Emergency Ward
-
మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు అస్వస్థత
ఢిల్లీ: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(92) అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను గురువారం రాత్రి హుటాహుటిన ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు. అత్యవసర విభాగంలో మన్మోహన్ సింగ్‌కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మాజీ ప్రధాని ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఎలాంటి హెల్త్ బులెటిన్ విడుదల చేయలేదు. ఆయన ఆసుపత్రిలో ఏ అనారోగ్య సమస్య కారణంగా చేరారో తెలియరాలేదు.అయితే, ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఎయిమ్స్‌లో చేర్చినట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి. మన్మోహన్ సింగ్ 2004 నుంచి 2014 వరకు 10 ఏళ్ల పాటు దేశ ప్రధానిగా సేవలందించారు.మాజీ ప్రధాని పీవీ నరసింహరావు ప్రభుత్వం చేపట్టిన ఆర్థిక సంస్కరణల్లో ఆర్బీఐ గవర్నర్ హోదాలో కీలక పాత్ర పోషించిన మన్మోహన్ సింగ్.. 1991 అక్టోబరు 1 నుండి 2019 జూన్ 14 వరకు ఐదు పర్యాయాలు అస్సాం నుండి రాజ్యసభ సభ్యునిగా, ఆ తర్వాత ఆయన 2019 ఆగస్టు 20 నుండి 2024 ఏప్రిల్ 3 వరకు రాజస్థాన్ రాష్ట్రం నుండి రాజ్యసభ సభ్యునిగా పనిచేశారు.ఇదీ చదవండి: అప్పటివరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన -
వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం.. అనంతపురం సర్వజనాస్పత్రిలో తల్లీబిడ్డ మృతి
అనంతపురం మెడికల్: అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంతో సోమవారం తల్లీబిడ్డ ప్రాణాలు గాల్లో కలసిపోయాయి. బాత్రూంకు వెళ్లిన గర్భిణి అక్కడ కళ్లు తిరిగి కిందపడిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. గైనిక్ విభాగం వైద్యులు, సిబ్బంది సకాలంలో స్పందించకపోవడంతో తల్లి, బిడ్డ ప్రాణాలు దక్కలేదు. అనంతపురం జిల్లా రాయదుర్గానికి చెందిన మంజునాథ్ తన భార్య జ్యోతి (30)ని మూడో కాన్పునకు గత నెల 27న సర్వజనాస్పత్రి ఎమర్జెన్సీ వార్డులో చేర్పించారు. హైరిస్క్ కేసు కావడంతో వైద్యులు, సిబ్బంది చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉన్నా.. ఆ స్థాయిలో పట్టించుకోలేదు. జ్యోతికి సోమవారం ఐరన్ సుక్రోజ్ ఇంజెక్షన్ ఇచ్చారు. కాసేపటికి కళ్లు తిరుగుతున్నాయని, బాత్రూంకు వెళ్లాలని చెప్పింది. బాత్రూంకు పంపించడంలో స్టాఫ్‌నర్సులు, ఎఫ్‌ఎన్‌వోల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో కుటుంబసభ్యులే జ్యోతిని బాత్రూంకు తీసుకెళ్లారు. అక్కడే ఆమె కింద పడిపోయింది. భర్త మంజునాథ్ తదితరులు గట్టిగా కేకలు వేసినా సిబ్బంది వెంటనే స్పందించలేదు. కొద్దిసేపటి తరువాత వచ్చిన సిబ్బంది జ్యోతిని పరీక్షించి లేబర్ వార్డుకు తరలించి సీపీఆర్ ద్వారా శ్వాసనందించే ప్రయత్నం చేశారు. జ్యోతి పరిస్థితి అర్థంగాక దిక్కుతోచని స్థితిలో ఉన్న మంజనాథ్‌ను బయటకు వెళ్లి ఇంజక్షన్ తీసుకురమ్మని గైనిక్ వైద్యులు, స్టాఫ్‌నర్సులు చెప్పారు. దీంతో అతడు పరుగెత్తుకుంటూ వెళ్లి స్థానిక సప్తగిరి సర్కిల్లోని ఓ ప్రైవేటు మందుల షాపులో రూ.170 వెచ్చించి యాంటీ బయోటిక్ ఇంజెక్షన్ తీసుకొచ్చాడు.తర్వాత జ్యోతికి సిజేరియన్ చేశారు. అప్పటికే ఆడబిడ్డ చనిపోయింది. జ్యోతిని అక్యూట్ మెడికల్ కేర్ (ఏఎంసీ) యూనిట్లో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స చేసినా ఫలితం లేకపోయింది. ఆమె కన్నుమూసింది. తొమ్మిదేళ్ల పాప, ఏడేళ్ల బాబు ఉన్నారని, తల్లి మృతితో వాళ్ల పరిస్థితేంటని మంజునాథ్ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.తల్లిని బతికించాలని చూశాంజ్యోతికి రక్తహీనత ఉండడంతో రెండు యూనిట్ల రక్తం అందించాం. నెలలు నిండకపోవడంతో పాటు బాత్రూంకు వెళ్లిన సమయంలో కళ్లు తిరిగి పడిందని చెప్పారు. అప్పటికే పల్స్ లేదు. తల్లిని రక్షించాలనే ఉద్దేశంతో సిజేరియన్ చేశాం. కార్డియాక్ అరెస్టు అయి ఆమె మరణించింది. – డాక్టర్ షంషాద్‌బేగం, హెచ్‌వోడీ, గైనిక్ విభాగం, అనంతపురం సర్వజనాస్పత్రి -
ఎంత ఎమర్జెన్సీ అయితే మాత్రం ఇదేమిటి తమ్ముడూ!
అమీర్‌ఖాన్, మాధవన్, శర్మన్ జోషిల ‘త్రీ ఇడియెట్స్’ సినిమాలోని సన్నివేశాలను ఇప్పటికీ గుర్తు తెచ్చుకుంటాం. అందులో ఒకటి హాస్పిటల్ సీన్. అనారోగ్యంతో బాధపడుతున్న శర్మన్ తండ్రిని అమీర్‌ఖాన్ స్కూటర్‌పై కూర్చోబెట్టుకొని, భుజాలకు కట్టేసుకొని ఆస్పత్రి ఎమర్జెన్సీ వార్డులోకి దూసుకువెళ్లే సీన్ ఉంది. మధ్యప్రదేశ్‌లోని ఒక హాస్పిటల్లో అచ్చం ఇలాంటి సీనే కనిపించింది. అపస్మారకస్థితిలో ఉన్న తన తాతను బైక్‌పై కూర్చోపెట్టుకొని ఆస్పత్రి ఎమర్జెన్సీ వార్డులోకి దూసుకువెళ్లాడు ఒక వ్యక్తి. సదరు ఈ వ్యక్తి ఇదే ఆస్పత్రిలో పనిచేస్తాడట. ‘ఎక్స్’లో ఒక యూజర్ షేర్ చేసిన ఈ వీడియో వైరల్ అయింది. ‘త్రీఇడియెట్స్’ సినిమా సీన్‌ను గుర్తు తెస్తుంది. -
షాకింగ్.. 2 గంటల్లో 40 మందిని కరిచిన వీధి కుక్క.. కిక్కిరిసిన ఆసుపత్రి వార్డ్
జైపూర్: కుక్కలు మనుషులపై దాడి చేస్తున్న ఘటనలు ఈ మధ్యకాలంలో ఎక్కువ అవుతున్నాయి. రోడ్డు మీద వెళ్తున్న వారిపై విచక్షణ రహితంగా దాడి చేసి గాయపరుస్తున్నాయి. పెంపుడు శునకాలు, వీధి కుక్కలనే తేడా లేకుండా ఉన్నట్టుండి యజమానులు, బయట వారిపై దాడి చేస్తున్నాయి. తాజాగా రాజస్థాన్‌లో ఓ వీధి కుక్క బీభత్సం సృష్టించింది. కేవలం 2 గంటల్లోనే ఏకంగా 40 మందిని కరిచింది. ఈ ఘటన బార్మర్ జిల్లాలోని కళ్యాణ్పూర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. వీధి కుక్క దాడితో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కుక్క దాడిలో గాయాలపాలైన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. బాధితులతో ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డు నిండిపోయింది. దీంతో స్థానికంగా పరిస్థితి ఏ స్థాయికి చేరిందనేది వెల్లడవుతోంది. అకస్మాత్తుగా వీధికుక్క దాడి చేయడంతో చాలా మంది గాయపడ్డారని, వారందరికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నామని సదరు హాస్పిటల్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ బిఎల్ మన్సూరియా తెలిపారు. ఈ ఘటనపై వెంటనే నగర పాలక సంస్థకు సమాచారం అందించడంతో అధికారులు రంగంలోకి దిగారు. కుక్కను పట్టుకునేందుకు రెండు బృందాలను ఏర్పాటు చేశారు. ఎట్టకేలకు ఆసుపత్రి సిబ్బంది సహాయంతో వీధికుక్కను పట్టుకున్నారు. తాజా ఘటనతో నగరంలోని కుక్కల బెడద ఎక్కువగా ఉన్న వివిధ ప్రాంతాల్లో వాటిని పట్టుకునేందుకు నగర పాలక సంస్థ చర్యలు చేపట్టింది. చదవండి: దారుణం.. ఇంటి యజమానిని చితకబాది.. నోట్లో పినాయిల్ పోసి.. -
షాకింగ్ వీడియో: రక్తపు మడుగులో పేషెంట్.. చుట్టూ తిరుగుతున్న కుక్క
లఖ్‌నవూ: ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డులో తీవ్ర రక్తస్రావంతో ఓ వ్యక్తి కింద పడిపోయి ఉన్నాడు. అతని చుట్టూ ఓ వీధి కుక్క తిరుగుతున్న హృదయవిదారక సంఘటన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ అమానవీయ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఖుషీనగర్ ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో జరిగింది. వీడియో ప్రకారం.. తీవ్రంగా గాయపడిన వ్యక్తి ఎమర్జెన్సీ వార్డులో కింద పడిపోయి ఉన్నాడు. చుట్టూ రక్తం పడి ఉంది. ఆ వ్యక్తి ముఖం, తలపై తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. స్పృహ తప్పి పడిపోయిన ఆ వ్యక్తి చుట్టూ ఓ వీధి కుక్క సైతం తిరుగుతోంది. 28 సెకన్ల పాటు చూపించిన ఈ వీడియోలో ఎమర్జెన్సీ వార్డుల్లో ఖాళీ పడకల సహా ఏ ఒక్క డాక్టర్, నర్సు సైతం లేరు. మరోవైపు.. ఈ ఘటనపై వివరణ ఇచ్చారు ఆసుపత్రి ఇన్‌ఛార్జి డాక్టర్ ఎస్కే వర్మ. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తీసుకొచ్చారని చెప్పారు. అతడు మద్యం మత్తులో ఉన్నాడని, చికిత్స అందిస్తున్న సమయంలోనే పలుమార్లు బెడ్ పైనుంచి కిందపడిపోయినట్లు చెప్పారు. ఆ వీడియో తీసిన సమయంలో డాక్టర్, వార్డు బాయ్ మరో వార్డులోని ఎమర్జెన్సీ కేసును చూసేందుకు వెళ్లారని తెలిపారు. ఆ తర్వాత గాయపడిన వ్యక్తిని గోరఖ్‌పుర్‌లోని ఆసుపత్రికి తరలించామని స్పష్టం చేశారు. The video is from #Kushinagar, #UttarPradesh In the government hospital, the injured youth lying in a pool of blood is lying on the ground instead of the bed, dogs are licking his blood. The fate of every hospital is not like Morbi, which is brightened overnight. pic.twitter.com/5PM5di0Lxv — Today Hind (@today__hind) November 3, 2022 ఇదీ చదవండి: ‘ఒక్క ఉదాహరణ చూపితే రాజీనామా చేస్తా.. మీరు సిద్ధమా?’.. కేరళ సీఎంకు గవర్నర్ సవాల్ -
ఇదేం రోగం?
అనంతపురం మెడికల్ : పేరు గొప్ప అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ వార్డులో వైద్యం దైవాధీనంగా మారింది. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా ప్రమోషన్ పొందినా, ఇక్కడికొచ్చే రోగులకు ఎలాంటి చికిత్స అందిస్తారో ప్రత్యక్షంగా చూస్తే మాత్రం ఒళ్లు గ గుర్పొడుస్తుంది. గురువారం బత్తలపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన 15 మందిని సర్వజనాస్పత్రికి తీసుకొచ్చారు. ఆ సమయంలో క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సైదన్న, ఇద్దరు హౌస్సర్జన్లు ఉన్నారు. ఓ వైపు తీవ్రంగా రక్తస్రావం జరుగుతున్నా, డ్యూటీ డాక్టర్, హౌస్సర్జన్లు ఏమాత్రం చొరవ చూపలేదు. స్వీపర్లు, ఎంఎన్ఓలు.. వారికి తోచినట్లు గాయూలకు కుట్లు వేశారు. దెబ్బ తగిలిన ప్రాంతంలో కుట్లు వేయచ్చో.. వేయకూడదో కూడా తెలియని పరిస్థితి. అటువంటిది పాత సూదితో స్వీపర్లే కుట్లు వేశారు. ఇదేమిటని ప్రశ్నించే నాథుడే కరువయ్యారు. చేతికి మరక అంటకూడదన్న చందంగా వైద్యులు ప్రవర్తించారు. ఆస్పత్రిలో పని చేయని బయటి వ్యక్తులు బ్లేడుతో క్షతగాత్రుల వెంట్రుకలను తొలగించి కుట్లు వేశారు. ఇంతటి దయనీయ పరిస్థితి జిల్లా కేంద్రంలో ఉన్న ఏ ప్రభుత్వ ఆస్పత్రిలోనూ ఉండి ఉండదని రోగులు వాపోయూరు. ‘ఆపద సమయంలో కుట్లు వేశారని వారికి చేతులెత్తి మొక్కాలో... లేక ఒకరికి వేసిన సూదితోనే మరొకరికి కుట్లు వేసి ఇన్ఫెక్షన్లు సోకేలా చేస్తున్నారని అరవాలో అర్థం కావడం లేద’ని ఓ క్షతగాత్రురాలి భర్త ఆవేదన వ్యక్తం చేశారు. క్షతగాత్రుల్లో ఎవరికైనా ప్రమాదకర వ్యాధులుంటే మిగితా వారి పరిస్థితేమిటి? అనే ప్రశ్నకు సమాధానం చెప్పేవారెవరూ లేరక్కడ. చోద్యం చూడటమే వైద్యమా? రక్తమోడుతున్న క్షతగాత్రులకు సత్వరమే వైద్యం అందించడానికి సర్జన్లు, మత్తు మందిచ్చే అనెస్థీషియన్లను వెంటనే పిలిపించాలి. మెడికల్ కళాశాలకు అనుబంధంగా ఉన్న ఇంత పెద్ద ఆస్పత్రిలో వైద్యం అందించే వారే కరువయ్యూరంటే.. రోగుల పరిస్థితి ఏంటో.. ఈ ఆస్పత్రిలో ఎలా చూపించుకోవాలంటూ ఓ రోగి కన్నీటిపర్యంతమయ్యూరు. ఆస్పత్రి యూజమాన్యం నిర్లక్ష్య వైఖరే ఇందుకు కారణమని స్పష్టమవుతోంది. ఏమైనా అంటే వైద్యులు సెలవులో వెళ్లిపోతారని యూజమాన్యం ప్రతి విషయంలో వెనకడుగు వేస్తోంది. ఆర్ఎంఓ డాక్టర్ పద్మావతి సైతం ప్రేక్షక పాత్ర వహించారు. సర్జన్లు, ఫిజీషియన్లను అందుబాటులోకి తీసుకురాలేదు. కనీసం కాల్ డ్యూటీ వైద్యులను పిలిపించిన పాపాన పోలేదు. త్వరగా వార్డులకు పంపండి.. అక్కడ వాళ్లు చూసుకుంటారంటూ హడావుడి చేశారు తప్పితే.. అత్యవసర వైద్యంపై దృష్టి సారించలేదు. మరొకరికి విధులు అప్పగించకుండానే వెళ్లిపోయిన మెడికల్ ఆఫీసర్ క్షతగాత్రుల్లో ఖాసీం వలి(35) అనే వ్యక్తి కొన ఊపిరితో కొట్టుమిట్టాడాడు. అతన్ని ఎమర్జెన్సీ వార్డులో ఓ మూలన పడేశారు. ఆక్సిజన్ అందక అతను కాసేపటికి ప్రాణం విడిచాడు. వాస్తవంగా ఆక్సిజన్ అందక ఇబ్బంది పడే వారికి కృత్రిమ శ్వాస లేదా ఆంబు ద్వారా అందించాలి. ఓ పక్క వారికి వైద్యం అందించే వారే కరువైన పరిస్థితిలో క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సైదన్న తన డ్యూటీ ముగిసిందంటూ (మధ్యాహ్నం 2 గంటలు) ఖాసీంవలి కేస్ షీట్‌పై సంతకం పెట్టి వెళ్లిపోయారు. తర్వాత విధులకు హాజరయ్యే వారికి బాధ్యతలు అప్పజెప్పకుండానే వెళ్లిపోవడం చూస్తుంటే మానవీయత అనేది ఇక్కడ ప్రశ్నార్థకమని తేలిపోరుుంది. కాంతమ్మ(40), ఉత్తమ్మ(63), నాగమునమ్మ(50), అక్కమ్మ(51), లక్ష్మిదేవి(32), అమ్ములు(6), హుస్సేన్‌ఖాన్(66), రామకుమారి(11), అంజినమ్మ(62), వెంగముని(45), రంగప్ప(65), గంగులమ్మ(55), మాబు(45), రమణమ్మ(35), ఆదినారాయణ(32), జయమ్మ(38), పుల్లమ్మ(50), రాజమ్మ(70), ఆంజినేయులు(32) గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. -
ఎంజీఎంలో జేసీ హల్చల్
ఎంజీఎం, న్యూస్‌లైన్ : నాలుగు జిల్లాలకు పెద్ద దిక్కుగా ఉన్న ఎంజీఎం ధర్మాస్పత్రిలో జిల్లా జాయింట్ కలెక్టర్ పౌసుమిబసు హల్చల్ చేశారు. ఈనెల 19న(ఆదివారం) హెచ్‌డీఎస్ సమావేశం నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆమె ఆస్పత్రిని శుక్రవారం సందర్శించారు. మధ్యాహ్నం 12 గంటలకు ఆస్పత్రికి చేరుకున్న జేసీ ముందుగా అత్యవసర వార్డు, తర్వాత ఓపీ విభాగం, బ్లడ్‌బ్యాంక్, ఏఆర్టీ సెంటర్, ఏపీఎంఎస్ఐడీసీ నిర్వహిస్తున్న అభివృద్ధి పనులు, మెడల్ డయాగ్నస్టిక్ సెంటర్‌ను పరిశీలించారు. అనంత రం రోగులకు అందిస్తున్న భోజనాన్ని స్వయంగా రుచి చూశారు. సాయంత్రం 6.00 గంటల తర్వాత సూపరిం టెండెంట్ చాంబర్లో సూపరింటెండెంట్ మనోహర్, ఆర్ఎంఓ నాగేశ్వర్రావు, హేమంత్, శివకుమార్, హెచ్ఓడీ కరుణాకర్‌రెడ్డి, బలరాం, డైటీషియన్ వీరమల్లు తదితరులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి పలు అంశాలపై చర్చించారు. ఏపీఎంఎస్ఐడీసీ అధికారులపై ఆగ్రహం ఆస్పత్రిలో 1.10 కోట్లతో ఏపీఎంఎస్ఐడీసీ అధికారు లు చేపట్టిన నిర్మాణ పనుల్లో నాణ్యత లోపించడంపై జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల రోజుల క్రితం ఆస్పత్రిని సందర్శించినప్పుడు చేపట్టిన పనుల వివరాలు తెలుపాలని కోరారు. ఓపీ విభాగంలో రోగుల సౌకర్యార్థం రక్త సేకరణ గదిలో చేపట్టిన టాయ్లెట్ల నిర్మాణ పనుల్లో నాణ్యత లోపించిన విషయాన్ని గ్రహించిన ఆమె ఈఈ దేవేందర్‌పై మండిపడ్డారు. నాసిరకంగా పనులు నిర్వహిస్తే ఊపేక్షించేది లేదని హెచ్చరించారు. ఆస్పత్రిలో చేపట్టిన నిర్మాణాలపై సూపరింటెండెంట్‌తో చర్చించి తుది నివేదికను సమర్పించాలని ఆదేశించారు. ఆస్పత్రిలో ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన మెడల్ డయాగ్నస్టిక్స్ నిర్వహణపై జేసీ నిప్పులు చెరిగారు. ఇన్‌పేషంట్ల రిపోర్టులు సెంటర్లోనే దర్శనమివ్వడం, ఈనెల 7న తీసిన స్కానింగ్ రిపోర్టులు వార్డుకు చేరకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ప్రైవేట్ రోగులకు ఇచ్చిన ప్రాధాన్యం ఎంజీఎం ఇన్పే షంట్లకు ఇవ్వడం లేదని పలువురు రోగులతోపాటు వైద్యసిబ్బంది సైతం ఆమెకు వివరించారు. మెడల్ నిర్వహణతీరును పరిశీలించేందుకు ప్రత్యేకంగా ఒక ఉద్యోగిని ఏర్పాటు చేసి ప్రభుత్వ పరంగా ఎన్ని స్కానింగ్‌లు తీస్తున్నారో పరిశీలించాలని చెప్పారు. వేయ్యి పడకల ఆస్పత్రిలో రోగులకు అందిస్తున్న డైట్(భోజనాన్ని) ఎలా ఉంటుందని జేసీ పౌసుమిబసు సూపరింటెండెంట్ మనోహర్, ఆర్ఎంఓ నాగేశ్వర్రావు, హేమంత్, శివకుమార్లతోకలిసి రుచిచూశారు. డైట్లో అందుబాటులో ఉంచిన సరుకులను సైతం పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఏడీ తీరుపై అసహనం ఆస్పత్రి అసిస్టెండ్ డెరైక్టర్ విధులు నిర్వహిస్తున్న తీరుపై జేసీ అసహనం వ్యక్తం చేశారు. అతను పలువురు సిబ్బం దికి సంబంధించిన సెలవులు, ఆయ సంతోషమ్మ వేతన చెల్లింపు విషయంలో అతడి ప్రవర్తన సక్రమంగా లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. అనాథ శిశువుల తరలింపు కోసం ఐసీడీఎస్ పీడీకి ఆదేశాలు ఎంజీఎంలో 9 మంది అనాథ శిశువులు చికిత్స పొందుతున్నారు. వారి ఆరోగ్యం మెరుగుపడడంతోపాటు సుమారు ఆరు నెలలుగా ఎంజీఎంలోనే ఉండడంతో ఆస్పత్రి సిబ్బందికి ఇబ్బంది మారింది. ఆ చిన్నారులను శిశు గృహాలకు తరలించాలని ఏన్నిమార్లు చెప్పినా పట్టించుకోవడంతో సంబంధిత సిబ్బంది జేసీకి వివరిం చారు. దీంతో ఆమె అనాథ పిల్లలను తరలించాలని ఐసీడీఎస్ పీడీని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
ఇదేం రోగం ?
అనంతపురం అర్బన్, న్యూస్‌లైన్: ప్రాణాలు పోయాల్సిన వైద్యులు తమ మధ్య ఉన్న విభేదాలతో ప్రాణాపాయస్థితిలో ఓ క్షతగాత్రుడు గంటల కొద్దీ ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో ఎమర్జెన్సీ వార్డులో కొట్టుమిట్టాడుతున్నా ఏ మాత్రం పట్టించుకోలేదు. గాయపడిన వ్యక్తి వైద్య ఆరోగ్య శాఖకు చెందిన ఉద్యోగి అయినా డాక్టర్లు స్పందించకపోవడంపై ఆస్పత్రి వర్గాలు ఆవేదన వ్యక్తం చేశాయి. వివరాల్లోకి వెళితే.. ముదిగుబ్బ పీహెచ్సీ అటెండర్ జయచంద్ర(45), ఆయన మేనల్లుడు ఆంజినేయులు(19) సోమవారం ఉదయం 9.30 గంటలకు ద్విచక్ర వాహనంలో అనంతపురం వస్తుండగా అదుపుతప్పి రోడ్డుపక్కన మైలురాయిని ఢీ కొన్నారు. ప్రమాదంలో జయచంద్ర తలకు తీవ్ర గాయమైంది. ఆయనను అక్కడి పీహెచ్సీ సిబ్బంది హుటాహుటిన సర్వజనాస్పత్రికి ఉదయం 11 గంటలకు తీసుకువచ్చారు. అప్పటికే బాధితుని తల పగిలి, అధిక రక్తస్రావం అవుతూ ఉంది. అక్కడున్న కాజువాలిటీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ చౌదరి రోగిని పరీక్షించి, ఆక్సిజన్ అందించారు. తలకు కుట్టువేయాలన్నా, మెరుగైన వైద్యం అందించాలన్నా సర్జన్ రావాల్సిందేనని తెలిపారు. డ్యూటీలో ఉన్న స్టాఫ్ నర్సులు ఈ విషయాన్ని సూపరింటెండెంట్ డాక్టర్ కేఎస్ఎస్ వెంకటేశ్వరరావుకు తెలిపారు. ఈ మేరకు సమాచారం సర్జన్‌కు తెలియజేయాలని ఆయన నర్సులకు సూచించారు. సర్జికల్ విభాగం వైద్యురాలు విజయలక్ష్మికి ఫోన్ చేసి చెప్పారు. ఆమె ఆస్పత్రిలోనే ఉంటూ సమాచారం అందిన గంట తర్వాత వచ్చారు. గాయపడిన ఉద్యోగిని చూసి పరిస్థితి విషమంగా ఉందని, హయ్యర్ ఇన్స్టిట్యూట్కు పంపాలని చెప్పి ఆమె వెళ్లిపోయారు. బాధితుడికి కనీసం కుట్లు కూడా వేయకుండా డాక్టర్ వెళ్లిపోవడంతో కాజువాలిటీ సిబ్బంది ఆశ్చర్యపోయారు. చివరకు స్టాఫ్ నర్సు రక్తస్రావం ఆపేందుకు కట్టుకట్టారు. పట్టించుకున్న పాపానపోలేదు.. గాయపడిన వ్యక్తికి సెలైన్ ఎక్కించారు. ఆక్సిజన్ పెట్టినా అది సరిగ్గా అతనికి అందడంలేదు. ఇలా గంటసేపు బాధితుడు కాజువాలిటీలో విలవిల్లాడుతూ ఉండిపోయాడు. ఈయన పరిస్థితిని చూడలేక ఆస్పత్రి సిబ్బంది మరోసారి సర్జికల్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ మురళీకృష్ణకు ఫోన్ చేశారు. విషయమేమిటని ఆయన ప్రశ్నించగా .. రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తికి తల పగిలి తీవ్ర రక్తస్రావం అవుతోందని, ఇప్పుడే డాక్టర్ విజయలక్ష్మి వచ్చి బాధితుడ్ని చూసి వెళ్లారని సిబ్బంది ఆయనకు వివరించారు. ఆ డాక్టర్ ఏమి చెప్పారని డాక్టర్ మురళీకృష్ణ తిరిగి ప్రశ్నించగా.. కర్నూలు తీసుకెళ్లాలని సూచించారని తెలపడంతో మరి కర్నూలుకు తీసుకెళ్లమనండి అంటూ ఆయన చెప్పారు. మిమ్మల్ని వెంటనే రావాలని సూపరింటెండెంట్ తెలిపారని చెప్పగా.. ‘ఆయనే నాకు ఫోన్ చేయమనండి’ అంటూ జవాబిచ్చారు. చివరకు డాక్టర్ మురళీకృష్ణ వచ్చి వైద్యం అందించారు. అనంతరం కుటుంబ సభ్యులు బాధితుడ్ని కర్నూలుకు తీసుకెళ్లారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. స్పందించని వైద్య ఆరోగ్య శాఖ గాయపడిన అటెండర్ జయచంద్రను తోటి సిబ్బంది 108 వాహనంలో ఆస్పత్రికి తీసుకువచ్చారు. రెండు గంటలైనా వైద్యులు ఆయనను పట్టించుకోలేదు. పీహెచ్సీ సిబ్బంది ఈ విషయాన్ని వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు తెలిపినా ప్రయోజనం లేకపోయింది. తమ శాఖకు చెందిన ఓ ఉద్యోగి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని తెలిసీ, ఆస్పత్రికి నాలుగడుగుల దూరంలో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు రాకపోవడంతో సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు.