సాక్షి, అమరావతి : ప్రభుత్వరంగ ఆస్పత్రుల్లోనే క్యాన్సర్‌కు మెరుగైన వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను ముమ్మరం చేసింది. వ్యాధి నియంత్రణ, నివారణకు సీఎం వైఎస్ జగన్ ఆధునిక వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ వైద్యం కోసం బాధితులు ఇతర రాష్ట్రాలకు వెళ్లే పనిలేకుండా అన్ని ప్రాంతాల్లో 50 కి.మీ పరిధిలోనే వైద్య సదుపాయాలను కల్పించేలా కాంప్రహెన్సివ్ క్యాన్సర్ కేర్ రోడ్ మ్యాప్‌ను రాష్ట్ర వైద్యశాఖ రూపొందించింది.
తొలిదశ కింద.. గుంటూరు జీజీహెచ్‌లోని క్యాన్సర్ విభాగాన్ని లెవల్–1 సెంటర్‌గా, కర్నూలు, విశాఖపట్నంలో లెవల్–2 క్యాన్సర్ సెంటర్లను అభివృద్ధి చేయనుంది. రెండో దశలో కాకినాడ, అనంతపురం జీజీహెచ్‌లలోని విభాగాలను లెవెల్–2 క్యాన్సర్ సెంటర్లుగా అభివృద్ధిచేస్తుంది. ఇందుకుగాను రూ.119.50 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది.
అధునాతన పరికరాల ఏర్పాటు
గుంటూరు, కర్నూలు, విశాఖ క్యాన్సర్ సెంటర్లకు రాష్ట్ర ప్రభుత్వం అధునాతన వైద్య పరికరాలను సమకూరుస్తోంది. నాట్కో సహకారంతో గుంటూరు జీజీహెచ్‌లో క్యాన్సర్ సెంటర్‌ను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రారంభించింది. క్యాన్సర్ బాధితులకు రేడియేషన్ థెరపీ అందించడానికి ఆధునిక వైద్య పరికరాల్లో ఒకటైన లీనియర్ యాక్సిలేటర్ (లినాక్) ఇక్కడ అందుబాటులో ఉంది. దీనిని లెవెల్–1 సెంటర్‌గా అభివృద్ధి చేపట్టడానికి వీలుగా పెట్ స్కాన్ మిషన్‌ను సర్కార్ సమకూరుస్తోంది.
మరోవైపు.. రూ.120 కోట్లతో కర్నూలులో కొత్తగా ఏర్పాటుచేస్తున్న స్టేట్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ భవన నిర్మాణ పనులు వచ్చేనెలలో పూర్తవుతాయి. విశాఖపట్నంలో ఇప్పటికే భవనం అందుబాటులో ఉంది. ఈ రెండు చోట్లకు లినాక్, హెచ్‌డీఆర్ బ్రాకీ, సీటీ సిమ్యులేటర్ పరికరాల కొనుగోలుకు అధికారులు పర్చేజింగ్ ఆర్డర్లు(పీఓ) ఇచ్చారు.
అదే విధంగా.. సర్జికల్, మెడికల్, రేడియేషన్ అంకాలజీ పరికరాల కొనుగోలు ప్రక్రియ ముగిసింది. ఈ ఏడాది డిసెంబర్ నెలాఖరులోగా పరికరాలను సమకూర్చే ప్రక్రియ పూర్తిస్థాయిలో పూర్తవుతుంది. అనంతపురం, కాకినాడల్లో లినాక్, సీటీ సిమ్యులేటర్ పరికరాల ఏర్పాటుకు బంకర్ల నిర్మాణం, ఇతర పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి.
ఆరోగ్యశ్రీ ద్వారా అండగా..
రాష్ట్ర విభజన నేపథ్యంలో క్యాన్సర్ చికిత్స మౌలిక సదుపాయాలను ఏపీ కోల్పోయింది. దీనికితోడు.. టీడీపీ సర్కార్ హయాంలో ప్రభుత్వాస్పత్రులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఫలితంగా.. క్యాన్సర్ చికిత్సకు ప్రైవేట్ ఆస్పత్రులపైనే మెజారిటీ శాతం ఆధారపడాల్సి వస్తోంది.
ఈ క్రమంలో.. ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కలిగిన సీఎం వైఎస్ జగన్.. ప్రభుత్వ రంగంలో క్యాన్సర్ చికిత్స సదుపాయాల కల్పన, ఆయా ఆస్పత్రుల బలోపేతం, వ్యాధి నియంత్రణ చర్యలపై దృష్టిసారించారు. అలాగే, క్యాన్సర్‌కు సంబంధించిన అన్ని రకాల చికిత్సలను ఆరోగ్యశ్రీలో చేర్చి బాధితులకు సీఎం జగన్ అండగా నిలుస్తున్నారు. గత ఏడాది క్యాన్సర్ బాధితుల చికిత్స కోసం పథకం కింద ఏటా రూ.600 కోట్లు ఖర్చుచేశారు.
ప్రణాళికాబద్ధంగా క్యాన్సర్‌కు కళ్లెం
క్యాన్సర్‌కు వైద్యం, వ్యాధి నియంత్రణ చర్యల విషయంలో ప్రణాళికబద్ధంగా అడుగులు వేస్తున్నాం. ప్రభుత్వ రంగంలోనే ఇందుకు మెరుగైన వైద్యం అందాలని సీఎం జగన్ ఆదేశించారు. ఆ మేరకు చర్యలు ప్రారంభించాం. ఈ ఏడాది ఆఖరుకు లెవల్–1 సెంటర్‌గా గుంటూరు.. లెవల్–2 కేంద్రాలుగా కర్నూలు, విశాఖపట్నం క్యాన్సర్ ఆస్పత్రులను అభివృద్ధి చేస్తాం.
మరోవైపు.. నేషనల్ క్యాన్సర్ గ్రిడ్ (ఎన్‌సీజీ) ఏపీ చాప్టర్‌ను ప్రారంభించాం. దీని పరిధిలోకి అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ క్యాన్సర్ ఆస్పత్రులను తీసుకొచ్చి చికిత్స విషయంలో నిర్దేశిత ప్రొటోకాల్స్‌ను పాటించేలా చూస్తున్నాం. క్యాన్సర్ రిజిస్ట్రీని కూడా ప్రారంభించాం. – ఎం.టి. కృష్ణబాబు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ
Comments
Please login to add a commentAdd a comment