వైఎస్సార్ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనంలో బాలింత, బిడ్డతో ఆమె సహాయకురాలు
గత నెల ఒకటో తేదీన విజయవాడ రైల్వేస్టేషన్‌లో ఎస్.కె.అమీనాకు పురిటినొప్పులు వచ్చాయి. దీంతో కుటుంబ సభ్యులు 108కు ఫోన్ చేశారు. ఆ కొద్దిసేపటికి 108 అంబులెన్స్ రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. విజయవాడ పాత జీజీహెచ్‌కు అమీనాను తరలించింది. వైద్యులు అమీనాకు ప్రసవం చేశారు. కొద్ది రోజుల విశ్రాంతి అనంతరం 11వ తేదీ ఆస్పత్రి నుంచి అమీనాను డిశ్చార్జి చేశారు. అమీనాది వైఎస్సార్ జిల్లా కడప నగరం యానాది కాలనీ. ఈ క్రమంలో ఇంటికి వెళ్లాలంటే 400 కి.మీ మేర ప్రయాణించాల్సిన పరిస్థితి. ప్రైవేట్ ట్యాక్సీ అద్దెకు తీసుకుని వెళ్లాలంటే సుమారు రూ.10వేల మేర వెచ్చించాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో అమీనాకు ‘డాక్టర్ వైఎస్సార్ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్’ వాహనం అండగా నిలిచింది. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా వాహనంలో బాలింత అమీనా ఆమె బిడ్డను వైద్యశాఖ క్షేమంగా ఇంటికి తరలించింది.
సాక్షి, అమరావతి: ఏపీలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవించిన మహిళలకు తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవల రూపంలో అండగా నిలుస్తోంది. ప్రజారోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వ హయాంలో కునారిల్లిన 108, 104 సేవలకు ఊపిరిలూదినట్టుగానే తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవలను మెరుగు పరిచింది. ఈ ఏడాది ఏప్రిల్ నెల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 500 కొత్త వాహనాలతో ‘డాక్టర్ వైఎస్సార్ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్’ సేవలను విస్తరించింది. దీంతో గతంతో పోలిస్తే ప్రస్తుతం ఎక్కువ మందికి లబ్ధి చేకూరుతోంది.
రోజుకు 700 మంది..
రాష్ట్రవ్యాప్తంగా వెయ్యికి పైగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏడాదికి 3 లక్షల మేర ప్రసవాలు చేస్తుంటారు. ఏప్రిల్‌కు ముందు కేవలం 279 వాహనాలే అందుబాటులో ఉండేవి. డిశ్చార్జ్ సమయంలో బాలింతలకు వాహనాలు అందుబాటులో ఉండేవి కాదు. దీంతో సొంత డబ్బు ఖర్చు పెట్టి బస్సు, ఆటోలు, ట్యాక్సీల్లో ఇళ్లకు వెళ్లేవారు. ఏప్రిల్ నుంచి 500 వాహనాలతో సేవలను విస్తరించారు. ప్రస్తుతం రోజుకు సగటున 700 మంది బాలింతలను తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలు ఆస్పత్రుల నుంచి ఇళ్లకు వెళుతున్నారు. ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 68,252 మంది బాలింతలు ఈ సేవలను వినియోగించుకున్నారు. తల్లులు, బిడ్డల రక్షణ, భద్రతకు భరోసా కల్పిస్తూ అన్ని వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ సౌకర్యం ఉంటోంది.
ఫిర్యాదుల స్వీకారం..
తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవలను సమర్థవంతంగా అమలు చేయడం కోసం క్షేత్ర స్థాయిలో తలెత్తే సమస్యలు, ఇబ్బందులపై ఫిర్యాదులను వైద్య శాఖ స్వీకరిస్తోంది. టోల్ ఫ్రీ నెంబర్ 104 ద్వారా ఫిర్యాదులను స్వీకరిస్తున్నారు. గత నెల నుంచి ఫిర్యాదుల స్వీకారం ప్రారంభించగా..ఇప్పటికి 18 ఫిర్యాదులు నమోదయ్యాయి. వీటిని సకాలంలో వైద్య శాఖ పరిష్కరించింది. కాగా.. మహిళ గర్భం దాల్చిన నాటి నుంచి పండంటి బిడ్డకు జన్మనిచ్చి ఆస్పత్రి నుంచి ఇంటికి చేరుకునేంత వరకూ అనేక విధాలుగా ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ప్రసవానంతరం డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కింద తల్లికి విశ్రాంతి సమయానికి రూ.5వేల చొప్పున ఆర్థిక సాయం చెల్లిస్తున్నారు.
తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవల్లో వచ్చిన మార్పులు ఇలా
ఏప్రిల్‌కు ముందు వరకు..
► 279 వాహనాలు
► ఇరుకైన మారుతీ ఓమినీ వాహనం
► ఏసీ సౌకర్యం ఉండదు
► ట్రిప్‌కు ఇద్దరు బాలింతల తరలింపు
ఏప్రిల్ నెల నుంచి..
► 500 వాహనాలు
► విశాలమైన మారుతీ ఈకో వాహనం
► ఏసీ సౌకర్యం ఉంటుంది
► ట్రిప్‌కు ఒక బాలింత మాత్రమే తరలింపు
ఒక్క రూపాయి ఖర్చు లేకుండా
తొమ్మిదో తేదీ కేజీహెచ్‌లో ప్రసవించాను.ఆస్పత్రి నుంచి మా గ్రామం 200 కి.మీ దూరం. తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌లో రూపాయి ఖర్చు లేకుండా ఇంటికి చేర్చారు.
– సి.గంగోత్రి, గుమ్మలక్ష్మిపురం, విజయనగరం జిల్లా
Comments
Please login to add a commentAdd a comment