రాకొండలో బోరులో నీళ్లు తగ్గడంతో పైపులను దించేందుకు యత్నిస్తున్న రైతులు
సాక్షి,మరికల్: ‘‘జానెడు పొట్టను నింపుకొనే కష్టజీవి రెక్కలకు తీరని కష్టాలు వచ్చాయి. గతేడాది ఆశించిన వర్షపాతం నమోదుకాక వాగులు, వంకలు, చెరువుల్లో నీరులేక బోర్లలో భూగర్భజలం అడుగంటిపోతుంది. అప్పటికే సాగుచేసిన వరి, ఇతర పంటలను కాపాడుకునేందుకు రైతులు చేయరాని ప్రయత్నాలు చేస్తూ జలం కోసం పొల్లాలో బోర్లను డ్రిల్లింగ్ చేస్తూ భగీరథయత్నం చేస్తున్నారు.’’
గుక్కెడ నీరు దొరకని దుస్థితి
ఇప్పటికే అన్ని మండలాల్లో 90శాతం వ్యవసాయ బోర్లలో భూగర్భజలాలు అడుగంటిపోయాయి. అడవుల్లో గుక్కెడు నీళ్లు దొరకని పరిస్థితి నెలకొంది. వేసవి మరో రెండు నెలలు ఉండగానే కరువు మేఘాలు కమ్మేయడంతో అన్నదాత బావురమంటున్నాడు. చేతికొచ్చిన వరిపంటను రక్షించుకునేందుకు పక్కపొల్లం రైతుల బోర్ల నుంచి సాగునీరు పెట్టుకునేందుకు ప్రాధేయపడుతున్నారు. దాయదాల్చి నీళ్లు ఇస్తే పంటలు.. లేదంటే పెట్టుబడి సైతం మీదపడే ప్రమాదం కన్పిస్తోంది.కొంతమంది రైతులు చేతికొచ్చిన పంటలను రక్షించుకునేందుకు ఒక్కొక్కరు తమ పొల్లాలో రెండు నుంచి ఐదు వరకు బోర్లను డ్రిలింగ్ చేస్తున్నారు. మరికొందరు నీళ్లు వచ్చే వరకు ఆపార భగీరథయత్నం చేస్తున్నారు.
ఎండుతున్న పంటలు
ఫిబ్రవరి నెలలోనే వ్యవసాయ బోర్లలో భూగర్భజలాలు అడుగంటి పోవడంతో రైతులకు కష్టాలు మొదలయ్యాయి. ఆరుగాలం కష్టించి పండించిన పంటలకు చేతికొచ్చే దశలోనే నీళ్లులేక పంటలు ఎండుముఖం పట్టాయి. ఎకరాకు రూ.25వేల చొప్పున పెట్టుబడులు పెట్టిన రైతులకు అప్పులు తప్పెటట్లులేదు.మరో పక్షం రోజుల వరకు మూడు తడుల నీళ్లు పెట్టిన పంటలు బతికే అవకాశం ఉంది. పంటల పరిస్థితి పక్కన పెడితే పశువులకు గుక్కెడు నీళ్లులేక దాహంతో అల్లాడుతున్నాయి. ఇలాంటి విపత్కర పరిస్థితులు రావడంతో రైతులు కోలుకోలేకపోతున్నారు.
కోయిల్‌సాగర్ కింద ఇదే పరిస్థితి
కోయిల్‌సాగర్ ప్రాజెక్టును నమ్ముకొని వరి పంటలు సాగుచేసిన రైతులకు ముందు నుయ్యి.. వెనక గొయ్యిలా మారింది. సరైన సమయానికి ప్రాజెక్టు నుంచి అధికారులు నీళ్లను వదలకపోవడంతో రైతులు కేఎస్పీ ఆయకట్టు నీటి కోసం ఆందోళన బాట పడితే ఎట్టకేలకు కంటితుడుపుగా ఐదు రోజులు నీటిని విడుదల చేసి చేతులు ఎత్తేశారు. మరో ఐదురోజులపాటు నీరు విడుదల చేస్తే పంటలు బతికే అవకాశం ఉందని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment