
తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవల కాంట్రాక్టు అస్మదీయుడికి కట్టబెట్టేందుకు అమాత్యుడి స్కెచ్
500 వాహనాలతో సేవల కల్పనకు టెండర్లు పిలిచిన ఏపీఎంఎస్‌ఐడీసీ
మూడేళ్ల కాలపరిమితికి కాంట్రాక్ట్.. మరో రెండేళ్లు పొడిగించేందుకు అవకాశం
ముందే ఓ సంస్థను ఎంపిక చేసి పేరుకే టెండర్లు నిర్వహిస్తున్న వైనం
ఒక్క బిడ్ దాఖలైనా ఆమోదించేలా రూపొందించిన నిబంధనలే నిదర్శనం
ఓ సంస్థతో డీల్ కుదుర్చుకుని ఆస్పత్రులకు జనరిక్ మందుల సరఫరాలోనూ అవినీతి పర్వం
సాక్షి, అమరావతి: దోచుకో.. పంచుకో.. తినుకో..! లక్ష్యంగా కూటమి నేతలు రెచ్చిపోతున్నారు. అస్మదీయులకు కాంట్రాక్ట్‌లను కట్టబెట్టడం.. అందినకాడికి దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు. ఈ క్రమంలో కీలక శాఖకు చెందిన అమాత్యుడి అవినీతి నిత్య‘సత్యం’గా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రూ.కోట్ల విలువ చేసే కాంట్రాక్ట్‌లపై కన్నేసిన ఆయన ముందే కొన్ని సంస్థలతో డీల్ కుదుర్చుకుని వాటికి పనులను కట్టబెట్టేలా పావులు కదుపుతున్నారు.
ఇందులో భాగంగా గర్భిణులు, బాలింతలను ఆస్పత్రులకు, ఇంటి వద్దకు తరలించే కాంట్రాక్ట్‌ను అస్మదీయుడికి కట్టబెట్టడానికి స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సేవలు అందిస్తున్న సంస్థ కాంట్రాక్ట్ గడువు ముగియడంతో ఏపీఎంఎస్‌ఐడీసీ కొత్తగా టెండర్లను ఆహ్వానించింది. మొత్తం ఐదు వందల వాహనాలతో.. మూడేళ్ల కాల పరిమితితో టెండర్‌లను పిలిచారు. కాంట్రాక్టు పరిమితి ముగిశాక మరో రెండేళ్లు పొడిగించుకునేలా వెసులుబాటు కల్పించారు. ఏడాదికి రూ.25 కోట్ల నుంచి రూ.30 కోట్ల వరకూ ఈ సేవలకు ప్రభుత్వం వెచ్చించే అవకాశం ఉంది. ఈ లెక్కన ఐదేళ్లకు రూ.100 కోట్ల నుంచి రూ.150 కోట్ల విలువ చేసే కాంట్రాక్ట్ ఇది!!
అస్మదీయుడికి కట్టబెట్టేలా పక్కా ప్రణాళిక
గతంలోనూ అత్యవసర వైద్య సేవల్లో అక్రమాలకు తెర తీయగా.. ఆ ఆశలపై ప్రభుత్వ పెద్దలు నీళ్లు చల్లడంతో.. ప్రత్యామ్నాయంగా తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవలపై సదరు నేత దృష్టి సారించినట్లు వెల్లడైంది. ఈ నేపథ్యంలో కొద్ది నెలల క్రితం తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవలు నిర్వహిస్తున్న సంస్థ నిర్వాహకులను పిలిచి బెంగళూరుకు చెందిన తన సన్నిహితుడి సంస్థకు సబ్ కాంట్రాక్ట్ ఇవ్వాలని ఆదేశించినట్లు విశ్వసనీయ సమాచారం.
అయితే మార్చితో ప్రస్తుత కాంట్రాక్ట్ ముగుస్తున్న తరుణంలో ఇప్పుడు సబ్ కాంట్రాక్ట్ తీసుకుని ఏం చేస్తారని అధికారులు నివేదించడంతో.. ఆ ఆలోచనను విరమించుకున్నారు. కొత్త కాంట్రాక్ట్‌నే తమవారికి కట్టబెట్టేలా వ్యూహ రచన చేశారు. ఈ నేపథ్యంలో కొత్త టెండర్ నిబంధనలన్నీ అస్మదీయ సంస్థకు అనుగుణంగా రూపొందించేలా అమాత్యుడు జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది.
సదరు సంస్థకు సేవల నిర్వహణలో అనుభవం లేకపోవడంతో కన్షార్షియంలో ప్రస్తుత సేవల నిర్వహణ సంస్థ అనుభవాన్ని వాడుకునేందుకు సిద్ధమమైనట్లు సమాచారం. ఓ సంస్థకు కట్టబెట్టాలని ముందే నిర్ణయించుకుని, ఒకే బిడ్ దాఖలైనా ఆమోదించే వెసులుబాటుతో అడ్డగోలుగా నిబంధనలు రూపొందించారు.
సాధారణంగా ఒకే బిడ్ దాఖలైన సందర్భాల్లో బిడ్‌ను రద్దు చేసి ప్రభుత్వం మళ్లీ టెండర్లకు వెళుతుంది. గత ప్రభుత్వంలో ఇదే నిబంధనతో ఇవే టెండర్‌లను నిర్వహించారు. అయితే తాజా టెండర్లలో మాత్రం ఒకే బిడ్ వచ్చినా ఆమోదించే అవకాశాన్ని సృష్టించుకున్నారు. దీన్ని బట్టి చూస్తే ప్రభుత్వం ముందే ఓ సంస్థను నిర్ణయించుకుని పేరుకు టెండర్ల తంతు నిర్వహిస్తోందని స్పష్టమవుతోంది.
కాంట్రాక్ట్ లేకుండానే..
తిరుపతికి చెందిన జనరిక్ మందుల సరఫరా సంస్థతో డీల్ కుదుర్చుకుని ప్రభుత్వాస్పత్రులకు జన్ ఔషధి మందుల సరఫరా పేరిట అమాత్యుడు ఇప్పటికే అవినీతికి తెర తీశారు! తాను డీల్ కుదుర్చుకున్న సంస్థతోనే ప్రభుత్వాస్పత్రుల సూపరింటెండెంట్‌లు ఎంవోయూ కుదుర్చుకుని మందులు కొనుగోలు చేసేలా వైద్య శాఖ అధికారులతో నిబంధనలు రూపొందించి ఉత్తర్వులు ఇప్పించారు. ప్రభుత్వ బోధనాస్పత్రులకు డీ సెంట్రలైజ్డ్ బడ్జెట్‌లో సరఫరా కాని వాటితో పాటు అత్యవసర మందులు, సర్జికల్స్‌ను ఏటా రూ.50 కోట్లకుపైగా వెచ్చించి స్థానికంగా కొనుగోలు చేస్తుంటారు.
ఈ కొనుగోళ్ల వ్యవహారంలో టెండర్లు పిలవకుండా రాష్ట్రవ్యాప్తంగా ఒప్పంద ప్రాతిపదికన ఒకే సంస్థకు మేలు జరిగేలా అమాత్యుడు చక్రం తిప్పారు. మంత్రి డీల్ చేసుకున్న సంస్థతో ఆస్పత్రుల సూపరింటెండెంట్‌లు రెండేళ్ల ప్రాతిపదికన ఎంవోయూ చేసుకునేలా గతేడాది ఆదేశాలు ఇచ్చారు. ఈ క్రమంలో ఇప్పటికే చాలా ఆస్పత్రుల్లో ఎంవోయూలు పూర్తి అయ్యాయి. ఈ లెక్కన రెండేళ్లలో రూ.100 కోట్లకుపైగా బిజినెస్ కల్పించడం ద్వారా కమీషన్ల రూపంలో రూ.కోట్లలో ప్రజాధనం దుర్వినియోగం జరుగుతోందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
‘‘అత్యవసర’’ ఆశలపై నీళ్లు..!
టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వైద్య శాఖలో అత్యవసర సేవల నిర్వహణపై కన్నేసిన సదరు అమాత్యుడు ప్రస్తుత సేవల నిర్వహణ సంస్థను టార్గెట్ చేశారు. దీంతో ఆందోళనకు గురైన యాజమాన్యం అమాత్యుడిని శరణు కోరగా.. తాను చెప్పిన సంస్థకు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చి వెళ్లిపోవాలని హుకుం జారీ చేశారు. ఇందుకు సరేనన్న యాజమాన్యం అమాత్యుడు సిఫార్సు చేసిన సంస్థకు సబ్ కాంట్రాక్ట్ ఇవ్వాలని కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాసింది.
ఈ క్రమంలో సబ్ కాంట్రాక్ట్ కోసం వైద్య శాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపారు. ఈ దశలో ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకుని.. సబ్ కాంట్రాక్ట్‌లు కుదరవని, తమ అస్మదీయుడికి అత్యవసర వైద్య సేవల కాంట్రాక్ట్ కట్టబెడతామని చెప్పడంతో చేసేదేమీ లేక అమాత్యుడు సైలెంట్ అయిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment