కేజీహెచ్ గైనిక్ వార్డు నుంచి ఆక్సిజన్ సిలిండర్ మోసుకెళ్లిన తండ్రి
పట్టించుకోని కేజీహెచ్ సిబ్బంది
మహారాణిపేట(విశాఖ దక్షిణ): పసిబిడ్డ కోసం తండ్రి నానా కష్టాలు పడ్డాడు. ప్రసవం అయిన తర్వాత చికిత్స కోసం పిల్లల వార్డుకు తీసుకొని వెళ్లడానికి సిబ్బంది నిరాకరించారు. దీంతో తండ్రి ఆక్సిజన్ సిలిండర్ మోసుకొని వార్డుకు తీసుకొని వెళ్లాడు. పసిబిడ్డను ఆయా తీసుకొని వెళ్లగా తండ్రి సిలిండర్ మోసుకొని వెళ్లాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద్ ఆరా తీశారు.
కాకినాడ జిల్లా కోటనందూరుకి చెందిన అల్లు శిరీష, విష్ణుమూర్తి దంపతులు. శిరీష ఈ నెల 9న కేజీహెచ్ గైనిక్ వార్డులో చేరారు. మంగళవారం ఉదయం 8.30 శిరీష పసికందుకు జన్మనిచ్చి0ది. పసికందు అనారోగ్యానికి గురవడంతో పిల్లల వార్డులో ఉన్న ఐసీయూలో అబ్జర్వేషన్‌లో ఉంచాలని వైద్యులు సూచించారు.
పసికందును గైనిక్ వార్డుకు తరలించడానికి కేజీహెచ్ సిబ్బంది ఎవరు ముందుకు రాలేదు. దీంతో తండ్రి విష్ణుమూర్తి అక్కడ ఉన్న ఆయాతో మాట్లాడి తాను సిలిండర్ మోస్తానని ముందుకు వచ్చాడు. దీంతో ఆయా పసిపాపను, తండ్రి సిలిండర్ మోసుకొని వెళ్లారు. గైనిక్ వార్డు నుంచి పిల్లల వార్డు వరకు నడిచి తీసుకొని వెళ్తున్న ఈ దృశ్యాన్ని కొంత మంది వీడియో తీశారు. దీనిని వైరల్ చేయడంతో ఈ విషయం బయట పడింది.
గైనిక్ వార్డు వద్ద బ్యాటరీ కారు
ఈ ఘటన వైరల్ కావడంతో సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద్ ఆరా తీశారు. గైనిక్, పిల్లల వార్డు సిబ్బందిని పిలిచి విచారించారు. ఆ సమయంలో ఎవరు డ్యూటీలో ఉన్నారు.. ఈ ఘటనకు ఎవరు బాధ్యులు అన్నదానిపై చర్చించారు. ఈ సమస్య లేకుండా గైనిక్, పిల్లల వార్డు వద్ద ఒక బ్యాటరీ కారు సిద్ధం చేస్తున్నట్లు శివానంద్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment