ప్రసవానంతరం ఇంటివద్ద కాకుండా మధ్యలోనే వదిలేసిన వైనం
సిజేరియన్ నొప్పులతో నడుచుకుంటూ ఇంటికి చేరిన బాధితురాలు
తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ సిబ్బంది నిర్వాకం
అనంతగిరి (అరకులోయ రూరల్): పచ్చి బాలింతరాలు.. పైగా, సిజేరియన్ ద్వారా ప్రసవం జరిగి వారం రోజులే అయింది.. క్షేమంగా ఆమెను ఇంటి వద్దకు చేర్చాల్సిన తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ సిబ్బంది ఆమెను నిర్లక్ష్యంగా, నిర్దయగా గ్రామానికి 3 కి.మీ. దూరంలో వదిలేసి వెళ్లిపోయారు. ఆదివారం జరిగిన ఈ సంఘటన వివరాలివి.. మండలంలోని పినకోట పంచాయతీ వాజంగి గ్రామానికి చెందిన గిరిజన మహిళ తామర్ల జ్యోతి(32)ని ప్రసవం కోసం విశాఖలోని కేజీహెచ్‌లో వారం కిందట చేర్చారు.
కాన్పు ఇబ్బంది కావడంతో శస్త్రచికిత్స చేశారు. పండంటి ఆడ శిశువు పుట్టింది. తల్లీబిడ్డ ఆరోగ్యంగానే ఉండటంతో వైద్యుల సలహా మేరకు ఆదివారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌లో బయల్దేరారు. వాజంగిలోని బాలింత ఇంటి వరకు రావాల్సిన తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ గ్రామానికి 3 కి.మీ. దూరంలోనే వారిని దింపేసి సిబ్బంది వెళ్లిపోయారు.
దీంతో శస్త్రచికిత్స చేయించుకున్న తాను మరో దారిలేక కష్టంగా కాలినడకన ఇంటికి చేరాల్సి వచ్చిందని బాలింత జ్యోతి, ఆమె బంధువు రవికుమార్ ఆవేదన వ్యక్తంచేశారు. శస్త్ర చికిత్స కుట్లు ఇంకా పచ్చిగానే ఉండటంతో గ్రామానికి చేరేందుకు నరకయాతన చూడాల్సి వచ్చిందని బాధితు రాలు వాపోయింది. వాహన సిబ్బంది కనీస మానవత్వం చూపలేదని, తామింక రాలేమని వారు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని ఆమె ఆరోపించింది.
Comments
Please login to add a commentAdd a comment