ఇదేం రోగం?
అనంతపురం మెడికల్ : పేరు గొప్ప అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ వార్డులో వైద్యం దైవాధీనంగా మారింది. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా ప్రమోషన్ పొందినా, ఇక్కడికొచ్చే రోగులకు ఎలాంటి చికిత్స అందిస్తారో ప్రత్యక్షంగా చూస్తే మాత్రం ఒళ్లు గ గుర్పొడుస్తుంది. గురువారం బత్తలపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన 15 మందిని సర్వజనాస్పత్రికి తీసుకొచ్చారు. ఆ సమయంలో క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సైదన్న, ఇద్దరు హౌస్‌సర్జన్‌లు ఉన్నారు. ఓ వైపు తీవ్రంగా రక్తస్రావం జరుగుతున్నా, డ్యూటీ డాక్టర్, హౌస్‌సర్జన్‌లు ఏమాత్రం చొరవ చూపలేదు. స్వీపర్లు, ఎంఎన్‌ఓలు.. వారికి తోచినట్లు గాయూలకు కుట్లు వేశారు. దెబ్బ తగిలిన ప్రాంతంలో కుట్లు వేయచ్చో.. వేయకూడదో కూడా తెలియని పరిస్థితి. అటువంటిది పాత సూదితో స్వీపర్లే కుట్లు వేశారు. ఇదేమిటని ప్రశ్నించే నాథుడే కరువయ్యారు. చేతికి మరక అంటకూడదన్న చందంగా వైద్యులు ప్రవర్తించారు.
ఆస్పత్రిలో పని చేయని బయటి వ్యక్తులు బ్లేడుతో క్షతగాత్రుల వెంట్రుకలను తొలగించి కుట్లు వేశారు. ఇంతటి దయనీయ పరిస్థితి జిల్లా కేంద్రంలో ఉన్న ఏ ప్రభుత్వ ఆస్పత్రిలోనూ ఉండి ఉండదని రోగులు వాపోయూరు. ‘ఆపద సమయంలో కుట్లు వేశారని వారికి చేతులెత్తి మొక్కాలో... లేక ఒకరికి వేసిన సూదితోనే మరొకరికి కుట్లు వేసి ఇన్‌ఫెక్షన్‌లు సోకేలా చేస్తున్నారని అరవాలో అర్థం కావడం లేద’ని ఓ క్షతగాత్రురాలి భర్త ఆవేదన వ్యక్తం చేశారు. క్షతగాత్రుల్లో ఎవరికైనా ప్రమాదకర వ్యాధులుంటే మిగితా వారి పరిస్థితేమిటి? అనే ప్రశ్నకు సమాధానం చెప్పేవారెవరూ లేరక్కడ.
చోద్యం చూడటమే వైద్యమా?
రక్తమోడుతున్న క్షతగాత్రులకు సత్వరమే వైద్యం అందించడానికి సర్జన్లు, మత్తు మందిచ్చే అనెస్థీషియన్‌లను వెంటనే పిలిపించాలి. మెడికల్ కళాశాలకు అనుబంధంగా ఉన్న ఇంత పెద్ద ఆస్పత్రిలో వైద్యం అందించే వారే కరువయ్యూరంటే.. రోగుల పరిస్థితి ఏంటో.. ఈ ఆస్పత్రిలో ఎలా చూపించుకోవాలంటూ ఓ రోగి కన్నీటిపర్యంతమయ్యూరు.
ఆస్పత్రి యూజమాన్యం నిర్లక్ష్య వైఖరే ఇందుకు కారణమని స్పష్టమవుతోంది. ఏమైనా అంటే వైద్యులు సెలవులో వెళ్లిపోతారని యూజమాన్యం ప్రతి విషయంలో వెనకడుగు వేస్తోంది. ఆర్‌ఎంఓ డాక్టర్ పద్మావతి సైతం ప్రేక్షక పాత్ర వహించారు. సర్జన్లు, ఫిజీషియన్‌లను అందుబాటులోకి తీసుకురాలేదు. కనీసం కాల్ డ్యూటీ వైద్యులను పిలిపించిన పాపాన పోలేదు. త్వరగా వార్డులకు పంపండి.. అక్కడ వాళ్లు చూసుకుంటారంటూ హడావుడి చేశారు తప్పితే.. అత్యవసర వైద్యంపై దృష్టి సారించలేదు.
మరొకరికి విధులు అప్పగించకుండానే వెళ్లిపోయిన మెడికల్ ఆఫీసర్
క్షతగాత్రుల్లో ఖాసీం వలి(35) అనే వ్యక్తి కొన ఊపిరితో కొట్టుమిట్టాడాడు. అతన్ని ఎమర్జెన్సీ వార్డులో ఓ మూలన పడేశారు. ఆక్సిజన్ అందక అతను కాసేపటికి ప్రాణం విడిచాడు. వాస్తవంగా ఆక్సిజన్ అందక ఇబ్బంది పడే వారికి కృత్రిమ శ్వాస లేదా ఆంబు ద్వారా అందించాలి. ఓ పక్క వారికి వైద్యం అందించే వారే కరువైన పరిస్థితిలో క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సైదన్న తన డ్యూటీ ముగిసిందంటూ (మధ్యాహ్నం 2 గంటలు) ఖాసీంవలి కేస్ షీట్‌పై సంతకం పెట్టి వెళ్లిపోయారు. తర్వాత విధులకు హాజరయ్యే వారికి బాధ్యతలు అప్పజెప్పకుండానే వెళ్లిపోవడం చూస్తుంటే మానవీయత అనేది ఇక్కడ ప్రశ్నార్థకమని తేలిపోరుుంది.
కాంతమ్మ(40), ఉత్తమ్మ(63), నాగమునమ్మ(50), అక్కమ్మ(51), లక్ష్మిదేవి(32), అమ్ములు(6), హుస్సేన్‌ఖాన్(66), రామకుమారి(11), అంజినమ్మ(62), వెంగముని(45), రంగప్ప(65), గంగులమ్మ(55), మాబు(45), రమణమ్మ(35), ఆదినారాయణ(32), జయమ్మ(38), పుల్లమ్మ(50), రాజమ్మ(70), ఆంజినేయులు(32) గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.