వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బంధువుల ఆగ్రహం
ఆస్పత్రి వద్ద ఆందోళన
నర్సీపట్నం: నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో మంగళవారం పురిటి నొప్పులతో ఓ గర్భిణి ప్రాణాలు విడిచింది. దీనికి వైద్యులు, వైద్య సిబ్బందే కారణమంటూ బంధువులు ఆందోళనకు దిగారు. సయ్యద్ మహాగున్నిషా అలియాస్ దేవి(30), నానాజీది ఎస్.రాయవరం మండలంలోని చిన్నగుమ్ములూరు. వీరిద్దరిది మతాంతర వివాహం. వీరికి మూడేళ్ల పాప ఉంది. దేవికి మొదటి కాన్పు సాధారణంగానే జరిగింది. రెండో కాన్పు కోసం ఏరియా ఆస్పత్రిలో సోమవారం మధ్యాహ్నం చేరింది.
రాత్రి 8 గంటలకు డాక్టర్ వచ్చి పరీక్షించి వెళ్లారు. రాత్రి 12 గంటల సమయంలో వైద్య సిబ్బంది వచ్చి టాబ్లెట్ ఇచ్చారు. విపరీతమైన నొప్పులు రావడంతో ఆపరేషన్ చేయాలని గర్భిణీ ఎంత మొత్తుకున్నా వైద్యులు కానీ, సిబ్బంది కానీ పట్టించుకోలేదని మృతురాలి అత్త లక్ష్మి ఆవేదన వ్యక్తం చేసింది. ప్రిపరేషన్ వార్డులో నైట్ డ్యూటీ సిబ్బంది లేరని, మూడు గంటల సమయంలో లేపి తీసుకొచి్చనా.. ఏం పర్లేదు.. డెలివరీ అయిపోతుందని చెప్పి వెళ్లిపోయారని అత్త, బంధువులు కన్నీళ్లపర్యంతమయ్యారు.
ఉదయం 7 గంటల సమయంలో కడుపులో బిడ్డతో సహా గర్భిణి మరణించింది. దీంతో భర్త నానాజీ సొమ్మసిల్లి పడిపోయాడు. గర్భిణి మరణానికి వైద్యులు, వైద్య సిబ్బంది నిర్లక్ష్యమే కారణమంటూ బంధువులు ఆందోళనకు దిగారు. ఇన్‌చార్జి సూపరింటెండెంట్ సత్యనారాయణ, స్త్రీ వైద్య నిపుణులు లక్ష్మణ్‌రావు బంధువులకు నచ్చజెప్పేందుకు యత్నిoచారు. అయినా ఫలితం లేదు. దీంతో వైద్యులు, బంధువుల మధ్య వాగ్వాదం జరిగింది.
ఎస్‌ఐ ఉమామహేశ్వరరావు, సిబ్బందితో ఆస్పత్రికి చేరుకుని మృతురాలి బంధువులతో మాట్లాడి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. దీనిపై ఇన్‌చార్జి సూపరింటెండెంట్ సత్యనారాయణను వివరణ కోరగా వైద్యులు, వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించలేదని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment