నింగి కురవదు.. నేల తడవదు ‘సాగు’బడి ఎలా..!
సాక్షి, కాకినాడ(తూర్పు గోదావరి): ఒకవైపు సముద్రం, మరోవైపు గోదావరి... కానీ జిల్లాలో భూగర్బ జలాలు అడుగంటిపోతున్నాయి. సాధారణంగా చుట్టూ నీటి వనరులు ఉండటం వల్ల భూగర్భ జలాలు రీఛార్జ్ కావాలి. కానీ జిల్లాలో పరిస్థితి దయనీయంగా మారుతోంది. భూగర్భ జలాల సంరక్షణ పేరిట నానా హంగామా చేసి, రూ.కోట్లలో ఖర్చు చేసిన గత తెలుగుదేశం పాలకుల చిత్తశుద్ధి లేమితో ఈ పరిస్థితి దాపురించింది.
జల సంరక్షణ పేరుతో గత ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆర్భాటం చేసింది. వందల కోట్లు ఖర్చు పెట్టింది. అయితే, నీటి సంరక్షణ మాటేమో గాని నిధుల భక్షణ మాత్రం ఎక్కువే జరిగింది. ఈ పనులు టీడీపీ నేతలకు కాసులు కురిపించాయే తప్ప జిల్లాలో భూగర్భ జలాలు ఎక్కడా పెరగలేదు సరికదా సొమ్ములు ఖర్చు పెట్టిన కొద్దీ భూగర్భ జలాలు మరింత అడుగంటి పోయాయి. దోపిడీపై చూపించిన శ్రద్ధ భూగర్భ జలాల సంరక్షణపై ఏమాత్రం చూపలేదు. ‘మా జేబులు నిండుతున్నాయి. జల సంరక్షణ ఏమైపోతే మాకేంటి’ అనే ధోరణిలో గాలికొదిలేశారు. ఇప్పుడది ప్రమాదకరంగా తయారైంది.
రూ.500 కోట్లకు పైగా ఖర్చు...ఆపై హడావుడి
అభివృద్ధికి మూలం జలం అని చెప్పుకుని నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జల సంరక్షణ కోసం ఐదేళ్ల కాలంలో రూ.500 కోట్ల వరకు ఖర్చు పెట్టారు. అనేక రకాల పథకాలు, కార్యక్రమాల పేరుతో పెద్ద ఎత్తున హడావుడి చేశారు. పనులు చేసినట్టు రికార్డుల్లో కూడా చూపించారు. 1000కి పైగా చెరువులు అభివృద్ధి చేసినట్టు గొప్పగా చెప్పారు. కానీ జిల్లాలో భూగర్బ జలాలు ఇసుమంతైనా పెరగలేదు.
ఏటా భారీగా తగ్గిపోతూ వస్తున్నాయి. దీంతో చేసిన ఖర్చు, జరిగిన పనులు అక్కరకు రాకుండా పోయాయి. జల సంరక్షణ పనులు చేశాక కూడా భూగర్బ జలాలు మరింత దిగజారిపోయాయి. 2016మే నాటికి 8.98 మీటర్ల లోతులో నీరు ఉండగా, 2017మే నాటికి 9.55మీటర్ల లోతుకు వెళ్లిపోయాయి. 2018మే నాటికి 9.58మీటర్ల లోతుకు చేరాయి. 2019మే నాటికైతే 10.27మీటర్ల లోతుకు భూగర్బ జలాలు అడుగంటిపోయాయి.
జిల్లాలో నీరు చెట్టు కింద చేసిన వ్యయం | రూ.250 కోట్లు |
పంట సంజీవని కింద చేసిన ఖర్చు | రూ.20 కోట్లు |
ఇంకుడు గుంతల కింద చేసిన ఖర్చు | రూ.3.08 కోట్లు |
కాంటూరు ట్రెంచెస్ కింద చేసిన ఖర్చు | రూ.30.67లక్షలు |
రాక్ ఫీల్డ్ డ్యామ్‌లు, చెక్ డ్యామ్‌లు, ఇతరత్రా చేసిన ఖర్చు | రూ.200 కోట్ల |
నేతల ఆస్తులు పెరిగాయి...భూగర్భంలో నీళ్లు తగ్గాయి
జల సంరక్షణ పేరుతో పనుల పందేరానికి తెర లేపారు. నామినేటేడ్ ముసుగులో నిధులు దోచి పెట్టారు. నేతలు సిండికేట్‌గా మారి పనులు చేపట్టారు. రికార్డుల్లో అంతా జరిగినట్టు చూపించారు. నిధులు ఎంచక్కా డ్రా చేసేసుకున్నారు. కానీ భూగర్భ జలాలు మాత్రం పెరగలేదు. జిల్లాలో నీరు చెట్టు అక్రమాలు ఏ స్థాయిలో జరిగాయో అందరికీ తెలుసు. నేతల మేతకు బాగా పనిచేశాయి. చెరువుల తవ్వకాలు, రిటైనింగ్ వాల్, చెక్‌డ్యామ్‌లు, స్లూయిజ్...ఇలా రకరకాల కాంక్రీట్ పనుల రూపంలో పెద్ద ఎత్తున నిధులు స్వాహా చేశారు.
చెరువు పనుల్లో మట్టి అమ్మకాల ద్వారా కోట్లాది రూపాయలు ఆర్జించారు. ఇక, కాంక్రీటు పనుల విషయానికొస్తే కొన్ని పనులు నాసిరకంగా, మరికొన్ని అసంపూర్తిగా చేపట్టిన దాఖలాలు ఉన్నాయి. కొన్నిచోట్‌లైతే పనులు చేపట్టకుండానే నిధులు డ్రా చేసిన సందర్భాలు ఉన్నాయి. మరికొన్ని చోట్లైలైతే పాత పనులకే పైపై మెరుగులు దిద్ది బిల్లులు చేసేసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉండగా ఇంకుడు గుంతలు, పంట సంజీవని, కాంటూరు ట్రెంచెస్, రాక్‌ఫీల్డ్ డ్యామ్‌లు...తదితర కార్యక్రమాల పేరుతో ఇరిగేషన్, డ్వామా, అటవీ శాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పనులు చేపట్టారు. వాటికి వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. వీటిలో కూడా దాదాపు అక్రమాలు చోటు చేసుకున్నాయి.
లోకాయుక్త, విజిలెన్స్ వరకు ఫిర్యాదులు కూడా వెళ్లాయి. చెప్పాలంటే జల సంరక్షణ పేరుతో నిధులు తినేశారు. దీంతో టీడీపీ నేతల ఆస్తులు గణనీయంగా పెరిగాయి. నీరు చెట్టు పనులు నేతల మేతకు పనికొచ్చాయే తప్ప నీటి మట్టాన్ని పెంచలేకపోయాయి.
భవిష్యత్తు భయానకం
జిల్లాలో దిగజారిపోతున్న భూగర్బ జలాలు చూస్తుంటే భవిష్యత్తు ఆందోళనకరంగా కన్పిస్తోంది. చిత్తశుద్ధి లేని నేతలు, అవినీతి అక్రమాలతో నిధులు భోంచేసిన పాలకులతో గత ఐదేళ్లుగా చేసిన ఖర్చు వృథా ప్రయాసగానే మిగిలిపోయింది. 2016, 2017కి చూస్తే భూగర్బ జలాల లోతు 0.6 మీటర్ల మేర పెరగగా, 2017, 2018కి చూస్తే 0.03 మీటర్ల లోతు పెరిగింది. 2018, 2019కి చూస్తే 0.69మీటర్ల భూగర్బ జలాలు మరింత అడుగంటిపోయాయి. ఇలా ఏటా భూగర్భ జలాలు లోతుకు వెళ్లిపోతున్నాయి.
ఫలితంగా సాగునీరు సంగతి పక్కన పెడితే తాగడానికి గుక్కెడు నీళ్ల కోసం ఇబ్బంది పడే పరిస్థితిలో భవిష్యత్తులో దాపురిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వం అప్రమత్తం కావల్సి ఉంది. పాలకులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని జల సంరక్షణ కోసం ప్రత్యేక శ్రద్ధ చూపాలి. ఆంధ్రా అన్నపూర్ణకు హాని జరగకుండా చూడాల్సిన అవసరం ఉంది.
ఏటా తగ్గిపోతూ వస్తున్న భూగర్భ జలాలు
మే 2016లో భూగర్బజలాల లోతు | 8.98 మీ. |
మే 2017లో భూగర్బజలాల లోతు | 9.55 మీ. |
మే 2018లో భూగర్బజలాల లోతు | 9.58 మీ. |
మే 2019లో భూగర్బజలాల లోతు | 10.27 మీ. |
Comments
Please login to add a commentAdd a comment