విజయవాడలో ప్రారంభానికి సిద్ధంగా ఉన్న వైఎస్సార్ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలు
Thalli Bidda Express: ప్రభుత్వాస్పత్రిలో ప్రసవానంతరం తల్లీబిడ్డను సురక్షితంగా, సౌకర్యవంతంగా ఇంటికి చేర్చే బృహత్తర కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందుకోసం 500 ‘డాక్టర్ వైఎస్సార్ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్’ వాహనాలను సిద్ధం చేసింది. శుక్రవారం విజయవాడలోని బెంజ్ సర్కిల్ వేదికగా సీఎం వైఎస్ జగన్ జెండా ఊపి ఈ వాహనాలను ప్రారంభించనున్నారు.
సాక్షి, అమరావతి: ప్రభుత్వాస్పత్రిలో ప్రసవానంతరం తల్లీబిడ్డను సురక్షితంగా, సౌకర్యవంతంగా ఇంటికి చేర్చే బృహత్తర కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందుకోసం 500 ‘డాక్టర్ వైఎస్సార్ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్’ వాహనాలను సిద్ధం చేసింది. విజయవాడలోని బెంజ్ సర్కిల్ వేదికగా శుక్రవారం సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జెండా ఊపి ఈ వాహనాలను ప్రారంభించనున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో కూనారిల్లిన 108, 104 సేవలకు ఊపిరిలూదినట్టుగానే.. తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవలనూ ప్రభుత్వం విస్తరించింది. అరకొరగా ఉన్న పాత వాహనాల స్థానంలో 500 కొత్త వాహనాలను ప్రవేశపెట్టింది.
ఏటా సగటున 4 లక్షల మందికి ప్రయోజనం
రాష్ట్ర వ్యాప్తంగా 1,057 ప్రభుత్వాస్పత్రుల్లో ఏడాదికి సగటున నాలుగు లక్షల దాకా ప్రసవాలు జరుగుతుంటాయి. నెలలు నిండిన గర్భిణులను కాన్పుకు ఇంటి నుంచి 108 వాహనంలో తీసుకెళ్లి ఆస్పత్రిలో చేరుస్తున్నారు. నాణ్యమైన వైద్య సేవలు, డబ్ల్యూహెచ్‌వో ప్రమాణాలు కలిగిన మందులను ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. ఆయా ఆస్పత్రుల్లో జరిగే ప్రసవాల సంఖ్య ఆధారంగా డాక్టర్ వైఎస్సార్ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలను కేటాయించారు. తల్లులకు సాయం అందించేందుకు వీలుగా కేంద్రీకృత 102 కాల్ సెంటర్ సేవలనూ మెరుగుపరిచారు.
తల్లీబిడ్డను ఇంటికి తరలించేటప్పుడు ఆస్పత్రుల్లోని నర్సులు, వాహనాల డ్రైవర్ల సమన్వయం కోసం ప్రత్యేకంగా యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఆస్పత్రుల్లో జరిగే ప్రతి ప్రసవానికి సంబంధించిన వివరాలు మాతృ, శిశు సంరక్షణ పోర్టల్‌లో నమోదు చేస్తారు. ఆ వివరాలను యాప్‌కు అనుసంధానించి బాలింతలను క్షేమంగా ఇంటికి తరలించేందుకు చర్యలు తీసుకుంటారు. బాలింతను వాహనంలో ఎక్కించుకున్నప్పుడు, ఆమెను ఇంటి దగ్గర దించాక ఈ యాప్‌లో డ్రైవర్ ఫొటో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. తల్లీబిడ్డల రక్షణ, భద్రతకు భరోసానిస్తూ అన్ని వాహనాలకూ జీపీఎస్ ట్రాకింగ్ సౌకర్యం ఉంటుంది. అలాగే ప్రసవానంతరం తల్లికి ప్రభుత్వం డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కింద వివిధ అవసరాల కోసం రూ.5 వేలు చెల్లిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment