బాత్‌రూం వద్ద కిందపడ్డ గర్భిణి
సకాలంలో స్పందించని వైద్యులు, సిబ్బంది
సిజేరియన్ చేసినా దక్కని ఫలితం
అనంతపురం మెడికల్: అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంతో సోమవారం తల్లీబిడ్డ ప్రాణాలు గాల్లో కలసిపోయాయి. బాత్‌రూంకు వెళ్లిన గర్భిణి అక్కడ కళ్లు తిరిగి కిందపడిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. గైనిక్ విభాగం వైద్యులు, సిబ్బంది సకాలంలో స్పందించకపోవడంతో తల్లి, బిడ్డ ప్రాణాలు దక్కలేదు. అనంతపురం జిల్లా రాయదుర్గానికి చెందిన మంజునాథ్ తన భార్య జ్యోతి (30)ని మూడో కాన్పునకు గత నెల 27న సర్వజనాస్పత్రి ఎమర్జెన్సీ వార్డులో చేర్పించారు.
హైరిస్క్ కేసు కావడంతో వైద్యులు, సిబ్బంది చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉన్నా.. ఆ స్థాయిలో పట్టించుకోలేదు. జ్యోతికి సోమవారం ఐరన్ సుక్రోజ్ ఇంజెక్షన్ ఇచ్చారు. కాసేపటికి కళ్లు తిరుగుతున్నాయని, బాత్‌రూంకు వెళ్లాలని చెప్పింది. బాత్‌రూంకు పంపించడంలో స్టాఫ్‌నర్సులు, ఎఫ్‌ఎన్‌వోల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో కుటుంబసభ్యులే జ్యోతిని బాత్‌రూంకు తీసుకెళ్లారు. అక్కడే ఆమె కింద పడిపోయింది. భర్త మంజునాథ్ తదితరులు గట్టిగా కేకలు వేసినా సిబ్బంది వెంటనే స్పందించలేదు.
కొద్దిసేపటి తరువాత వచ్చిన సిబ్బంది జ్యోతిని పరీక్షించి లేబర్ వార్డుకు తరలించి సీపీఆర్ ద్వారా శ్వాసనందించే ప్రయత్నం చేశారు. జ్యోతి పరిస్థితి అర్థంగాక దిక్కుతోచని స్థితిలో ఉన్న మంజనాథ్‌ను బయటకు వెళ్లి ఇంజక్షన్ తీసుకురమ్మని గైనిక్ వైద్యులు, స్టాఫ్‌నర్సులు చెప్పారు. దీంతో అతడు పరుగెత్తుకుంటూ వెళ్లి స్థానిక సప్తగిరి సర్కిల్‌లోని ఓ ప్రైవేటు మందుల షాపులో రూ.170 వెచ్చించి యాంటీ బయోటిక్ ఇంజెక్షన్ తీసుకొచ్చాడు.
తర్వాత జ్యోతికి సిజేరియన్ చేశారు. అప్పటికే ఆడబిడ్డ చనిపోయింది. జ్యోతిని అక్యూట్ మెడికల్ కేర్ (ఏఎంసీ) యూనిట్‌లో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స చేసినా ఫలితం లేకపోయింది. ఆమె కన్నుమూసింది. తొమ్మిదేళ్ల పాప, ఏడేళ్ల బాబు ఉన్నారని, తల్లి మృతితో వాళ్ల పరిస్థితేంటని మంజునాథ్ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
తల్లిని బతికించాలని చూశాం
జ్యోతికి రక్తహీనత ఉండడంతో రెండు యూనిట్ల రక్తం అందించాం. నెలలు నిండకపోవడంతో పాటు బాత్‌రూంకు వెళ్లిన సమయంలో కళ్లు తిరిగి పడిందని చెప్పారు. అప్పటికే పల్స్ లేదు. తల్లిని రక్షించాలనే ఉద్దేశంతో సిజేరియన్ చేశాం. కార్డియాక్ అరెస్టు అయి ఆమె మరణించింది. – డాక్టర్ షంషాద్‌బేగం, హెచ్‌వోడీ, గైనిక్ విభాగం, అనంతపురం సర్వజనాస్పత్రి
Comments
Please login to add a commentAdd a comment