ఆయకట్టు గట్టెక్కేనా..? | Sriram Sagar Project Use To Farmers | Sakshi
Sakshi News home page

ఆయకట్టు గట్టెక్కేనా..?

Published Mon, Mar 4 2019 6:23 AM | Last Updated on Mon, Mar 4 2019 6:23 AM

Sriram Sagar Project Use To Farmers - Sakshi

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు

బాల్కొండ: శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు ఆయకట్టు కింద సాగవుతున్న పంటలకు చివరి వరకు నీరందుతుందా..? యాసంగి పంటలు చేతికొస్తాయా? అంటే అనుమానంగానే ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టులో ఉన్న నీటిమట్టాన్ని చూస్తే యాసంగి పంటలు చేతికి రావడం అనుమానమేనని రైతాంగం ఆందోళన చెందుతోంది. ఉత్తర తెలంగాణ జిల్లాల కల్పతరువుగా పేరు గాంచిన శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌లో నీటి నిల్వలు వేగంగా తగ్గిపోతున్నాయి. ప్రస్తుత యాసంగిలో వారబందీ ప్రకారం నాలుగు తడుల నీరు పంటలకు అందించేందుకు ప్రాజెక్ట్‌ అధికారులు ప్రణాళిక రూపొందించి శివమ్‌ కమిటీకి పంపించారు. కమిటీ సూచన మేరకు ప్రభుత్వం యాసంగి పంటలకు నీటి విడుదలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో ఫిబ్రవరి 1 నుంచి నీటి విడుదల ప్రారంభించడంతో నీటి మట్టం పడిపోతోంది. మరోవైపు. ఎగువ ప్రాంతాల నుంచి ప్రస్తుతం చుక్క నీరు వచ్చే అవకాశం లేదు. ప్రస్తుతం ప్రాజెక్ట్‌లో 19 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది.

యాసంగిలో ఎల్‌ఎండీ ఎగువ భాగం వరకు కాకతీయ కాలువ కింద 3.91 లక్షల ఎకరాలు, గుత్ప అలీసాగర్‌ ఎత్తిపోతల కింద 21 వేల ఎకరాలు, లక్ష్మి కాలువ ద్వారా 16500 ఎకరాలు, సరస్వతి కాలువ ద్వారా 24 వేల ఎకరాలకు సాగు నీరు అందించాలని నిర్ణయించారు. అయితే, ప్రస్తుతమున్న పంటలకు చివరి తడి వరకు నీరు అందడం గగనమేనని అటు రైతులు, ఇటు అధికారులు పేర్కొంటున్నారు. కాకతీయ కాలువ ద్వారా ఒక తడి నీరు ఇవ్వడానికి 4.5 టీఎంసీల నీరు అవసరమవుతుంది. ఇప్పటివరకు ఒక తడి మాత్రమే నీరు ఇచ్చారు. ప్రస్తుతం రెండవ తడి కోసం నీటి విడుదల కొనసాగుతోంది. ఎండలు ఎక్కువ పెరగడంతో రెండవ తడిలో కనీసం 5 టీఎంసీల నీరు అవసరమవుతుందని ప్రాజెక్ట్‌ అధికారులు అంచనా వేస్తున్నారు.

మూడు, నాలుగు తడుల సమయంలో నీటి వినియోగం మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ లెక్క ప్రకారం మూడు తడులకు కలిపి కనీసం 15 టీఎంసీల నీరు అవసరని భావిస్తున్నారు. అయితే, ఎస్సారెస్పీలో ప్రస్తుతం 19 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. ఈ లెక్కన పంటల కోసం 15 టీఎంసీల నీటిని విడుదల చేసే అవకాశం లేదు. ఎందుకంటే తాగు నీటి అవసరాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. డెడ్‌ స్టోరేజీ 5 టీఎంసీలు, ఆవిరి రూపంలో 2 టీఎంసీలు పోతుంది. ఇక, మిషన్‌ భగీరథకు 6.5 టీఎంసీల నీటిని కేటాయించారు. అవన్ని పోనూ మిగిలేది 5 టీఎంసీలు మాత్రమే. అంటే, ఈ లెక్కన చూస్తే ఆయకట్టుకు రానున్న రోజుల్లో నీటి విడుదల చేయడం కష్టంగానే కనిపిస్తోంది

 పడిపోయిన నిల్వ సామర్థ్యం

వాస్తవానికి శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నిల్వ సామర్థ్యంపై అనేక అనుమానాలున్నాయి. ప్రాజెక్టు మొదట్లో 120 టీఎంసీలుగా పేర్కొన్నారు. అయితే, 1994లో నిర్వహించిన సర్వే మేరకు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలు అని అధికారులు చెబుతున్నారు. 2015లో చేపట్టిన సర్వే ప్రకారం నిల్వ సామర్థ్యం 80 టీఎంసీలకు పడిపోయినట్లు తేలింది. పూడికను పరిగణనలోకి తీసుకుంటే అది మరింత తగ్గుతుంది. తాజా సర్వేను లెక్కల్లోకి తీసుకోకుండా అధికారులు పాత లెక్కలు చెబుతుండడం గమనార్హం. దీంతో నీటి లెక్కలన్నీ కాకి లెక్కలేనని ఆయకట్టు రైతులు విమర్శిస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement