ground water level is decreasing
-
నిధులు గాలికి.. నీళ్లు పాతాళానికి
సాక్షి, కాకినాడ(తూర్పు గోదావరి): ఒకవైపు సముద్రం, మరోవైపు గోదావరి... కానీ జిల్లాలో భూగర్బ జలాలు అడుగంటిపోతున్నాయి. సాధారణంగా చుట్టూ నీటి వనరులు ఉండటం వల్ల భూగర్భ జలాలు రీఛార్జ్ కావాలి. కానీ జిల్లాలో పరిస్థితి దయనీయంగా మారుతోంది. భూగర్భ జలాల సంరక్షణ పేరిట నానా హంగామా చేసి, రూ.కోట్లలో ఖర్చు చేసిన గత తెలుగుదేశం పాలకుల చిత్తశుద్ధి లేమితో ఈ పరిస్థితి దాపురించింది. జల సంరక్షణ పేరుతో గత ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆర్భాటం చేసింది. వందల కోట్లు ఖర్చు పెట్టింది. అయితే, నీటి సంరక్షణ మాటేమో గాని నిధుల భక్షణ మాత్రం ఎక్కువే జరిగింది. ఈ పనులు టీడీపీ నేతలకు కాసులు కురిపించాయే తప్ప జిల్లాలో భూగర్భ జలాలు ఎక్కడా పెరగలేదు సరికదా సొమ్ములు ఖర్చు పెట్టిన కొద్దీ భూగర్భ జలాలు మరింత అడుగంటి పోయాయి. దోపిడీపై చూపించిన శ్రద్ధ భూగర్భ జలాల సంరక్షణపై ఏమాత్రం చూపలేదు. ‘మా జేబులు నిండుతున్నాయి. జల సంరక్షణ ఏమైపోతే మాకేంటి’ అనే ధోరణిలో గాలికొదిలేశారు. ఇప్పుడది ప్రమాదకరంగా తయారైంది. రూ.500 కోట్లకు పైగా ఖర్చు...ఆపై హడావుడి అభివృద్ధికి మూలం జలం అని చెప్పుకుని నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జల సంరక్షణ కోసం ఐదేళ్ల కాలంలో రూ.500 కోట్ల వరకు ఖర్చు పెట్టారు. అనేక రకాల పథకాలు, కార్యక్రమాల పేరుతో పెద్ద ఎత్తున హడావుడి చేశారు. పనులు చేసినట్టు రికార్డుల్లో కూడా చూపించారు. 1000కి పైగా చెరువులు అభివృద్ధి చేసినట్టు గొప్పగా చెప్పారు. కానీ జిల్లాలో భూగర్బ జలాలు ఇసుమంతైనా పెరగలేదు. ఏటా భారీగా తగ్గిపోతూ వస్తున్నాయి. దీంతో చేసిన ఖర్చు, జరిగిన పనులు అక్కరకు రాకుండా పోయాయి. జల సంరక్షణ పనులు చేశాక కూడా భూగర్బ జలాలు మరింత దిగజారిపోయాయి. 2016మే నాటికి 8.98 మీటర్ల లోతులో నీరు ఉండగా, 2017మే నాటికి 9.55మీటర్ల లోతుకు వెళ్లిపోయాయి. 2018మే నాటికి 9.58మీటర్ల లోతుకు చేరాయి. 2019మే నాటికైతే 10.27మీటర్ల లోతుకు భూగర్బ జలాలు అడుగంటిపోయాయి. జిల్లాలో నీరు చెట్టు కింద చేసిన వ్యయం రూ.250 కోట్లు పంట సంజీవని కింద చేసిన ఖర్చు రూ.20 కోట్లు ఇంకుడు గుంతల కింద చేసిన ఖర్చు రూ.3.08 కోట్లు కాంటూరు ట్రెంచెస్ కింద చేసిన ఖర్చు రూ.30.67లక్షలు రాక్ ఫీల్డ్ డ్యామ్‌లు, చెక్ డ్యామ్‌లు, ఇతరత్రా చేసిన ఖర్చు రూ.200 కోట్ల నేతల ఆస్తులు పెరిగాయి...భూగర్భంలో నీళ్లు తగ్గాయి జల సంరక్షణ పేరుతో పనుల పందేరానికి తెర లేపారు. నామినేటేడ్ ముసుగులో నిధులు దోచి పెట్టారు. నేతలు సిండికేట్‌గా మారి పనులు చేపట్టారు. రికార్డుల్లో అంతా జరిగినట్టు చూపించారు. నిధులు ఎంచక్కా డ్రా చేసేసుకున్నారు. కానీ భూగర్భ జలాలు మాత్రం పెరగలేదు. జిల్లాలో నీరు చెట్టు అక్రమాలు ఏ స్థాయిలో జరిగాయో అందరికీ తెలుసు. నేతల మేతకు బాగా పనిచేశాయి. చెరువుల తవ్వకాలు, రిటైనింగ్ వాల్, చెక్‌డ్యామ్‌లు, స్లూయిజ్...ఇలా రకరకాల కాంక్రీట్ పనుల రూపంలో పెద్ద ఎత్తున నిధులు స్వాహా చేశారు. చెరువు పనుల్లో మట్టి అమ్మకాల ద్వారా కోట్లాది రూపాయలు ఆర్జించారు. ఇక, కాంక్రీటు పనుల విషయానికొస్తే కొన్ని పనులు నాసిరకంగా, మరికొన్ని అసంపూర్తిగా చేపట్టిన దాఖలాలు ఉన్నాయి. కొన్నిచోట్లైతే పనులు చేపట్టకుండానే నిధులు డ్రా చేసిన సందర్భాలు ఉన్నాయి. మరికొన్ని చోట్లైలైతే పాత పనులకే పైపై మెరుగులు దిద్ది బిల్లులు చేసేసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉండగా ఇంకుడు గుంతలు, పంట సంజీవని, కాంటూరు ట్రెంచెస్, రాక్‌ఫీల్డ్ డ్యామ్‌లు...తదితర కార్యక్రమాల పేరుతో ఇరిగేషన్, డ్వామా, అటవీ శాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పనులు చేపట్టారు. వాటికి వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. వీటిలో కూడా దాదాపు అక్రమాలు చోటు చేసుకున్నాయి. లోకాయుక్త, విజిలెన్స్ వరకు ఫిర్యాదులు కూడా వెళ్లాయి. చెప్పాలంటే జల సంరక్షణ పేరుతో నిధులు తినేశారు. దీంతో టీడీపీ నేతల ఆస్తులు గణనీయంగా పెరిగాయి. నీరు చెట్టు పనులు నేతల మేతకు పనికొచ్చాయే తప్ప నీటి మట్టాన్ని పెంచలేకపోయాయి. భవిష్యత్తు భయానకం జిల్లాలో దిగజారిపోతున్న భూగర్బ జలాలు చూస్తుంటే భవిష్యత్తు ఆందోళనకరంగా కన్పిస్తోంది. చిత్తశుద్ధి లేని నేతలు, అవినీతి అక్రమాలతో నిధులు భోంచేసిన పాలకులతో గత ఐదేళ్లుగా చేసిన ఖర్చు వృథా ప్రయాసగానే మిగిలిపోయింది. 2016, 2017కి చూస్తే భూగర్బ జలాల లోతు 0.6 మీటర్ల మేర పెరగగా, 2017, 2018కి చూస్తే 0.03 మీటర్ల లోతు పెరిగింది. 2018, 2019కి చూస్తే 0.69మీటర్ల భూగర్బ జలాలు మరింత అడుగంటిపోయాయి. ఇలా ఏటా భూగర్భ జలాలు లోతుకు వెళ్లిపోతున్నాయి. ఫలితంగా సాగునీరు సంగతి పక్కన పెడితే తాగడానికి గుక్కెడు నీళ్ల కోసం ఇబ్బంది పడే పరిస్థితిలో భవిష్యత్తులో దాపురిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వం అప్రమత్తం కావల్సి ఉంది. పాలకులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని జల సంరక్షణ కోసం ప్రత్యేక శ్రద్ధ చూపాలి. ఆంధ్రా అన్నపూర్ణకు హాని జరగకుండా చూడాల్సిన అవసరం ఉంది. ఏటా తగ్గిపోతూ వస్తున్న భూగర్భ జలాలు మే 2016లో భూగర్బజలాల లోతు 8.98 మీ. మే 2017లో భూగర్బజలాల లోతు 9.55 మీ. మే 2018లో భూగర్బజలాల లోతు 9.58 మీ. మే 2019లో భూగర్బజలాల లోతు 10.27 మీ. -
