గర్బిణులు
పథకాలు ఆర్భాటంగా ప్రవేశపెట్టడం... దానికి భారీ ఎత్తున ప్రచారం కల్పించడం... తీరా దానిని అందుకోవడానికి లెక్కలేనన్ని ఆంక్షలు పెట్టడం ఈ సర్కారుకు ఆది నుంచీ అలవాటే. తల్లి సురక్ష పథకం ఇప్పుడు అదే కోవలోకి వస్తుంది. పథకం పొందాలంటే దంపతులిద్దరి పేర్లూ ఒకే రేషన్ కార్డులో ఉండాలన్న మెలిక పెట్టడంతో ఎంతమంది అనర్హులైపోతున్నారు.
విజయనగరం ఫోర్ట్: గర్భిణులకు ఆరోగశ్రీ పథకం ద్వారా కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉచితంగా ప్రసవాలు జరిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తల్లి సురక్ష కార్యక్రమం ప్రకటించింది. కానీ ఈ అవకాశం దక్కడానికి మాత్రం కీలకమైన మెలిక పెట్టింది. దీనివల్ల ఆ కార్యక్రమాన్ని ఎంతోమంది అందుకోలేకపోతున్నారు. ఏదో ఒక అడ్డంకితో సౌకర్యానికి దూరం చేసే ఈ కార్యక్రమం ప్రవేశపెట్టడం ఎందుకని ఇప్పుడు గర్భిణుల కుటుంబాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి.
పథకం స్వరూపం ఇదీ...
తల్లి సురక్ష కార్యక్రమం ద్వారా ఆరోగ్యశ్రీ పథకం ఉన్న ప్రభుత్వ, కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉచితంగా ప్రసవాలు జరిపించేందుకు రూపొందించారు. సాధారణ ప్రసవానికి రూ.8 వేలు, సిజేరియన్ అయితే రూ.14050 చెల్లించాలని నిర్ణయించారు. ఈ పథకం ద్వారా ప్రసవం జరిపించుకోవాలంటే గర్బిణి, ఆమె భర్త ఇద్దరూ ఒకే కార్డులో పేర్లు నమోదై ఉండాలని నిబ«ంధన పెట్టారు. చాలా మంది నూతన వధువరులకు ఉమ్మడి కార్డులు లేవు. పెళ్లికి ముందే రేషన్‌కార్డు పొంది ఉన్నందున వీరికి ఆయా కుటుంబాలకున్న కార్డుల్లోనే పేర్లు నమోదై ఉన్నాయి. పెళ్లి చేసుకున్న చాలామంది సొంతంగా రేషన్‌కార్డుకోసం దరఖాస్తు చేసుకున్నా... ఇప్పటికీ వారికి కార్డు మంజూరు కాలేదు. దీనివల్ల చాలామంది తల్లి సురక్ష పథకానికి దూరమైపోతున్నారు. దీనిపై జిల్లా ఆరోగ్యశ్రీ కో ఆర్డినేటర్ కె.అజయ్‌సాయిరాంవద్ద ప్రస్తావించగా తల్లి సురక్ష కార్యక్రమంలో ప్రసవం జరిపించుకోవాలంటే గర్బిణి, ఆమె భర్త పేర్లు ఒకే రేషన్ కార్డులో ఉండితీరాలని, అలా అయితేనే వర్తిస్తుందని స్పష్టం చేశారు.
ఆరోగ్యశ్రీ పథకం ఉన్న ప్రైవేటు ఆస్పత్రులు: తిరుమల ఆస్పత్రి, సాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, వెంకటరామ ఆస్పత్రి, సాయి పి.వి.ఆర్.ఆస్పత్రి, ఆంధ్రా చిల్డ్రన్ ఆస్పత్రి, వెంకటపద్మ ఆస్పత్రి, పుష్ఫగిరి ఐ ఆస్పత్రి, మువ్వగోపాల ఆస్పత్రి, నెల్లిమర్లలోని మిమ్స్ ఆస్పత్రి, కొలపర్తి ఆస్పత్రి, ఎస్.కోట బీఎస్‌ఆర్ డెంటల్ ఆస్పత్రి, వరుణ్ డెంటల్ ఆస్పత్రి, విజయ డెంటల్ ఆస్పత్రి, ఆపిల్ డెంటల్ ఆస్పత్రి, స్వామి ఐ ఆస్పత్రి
Comments
Please login to add a commentAdd a comment