![Shocking: Dog Bites 40 People In 2 Hours In Rajasthan - Sakshi](/styles/webp/s3/article_images/2022/12/30/dog.jpg.webp?itok=xVT142pt)
జైపూర్: కుక్కలు మనుషులపై దాడి చేస్తున్న ఘటనలు ఈ మధ్యకాలంలో ఎక్కువ అవుతున్నాయి. రోడ్డు మీద వెళ్తున్న వారిపై విచక్షణ రహితంగా దాడి చేసి గాయపరుస్తున్నాయి. పెంపుడు శునకాలు, వీధి కుక్కలనే తేడా లేకుండా ఉన్నట్టుండి యజమానులు, బయట వారిపై దాడి చేస్తున్నాయి. తాజాగా రాజస్థాన్‌లో ఓ వీధి కుక్క బీభత్సం సృష్టించింది. కేవలం 2 గంటల్లోనే ఏకంగా 40 మందిని కరిచింది. ఈ ఘటన బార్మర్ జిల్లాలోని కళ్యాణ్‌పూర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. వీధి కుక్క దాడితో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
కుక్క దాడిలో గాయాలపాలైన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. బాధితులతో ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డు నిండిపోయింది. దీంతో స్థానికంగా పరిస్థితి ఏ స్థాయికి చేరిందనేది వెల్లడవుతోంది. అకస్మాత్తుగా వీధికుక్క దాడి చేయడంతో చాలా మంది గాయపడ్డారని, వారందరికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నామని సదరు హాస్పిటల్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ బిఎల్ మన్సూరియా తెలిపారు.
ఈ ఘటనపై వెంటనే నగర పాలక సంస్థకు సమాచారం అందించడంతో అధికారులు రంగంలోకి దిగారు. కుక్కను పట్టుకునేందుకు రెండు బృందాలను ఏర్పాటు చేశారు. ఎట్టకేలకు ఆసుపత్రి సిబ్బంది సహాయంతో వీధికుక్కను పట్టుకున్నారు. తాజా ఘటనతో నగరంలోని కుక్కల బెడద ఎక్కువగా ఉన్న వివిధ ప్రాంతాల్లో వాటిని పట్టుకునేందుకు నగర పాలక సంస్థ చర్యలు చేపట్టింది.
చదవండి: దారుణం.. ఇంటి యజమానిని చితకబాది.. నోట్లో పినాయిల్ పోసి..
Comments
Please login to add a commentAdd a comment