పల్లెల్లో దాహం కేకలు !
సాక్షి, దాచేపల్లి : పల్లెవాసుల గొంతెండుతోంది. భూగర్భ జలాలు అడుగంటిపోతున్న నేపథ్యంలో గ్రామాల్లో తాగునీటి ఎద్దడి ప్రారంభమైంది. గుక్కెడు నీటి కోసం ప్రజలు బిందెలు పట్టుకుని పరుగులు తీస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో నీటి కొరత తీవ్రంగా ఉండటంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. మంచినీటి సమస్య అధికంగా ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవటంతో ప్రజలు మండిపడుతున్నారు. ఓట్లు కోసం గడప తొక్కే నాయకులు ఇప్పుడు నీటి సమస్యను పరిష్కరించకపోవటంతో వారి తీరును తప్పుపడుతున్నారు. వేసవికాలం ప్రారంభంలోనే మంచినీటి ఎద్దడి ఉంటే ముందు రోజుల్లో మరింతగా నీటి కోసం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంటుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చెంతనే కృష్ణమ్మ ప్రవహిస్తున్నప్పటికీ అధికారులు ప్రణాళికాబద్దంగా వ్యవహరించకపోవటంతో అనేక గ్రామాలకు కృష్ణమ్మ రావటంలేదు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో నిర్మించిన తాగునీటి పైలెట్ ప్రాజెక్ట్‌ల నిర్వహణ పట్ల నిర్లక్ష్యంగా వ్యహరించటంతో మంచినీటి సమస్యకు కారణంగా మారింది. పైపులైన్ల తొలగింపు.... నడికుడి పంచాయతీ పరిధిలోని నారాయణపురం,మన్షూర్షాపేట, అంజనాపురం, నడికుడి ఎస్సీ కాలనీలో మంచినీటి సమస్య అధికంగా ఉంది. ఇక్కడ రోడ్ల నిర్మాణం కోసం తాగునీటి పైపులను తొలగించారు. నెలలు గడుస్తున్న రోడ్ల నిర్మాణాలు పూర్తికాక పైపులైన్లను అమర్చలేదు. దీంతో మంచినీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మండలంలోని కేసానుపల్లి గ్రామంలో పలు బోర్లు మరమ్మతులకు గురికాగా మరికొన్ని బోర్లకు నీరు అందటంలేదు. భూగర్భ జలాలు అడుగంటిపోవటంతో బోర్లకు నీరు అందక పనిచేయటంలేదు. దీంతో ప్రజలు తాగునీటి కోసం పరుగులు తీస్తున్నారు. రైల్వేట్రాక్ సమీపంలో నూతనంగా ఏర్పడిన కాలనీలో బోర్లు పనిచేయక కాలనీవాసులు నీటి కోసం అరకిలోమీటర్ దూరం వెళ్తున్నారు. దాచేపల్లిలోని పలు వార్డుల్లో మంచినీటి సమస్య ఉంది. మాదినపాడు, తంగెడ, తక్కెళ్లపాడు, గామాలపాడు, పొందుగల గ్రామాల్లో కూడా మంచినీటి కోసం ప్రజలు అవస్థలు పడుతున్నారు. అడుగంటుతున్న భూగర్భ జలాలు... వేసవికాలం రావటంతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. గతేడాది వర్షపాతం తక్కువ మోతాదులో నమోదు కావటంతో భూగర్భ జలాలు స్థాయి పెరగలేదు. దీంతో బోర్లకు నీరు అందటంలేదు. ప్రస్తుతం 500 అడుగుల లోతులో బోర్లు వేసిన అర అంగుళం నీటి ధార రావటంలేదు. నాగులేరు, పలు వాగుల్లో అధికపార్టీ నాయకులు చెక్‌డ్యాంలను నిర్మించారు. కేవలం నిధులు డ్రా చేసుకునేందుకు వీటిని నిర్మించారే తప్ప నీరు నిలబడేందుకు కాదనే విషయం చెక్‌డ్యాంలను చూస్తే తెలుస్తుంది. మార్చిలో భూగర్భ జలాలు అడుగంటిపోతే ఏప్రిల్, మే నెలలో అసలు బోర్లు పనిచేయవనే ఆందోళన ప్రజలను వెంటాడుతోంది. రెండేళ్ల క్రితం డిసెంబర్ నుంచి మే నెలాఖారు వరకు మంచినీటి ఎద్దడి నెలకొనటంతో మంచినీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గ్రామాల్లో నెలకొన్న మంచినీటి ఎద్దడిపై దృష్టిసారించకపోవడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీటి ఎద్దడి అధికంగా ఉన్న ప్రాంతాల్లో నడికుడికి చెందిన మందపాటి నాగిరెడ్డి ఫౌండేషన్, ఇరికేపల్లికి చెందిన ది మధర్ స్వచ్ఛంద సేవా సంస్థల వారు ట్యాంకర్ల ద్వారా ఉచితంగా మంచి నీటిని అందిస్తున్నారు. స్వచ్ఛంద సేవా సంస్థలు తీసుకున్న చొరవను ప్రభుత్వం చూపించకపోవటం తీవ్ర విమర్శలకు దారి తీస్తుంది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మంచినీటి సమస్యను తీర్చాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. రోడ్ల కోసం పైపులైన్లు తొలగించారు నారాయణపురంలో రోడ్ల నిర్మాణం కోసం మంచినీటి పైపులైన్లను తొలగించారు. పైపులను తీసేయటం వల్ల మంచినీటి కోసం ఇబ్బందులు పడుతున్నాం. గత నెల రోజుల నుంచి మంచినీటి కోసం పక్క వీధులకు వెళ్తున్నారు. పైపులైన్ల ద్వారా మంచినీరు సక్రమంగా అందటంలేదు. – షేక్ షరిఫ్. నారాయణపురం -
నీరులేక పాతాళానికి.. గంగమ్మ!
సాక్షి,మరికల్: ‘‘జానెడు పొట్టను నింపుకొనే కష్టజీవి రెక్కలకు తీరని కష్టాలు వచ్చాయి. గతేడాది ఆశించిన వర్షపాతం నమోదుకాక వాగులు, వంకలు, చెరువుల్లో నీరులేక బోర్లలో భూగర్భజలం అడుగంటిపోతుంది. అప్పటికే సాగుచేసిన వరి, ఇతర పంటలను కాపాడుకునేందుకు రైతులు చేయరాని ప్రయత్నాలు చేస్తూ జలం కోసం పొల్లాలో బోర్లను డ్రిల్లింగ్ చేస్తూ భగీరథయత్నం చేస్తున్నారు.’’ గుక్కెడ నీరు దొరకని దుస్థితి ఇప్పటికే అన్ని మండలాల్లో 90శాతం వ్యవసాయ బోర్లలో భూగర్భజలాలు అడుగంటిపోయాయి. అడవుల్లో గుక్కెడు నీళ్లు దొరకని పరిస్థితి నెలకొంది. వేసవి మరో రెండు నెలలు ఉండగానే కరువు మేఘాలు కమ్మేయడంతో అన్నదాత బావురమంటున్నాడు. చేతికొచ్చిన వరిపంటను రక్షించుకునేందుకు పక్కపొల్లం రైతుల బోర్ల నుంచి సాగునీరు పెట్టుకునేందుకు ప్రాధేయపడుతున్నారు. దాయదాల్చి నీళ్లు ఇస్తే పంటలు.. లేదంటే పెట్టుబడి సైతం మీదపడే ప్రమాదం కన్పిస్తోంది.కొంతమంది రైతులు చేతికొచ్చిన పంటలను రక్షించుకునేందుకు ఒక్కొక్కరు తమ పొల్లాలో రెండు నుంచి ఐదు వరకు బోర్లను డ్రిలింగ్ చేస్తున్నారు. మరికొందరు నీళ్లు వచ్చే వరకు ఆపార భగీరథయత్నం చేస్తున్నారు. ఎండుతున్న పంటలు ఫిబ్రవరి నెలలోనే వ్యవసాయ బోర్లలో భూగర్భజలాలు అడుగంటి పోవడంతో రైతులకు కష్టాలు మొదలయ్యాయి. ఆరుగాలం కష్టించి పండించిన పంటలకు చేతికొచ్చే దశలోనే నీళ్లులేక పంటలు ఎండుముఖం పట్టాయి. ఎకరాకు రూ.25వేల చొప్పున పెట్టుబడులు పెట్టిన రైతులకు అప్పులు తప్పెటట్లులేదు.మరో పక్షం రోజుల వరకు మూడు తడుల నీళ్లు పెట్టిన పంటలు బతికే అవకాశం ఉంది. పంటల పరిస్థితి పక్కన పెడితే పశువులకు గుక్కెడు నీళ్లులేక దాహంతో అల్లాడుతున్నాయి. ఇలాంటి విపత్కర పరిస్థితులు రావడంతో రైతులు కోలుకోలేకపోతున్నారు. కోయిల్‌సాగర్ కింద ఇదే పరిస్థితి కోయిల్‌సాగర్ ప్రాజెక్టును నమ్ముకొని వరి పంటలు సాగుచేసిన రైతులకు ముందు నుయ్యి.. వెనక గొయ్యిలా మారింది. సరైన సమయానికి ప్రాజెక్టు నుంచి అధికారులు నీళ్లను వదలకపోవడంతో రైతులు కేఎస్పీ ఆయకట్టు నీటి కోసం ఆందోళన బాట పడితే ఎట్టకేలకు కంటితుడుపుగా ఐదు రోజులు నీటిని విడుదల చేసి చేతులు ఎత్తేశారు. మరో ఐదురోజులపాటు నీరు విడుదల చేస్తే పంటలు బతికే అవకాశం ఉందని ఆయకట్టు రైతులు కోరుతున్నారు. -
రైతన్నకు నీటి కష్టాలు
సాక్షి, మోటకొండూర్(నల్గొండ) : దేశానికి అన్నం పెట్టే రైతన్నకు ఏ సీజన్లోనైనా కష్టాలు మాత్రం తప్పటం లేదు. సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవకపోవడం ఒక కారణమైతే.. కురిసిన వర్షపు నీటిని నిల్వచేసే చెరువులు, కుంటలు, వాగులు, వంకలు అన్యాక్రాంతం అయి నీటి నిల్వ సామర్థ్యం తగ్గడం మరో కారణం. వేసవి ప్రారంభంలోనే ఎండలు మండుతుందటంతో భూగర్భ జలాలు నానాటికి అడుగంటి బోర్లు వట్టిపోతుండటంతో రైతులకు కన్నీళ్లే మిగిలేలా ఉన్నాయి. రబీ సాగు వివరాలు ఇలా.. మండల వ్యాప్తంగా 15,275 హెక్టార్ల వ్యవసాయ భూమి ఉండగా అందులో రబీలో 1,322 హెక్టార్ల విస్తీరణంలో సాగుచేశారు. అందులో వరి 890 హెక్టార్లు, జొన్నలు 6 హెక్టార్లు, మినుములు 6 హెక్టార్లు, శెనిగలు 25 హెక్టార్లు, వేరుశెనిగలు 30 హెక్టార్లు, కొర్రలు ఒక హెక్టార్, కూరగాయలు 90హెక్టార్లు, మొక్కజొన్న 270హెక్టార్లు సాగు చేపట్టారు. కాగా గత రబీ సీజన్లో 3,412 హెక్టార్లలో సాగుచేయగా వర్షాల లేమి కారణంగా ఈ రబీ సీజన్లో సగానికి పైగా సాగు తగ్గింది. ప్రసుత్తం సాగు చేసిన పంటలు చేతికొచ్చే పరిస్థితి కనిపించడంలేదు. దీంతో రైతున్నలు ఆకాశంవైపు ఆశగా చూస్తున్నారు. భూగర్భజలాలు అడుగంటాయి వర్టూర్ గంగబావి వద్ద నాకు 9ఎకరాల భూమి ఉంది. అందులో 3ఎకరాలు పత్తి, 2ఎకరాలు కంది, ఎకరం వరి పంట వేశాను. వరికి మరో 20 రోజులు నీళ్లు అందితే పంట చేతికొచ్చేది. కానీ నీళ్లు అందక ప్రస్తుతం ఎండిపోయింది. కాగా నాకు రెండు బోర్లు ఉన్నాయి. గత రబీ సీజన్లో 2.5ఎకరాలలో వరి పంట పండించాను. ఇప్పుడు ఎకరం కూడా పారే పరిస్థితిలేదు. – సింగిరెడ్డి సాయిరెడ్డి, రైతు -
ఆయకట్టు గట్టెక్కేనా..?
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు కింద సాగవుతున్న పంటలకు చివరి వరకు నీరందుతుందా..? యాసంగి పంటలు చేతికొస్తాయా? అంటే అనుమానంగానే ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టులో ఉన్న నీటిమట్టాన్ని చూస్తే యాసంగి పంటలు చేతికి రావడం అనుమానమేనని రైతాంగం ఆందోళన చెందుతోంది. ఉత్తర తెలంగాణ జిల్లాల కల్పతరువుగా పేరు గాంచిన శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో నీటి నిల్వలు వేగంగా తగ్గిపోతున్నాయి. ప్రస్తుత యాసంగిలో వారబందీ ప్రకారం నాలుగు తడుల నీరు పంటలకు అందించేందుకు ప్రాజెక్ట్ అధికారులు ప్రణాళిక రూపొందించి శివమ్ కమిటీకి పంపించారు. కమిటీ సూచన మేరకు ప్రభుత్వం యాసంగి పంటలకు నీటి విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఫిబ్రవరి 1 నుంచి నీటి విడుదల ప్రారంభించడంతో నీటి మట్టం పడిపోతోంది. మరోవైపు. ఎగువ ప్రాంతాల నుంచి ప్రస్తుతం చుక్క నీరు వచ్చే అవకాశం లేదు. ప్రస్తుతం ప్రాజెక్ట్‌లో 19 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. యాసంగిలో ఎల్ఎండీ ఎగువ భాగం వరకు కాకతీయ కాలువ కింద 3.91 లక్షల ఎకరాలు, గుత్ప అలీసాగర్ ఎత్తిపోతల కింద 21 వేల ఎకరాలు, లక్ష్మి కాలువ ద్వారా 16500 ఎకరాలు, సరస్వతి కాలువ ద్వారా 24 వేల ఎకరాలకు సాగు నీరు అందించాలని నిర్ణయించారు. అయితే, ప్రస్తుతమున్న పంటలకు చివరి తడి వరకు నీరు అందడం గగనమేనని అటు రైతులు, ఇటు అధికారులు పేర్కొంటున్నారు. కాకతీయ కాలువ ద్వారా ఒక తడి నీరు ఇవ్వడానికి 4.5 టీఎంసీల నీరు అవసరమవుతుంది. ఇప్పటివరకు ఒక తడి మాత్రమే నీరు ఇచ్చారు. ప్రస్తుతం రెండవ తడి కోసం నీటి విడుదల కొనసాగుతోంది. ఎండలు ఎక్కువ పెరగడంతో రెండవ తడిలో కనీసం 5 టీఎంసీల నీరు అవసరమవుతుందని ప్రాజెక్ట్ అధికారులు అంచనా వేస్తున్నారు. మూడు, నాలుగు తడుల సమయంలో నీటి వినియోగం మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ లెక్క ప్రకారం మూడు తడులకు కలిపి కనీసం 15 టీఎంసీల నీరు అవసరని భావిస్తున్నారు. అయితే, ఎస్సారెస్పీలో ప్రస్తుతం 19 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. ఈ లెక్కన పంటల కోసం 15 టీఎంసీల నీటిని విడుదల చేసే అవకాశం లేదు. ఎందుకంటే తాగు నీటి అవసరాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. డెడ్ స్టోరేజీ 5 టీఎంసీలు, ఆవిరి రూపంలో 2 టీఎంసీలు పోతుంది. ఇక, మిషన్ భగీరథకు 6.5 టీఎంసీల నీటిని కేటాయించారు. అవన్ని పోనూ మిగిలేది 5 టీఎంసీలు మాత్రమే. అంటే, ఈ లెక్కన చూస్తే ఆయకట్టుకు రానున్న రోజుల్లో నీటి విడుదల చేయడం కష్టంగానే కనిపిస్తోంది పడిపోయిన నిల్వ సామర్థ్యం వాస్తవానికి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిల్వ సామర్థ్యంపై అనేక అనుమానాలున్నాయి. ప్రాజెక్టు మొదట్లో 120 టీఎంసీలుగా పేర్కొన్నారు. అయితే, 1994లో నిర్వహించిన సర్వే మేరకు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలు అని అధికారులు చెబుతున్నారు. 2015లో చేపట్టిన సర్వే ప్రకారం నిల్వ సామర్థ్యం 80 టీఎంసీలకు పడిపోయినట్లు తేలింది. పూడికను పరిగణనలోకి తీసుకుంటే అది మరింత తగ్గుతుంది. తాజా సర్వేను లెక్కల్లోకి తీసుకోకుండా అధికారులు పాత లెక్కలు చెబుతుండడం గమనార్హం. దీంతో నీటి లెక్కలన్నీ కాకి లెక్కలేనని ఆయకట్టు రైతులు విమర్శిస్తున్నారు. -
తోడేస్తున్నారు..
సాక్షి, భీమదేవరపల్లి(హుస్నాబాద్): జిల్లాకు సాగు నీటి గండం వచ్చింది. అవసరానికి మించి నీటిని తోడేస్తుండడంతోనే ఈ దుర్భర పరిస్థితి ఏర్పడింది. ఏప్రిల్, మే నెలల్లో రావాల్సిన సాగు నీటి కొరత ఫిబ్రవరి చివరి నుంచే మొదలైంది. ఇప్పటికే వ్యవసాయ, బోరుబావుల్లో గణనీయంగా నీటి మట్టం తగ్గిపోయింది. ఏడు మండలాల్లో బోరుబావుల తవ్వకాలతోపాటు అత్యధికంగా నీటిని వినియోగిస్తున్నట్లు భూగర్భజల శాఖ అధికారులు చెబుతున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే రాబోవు రోజుల్లో పరిస్థితి మరింత జఠిలంగా అవుతుందని హెచ్చరిస్తున్నారు. జిల్లాలో మొత్తం 11 మండలాలు ఉండగా.. వీటి పరిధిలో 28,000 వ్యవసాయ బోరుబావులు, 32,000 వ్యవసాయ బావులున్నాయి. సాధారణ సాగు విస్తీర్ణం 24,768 హెక్టార్లు ఉండగా యాసంగిలో 23,728 హెక్టర్లలో వివిధ పంటలు సాగు చేస్తున్నారు. ఇందులో వరి 12,605 హెక్టార్లు, మొక్కజొన్న 9986 హెక్టార్లు, వేరుశనగ 553 హెక్టార్లరు. రైతులు ప్రధానంగా యాసంగిలో వరి, మొక్కజొన్న తదితర పంటలను సాగు చేస్తున్నారు. నిరంతర ఉచిత విద్యుత్ అందుబాటులోకి వచ్చిన నాటి నుంచి సాగు నీటి వినియోగం పెరిగినట్లు తెలుస్తోంది. దీనికి తోడు వర్షం నీటిని నిల్వ ఉంచకపోవడంతో కొరత ఏర్పడుతోంది. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది నెల రోజుల మందుగానే సాగు నీటి సమస్య మొదలైంది. యాసంగిలో వేసిన పంటను కాపాడుకోవడానికి కొత్తగా బోర్లు వేయించడంతోపాటు వ్యవసాయ బావులు తవ్విస్తున్నారు. పలు గ్రామాల్లో 600 ఫీట్ల వరకు బోరు వేసినా నీటి జాడ కనిపించడంలేదు. దీనిని బట్టి పరిస్థితి నీటి వినియోగం ఎమేరకు ఉందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా భీమదేవరపల్లి మండలంలో ఈ పరిస్థితులు నెలకొన్నాయి. అత్యధికంగా నీటి వినియోగం చేసే గ్రామాలు జిల్లాలో అత్యధికంగా సాగు నీటిని వినియోగి స్తున్న గ్రామాలను అధికారులు గుర్తించారు. అందులో భీమదేవరపల్లి మండలంలోని గట్లనర్సింగపూర్, భీమదేవరపల్లి, కొప్పుర్, కొత్తకొండ, మల్లారం, మాణిక్యాపూర్, ముల్కనూర్, ముస్తఫా పూర్, ముత్తారం, ధర్మసాగర్ మండలంలో జానకిపురం, మల్లక్కపల్లి, నారాయణగిరి, ఎల్కతుర్తి మండలంలో బావుపేట, దండెపల్లి, జీల్గుల, పెంచికల్‌పేట, తిమ్మాపూర్, వల్భాపూర్, హసన్‌పర్తి మండలంలో దేవన్నపేట, జయగిరి, లక్నవ రం, పెంబర్తి, ఐనవోలు మండలంలో గర్మిల్లపల్లి, ఐనవోలు, పంతని, పున్నేల, సింగారం, కమలా పూర్ మండలంలో భీంపల్లి, దేశరాజుపల్లి, గూనిపర్తి, ఖాజిపేట మండలంలో మడికొండ, తరాలపల్లి, ఖిలా వరంగల్ మండలంలో గాదేపల్లి, స్తంభంపల్లి, వసంతాపూర్, వేలేరు మండలం లో మల్లికుదుర్ల, వేలేరు ఉన్నాయి. ఫిబ్రవరిలోనే తగ్గిన నీటి మట్టం జిల్లాలో గతేడాది ఫిబ్రవరిలో భూగర్భజల నీటి మట్టం 8.33 మీటర్లు ఉండగా ఈ ఏడాది 9.52 మీటర్లకు చేరింది. గతేడాదితో పోల్చుకుంటే 1.19 మీటర్ల లోతుకు పడిపోయింది. ఇప్పటికే భానుడు తన ప్రతపాన్ని చూపిస్తుండగా ఇక మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఎండలు మరింత ఉగ్రరూపం దాల్చనున్నాయి. దీంతో సాగు నీరు విషయం పక్కనబెటితే తాగు నీటికి సైతం తీవ్ర ఇబ్బందులు తప్పెలా లేవు. పైలెట్ ప్రాజెక్టుగా భీమదేవరపల్లి భూగర్జ జలాలను పెంపొందిచడంలో భాగంగా భీమదేవరపల్లి మండలాన్ని పైలెట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేశారు. ఇందులో కొప్పుర్, గట్లనర్సింగపూర్, కొత్తకొండ, ముల్కనూర్, ముస్తఫాపూర్ గ్రామాలను ఎంపిక చేశారు. ఆయా గ్రామాల్లో చెక్ డ్యాంలు, చెరువుల్లో కృత్రిమ ఇంకుడు బోరుబావులను నిర్మించనున్నారు. 150 ఫీట్ల వరకు బోరుబావులను తవ్వనున్నారు. దీంతో భూగర్భ జలాలు పెరిగి ఖరీఫ్‌లో సాగు నీరు అధికం కావడానికి ఈ కృత్రిమ ఇంకుడు బోరుబావులు ఉపయోగపడునున్నాయి. ఒక్కో కృత్రిమ ఇంకుడు బోరుబావి నిర్మాణానికి ప్రభుత్వం రూ.లక్ష నుంచి రూ.1.50లక్షల వరకు వెచ్చించనున్నారు. ఆయా గ్రామాల్లో రైతులతో సభలు నిర్వహించి ఎక్కడ కృత్రిమ ఇంకుడు బోరుబావుల తవ్వకం చేపట్టాలనే అంశంపై తీర్మానాలు చేయనున్నారు. ఈ మేరకు ఇటీవల కొత్తకొండలో సమావేశం నిర్వహించారు. నూతన బోర్లు, బావులకు చెక్.. భూగర్జ జలాలు తగ్గిపోతుండడంతో జిల్లాలోని ఏడు మండలాల పరిధిలో 37 గ్రామాలను బ్లాక్ లిస్టులో పెట్టినట్లు అధికారులు చెబుతున్నారు. ఆ యా గ్రామాల్లో నూతనంగా బోరులు వేయొద్దని, బావుల తవ్వకం చేపట్టవద్దని హెచ్చరిస్తున్నారు. ఒక వేళ వేసినట్లైతే కేసులు నమోదు చేయడంతోపాటు జరిమానాలు సైతం విధించనున్నారు. -
కేసీఆర్ మాటలు నీటి మూటలు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో భూగర్భజలాలు ప్రమాదకర స్థాయికి పడిపోయాయని బీజేపీ శాసనసభ పక్ష నేత కిషన్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘గ్రామీణ ప్రాంతాల్లో రైతులు అనేక కష్టాలు ఎదర్కొంటున్నారు. రబీలో వేసిన పంటలు ఒక ఎకరం కూడా ఎండనివ్వనని కేసీఆర్ చెప్పారు. కానీ ఆయన మాటలు నీటి మూటలు అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 100 మండలాలోల తీవ్ర కరువు పరిస్థితలు ఉన్నాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది 4 నుంచి 5 మీటర్ల దిగువకు భూగర్భ జలాలు చేరాయి’ అని తెలిపారు. తెలంగాణని ధనిక రాష్ట్రం అని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుందని, కరువు సహాయం కింద కేంద్రం వెయ్యి కోట్లు ఇస్తే ఇప్పటివరకు అవి ప్రజలకు అందలేదని ఆరోపించారు. సన్న బియ్యంతో అన్నం పెడతామని చెబుతున్నారు, కానీ ప్రజల కడుపు కాలే పరిస్థితి నెలకొందని వ్యాఖ్యానించారు. మిషన్ భగీరథపై ఉన్న ప్రేమ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు తాగునీరు అందించడంపై లేదన్నారు. తాగునీరులేక ఉత్తర తెలంగాణలోని గిరిజనులు వలస పోతున్నారని ఆయన తెలిపారు. కేవలం జనగామ జిల్లాలోనే 20 వేల ఎకరాల పంట నష్టం వాటిల్లిందని కిషన్‌రెడ్డి అన్నారు. భూగర్భ జలాలు పడిపోవడం వల్ల బోరుబావులు ఎండిపోయాయని తెలిపారు. హైదరాబాద్ చుట్టుపక్కల కూడా కూరగాయలు లేక ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ప్రజల అవసరాలను పట్టించుకోకుండా రైతులకు ఇచ్చే 4వేల రూపాయలను సర్వరోగ నివారిణి లాగా చెప్తున్నారని, ప్రభుత్వం పుండు ఒకటి ఉంటే మందు మరోటి వేస్తుందని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో నెలకొన్న తాగునీటి ఎద్దడిపై అఖిలపక్షం ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాన్ని ఎవరు విమర్శించకూడదు, శాసనసభలో కూడా ప్రశ్నించే హక్కు లేకుండా చేస్తుందని సర్కార్ తీరుపై మండిపడ్డారు. -
ప్రమాద ఘంటికలు
మెదక్: జిల్లాలో చెప్పుకోదగ్గ సాగునీటి ప్రాజెక్టులు లేకపోవడంతో సాగు నీరు కోసం రైతన్న భగీరథ ప్రయత్నాలు చేస్తున్నాడు. పాతాళగంగను పైకి తెచ్చేందుకు ప్రతి ఏటా విరివిగా బోర్లు తవ్వుతూనే ఉన్నారు. దీని కోసం లెక్కకు మించిన అప్పులు చేసి మరీ బోర్లు వేస్తున్నారు. విచ్చలవిడిగా బోర్లు తవ్వడంతో భూగర్భ జలాలు ప్రమాదస్థాయికి పడిపోయాయి. జిల్లా వ్యాప్తంగా అధికారిక లెక్కల ప్రకారం 1.30 లక్షల బోర్లు పనిచేస్తున్నాయి. వ్యవసాయానికి సంబంధించిన బోర్లు 90 వేలు ఉండగా 10వేల బోర్లు గృహ అవసరాల కోసం ఉపయోగిస్తున్నారు. మరో 30 వేల బోర్లు తాగునీటి కోసం, కంపెనీల యజమాన్యాలు తవ్వినవి. కొన్ని గ్రామాలకు మాత్రమే.. సరైన వర్షాలు లేకపోవడంతో పాతాళంలోనుంచి నీటిని బోర్లు ఎత్తిపోస్తున్నాయి. ఫలితంగా ప్రమాదస్థాయికి నీరు పడిపోయింది. జిల్లాలో పాపన్నపేట, మండలంతోపాటు మెదక్, కొల్చారం, హవేళిఘణాపూర్ మండలాల్లోని కొన్ని గ్రామాలకు మాత్రమే ఘనపూర్ ప్రాజెక్టు నుంచి ఎఫ్ఎం, ఎంఎ కాల్వలద్వారా సాగు నీరందుతోంది. కొంతకాలంగా సరైన వర్షాలు లేక చెరువు, కుంటలు నెర్రలు బారాయి. దీంతో సాగునీటికోసం రైతులు పోటీపడి మరి బోర్లుతవ్వుతున్నారు. నిత్యం ఎక్కడో ఒకదగ్గర జిల్లాలో 40 నుంచి 50 వరకు బోర్లు తవ్వుతున్నారు. ప్రస్తుతం ఎండలు ముదురుతున్న క్రమంలో ఈ సంఖ్యామరింత పెరిగే అవకాశం ఉందని అధికారులే చెబుతున్నారు. కాగా పాలకులు, అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోకుంటే ఇబ్బందులు తలెత్తే అవకాశాలు మెండుగా ఉన్నాయి. నీటి జాడ కరువు గతంలో బోరుబావిని తవ్వాలంటే 250 అడుగుల లోతు వేసేవారు. నేడు ఏకంగా 350 నుంచి 400 ఫీట్ల లోతుకు వెళ్తే తప్ప నీరు కనిపించని దుస్థితి. కొన్న చోట్ల ఎంత కిందకు వెళ్లినా నీటిజాడ దొరకని మండలాలు అనేకం ఉన్నాయి. సాగునీటికోసం చేసే ప్రయత్నంలో రైతులు అప్పుల పాౖలౌవుతున్నారు. ప్రమాద స్థాయిలోకి.. వ్యవసాయానికి ప్రభుత్వం 24 గంటల పాటు విద్యుత్‌ను సరఫరా చేయడంతో ఈ సమస్య మరింత జటిలమవుతుంది. దీంతో రైతులు స్థాయికి మించి పంటలను సాగు చేస్తున్నారు. బోరుబావిలో వచ్చే నీటిని కాకుండా సదరు రైతుకు బోరువద్ద ఎంత భూమి ఉంటుందో పూర్తి స్థాయిలో సాగు చేస్తున్నాడు. ఈ క్రమంలో సాగుచేసిన పంటకు నీటి తడులు అందక పోవడంతో 24 గంటల పాటు బోరును నడిపిస్తున్నాడు. దీంతో భూగర్భ జలాలు గణనీయంగా పడిపోతూ ప్రమాద స్థాయికి చేరుతున్నాయి. నీటి తడులు అందడం లేదు.. నాకున్న రెండు ఎకరాల భూమిలో ఇటీవలే రెండు బోర్లువేశాను. ఒక దాంట్లో మాత్రమే కొద్దిపాటిగా నీరు వచ్చింది. ఆనీటి ఆధారంగా ఎకరం పొలంలో వరి నాటు వేశాను. కాగా ఆ నీటితో పొలానికి సరిపడ నీటితడులు అందడం లేదు. పంటను రక్షించుకోవాలనే తాపత్రయంతో మరో బోరు వేయాల్సిన పరిస్థితి నెలకొంది. –బాగయ్య, రైతు -
ఆరుగాలం చెమటోడ్చిన వరి రైతు అతలాకుతలం..
ఆరుగాలం కష్టపడితే తప్ప నాలుగు మెతుకులు నోట్లోకి వెళ్లలేని పరిస్థితి అన్నదాతది. అతివృష్టి, అనావృష్టి అన్నింటినీ తట్టుకుని సాగు చేస్తుంటే రబీలో మొగిపురుగు రూపంలో శని దాపురించింది. ఖరీఫ్‌లో అగ్గి తెగులు, ఇప్పుడు మొగిపురుగు... ఇలా వరుస విపత్తులతో రైతన్న కోలుకోలేకపోతున్నాడు. ఏ మందులు పిచికారీ చేసినా ఫలితం శూన్యం. దీంతో వరిసాగు చేస్తున్న రైతన్న పరిస్థితి దయనీయంగా మారింది. ఎలాగైనా ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు, రైతు సంఘాల నాయకులు కోరుతున్నారు. మెదక్‌జోన్: అతివృష్టి.. అనావృష్టి.. విపత్తులు.. వాతావరణ మార్పులు..చీడపీడలు వీటిన్నంటితో అన్నదాతలు ఎప్పుడికప్పుడు కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతూనే ఉన్నాడు. ఈ ఏడాది ఖరీఫ్‌లో సాగుచేసిన పంటలకు అగ్గితెగులు సోకి 40 శాతం మేర వరి పంట చేతికందకుండా పోయింది. దీంతో కనీసం పెట్టుబడి కూడా చేతి కందని పరిస్థితి. కనీసం రబీలోనైనా సాగుచేసిన పంటలతో ఖరీఫ్‌లో జరిగిన నష్టాన్ని పూడ్చుకుందామంటే మాయదారి మొగిపురుగు దాడితో పంటలన్ని సర్వనాశనం అవుతున్నాయి. పచ్చని పైర్లతో కళకళలాడాల్సిన పంటపొలాలు పురుగు దాడితో వెలవెలబోతున్నాయి. ఈ పురుగు వరి కర్ర మొదళ్లనే కొరికి రైతన్నకు తీవ్ర నషాన్ని మిగిలిస్తుంది. 18 వేల హెక్టార్లు మాత్రమే.. జిల్లా వ్యాప్తంగా సాధారణంగా 20 వేల హెక్టార్లలో వరి సాగు చేయాల్సి ఉండగా ఖరీఫ్‌లో సరైన వర్షాలు లేక చెరువులు, కుంటల్లో నీరు లేకపోవడంతో బోరుబావుల్లో వచ్చే కొద్దిపాటి నీటితో ఇప్పటి వరకు 18 వేల హెక్టార్లు మాత్రమే సాగుచేశారు. దీనికి తోడు వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తుండంతో భూగర్భజలాలు గణనీయంగా తగ్గిపోయాయి. వేసిన పంటలైనా చేతికి వస్తాయని ఏదురు చూస్తున్న రైతన్నకు మొగిపురుగు రూపంలో ఎదురుదాడి జరుగుతోంది. దీంతో రైతులు వేలాది రైపాయల అప్పులు చేసి ఎన్నో రకాల మందులను స్ప్రే చేస్తున్నా ఫలితం లేకుండా పోతుంది. దీంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్లుగా నష్టాలే... గత రెండు సంవత్సరాలుగా రైతులు తీవ్రంగా నష్టాల పాలవుతున్నారు. 2016లో ఖరీఫ్‌లో పంటలు చేతికందే సమయంలో భారీ వర్షాలతో పంటలన్ని నీటి పాలయ్యాయి. ఈ విపత్తు కారణంగా సుమారు లక్షకు పైగా ఎకరాల్లో వరి పైరు నీట మునిగింది. 2017లో సరైన వర్షాలు కురవక చెరువులు, కుంటలు నెర్రలు బారాయి. బోరుబావుల ఆధారంగా సాగుచేసిన పంటలు చేతికందే సమయంలో అగ్గితెగులు సోకి 40 శాతం పంటలు చేతికందకుండా పోయాయి. ప్రస్తుత రబీలోనైనా పంటలను కాస్తరట లభిస్తుందేమోనని ఆశించిన రైతాంగానికి మొగిపురుగు రూపంలో మరో విపత్తు వచ్చిపడింది. ప్రతి పొలంలోనూ ఈ మాయదారి తెగుళ్లు సోకి పంటను నాశనం చేస్తుంది. రెండుసార్లు మందులు కొట్టిన.. నేను ఎకరన్నర పొలంలో వరి సాగు చేశాను. పంట సాగు చేసి నెలన్నర అవుతోంది. మొగిపురుగు తగిలి పంటనంతా మొదళ్లలో తినేస్తుంది. దీంతో విషగుళికలు చల్లాను. ఏమాత్ర ఫలితం లేకపోవటంతో రెండు సార్లు పైమందులను సైతం పిచికారీ చేశాను. అయినా ఏమాత్రం తగ్గడం లేదు. ప్రభుత్వమే ఆదుకోవాలి. –నర్సింలు, రైతు, జంగరాయి నివారణ కోసం.. మొగిపురుగు నివారణకోసం నాటు వేయగానే 20 నుంచి 25 రోజుల్లో ఎకర పొలంలో 4 నుంచి 5 కిలోల త్రీజీ లేదా 4జీ గులికలు చల్లాలి. ఒకవేల చల్లకుంటే లీటర్ నీటిలో 2 గ్రాముల కార్బన్ హైడ్రోక్లోరైడ్ పౌడర్‌ను కలిపి పిచికారీ చేయాలి. లేదా క్లోరోపైరిఫాస్ 2ఎంఎల్ మందును 1లీటర్ నీటిచొప్పున కలిపి పిచికారీ చేయాలి. లేదా మొనోక్రోటోఫాస్ మందును లీటర్‌కు 1.8 ఎంల్ చొప్పున కలిపి పిచికారీ చేయాలి. –పరుశరాం, జిల్లా వ్యవసాయాధికారి -
అడుగంటుతున్న ఆశలు
సాక్షి, తిరుపతి:జిల్లాలో తాగునీటి ఎద్దడి తీవ్రమవుతోంది. సగటున ఒకరికి రోజుకు 135 లీటర్ల నీరు అవసరం. అందులో తాగునీరు పది లీటర్లమేర అవసరం ఉంది. ఈలెక్కన జిల్లాలోని 22 లక్షల మంది జనాభాకు రోజుకు 2.97 కోట్ల లీటర్లు అవసరం. తిరుపతి, చిత్తూరు కార్పొరేషన్లు, మదనపల్లె, శ్రీకాళహస్తి, పుంగనూరు, పుత్తూరు, పలమనేరు, నగరి మున్సిపాలిటీలతో పాటు 36 మండలాల పరిధిలోని 432 గ్రామాలకు కలిపి 1.17 కోట్ల లీటర్ల నీటిని ప్రభుత్వం సరఫరా చేస్తోంది. నగరాలు, పట్టణాలు మినహా గ్రామాలకు బోర్లను అద్దెకు తీసుకుని ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. జిల్లాలో 21 మండలాల్లో తాగునీటి ఎద్దడి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అందులో 18 మండలాల్లో ప్రమాదస్థాయికి చేరుకున్నట్లు సమాచారం. జిల్లాలో 30వేలకు పైగా తాగునీటి బోర్లు ఉన్నాయి. వీటిలో ఆర్డబ్ల్యూఎస్ కింద 18వేల బోర్లు ఉన్నారుు. వీటిలో అనేక బోర్లలో నీటి చుక్క కనిపించడం లేదు. ఒక్క శాంతిపురం మండలంలో 204 బోర్లు ఉంటే, అందులో 114 బోర్లు ఎండిపోయూరుు. కొన్ని చోట్ల వ్యవసాయబోర్లు, ట్యాంకర్ల ద్వారా మంచినీటిని సరఫరా చేస్తున్నట్లు అధికారులు చెపుతున్నారు. కొన్నిప్రాంతాల్లో రెండు, మూడు రోజులకోసారి సరఫరా చేస్తుంటే, మరి కొన్ని ప్రాంతాల్లో సరఫరా చేస్తున్న దాఖలాలే లేవు. రోజూ కిలో మీటర్ల దూరం వెళ్లి తాగునీరు తెచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. నగరాలు, పట్టణాల్లో నాలుగైదురోజులకొకసారి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసేచోట మహిళలు కొట్టుకుంటున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. శాశ్వత నీటి వనరులేవీ... జిల్లాలో మంచినీటి సరఫరా కోసం శాశ్వత నీటి వనరులు లేకపోవడం గమనార్హం. వాగులు, వంకలు, కుంటలు, చెరువులు, ఎండిపోయాయి. మరో వైపు విచ్చలవిడిగా బోరుబావుల తవ్వకాలు, ఇసుక అక్రమ రవాణాతో భూగర్భ జలాల మట్టం నానాటికీ పడిపోతున్నట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లాలో 36 మండలాల్లో సుమారు 3 లక్షలకుపైగా పవర్‌బోర్లు వేయడంతో ప్రభుత్వం డార్క్ ఏరియాగా ప్రకటించింది. తాజా సమాచారం ప్రకారం జిల్లాలో సగటున భూగర్భ జలమట్టం 12.68 మీటర్లు నమోదు కావాల్సి ఉండగా, 21 మండలాల్లో 20 మీటర్ల కంటే లోతుకు పడిపోయినట్లు తెలుస్తోంది. అందులో 18 మండలాలను డీప్లెవల్ ప్రాంతాలుగా పరిగణించారు. భూగర్భ జలాల అభివృద్ధికి జిల్లా నీటియాజమాన్య సంస్థ(డ్వామా) ఆధ్వర్యంలో చేపట్టిన వివిధ పనులు నాలుగేళ్లుగా నత్తనడకన సాగుతున్నాయి. 35 మండలాల్లో రూ.237 కోట్లతో 47 మెగా వాటర్‌షెడ్స్ ప్రాజెక్టుల కింద అభివృద్ధి పనులు చేపడుతున్నారు. సా.. గుతున్న సేద్యం ఎన్నడూ లేని విధంగా సాగు విస్తీర్ణం పడిపోయింది. రబీలో సాధారణ సాగు విస్తీర్ణం 64,060 హెక్టార్లైతే.. సాగైంది 53,628 హెక్టార్లే. గత ఏడాది 55,095 హెక్టార్లలో పంటలు సాగుచేశారు. ఏటా సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోతోంది. నీటి కాలుష్యం కూడా సమస్యకు మరో కారణంగా చెప్పొచ్చు. నగరిలో బట్టలకు అద్దే రంగుల కారణంగా భూగర్భ జలాలు కలుషితమవుతుండడంతో సత్రవాడ, రామాపురం పరిధిలో బోర్లువేసి చాలీచాలని నీటిని సరఫరా చేస్తున్నారు. ఏర్పేడు మండల పరిధిలోని చెన్నంపల్లె, పెన్నగడ, కొత్తకాల్వ, పెనుమల్లం, గుడిమల్లం తదితర గ్రామాలతో పాటు రేణిగుంట మండల పరిధిలోని మరికొన్ని పల్లెల మీదుగా ప్రవహించే నక్కలవంక వాగులో నీరు కలుషితం అవుతోంది. గాజులమండ్యం పారిశ్రామికవాడ నుంచి వచ్చే వ్యర్థనీరు కలుస్తుండడంతో నీరు కలుషితమవుతోంది. ఏటా పడిపోతున్న భూగర్భ జల నీటిమట్టం సంవత్సరం నీటి మట్టం (మీటర్లు) 2005 6.58 2006 9.91 2007 9.90 2008 8.26 2009 11.45 2010 8.79 2011 10.11 2012 15.77 2013 17.88 (ఆగస్టు నాటికి)