారు. అనంతరం సభలో పాల్గొన్నారు. హమ్మయ్య.. టిఫిన్ కోసం సమయం దొరికింది! సాక్షి,బాన్సువాడ (నిజామాబాద్): ఎన్నికల సమయం కావడంతో తెల్లవారుజాము నుంచి రాత్రి పడుకునే వరకు అభ్యర్థులకు తీరిక ఉండదు. పార్టీ నాయకులు, ప్రజలు, కార్యకర్తలతో బిజీబిజీగా ఉంటారు. ఇక బాన్సువాడ టీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి మరింత బిజీగా ఉన్నారు. కేవలం నియోజకవర్గమే కాకుండా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆయనపై ప్రచార బాధ్యతలు ఉండడంతో చాలా బిజీగా మారారు. శనివారం తెల్లవారుజామునే పట్టణంలోని శ్రీవేంకటేశ్వరాలయంలో భార్య సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రిని, ఆలయ కమిటీ వారు టిఫిన్ చేసి వెళ్లాలంటూ ఆత్మీయంగా ఆహ్వానించడంతో ఆయన అంగీకరించి కాస్త తీరికగా టిఫిన్ చేశారు. -
పేదల గుడిసెల కూల్చివేత
సుభాష్‌నగర్, న్యూస్‌లైన్ : నగర శివారులోని నందిగుట్ట సమీపంలో గల నిజాంసాగర్ ప్రధాన కాలువకు ఓ వైపు పేదలు నిర్మించుకున్న గుడిసెలను అధికారులు కూల్చివేయించారు. దీంతో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. కాలువకు ఓ వైపు పేదలు గుడెసెలు వేసుకున్నారు. సోమవారం మంత్రి సుదర్శన్‌రెడ్డిని కలిసి ఇళ్లకు సంబంధించి పట్టాలు ఇవ్వాలని కోరారు. స్పందించిన మంత్రి వెంటనే కలెక్టర్‌తో మాట్లాడారు. 15 రోజుల్లోగా నగరంలో 5 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి, నివాసాలు కల్పించాలని సూచించారు. అయితే జిల్లా యంత్రాంగం మాత్రం మంగళవారం తెల్లవారుజామున భారీ బందోబస్తు మధ్య పేదల గుడిసెలను కూల్చివేయించింది. కనీసం తమ వస్తువులను తీసుకుంటామని వేడుకున్నా కనికరం చూపలేదు. దీంతో బాధితులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. గుడిసెలు తీసి వేయడంతో తీవ్రమైన చలిలో చిన్న పిల్లలు, బాలింతలు వణుకుతూ గడిపారు. సుమారు 3 వందల కుటుంబాలు వీధిన పడ్డాయి. వారం క్రితమే.. నిజాంసాగర్ ప్రధాన కాలువ నందిగుట్ట ప్రాంతంలో పలువురు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్లాట్లు వేశారు. వాటిని విక్రయించుకోవడానికి పేదలు అడ్డు ఉన్నారని భావించారు. వారిని ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని ఎత్తులు వేశారు. వారం క్రితం మంత్రిని కలసి సమస్యను వివరించారు. పక్కా ప్రణాళక ప్రకారమే గుడిసెలను కూల్చివేయించారని బాధితులు ఆరోపిస్తున్నారు. నీటి పారుదల శాఖ ఆదేశాల మేరకే.. గుడిసెలను తొలగించడంలో మా ప్రమేయం లేదు. నీటిపారుదల శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే గుడిసెలను తొలగించాం. -యాదగిరిరెడ్డి, ఆర్డీఓ, నిజామాబాద్ -
అక్రమార్కులపై చర్యలేవి?
సాక్షి, నిజామాబాద్ : సర్పంచుల చెక్ పవర్‌ను పూర్తి స్థాయిలో పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకున్న సర్కారు.. అక్రమాలకు పాల్పడిన మాజీ సర్పంచులపై కనీస చర్యలు కూడా తీసుకోవడానికి సాహసించడం లేదు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని పంచాయతీ నిధులను కాజేసిన వారినుంచి సొమ్ము కక్కించడంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. 1984 నుంచి.. పంచాయతీలకు కేంద్రం ఏటా ఆర్థిక సంఘం నిధులు మంజూరు చేస్తుంది. గతంలో జేఆర్‌వై కింద నిధులిచ్చిన సర్కారు ఇప్పుడు బీఆర్జీఎఫ్, ఈజీఎస్ పథకాల కింద నిధులిస్తోంది. దీనికి తోడు వివిధ పన్నుల రూపంలో గ్రామంనుంచి కొంత ఆదాయం సమకూరుతుంది. ఈ నిధులతో గ్రామాల్లో రోడ్లు, మురికికాల్వలు, కల్వర్టు లు వంటి మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉంటుంది. తాగునీటి సరఫరా, విద్యుత్ దీపాలు, పారిశుధ్యం నిర్వహణ వంటి పనులు చేపట్టాల్సి ఉంటుంది. ఇలా అభివృద్ధి పనుల నిమిత్తం వచ్చిన నిధులను కొందరు సర్పంచ్‌లు నొక్కేశారు. అడిగే నాథుడే లేకపోవడంతో అసలు పనులు చేయకుండానే చేసినట్లు రికార్డుల్లో పేర్కొని నిధులు దిగమింగారు. నామమాత్రంగా పనులు చేసి లక్షల రూపాయల్లో బిల్లులు కాజేశారు. పారిశుధ్యం, విద్యుత్ సామగ్రి కొనుగోళ్లలోనూ చేతివాటం ప్రదర్శించారు. కొన్ని చోట్ల గ్రామపంచాయతీ తీర్మానం లేకుండానే ఇష్టారాజ్యంగా నిధులు ఖర్చు చేశారు. 1984 నుంచి ఇప్పటివరకు సర్పంచులుగా పనిచేసినవారిలో 167 మంది రూ. 1.28 కోట్ల మేర నిధులను కాజేశారు. ఏళ్లు గడుస్తున్నప్పటికీ వీరివద్ద రికవరీ చేసిన సొమ్ము నామమాత్రమే. కేవలం ముగ్గురు సర్పంచ్‌లనుంచి రూ. 2.09 లక్షలు మాత్రమే రికవరీ చేయగలిగారు. ఇంకా 164 మంది నుంచి నిధులు రికవరీ చేయాల్సి ఉంది. చెరువుల నిధులూ కాజేశారు చెరువుల మరమ్మతుల కోసం కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం కింద లక్షల రూపాయలు మంజూరు చేసింది. మెటీరియల్ కాంపోనెంట్ కింద వచ్చిన నిధుల వినియోగంలో కొందరు సర్పంచులు చేతివాటం ప్రదర్శించారు. సిమెంట్, ఇసుక, కంకర వంటి సామగ్రి నిధులను మింగేశారు. సామాజిక తనిఖీలలో ఈ అక్రమాలు వె లుగులోకి వచ్చినా చర్యలు శూన్యం. అక్రమాలకు పాల్పడిన సర్పంచుల నుంచి నిధులను రికవరీ చేసి ఇవ్వాలని ఈజీఎస్ అధికారులు పంచాయతీరాజ్ అధికారులకు నివేదిక పంపినా ఫలితం లేకుండా పోయింది. నోటీసులతోనే సరి అక్రమాలకు పాల్పడిన సర్పంచులపై రెవెన్యూ రికవరీ చట్టం కింద చర్యలు తీసుకోవచ్చు. అయితే తహశీల్దార్లు అక్రమార్కులకు నోటీసులిచ్చి చేతులు దులుపుకున్నా రు. మింగేసిన నిధులను చెల్లించని పక్షంలో వారి ఆస్తులను జప్తు చేయాల్సిన అధికారులు చర్యలు తీసుకోవడానికి జంకుతున్నారు.