సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఆస్పత్రులను బలోపేతం చేయడం ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే నాడు–నేడు పేరుతో ఆస్పత్రుల రూపు రేఖలు మార్చేందుకు విప్లవాత్మక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో పాటు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న డాక్టర్లు, స్పెషలిస్టులు, నర్సులు, సర్జన్లు, ఫార్మాసిస్టులు తదితర వైద్య సిబ్బందిని పూర్తిగా భర్తీ చేసేందుకు ఇటీవలే సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఇందులో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి జిల్లా, ఏరియా ఆస్పత్రుల వరకూ ఖాళీగా ఉన్న పోస్టులన్నీ భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. తద్వారా ప్రజా వైద్యాన్ని పూర్తిస్థాయిలో బలోపేతం చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు విధానంలో మొత్తం 9,712 వైద్య సిబ్బంది పోస్టుల భర్తీకి వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి వేర్వేరుగా ఐదు జీవోలను జారీ చేశారు. ఇందులో ఖాళీలు 4,011 కాగా, కొత్తగా ఏర్పాటు చేసిన పోస్టులు 5,701. గిరిజన ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో ఏ ఒక్క పోస్టు ఖాళీగా ఉండరాదని జీవోలో స్పష్టం చేశారు. మూడేళ్ల పాటు ప్రొబేషనరీ సమయంగా పేర్కొన్నారు. సిబ్బంది ఎక్కడ పనిచేస్తుంటే అక్కడే ఉండాలనే నిబంధన తప్పనిసరి చేశారు.
పోస్టుల భర్తీ వివరాలు ఇలా..
♦ ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ పరిధిలోని ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న 2,313 వివిధ కేటగిరీ పోస్టులను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేస్తారు.
♦ డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలో 3,388 స్టాఫ్ నర్సులు, ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్ల పోస్టులను కాంట్రాక్టు విధానంలో నియమిస్తారు.
♦ జిల్లా మెడికల్ విద్య పరిధిలోని ఆస్పత్రుల్లో 2,186 స్టాఫ్ నర్సులు, ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులను కాంట్రాక్టు విధానంలో భర్తీ చేస్తారు.
♦ మరో 1,021 పోస్టులను ఔట్ సోర్సింగ్ విధానంలో నియమిస్తారు.
♦ 804 అసిస్టెంట్ ప్రొఫెసర్స్, సివిల్ అసిస్టెంట్ సర్జన్స్, డెంటల్ అసిస్టెంట్ సర్జన్ల పోస్టులను రెగ్యులర్ విధానంలో భర్తీ చేస్తారు. ఇందులో రెండు ఎంటమాలజిస్ట్, 8 అసిస్టెంట్ మలేరియా ఆఫీసర్ పోస్టులు భర్తీ చేస్తారు.
కాంట్రాక్టు విధానంలో భర్తీచేసే స్టాఫ్ నర్సులు, ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్ల వేతనాలు..
స్టాఫ్ నర్సుల నెల వేతనం: 34,000
ఫార్మసిస్టుల నెల వేతనం: 28,000
ల్యాట్ టెక్నీషియన్ల నెల వేతనం: 28,000
Comments
Please login to add a commentAdd a comment