thalli bidda express
-
బాలింతకు నరకయాతన..
అనంతగిరి (అరకులోయ రూరల్): పచ్చి బాలింతరాలు.. పైగా, సిజేరియన్ ద్వారా ప్రసవం జరిగి వారం రోజులే అయింది.. క్షేమంగా ఆమెను ఇంటి వద్దకు చేర్చాల్సిన తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ సిబ్బంది ఆమెను నిర్లక్ష్యంగా, నిర్దయగా గ్రామానికి 3 కి.మీ. దూరంలో వదిలేసి వెళ్లిపోయారు. ఆదివారం జరిగిన ఈ సంఘటన వివరాలివి.. మండలంలోని పినకోట పంచాయతీ వాజంగి గ్రామానికి చెందిన గిరిజన మహిళ తామర్ల జ్యోతి(32)ని ప్రసవం కోసం విశాఖలోని కేజీహెచ్‌లో వారం కిందట చేర్చారు. కాన్పు ఇబ్బంది కావడంతో శస్త్రచికిత్స చేశారు. పండంటి ఆడ శిశువు పుట్టింది. తల్లీబిడ్డ ఆరోగ్యంగానే ఉండటంతో వైద్యుల సలహా మేరకు ఆదివారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌లో బయల్దేరారు. వాజంగిలోని బాలింత ఇంటి వరకు రావాల్సిన తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ గ్రామానికి 3 కి.మీ. దూరంలోనే వారిని దింపేసి సిబ్బంది వెళ్లిపోయారు. దీంతో శస్త్రచికిత్స చేయించుకున్న తాను మరో దారిలేక కష్టంగా కాలినడకన ఇంటికి చేరాల్సి వచ్చిందని బాలింత జ్యోతి, ఆమె బంధువు రవికుమార్ ఆవేదన వ్యక్తంచేశారు. శస్త్ర చికిత్స కుట్లు ఇంకా పచ్చిగానే ఉండటంతో గ్రామానికి చేరేందుకు నరకయాతన చూడాల్సి వచ్చిందని బాధితు రాలు వాపోయింది. వాహన సిబ్బంది కనీస మానవత్వం చూపలేదని, తామింక రాలేమని వారు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని ఆమె ఆరోపించింది. -
సురక్షితంగా.. సౌకర్యవంతంగా...
గత నెల ఒకటో తేదీన విజయవాడ రైల్వేస్టేషన్లో ఎస్.కె.అమీనాకు పురిటినొప్పులు వచ్చాయి. దీంతో కుటుంబ సభ్యులు 108కు ఫోన్ చేశారు. ఆ కొద్దిసేపటికి 108 అంబులెన్స్ రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. విజయవాడ పాత జీజీహెచ్‌కు అమీనాను తరలించింది. వైద్యులు అమీనాకు ప్రసవం చేశారు. కొద్ది రోజుల విశ్రాంతి అనంతరం 11వ తేదీ ఆస్పత్రి నుంచి అమీనాను డిశ్చార్జి చేశారు. అమీనాది వైఎస్సార్ జిల్లా కడప నగరం యానాది కాలనీ. ఈ క్రమంలో ఇంటికి వెళ్లాలంటే 400 కి.మీ మేర ప్రయాణించాల్సిన పరిస్థితి. ప్రైవేట్ ట్యాక్సీ అద్దెకు తీసుకుని వెళ్లాలంటే సుమారు రూ.10వేల మేర వెచ్చించాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో అమీనాకు ‘డాక్టర్ వైఎస్సార్ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్’ వాహనం అండగా నిలిచింది. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా వాహనంలో బాలింత అమీనా ఆమె బిడ్డను వైద్యశాఖ క్షేమంగా ఇంటికి తరలించింది. సాక్షి, అమరావతి: ఏపీలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవించిన మహిళలకు తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవల రూపంలో అండగా నిలుస్తోంది. ప్రజారోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వ హయాంలో కునారిల్లిన 108, 104 సేవలకు ఊపిరిలూదినట్టుగానే తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవలను మెరుగు పరిచింది. ఈ ఏడాది ఏప్రిల్ నెల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 500 కొత్త వాహనాలతో ‘డాక్టర్ వైఎస్సార్ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్’ సేవలను విస్తరించింది. దీంతో గతంతో పోలిస్తే ప్రస్తుతం ఎక్కువ మందికి లబ్ధి చేకూరుతోంది. రోజుకు 700 మంది.. రాష్ట్రవ్యాప్తంగా వెయ్యికి పైగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏడాదికి 3 లక్షల మేర ప్రసవాలు చేస్తుంటారు. ఏప్రిల్‌కు ముందు కేవలం 279 వాహనాలే అందుబాటులో ఉండేవి. డిశ్చార్జ్ సమయంలో బాలింతలకు వాహనాలు అందుబాటులో ఉండేవి కాదు. దీంతో సొంత డబ్బు ఖర్చు పెట్టి బస్సు, ఆటోలు, ట్యాక్సీల్లో ఇళ్లకు వెళ్లేవారు. ఏప్రిల్ నుంచి 500 వాహనాలతో సేవలను విస్తరించారు. ప్రస్తుతం రోజుకు సగటున 700 మంది బాలింతలను తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలు ఆస్పత్రుల నుంచి ఇళ్లకు వెళుతున్నారు. ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 68,252 మంది బాలింతలు ఈ సేవలను వినియోగించుకున్నారు. తల్లులు, బిడ్డల రక్షణ, భద్రతకు భరోసా కల్పిస్తూ అన్ని వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ సౌకర్యం ఉంటోంది. ఫిర్యాదుల స్వీకారం.. తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవలను సమర్థవంతంగా అమలు చేయడం కోసం క్షేత్ర స్థాయిలో తలెత్తే సమస్యలు, ఇబ్బందులపై ఫిర్యాదులను వైద్య శాఖ స్వీకరిస్తోంది. టోల్ ఫ్రీ నెంబర్ 104 ద్వారా ఫిర్యాదులను స్వీకరిస్తున్నారు. గత నెల నుంచి ఫిర్యాదుల స్వీకారం ప్రారంభించగా..ఇప్పటికి 18 ఫిర్యాదులు నమోదయ్యాయి. వీటిని సకాలంలో వైద్య శాఖ పరిష్కరించింది. కాగా.. మహిళ గర్భం దాల్చిన నాటి నుంచి పండంటి బిడ్డకు జన్మనిచ్చి ఆస్పత్రి నుంచి ఇంటికి చేరుకునేంత వరకూ అనేక విధాలుగా ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ప్రసవానంతరం డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కింద తల్లికి విశ్రాంతి సమయానికి రూ.5వేల చొప్పున ఆర్థిక సాయం చెల్లిస్తున్నారు. తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవల్లో వచ్చిన మార్పులు ఇలా ఏప్రిల్‌కు ముందు వరకు.. ► 279 వాహనాలు ► ఇరుకైన మారుతీ ఓమినీ వాహనం ► ఏసీ సౌకర్యం ఉండదు ► ట్రిప్‌కు ఇద్దరు బాలింతల తరలింపు ఏప్రిల్ నెల నుంచి.. ► 500 వాహనాలు ► విశాలమైన మారుతీ ఈకో వాహనం ► ఏసీ సౌకర్యం ఉంటుంది ► ట్రిప్‌కు ఒక బాలింత మాత్రమే తరలింపు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా తొమ్మిదో తేదీ కేజీహెచ్‌లో ప్రసవించాను.ఆస్పత్రి నుంచి మా గ్రామం 200 కి.మీ దూరం. తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌లో రూపాయి ఖర్చు లేకుండా ఇంటికి చేర్చారు. – సి.గంగోత్రి, గుమ్మలక్ష్మిపురం, విజయనగరం జిల్లా -
తల్లీబిడ్డకు శ్రీరామరక్ష
-
ఇంటికి చేరే దాకా తల్లీబిడ్డకు శ్రీరామరక్ష
Thalli Bidda Express: ప్రభుత్వాస్పత్రిలో ప్రసవానంతరం తల్లీబిడ్డను సురక్షితంగా, సౌకర్యవంతంగా ఇంటికి చేర్చే బృహత్తర కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందుకోసం 500 ‘డాక్టర్ వైఎస్సార్ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్’ వాహనాలను సిద్ధం చేసింది. శుక్రవారం విజయవాడలోని బెంజ్ సర్కిల్ వేదికగా సీఎం వైఎస్ జగన్ జెండా ఊపి ఈ వాహనాలను ప్రారంభించనున్నారు. సాక్షి, అమరావతి: ప్రభుత్వాస్పత్రిలో ప్రసవానంతరం తల్లీబిడ్డను సురక్షితంగా, సౌకర్యవంతంగా ఇంటికి చేర్చే బృహత్తర కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందుకోసం 500 ‘డాక్టర్ వైఎస్సార్ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్’ వాహనాలను సిద్ధం చేసింది. విజయవాడలోని బెంజ్ సర్కిల్ వేదికగా శుక్రవారం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జెండా ఊపి ఈ వాహనాలను ప్రారంభించనున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో కూనారిల్లిన 108, 104 సేవలకు ఊపిరిలూదినట్టుగానే.. తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవలనూ ప్రభుత్వం విస్తరించింది. అరకొరగా ఉన్న పాత వాహనాల స్థానంలో 500 కొత్త వాహనాలను ప్రవేశపెట్టింది. ఏటా సగటున 4 లక్షల మందికి ప్రయోజనం రాష్ట్ర వ్యాప్తంగా 1,057 ప్రభుత్వాస్పత్రుల్లో ఏడాదికి సగటున నాలుగు లక్షల దాకా ప్రసవాలు జరుగుతుంటాయి. నెలలు నిండిన గర్భిణులను కాన్పుకు ఇంటి నుంచి 108 వాహనంలో తీసుకెళ్లి ఆస్పత్రిలో చేరుస్తున్నారు. నాణ్యమైన వైద్య సేవలు, డబ్ల్యూహెచ్‌వో ప్రమాణాలు కలిగిన మందులను ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. ఆయా ఆస్పత్రుల్లో జరిగే ప్రసవాల సంఖ్య ఆధారంగా డాక్టర్ వైఎస్సార్ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలను కేటాయించారు. తల్లులకు సాయం అందించేందుకు వీలుగా కేంద్రీకృత 102 కాల్ సెంటర్ సేవలనూ మెరుగుపరిచారు. తల్లీబిడ్డను ఇంటికి తరలించేటప్పుడు ఆస్పత్రుల్లోని నర్సులు, వాహనాల డ్రైవర్ల సమన్వయం కోసం ప్రత్యేకంగా యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఆస్పత్రుల్లో జరిగే ప్రతి ప్రసవానికి సంబంధించిన వివరాలు మాతృ, శిశు సంరక్షణ పోర్టల్‌లో నమోదు చేస్తారు. ఆ వివరాలను యాప్‌కు అనుసంధానించి బాలింతలను క్షేమంగా ఇంటికి తరలించేందుకు చర్యలు తీసుకుంటారు. బాలింతను వాహనంలో ఎక్కించుకున్నప్పుడు, ఆమెను ఇంటి దగ్గర దించాక ఈ యాప్‌లో డ్రైవర్ ఫొటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తల్లీబిడ్డల రక్షణ, భద్రతకు భరోసానిస్తూ అన్ని వాహనాలకూ జీపీఎస్ ట్రాకింగ్ సౌకర్యం ఉంటుంది. అలాగే ప్రసవానంతరం తల్లికి ప్రభుత్వం డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కింద వివిధ అవసరాల కోసం రూ.5 వేలు చెల్లిస్తోంది. -
ఆంక్షల్లో తల్లి సురక్ష పథకం
పథకాలు ఆర్భాటంగా ప్రవేశపెట్టడం... దానికి భారీ ఎత్తున ప్రచారం కల్పించడం... తీరా దానిని అందుకోవడానికి లెక్కలేనన్ని ఆంక్షలు పెట్టడం ఈ సర్కారుకు ఆది నుంచీ అలవాటే. తల్లి సురక్ష పథకం ఇప్పుడు అదే కోవలోకి వస్తుంది. పథకం పొందాలంటే దంపతులిద్దరి పేర్లూ ఒకే రేషన్ కార్డులో ఉండాలన్న మెలిక పెట్టడంతో ఎంతమంది అనర్హులైపోతున్నారు. విజయనగరం ఫోర్ట్: గర్భిణులకు ఆరోగశ్రీ పథకం ద్వారా కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉచితంగా ప్రసవాలు జరిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తల్లి సురక్ష కార్యక్రమం ప్రకటించింది. కానీ ఈ అవకాశం దక్కడానికి మాత్రం కీలకమైన మెలిక పెట్టింది. దీనివల్ల ఆ కార్యక్రమాన్ని ఎంతోమంది అందుకోలేకపోతున్నారు. ఏదో ఒక అడ్డంకితో సౌకర్యానికి దూరం చేసే ఈ కార్యక్రమం ప్రవేశపెట్టడం ఎందుకని ఇప్పుడు గర్భిణుల కుటుంబాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. పథకం స్వరూపం ఇదీ... తల్లి సురక్ష కార్యక్రమం ద్వారా ఆరోగ్యశ్రీ పథకం ఉన్న ప్రభుత్వ, కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉచితంగా ప్రసవాలు జరిపించేందుకు రూపొందించారు. సాధారణ ప్రసవానికి రూ.8 వేలు, సిజేరియన్ అయితే రూ.14050 చెల్లించాలని నిర్ణయించారు. ఈ పథకం ద్వారా ప్రసవం జరిపించుకోవాలంటే గర్బిణి, ఆమె భర్త ఇద్దరూ ఒకే కార్డులో పేర్లు నమోదై ఉండాలని నిబ«ంధన పెట్టారు. చాలా మంది నూతన వధువరులకు ఉమ్మడి కార్డులు లేవు. పెళ్లికి ముందే రేషన్‌కార్డు పొంది ఉన్నందున వీరికి ఆయా కుటుంబాలకున్న కార్డుల్లోనే పేర్లు నమోదై ఉన్నాయి. పెళ్లి చేసుకున్న చాలామంది సొంతంగా రేషన్‌కార్డుకోసం దరఖాస్తు చేసుకున్నా... ఇప్పటికీ వారికి కార్డు మంజూరు కాలేదు. దీనివల్ల చాలామంది తల్లి సురక్ష పథకానికి దూరమైపోతున్నారు. దీనిపై జిల్లా ఆరోగ్యశ్రీ కో ఆర్డినేటర్ కె.అజయ్సాయిరాంవద్ద ప్రస్తావించగా తల్లి సురక్ష కార్యక్రమంలో ప్రసవం జరిపించుకోవాలంటే గర్బిణి, ఆమె భర్త పేర్లు ఒకే రేషన్ కార్డులో ఉండితీరాలని, అలా అయితేనే వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఆరోగ్యశ్రీ పథకం ఉన్న ప్రైవేటు ఆస్పత్రులు: తిరుమల ఆస్పత్రి, సాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, వెంకటరామ ఆస్పత్రి, సాయి పి.వి.ఆర్.ఆస్పత్రి, ఆంధ్రా చిల్డ్రన్ ఆస్పత్రి, వెంకటపద్మ ఆస్పత్రి, పుష్ఫగిరి ఐ ఆస్పత్రి, మువ్వగోపాల ఆస్పత్రి, నెల్లిమర్లలోని మిమ్స్ ఆస్పత్రి, కొలపర్తి ఆస్పత్రి, ఎస్.కోట బీఎస్ఆర్ డెంటల్ ఆస్పత్రి, వరుణ్ డెంటల్ ఆస్పత్రి, విజయ డెంటల్ ఆస్పత్రి, ఆపిల్ డెంటల్ ఆస్పత్రి, స్వామి ఐ ఆస్పత్రి -
కథలు చెప్పకండి
అనంతపురం న్యూసిటీ: ప్రసవానంతరం బాలింతను, చంటిబిడ్డను గమ్యస్థానాలకు చేర్చాల్సిన ‘తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్’ వాహనాలు ఆస్పత్రి ఆవరణలోనే అధిక సంఖ్యలో ఉండటంపై వైద్య ఆరోగ్యశాఖ ఉమెన్, చైల్డ్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ వాణిశ్రీ ‘జీవీకే గ్రూపు’ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆమె అనంతపురం సర్వజనాస్పత్రిని పరిశీలించారు. ప్రసవాల నివేదికను పరిశీలించి తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవలపై ఆరా తీశారు. అసలు చాలా వాహనాలను వాడటమే లేదని తెలిసింది. అక్కడి నుంచి సీనియర్ రెసిడెంట్స్ హాస్టల్వద్దకు వెళ్లిన ఆమెకు ఆరుబయట ఆరువాహనాలు కనిపించాయి. డ్రైవర్ల లైసెన్స్, బ్యాడ్జీలను పరిశీలించారు. డ్రెస్‌కోడ్ లేకపోవడంపై మండిపడ్డారు. మధ్యాహ్నం 12 గంటలవుతున్నా వాహనాలన్నీ ఇక్కడే ఉంటే ఎలా అంటూ ప్రశ్నించడంతో.. ‘బాలింతలు వాహనాల్లో ప్రయాణించడానికి ఆసక్తి చూపడం లేదు’ అని వాహనాల నిర్వాహకుడు సమాధానమిచ్చారు. పేదలు డబ్బు ఖర్చు చేసుకోవాలని అనుకోరు.. కథలు చెప్పకండి అంటూ జాయింట్ డైరెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లీబిడ్డలను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిందేనంటూ ఆదేశించారు. నిర్వహణ సరిగా లేనందున మూడు ‘తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్’ వాహనాలను రద్దు చేశామని తెలిపారు. అంతకు ముందు జాయింట్ డైరెక్టర్ ఆస్పత్రిలో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జగన్నాథ్ ఆర్ఎంఓతో సమావేశమయ్యారు. ప్రసవాలు బాగానే చేస్తున్నారని, డిశ్చార్జ్ అయ్యాక తల్లీబిడ్డలను గమ్యస్థానాలకు చేర్చకపోతే మిగతా ‘తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్’ వాహనాలను ఇతర ప్రాంతాలకు తరలిస్తామని స్పష్టం చేశారు. ప్రమాదాలు జరిగినపుడు మాత్రమే కాకుండా ఏ సమస్య వచ్చినా ప్రజలు 108కు ఫోన్ చేసి, సేవలు వినియోగించుకోవాలన్నారు. బరువు తక్కువ బిడ్డ పుట్టకూడదు బరువు తక్కువ బిడ్డ పుట్టకూడదని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని డీసీహెచ్ఎస్ డాక్టర్ రమేష్‌నాథ్‌కు జాయింట్ డైరెక్టర్ సూచించారు. డీసీహెచ్ఎస్ కార్యాలయంలో ఆమె సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. తక్కువ బరువు కారణంగానే శిశు మరణాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. వీటిని అధిగమించాలంటే గర్భిణులకు పౌష్టికాహారం, ఆరోగ్య పరీక్షలు అందించాలన్నారు. కార్యక్రమంలో డీఐఓ డాక్టర్ జ్యోత్స్న, విశ్రాంత డీఐఓ డాక్టర్ పురుషోత్తం, పీఓడీటీటీ డాక్టర్ సుజాత, ఆర్ఎంఓ డాక్టర్ విజయమ్మ, మేనేజర్ శ్వేత, గ్రేడ్ 2 నర్సింగ్ సూపరింటెండెంట్ కెజియాపాల్ ఉన్నారు. -
తల్లీ–బిడ్డ ఎక్స్‌ప్రెస్ డ్రైవర్ ఆత్మహత్య
రాజాం సిటీ /వంగర: స్థానిక సామాజిక ఆస్పత్రిలో తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ డ్రైవర్‌గా పనిచేస్తున్న డర్రు సన్యాసిరావు (రమేష్) (32) సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సాయంత్రం వరకు విధులు నిర్వహించిన ఆయన.. వాహనంలోనే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. దీనిని గమనించిన ఆస్పత్రి సిబ్బంది స్పందించి చికిత్సనందించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. మృతుడికి భార్య సంధ్య, ఇద్దరు కుమారులు, తల్లి ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందాల్సి ఉంది. వంగర మండలం బాగెంపేట గ్రామానికి చెందిన సన్యాసిరావు (రమేష్) మృతితో బాగెంపేట గ్రామం శోకసంద్రంలో మునిగింది. రెండున్నరేళ్లుగా తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ డ్రైవర్‌గా పనిచేస్తు అందరితో స్నేహభావంగా ఉండేవాడని, ఎందుకు ఇలాంటి పనిచేశాడో తెలియదని వాపోతున్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన సన్యాసిరావు లారీ డ్రైవర్‌గా, ఆటో డ్రైవర్‌గా కొంతకాలం పనిచేశారు. విషయం తెలుసుకున్న బంధువులు రాజాం సామాజిక ఆస్పత్రికి చేరుకొని మృతదేహం వద్ద విలపించారు. -
తల్లీబిడ్డపై నిర్లక్ష్య సేవ
అవస్థలు పడుతున్న బాలింతలు సమయానికి అందుబాటులో ఉండని ‘తల్లీ బిడ్డ ఎక్స్‌ప్రెస్’ వాహనాలు వాహనం కోసం సర్వజనాస్పత్రిలో రోజంతా నిరీక్షించిన ఓ బాలింత అనంతపురం మెడికల్ : ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవం అయ్యాక బాలింతలను సురక్షితంగా ఇంటికి తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు పడే అవస్థలు అన్నీఇన్నీ కావు. ఇలాంటి సమస్యను అధిగమించడంతో పాటు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచేందుకు ‘తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్’ వాహనాలను ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆస్పత్రుల్లో 20 వేలకు పైగా ప్రసవాలు జరిగాయి. అయితే తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవలు అందింది మాత్రం 13,800 మందికి మాత్రమే. ప్రభుత్వ సర్వజనాస్పత్రి నుంచి 5,480 మందికి, సామాజిక ఆరోగ్య కేంద్రాల నుంచి 1,952 మందికి, పీహెచ్‌సీల నుంచి 2,329 మందికి, జిల్లా కేంద్ర ఆస్పత్రి నుంచి 1945 మందికి, రెండు ఏరియా ఆస్పత్రుల నుంచి 2,105 మందికి సేవలందించారు. సమయానికి రాదాయె! ఆస్పత్రుల్లో ప్రసవం అయిన తర్వాత వైద్యులు డిశ్చార్జి తేదీ ప్రకటించగానే సంబంధిత ఆరోగ్య సిబ్బంది 102 సర్వీస్ కంట్రోల్ రూంకు స్వయంగా ఫోన్ చేసి ఫలానా బాలింతను ఫలానా తేదీన ఇన్ని గంటలకు పంపిస్తారంటూ వారికి సహాయంగా ఉన్న కుటుంబ సభ్యుల వివరాలు వెల్లడిస్తారు. కచ్చితంగా ఆ సమయానికి అందుబాటులో ఉన్న తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనం ఆస్పత్రికి వెళ్లి బాలింతను ఇంటికి చేర్చాలి. ఈ సేవలన్నీ ఉచితమే. అయితే అమలులో ఆ పరిస్థితి లేదు. అనంతపురం సర్వజనాస్పత్రి, కళ్యాణదుర్గం, రాయదుర్గం, కదిరి, హిందూపురం, మడకశిర, తాడిపత్రి, గుత్తి, గుంతకల్లు, ధర్మవరం, శింగనమలలో వాహనాలు అందుబాటులో ఉన్నాయి. మిగిలిన ప్రాంతాల్లో లేకపోవడంతో చాలా పీహెచ్‌సీల్లో బాలింతలు సొంత ఖర్చుతోనే ఇళ్లకు వెళ్లాల్సి వస్తోంది. ఒకేసారి డిశ్చార్జ్ చేస్తున్నారు సర్వజనాస్పత్రిలో ఇబ్బందిగా ఉంది. రోజూ సాయంత్రం వేళ ఒకేసారి డిశ్చార్జ్ చేస్తున్నారు. దీంతో అందరికీ వాహనం అందుబాటులో ఉంచలేని పరిస్థితి. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లా. – అంజన్‌రెడ్డి, తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ ప్రోగ్రాం మేనేజర్ , అనంతపురం -
‘తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్’ దందాపై విచారణ
అనంతపురం సిటీ : ప్రభుత్వాస్పత్రిలో ప్రసవమైన తల్లిని, బిడ్డనూ వారి ఇంటికి ఉచితంగా చేర్చేందుకు ప్రవేశపెట్టిన ‘తల్లీ బిడ్డ ఎక్స్‌ప్రెస్’ వాహనంలో అనధికారికంగా డబ్బు వసూలు చేస్తున్నట్లు వచ్చిన ఆరోపణలపై అధికారులు విచారణ చేపట్టారు. ‘నయా దోపిడీ’ పేరుతో సాక్షిలో ప్రచురితమైన కథనానికి జీవీకే సంస్థ ్థ రీజినల్ మేనేజర్ అంజనరెడ్డి మంగళవారం స్పందించారు. ఈ మేరకు అనంతపురం ఇన్చార్జ్ మోహన్‌ను ఈ సంఘటనపై ఆరా తీసిన అధికారులు అనంతరం డ్రైవర్లను ఆర్ఎంఓ వెంకటేశ్వరరావు వద్దకు పంపారు. ఆస్పత్రి తరఫున వచ్చే రోగులకు ఉచితంగా అందివ్వాల్సిన సేవలకు చార్టీలు వసూలు చేయరాదన్నారు. ఎవరైనా వసూలు చేసినట్లు తెలిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఇదిలా ఉండగా జీవీకే సంస్థ రీజనల్ మేనేజర్‌తోపాటు జిల్లా ఇన్చార్జి మోహన్‌లు గుత్తికి వెళ్లి అనధికారికంగా డబ్బు వసూలు చేశారని వచ్చిన ఆరోపణలపై బాధిత కుటుంబ సభ్యులను ఆరా తీసినట్లు తెలిసింది. విచారణ పూర్తికాగానే తగు చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు.