సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజల ఆరోగ్య రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. ఇందులో భాగంగా గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ప్రభుత్వ ఆస్పత్రులను ఆధునీకరణ సహా అనేక కార్యక్రమాలు చేపట్టారు. గుండె జబ్బులు, కేన్సర్‌పై ప్రత్యేక దృష్టి పెట్టారు. కార్డియాలజీ, కార్డియోవాస్క్యులర్ సేవలను మరింతగా విస్తృతం చేసి, ప్రజలకు చేరువ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో గుండె జబ్బులతో బాధపడే గ్రామీణులకు సత్వర వైద్య సేవలందించి, వారిని ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించారు.
ఎస్‌టీ ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్‌ఫార్‌క్షన్ (స్టెమి)గా పిలిచే ఈ కార్యక్రమం ద్వారా గుండెపోటు బాధితులకు గోల్డెన్ అవర్‌లో 40 నిమిషాల్లోనే చికిత్స అందిస్తారు. తద్వారా బాధితులు ప్రాణాపాయం నుంచి బయటపడటానికి వీలుంటుంది. ఇప్పటికే తిరుపతి రుయా ఆస్పత్రిలో దీనిని పైలెట్ ప్రాజెక్టుగా వైద్య, ఆరోగ్య శాఖ అమలులో పెట్టింది.
రెండో దశ పైలెట్ ప్రాజెక్టును వచ్చే నెల 29 నుంచి కర్నూలు, గుంటూరు, విశాఖపట్నం కేంద్రంగా ప్రాజెక్టును అమలు చేస్తారు. జనవరి నుంచి రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తారు. ఈలోగా పాత 11 బోధనాస్పత్రుల్లో కార్డియాలజీ, కార్డియో వాసు్క్యలర్ (సీటీవీఎస్) విభాగాలను బలోపేతం చేస్తారు. ఇందుకోసం కార్డియాలజీ, క్యాథ్‌లాబ్, సీటీవీఎస్ విభాగాల్లో 94 పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. వివిధ ఆస్పత్రుల్లో రూ.120 కోట్లతో క్యాథ్‌లాబ్స్‌ను సమకూర్చింది.
గుండె సంబంధిత వ్యాధులతోనే 32.4 శాతం మరణాలు
రాష్ట్రంలో సంభవిస్తున్న మరణాల్లో 32.4 శాతం గుండె సంబంధిత వ్యాధుల కారణంగానే ఉంటున్నాయి. రాష్ట్రంలో 38 లక్షల మందికి పైగా గుండె జబ్బుల బాధితులున్నారు. నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ (ఎన్‌సీడీ)లో గుండె జబ్బులదే అగ్రస్థానం. ఈ క్రమంలో ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కలిగిన సీఎం వైఎస్ జగన్ ఎన్‌సీడీ నిర్వహణపై పక్కా ప్రణాళిక అమలు చేస్తున్నారు.
ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా బీపీ, షుగర్, ఇతర ఎన్‌సీడీ వ్యాధిగ్రస్తుల ఆరోగ్యంపై నిరంతర ఫాలోఅప్ ఉంచుతున్నారు. ముఖ్యంగా గుండె జబ్బులు, క్యాన్సర్ వ్యాధులపై ఫోకస్ పెట్టారు. సత్వరమే నాణ్యమైన చికిత్సను అందించడం ద్వారా మరణాల కట్టడికి చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా స్టెమీ ప్రాజెక్టు చేపట్టారు.
ప్రాణాపాయం నుంచి కాపాడతారిలా..
స్టెమీ అంటే గుండె రక్తనాళం 100 శాతం పూడిపోవడంతో వచ్చే గుండెపోటు. దీనికి గురైన బాధితుడికి వీలైనంత త్వరగా ఆ పూడికను కరిగించే చికిత్స (థ్రాంబోలైసిస్ ఇంజక్షన్)ను ఇవ్వగలిగితే ప్రాణాల ను కాపాడవచ్చు. నగరాలకు దూరంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వారికి ఈ చికిత్స అందుబాటులో ఉండదు. సరైన సమయంలో వైద్యం అందక అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి వారిని రక్షించడానికి ప్రభుత్వం స్టెమీ పేరుతోనే కార్యక్రమాన్ని చేపట్టింది.
వచ్చే నెలలో గుంటూరు, కర్నూలు, విశాఖపట్నం జీజీహెచ్‌లలోని హబ్‌ల ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. కార్డియాలజిస్టులు, క్యాథ్‌లాబ్ సౌకర్యం ఉన్న ఈ మూడు ఆస్పత్రులను హబ్‌లుగా అభివృద్ధి చేస్తున్నారు. వీటికి ఆ జిల్లాల పరిధిలోని 48 స్పోక్స్ (ఏపీవీవీపీ ఆస్పత్రులు)ను అనుసంధానం చేసి సామాన్యులు, గ్రామీణులకు హార్ట్ కేర్ సర్వీసులను అందుబాటులోకి తెస్తున్నారు. ఛాతీనొప్పి, గుండెపోటు లక్షణాలతో స్పోక్స్‌కు వచ్చిన వారికి వెంటనే టెలీ–ఈసీజీ తీస్తారు.
ఆ ఫలితం హబ్‌లో ఉన్న కార్డియాలజిస్ట్‌కు వెళుతుంది. గుండె రక్తనాళం ఎంతశాతం పూడిపోయింది? వెంటనే థ్రాంబోలైసిస్ అవసరమా అనేది కార్డియాలజిస్ట్ నిర్ధారిస్తారు. వెంటనే స్పోక్ వైద్యుడికి తగిన సూచనలు చేస్తారు. అవసరమైతే రూ.40 వేలు విలువ చేసే థ్రాంబోలైసిస్ ఇంజక్షన్ ఉచితంగా బాధితులకు ఇస్తారు. ఇదంతా 40 నిమిషాల్లోనే జరుగుతుంది. దీంతో రోగి ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడతారు. ఆ తర్వాత తదుపరి చికిత్స కోసం హబ్‌కు లేదా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలిస్తారు.
ప్రజలకు అవగాహన కల్పిస్తాం
గ్రామీణ ప్రాంతాల్లో ఏఎన్‌ఎంలు, ఫ్యామిలీ డాక్టర్, సీహెచ్‌వోల ద్వారా గుండెపోటు లక్షణాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తాం. గుండెపోటుకు గురైన వ్యక్తిని 108 అంబులెన్స్ ద్వారా సమీపంలోని స్పోక్స్ సెంటర్‌కు తరలిస్తారు. బాధితులకు గోల్డెన్ అవర్‌లో చికిత్స లభిస్తుంది. తద్వారా మరణాలు కట్టడి అవుతాయి.
– జె.నివాస్, ఆరోగ్య, కుటుంబసంక్షేమ కమిషనర్
మందులు, పరికరాలు సమకూరుస్తున్నాం
మూడు జిల్లాల్లో స్పోక్స్ ఆస్పత్రులను గుర్తించాం. వాటిలో స్టెమీ ప్రోటోకాల్స్‌కు అనుగుణంగా అవసరమైన మందులు, వైద్య పరికరాలను ఏపీఎంఎస్‌ఐడీసీ ద్వారా సమకూరుస్తున్నాం. వైద్యులు, సిబ్బందికి ప్రోటోకాల్స్‌పై శిక్షణ ఇచ్చాం.
– డాక్టర్ వెంకటేశ్వర్, ఏపీవీవీపీ కమిషనర్
Comments
Please login to add a commentAdd a comment