Emergency medical services
-
అత్యవసర వైద్యసేవలకు 466 వాహనాలు
సాక్షి, హైదరాబాద్: వైద్యారోగ్యశాఖ పరిధిలో రాష్ట్రవ్యాప్తంగా అత్యవసర సేవలకు కొత్తగా 466 వాహనాలు అందుబాటులోకి రానున్నాయి. వీటిని వచ్చేనెల 1వ తేదీన ప్రారంభించా లని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అధికారులు కొత్త వాహనాలను కొనుగోలు చేశారు. 108, 102 అనే హెల్ప్‌లైన్ సేవల నంబర్లు స్పష్టంగా కనిపించేలా బ్రాండింగ్ చేశారు. సీ ఎం కేసీఆర్ ఫొటో, తెలంగాణ ప్రభుత్వ లోగో స్పష్టంగా కనిపిస్తున్నాయి. పార్థివ వాహనాల సేవలు ఉచితంగా అందిస్తామ నే విషయాన్ని తెలిపేవిధంగా ఉచితసేవ అని ముద్రించారు. అంబులెన్స్‌లు ఇలా... ప్రస్తుతం రాష్ట్రంలో 426 అంబులెన్స్‌లు అందుబాటులో ఉన్నాయి. 175 అంబులెన్సుల స్థానంలో కొత్తవి రిప్లేస్ చేస్తుండగా, మిగిలిన 29 అంబులెన్సులను అవసరమున్నట్టు గుర్తించిన కొత్త ప్రాంతాల్లో వినియోగించనున్నారు. కొత్తగా వచ్చే 204 వాహనాలను కలిపితే రాష్ట్రంలో 108 అంబులెన్సుల సంఖ్య 455కు పెరుగుతుంది. అమ్మ ఒడి వాహనాలు ఆకర్షణీయంగా గర్భిణుల కోసం ప్రవేశపెట్టిన అమ్మఒడి(102) వాహనాలు రాష్ట్రంలో 300 ఉన్నాయి. అయితే ఇందులో 228 వాహనాలకు కాలం చెల్లాయి. వాటి స్థానంలో కొత్తగా 228 వాహనాలను రీప్లేస్ చేస్తున్నారు. కొత్తగా అందుబాటులోకి రానున్న అమ్మఒడి వాహనాలు మరింత ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. వాహనం వెనుకభాగంలో అమ్మకు ఆత్మీయతతో, బిడ్డకు ప్రేమతో అనే ట్యాగ్‌లైన్‌తో పాటు, సీఎం కేసీఆర్ ఓ బాలింతకు కేసీఆర్ కిట్ అందిస్తున్న ఫొటో ముద్రించారు. చూడటానికి ఆహ్లాదంగా ఉండే రంగుల్లో, అమ్మఒడి కార్యక్రమ లోగో, శిశువు ఫొటోలతో 102 వాహనాలు కొత్తలుక్ సంతరించుకున్నాయి. పార్థివ వాహనాలు ప్రధాన ప్రభుత్వ దవాఖానాల్లో మరణించినవారి పార్థివదేహాలను స్వస్థలాలకు తరలించడం కుటుంబసభ్యులకు ఖర్చు తో కూడుకున్న పని. వారి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొ ని ప్రభుత్వం ఉచితంగా హర్సే వాహనాలను అందుబాటులోకి తెచ్చింది. ఈ హర్సే వాహనాలు 50 ఉన్నాయి. ఇందు లో 34 వాహనాలకు కాలం చెల్లిపోయింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కొత్తగా 34 వాహనాలను కొనుగోలు చేసి రిప్లేస్ చేస్తున్నది. వైద్యసేవలు మరింత పటిష్టం – మంత్రి హరీశ్‌రావు అత్యవసర సమయాల్లో సేవలు అందించే కొన్ని వాహనాలకు కాలం చెల్లిపోవడంతో తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి. ఈ నేపథ్యంలో పాత వాహనాల స్థానంలో కొత్తవి సమకూర్చుకోవడంతో పాటు, అవసరమున్నట్టు గుర్తించిన కొత్త ప్రాంతాల్లో వాహనాల సేవలు విస్తరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. వీటి రాకతో ప్రజలకు వైద్య సేవలు అందించడంలో మరింత వేగం పెరుగుతుంది. ప్రజలకు అవసరమైన ఆరోగ్యసేవలు అందించే విషయంలో ప్రభుత్వం ఎక్కడా రాజీపడటం లేదు. పెద్దమొత్తంలో నిధులు కేటాయించి వైద్యారోగ్య రంగాన్ని పటిష్టం చేసి, ఆరోగ్యరంగంలో తెలంగాణ దినదినాభివృద్ధి చెందుతూ ప్రజల మన్ననలు పొందుతుండటం సంతోషకరం. -
మరింత చేరువగా అత్యవసర వైద్యం
సాక్షి, హైదరాబాద్: ప్రజలకు అత్యవసర వైద్య సేవలు మరింత చేరువ చేసేందుకు తెలంగాణ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఇనీషియేషన్ (టెరి)ను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ప్రకృతి విపత్తులు, రోడ్డు ప్రమాదాలు, పని ప్రదేశాల్లో ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు, హార్ట్ అటాక్.. బ్రెయిన్ స్ట్రోక్, మాతా శిశు అత్యవసర సేవలు, మెడికల్.. సర్జికల్ ఎమర్జెన్సీస్ వంటి ఆరు రకాల బాధితులకు అవసరమైన వైద్యాన్ని తక్షణం అందించడం, తద్వారా ప్రాణ నష్టాన్ని సాధ్యమైనంతవరకు నివారించడమే దీని ప్రధాన లక్ష్యమని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఎమర్జెన్సీ కేసుల్లో 24% ట్రామా బాధితులే.. ఎమర్జెన్సీ విభాగానికి వచ్చే కేసుల్లో అత్యధికంగా 24 శాతం ట్రామా బాధితులే (గాయాలకు గురైనవారు) ఉంటున్నారు. ఆసుపత్రిలో చేరకముందు జరుగుతున్న 35 శాతం మరణాలకు, చేరిన 24 గంటలలోపు జరిగే 40 శాతం మరణాలకు రక్తస్రావం కారణం అవుతోంది. అయితే ప్రీ హాస్పిటలైజేషన్, ఎమర్జెన్సీ సర్విసెస్, రిహాబిలిటేషన్, సర్జరీ, స్పెషలిస్ట్, ఇన్వెస్టిగేషన్ ఫెసిలిటీస్ మధ్య సమన్వయం లోపం కారణంగా మరణాల రేటు ఎక్కువగా ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ గుర్తించింది. సకాలంలో స్పందించడం ద్వారా 30 నుంచి 40 శాతం హాస్పిటల్ మరణాలను నివారించవచ్చని అంచనా వేసింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని అన్ని రహదార్లు కవర్ అయ్యేలా 55 ట్రామా కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, 17 టీచింగ్ ఆసుపత్రులు, 21 జిల్లా ఆసుపత్రులు, 16 ఏరియా ఆసుపత్రుల్లో వీటిని ఏర్పాటు చేస్తారు. వీటినే ‘టెరి’లుగా వ్యవహరిస్తారు. ప్రీ హాస్పిటల్ సేవలు.. ప్రీ హాస్పిటల్, ఇంట్రా హాస్పిటల్ సేవలుగా విభజించి ట్రామా కేర్ సెంటర్లలో సేవలు అందించనున్నారు. ౖప్రీ హాస్పిటల్లో భాగంగా ప్రమాద బాధితులను తక్షణమే, సురక్షితంగా ఆసుపత్రికి చేర్చుతారు. ప్రమాద స్థలికి 108 అంబులెన్స్ వేగంగా చేరేలా అత్యాధునిక టెక్నాలజీ వినియోగిస్తారు. ప్రస్తుతం 426 అంబులెన్సులు ఉండగా, 292 వాహనాల్లో ఏఈడీలున్నాయి. మిగతా 133 వాహనాల్లో త్వరలో ఏర్పాటు చేస్తారు. 108 వాహనంలోకి బాధితుడిని తీసుకున్న వెంటనే అతని ఆరోగ్య పరిస్థితిని ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు. ఈ వివరాలు సమీపంలోని ఆసుపత్రికి చేరగానే అత్యవసర విభాగం వైద్యులు చికిత్స అందించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకుని సిద్ధంగా ఉంటారు. ఇంట్రా హాస్పిటల్ కేర్... ట్రామా కేర్ ఏర్పాటు చేయనున్న ఆసుపత్రుల్లో తగిన మార్పులు చేయనున్నారు. అంబులెన్స్ సులభంగా వచ్చి పోయేలా ఏర్పాటు చేయడంతో పాటు, దిగగానే ఎమర్జెన్సీ సేవలు అందేలా సదుపాయం కల్పిస్తారు. ఎమర్జెన్సీ విభాగం సులువుగా గుర్తించేలా సైన్ బోర్డులు ఏర్పాటు చేస్తారు. ప్రత్యేక ఓపీ సేవలు కొనసాగిస్తారు. క్యాజువాలిటీ డిపార్ట్మెంట్లను ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లుగా మార్చుతారు. ఎమర్జెన్సీ విభాగంలో డెడికేటెడ్ ట్రయాజ్ ఏర్పాటు చేస్తారు. ఇందులో నాలుగు క్లినికల్ మేనేజ్మెంట్ జోన్లు ఏర్పాటు చేస్తారు. ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, నలుపు రంగు సూచీలతో వీటిని విభజిస్తారు. ట్రయాజ్‌లో మల్టీ పారామీటర్ మానిటర్లు, మెడికల్ గ్యాస్ ఔట్ లెట్స్, ఇతర వైద్య సదుపాయాలు ఉంటాయి. అందుబాటులో అధునాతన వైద్య పరికరాలు ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్ ప్రకారం, 5,000 చదరపు అడుగుల్లో 10 పడకల ఎమర్జెన్సీ మెడికల్ డిస్పాచ్ (ఈఎండీ) ఏర్పాటు చేస్తారు. ఆస్పత్రుల సామర్థ్యాన్ని బట్టి ఎమర్జెన్సీకి పడకలు కేటాయిస్తారు. ఆటోక్లేవ్ మిషన్, మొబైల్ ఎక్స్ రే, ఈ ఫాస్ట్, సక్షన్ ఆపరేటర్స్, డిఫ్రిబ్రిలేటర్స్, సీ ఆర్మ్, ఆల్ట్రాసోనోగ్రఫీ, ఆల్ట్రా సౌండ్, సీటీ స్కాన్, వెంటిలేటర్లు, ఓటీ ఎక్విప్మెంట్ వంటి అధునాతన వైద్య పరికరాలు సమకూరుస్తారు. ఒక్కో ట్రామా కేర్ సెంటర్లో మొత్తం 7 విభాగాలకు చెందిన స్పెషాలిటీ వైద్యులు, నర్సింగ్, పారా మెడికల్ సిబ్బంది ఉంటారు. వీరికి జిల్లా స్థాయిలో ప్రత్యేక శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్ అందజేస్తారు. ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిరక్షణకు కృషి రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ఆరోగ్య సంరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోం. ప్రకృతి విపత్తులు, రోడ్డు ప్రమాదాలు ఇతర అత్యవసర సమయాల్లో సరైన సమయంలో అవసరమైన వైద్యం అందక బాధితులు విలువైన ప్రాణాలు కోల్పోతున్నారు. దీన్ని నివారించేందుకు ‘టెరి’కి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట< వ్యాప్తంగా 55 చోట్ల ట్రామా కేర్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం. – టి.హరీశ్‌రావు, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి -
కొన ప్రాణంతో ఉన్న వృద్ధుడికి ఊపిరి
నెల్లూరు(అర్బన్): ఏమైందో ఏమోగానీ వారం రోజులుగా ఆ వృద్ధుడు ఇంట్లో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. స్థానికులు చనిపోయాడనుకుని భావిస్తున్న తరుణంలో 108 సిబ్బంది ప్రాణం పోశారు. సాహసంతో వైద్యం చేసి కొన ఊపిరితో ఉన్న వ్యక్తిని బతికించారు. నెల్లూరులో శుక్రవారం జరిగిన ఈ ఘటన 108 సేవల గొప్పతనాన్ని మరోసారి చాటిచెప్పింది. కాశిం అనే వృద్ధుడు వాచ్‌మేన్‌గా పనిచేస్తూ రాజీవ్ గృహకల్ప కాలనీలో ఓ చిన్న గదిని అద్దెకు తీసుకుని జీవనం సాగిస్తున్నాడు. అయితే వారం రోజులుగా ఆ వృద్ధుడి ఇంటి తలుపు మూసే ఉంది. బయట తాళం వేయలేదు. స్థానికులు పెద్దగా పట్టించుకోలేదు. శుక్రవారం ఉదయం ఆ ఇంటి పక్కింటి వారికి దుర్వాసన రావడంతో అనుమానం వచ్చి తలుపు తడితే తీయలేదు. లోపల గడియ వేసి ఉంది. కిటికీలోంచి చూస్తే వృద్ధుడు అపస్మారక స్థితిలో ఉన్నాడు. వెంటనే 108కి సమాచారం ఇవ్వడంతో ఈఎంటీ (ఎమర్జెన్సీ టెక్నీష్ యన్) శ్రీనివాస్, పైలట్ రమేష్ తో కలిసి వెంటనే ఆ ఇంటి వద్దకు చేరుకున్నారు. తలుపులు పగుల గొట్టారు. వృద్ధుడు మరణించి ఉంటాడని స్థానికులు భావించారు. ఈఎంటీ శ్రీనివాస్ ఆ వృద్ధుడిని పరీక్షించాడు. నాడీ కూడా అందడం లేదు. బీపీ రికార్డు కాలేదు. కొన ఊపిరి ఉందని గ్రహించి ఆస్పత్రి వరకూ వెళ్లకుండా వెంటనే 108 వాహనంలోకి తీసుకెళ్లి వైద్యం చేశాడు. సెలైన్లు ఎక్కించడంతో పాటు, అత్యవసర ఇంజెక్షన్లు చేశాడు. దీంతో కాస్త నాడీ దొరకడంతో వెంటనే పెద్దాస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం వృద్ధుడి పరిస్థితి క్రమేపీ మెరుగవుతోంది. 108 సిబ్బంది వృద్ధుడి ప్రాణాన్ని కాపాడిన విషయం తెలుసుకున్న 108 జిల్లా మేనేజర్ పవన్‌కుమార్, నెల్లూరు డివిజన్ సూపర్వైజర్ రఫీ.. ఈఎంటీ శ్రీనివాస్‌ను, పైలట్ రమేష్ ను అభినందించారు. -
ప్రతి మూడు వారాలకు ఆరోగ్య శ్రీ బిల్లులు
ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి గత ప్రభుత్వం పెట్టిన బకాయిలుఅన్నింటినీ నెట్వర్క్ ఆస్పత్రులకు చెల్లించాం. ఇకపై ప్రతి మూడు వారాలకు ఒకసారి వైఎస్సార్ ఆరోగ్య శ్రీ బిల్లులు ఆన్లైన్లో అప్లోడ్ కావాలి. ఆ తర్వాత వాటిని వెంటనే మంజూరు చేయాలి. ‘వైఎస్సార్ ఆరోగ్య ఆసరా’ అనే కార్యక్రమాన్ని మన ప్రభుత్వం కొత్తగా ప్రారంభించింది. రోగులు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక తిరిగి పనులు చేసుకునే వరకు వైద్యుల సూచన మేరకు ఆర్థికంగా వారికి సహాయం అందించే ఈ కార్యక్రమం అమలులో ఇబ్బంది రాకుండా చూడాలి. –సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: అత్యవసర వైద్య సేవలు అందించడంలో ఏ లోటూ లేకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రతి మూడు వారాలకు ఒకసారి వైఎస్సార్ ఆరోగ్య శ్రీ బిల్లులను ఆయా ఆసుపత్రులు ఆన్లైన్లో అప్లోడ్ చేస్తే.. ఆ వెంటనే మంజూరు చేయాలని చెప్పారు. ఆరోగ్య ఆసరా కార్యక్రమం విషయంలో కూడా ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. కోవిడ్–19 నివారణ చర్యలు.. చేపలు, రొయ్యలకు ధర కల్పించడం తదితర అంశాలపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో అధికారులు వెల్లడించిన అంశాలు, సీఎం జగన్ ఆదేశాలు, సూచనలు ఇలా ఉన్నాయి. ఇబ్బంది లేకుండా ఎమర్జెన్సీ సేవలు ► సీఎం ఆదేశాల మేరకు ఎమర్జెన్సీ వైద్య సేవలను గుర్తించామని అధికారులు వెల్లడించారు. గర్భిణులు, కీమోథెరఫీ, డయాలసిస్ వంటి ఎమర్జెన్సీ సేవలు అవసరమైన వారందరినీ గుర్తించామన్నారు. షెడ్యూలు ప్రకారం వారికి వైద్య సేవలు అందించడానికి అన్ని రకాల చర్యలు తీసుకున్నామని చెప్పారు. ► షెడ్యూలు సమయానికి వైద్య సిబ్బందే కాల్ చేసి, వైద్య సేవల కోసం వారిని ఆసుపత్రులకు తరలిస్తున్నారని వివరించారు. క్షేత్ర స్థాయిలో ఏఎన్ఎంలు, ఆరోగ్య సిబ్బంది అన్ని రకాలుగా వారికి అండగా ఉంటున్నారని తెలిపారు. ► జూలై 1వ తేదీన 108 సర్వీసుల కోసం కొత్తగా కొనుగోలు చేసిన 1,060 వాహనాలను ప్రారంభించాలని నిర్ణయించారు. టెలి మెడిసిన్ కోసం కొత్త బైకులను వెంటనే కొనుగోలు చేయాలని సీఎం ఆదేశించారు. ► కోవిడ్ పరీక్షలు రెండు లక్షలు దాటాయని, యాక్టివ్ కేసుల కంటే కోలుకున్న కేసులు ఎక్కువగా ఉన్నాయని అధికారులు సీఎంకు వివరించారు. చేపలు, రొయ్యలకు స్థానికంగా మార్కెటింగ్ ► రాష్ట్రంలో స్థానికంగా చేపలు, రొయ్యలు విక్రయించేలా చూడాలని సీఎం ఆదేశించారు. దీని కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలన్నారు. కనీసం 30 శాతం స్థానిక వినియోగం ఉండేలా చూడాలని చెప్పారు. దీనిపై ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. చేపలకు ధర, మార్కెటింగ్ విషయాల్లో చర్యలు తీసుకోవాలని మంత్రి మోపిదేవిని ఆదేశించారు. ► రైతులు పండించిన ఇతర ఉత్పత్తులకు కూడా కనీసం 30 శాతం స్థానికంగా వినియోగం ఉండేలా చూడాలని సీఎం ఆదేశించారు. ► ట్రేడర్లకు అవసరమైన మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించాలని, ఇతర రాష్ట్రాల తరహాలో తగిన చర్యలు తీసుకోవాలని సీఎస్‌ను ఆదేశించారు. ► రాయలసీమ తదితర జిల్లాల్లో ఎక్కువగా ఉత్పత్తి అవుతున్న పండ్లు, టమాటాలకు మరింత మార్కెట్ కల్పించాలని సీఎం సూచించారు. కోల్డ్ స్టోరేజీలు, ప్రాసెసింగ్ యూనిట్లు, గోదాముల నిర్మాణంపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. ► ఈ సమీక్షలో మంత్రులు ఆళ్ల నాని, మోపిదేవి, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
అత్యవసర వైద్య సేవలను.. నిరాకరించొద్దు
సాక్షి, అమరావతి: కోవిడ్–19 నివారణ చర్యల్లో నిమగ్నమైనప్పటికీ ఇతర వ్యాధులతో సతమతమయ్యే పేషెంట్లకు కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. కిడ్నీ, తలసేమియా రోగులు, గర్భిణీలు తదితర ప్రధాన కేసులకు సంబంధించి వైద్యం అందడంలో ఎలాంటి ఇబ్బంది రాకూడదని.. అటువంటి వారికి వైద్యం నిరాకరించడాన్ని తీవ్రంగా పరిగణించాలని సీఎం సూచించారు. ముఖ్యమైన కేటగిరీలతో కూడిన జాబితాను తయారుచేయాలన్నారు. అలాగే, ప్రస్తుత పరిస్థితుల్లో చికిత్సకయ్యే రేట్లను పెంచితే తీవ్రమైన చర్యలు ఉంటాయని కూడా సీఎం హెచ్చరించారు. ఈ మేరకు అందరికీ సమాచారం పంపాలని అధికారులను ఆదేశించారు. కోవిడ్–19 నివారణ చర్యలపై ముఖ్యమంత్రి శనివారం క్యాంపు కార్యాలయంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, మోపిదేవి వెంకటరమణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, డీజీపీ గౌతం సవాంగ్‌లతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ముఖ్యాంశాలు ఇవీ.. ► రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల వివరాలను అధికారులు సీఎంకు వివరించారు. ► ఢిల్లీ వెళ్లిన వారికి, ప్రైమరీ కాంటాక్ట్ అయిన మొత్తం 1900 మందికి పైగా పరీక్షలు నిర్వహిస్తున్నామని అధికారులు తెలిపారు. ► ఇప్పటికే చాలావరకు పరీక్షలు పూర్తయ్యాయని, మిగిలిన వారికీ పరీక్షలు ఒకట్రెండు రోజుల్లో పూర్తిచేయనున్నట్లు వారు తెలిపారు. ఎప్పటికప్పుడు కరోనా సమస్యల పరిష్కారం కోవిడ్–19 కారణంగా తలెత్తిన సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, ఆ మేరకు కార్యాచరణతో ముందుకు సాగాలని సంబంధిత అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. ఈ సమయంలో.. రాష్ట్రవ్యాప్తంగా క్యాంపుల్లో ఉన్న వారికి అందుతున్న సదుపాయాలు, సీఎం ఆదేశాలు అమలుచేస్తున్న తీరును అధికారులు సీఎంకు వివరించారు. దీంతో.. ► కూలీలైనా.. కార్మికులైనా, వలస కూలీలైనా ఎవ్వరూ ఆకలితో ఉన్నారన్న మాట రాకూడదని వైఎస్ జగన్ వారికి స్పష్టంచేశారు. ఇలాంటి వారు ఎక్కడ ఉన్నా వారిని ఆదుకోవాలని సూచించారు. ► చిన్నచిన్న నివాసాలు ఏర్పాటుచేసుకుని కూలీలు ఎక్కువగా ఉన్నచోట అక్కడే షెల్టర్ ఏర్పాటుచేసి వారికి భోజన సదుపాయాలు కల్పించాలన్నారు. పంట నూర్పిడి యంత్రాలు సిద్ధం పంట చేతికొచ్చిన ప్రస్తుత సమయంలో తూర్పు గోదావరిలో 427 నూర్పిడి యంత్రాలు, ‘పశ్చిమ’ంలో 380, ‘కృష్ణా’లో 300 యంత్రాలను సిద్ధంచేశామని సీఎం వైఎస్ జగన్‌కు అధికారులు వివరించారు. ప్రతి గంటకూ రూ.1,800 నుంచి రూ.2,200 మధ్య రేటు ఖరారు చేశామని, ఇంతకుమించి ఎవరైనా రైతుల నుంచి ఎక్కువ వసూలు చేస్తే వాటి లైసెన్సులు రద్దు చేస్తామని తెలిపారు. 1.35 కోట్ల కుటుంబాల సర్వే పూర్తి రాష్ట్రంలోని 1.45 కోట్ల కుటుంబాలకుగాను 1.35 కోట్ల కుటుంబాల సర్వే పూర్తయ్యిందని, మిగతా ఇళ్ల సర్వే కూడా పూర్తవుతుందని సీఎం వైఎస్ జగన్‌కు అధికారులు తెలిపారు. కరోనా లక్షణాలున్న వారిని గుర్తించి వైద్యులతో పరిశీలన చేయిస్తున్నామని, వీరిలో ఎవరికి టెస్టులు నిర్వహించాలన్న దానిపై వైద్యులు నిర్ణయిస్తున్నారని వారు వివరించారు. కాగా, కోవిడ్ నివారణా చర్యలపై ప్రస్తుతం పనిచేస్తున్న టాస్క్‌ఫోర్స్‌లో వైద్య, ఆరోగ్యం.. వ్యవసాయం, మార్కెటింగ్ శాఖలు చాలా కీలకమని సీఎం ఈ సందర్భంగా స్పష్టంచేశారు. వ్యవసాయంపై ఇలా.. ► పంటలు, ధరలు, వాటి పరిస్థితిపై జరిగిన చర్చలో.. క్షేత్రస్థాయిలోని అగ్రికల్చర్ అసిస్టెంట్, రైతు భరోసా కేంద్రాల సిబ్బంది నుంచి నిరంతరం సమాచారం తెప్పించుకోవాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. అంతేకాక.. ► ఈ సమాచారం ఆధారంగా వ్యవసాయం, మార్కెటింగ్, పౌర సరఫరాల అధికారులు చర్యలు తీసుకోవాలని.. నిల్వ చేయలేని పంటల విషయంలో రైతులు నష్టపోకుండా వెంటనే చర్యలు చేపట్టాలని కూడా సూచించారు. అనంతపురం, కడపల నుంచి దాదాపు 200 లారీల ఉత్పత్తులను ఢిల్లీ, హర్యానాకు పంపించగలిగామని అధికారులు ఈ సందర్భంగా సీఎంకు వివరించారు. ► అలాగే, మీ ఆదేశాల ప్రకారం స్థానికంగా ఉన్న మార్కెట్లు, గ్రామాల వారీగా చిన్నచిన్న మార్కెట్లను ఏర్పాటుచేసి రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు సీఎంకు తెలిపారు. ఇతర రాష్ట్రాలకు రవాణా పరంగా ఉన్న ఇబ్బందులను సైతం ఎప్పకటిప్పుడు పరిష్కరిస్తున్నామన్నారు. -
గాంధీలో కొనసాగుతున్న జూడాల ఆందోళన
హైదరాబాద్: తమకు రక్షణ కల్పించాలని కోరుతూ సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్లు బుధవారం విధులు బహిష్కరించి ఆస్పత్రి ఓపీ విభాగం ఎదుట బైఠాయించి ఆందోళన, ధర్నా నిర్వహించారు. ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రక్షణపై స్పష్టమైన చర్యలు చేపట్టకుంటే గురువారం మధ్యాహ్నం 2 గంటల నుంచి అత్యవసర వైద్యసేవలను బహిష్కరిస్తామని జూడాలు హెచ్చరించారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే సీతాఫల్మండి రవీంద్రనగర్‌కు చెందిన చిన్నారి తరుణ్ మృతి చెందాడని ఆరోపిస్తూ పీఐసీయూ అద్దాలు ధ్వంసం చేయడంతోపాటు అక్కడ విధులు నిర్వహిస్తున్న జూనియర్ వైద్యుడు కార్తీక్‌పై మంగళవారం మృతుడి బంధువులు దాడి చేసిన సంగతి విదితమే. దీంతో తమకు రక్షణ కల్పించాలన్న డిమాండ్‌తో మంగళవారం రాత్రి నుంచి విధులు బహిష్కరించిన జూడాలు బుధవారం తమ ఆందోళన కొనసాగించారు. ఆస్పత్రి ఓపీ విభాగం ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు. ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించేందుకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నార్త్‌జోన్ డీసీపీ కల్మేశ్వర్ సింగన్వార్, గోపాలపురం ఏసీపీ శ్రీనివాసరావు, చిలకలగూడ సీఐ బాలగంగిరెడ్డి, డీఐ నర్సింహరాజులు జూడాలతో చర్చలు జరపడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. శాంతియుతంగా ర్యాలీ నిర్వహించేందుకు అనుమతి ఇవ్వడంతో జూడాలు ఆస్పత్రి నుంచి ముషీరాబాద్ చౌరస్తా వరకు ర్యాలీగా వెళ్లి పద్మారావు నగర్ మీదుగా ఆస్పత్రి ప్రాంగణంలోకి చేరుకున్నారు. స్పందించకుంటే సేవలు నిలిపివేస్తాం ఆస్పత్రిలో విధులు నిర్వహించే వైద్యులు, జూడాలు, సిబ్బందికి సరైన రక్షణ లేకపోవడంతో తరచూ దాడులు జరుగుతున్నాయని, ప్రభుత్వం తమకు రక్షణ కల్పించేందుకు తగిన చర్యలు చేపట్టాలని జూడాల సంఘం ప్రతినిధులు సంజయ్, శాంతికుమార్, లోహిత్, అర్జున్‌లు డిమాండ్ చేశారు. గురువారం మధ్యాహ్నం 2 లోగా వైద్య శాఖ మంత్రి స్వయంగా గాంధీ ఆస్పత్రికి వచ్చి జరిగిన ఘటనపై ఆరా తీయాలని, రక్షణ చర్యలను వివరించి స్పష్టమైన లిఖితపూర్వక హామీ ఇవ్వాలని కోరారు. లేకుంటే గురువారం మధ్యాహ్నం 2 గంటల తర్వాత నుంచి సాధారణ విధులతోపాటు అత్యవసర సేవలను బహిష్కరిస్తామని జూడాలు హెచ్చరించారు. ఇబ్బందులకు గురైన రోగులు జూడాల సమ్మెతో వైద్య సేవల్లో తీవ్ర జాప్యం నెలకొంది. దీంతో నిరుపేద రోగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అత్యవసర విభాగానికి వెళ్లే రహదారి మూసివేయడం, ఓపీ విభాగం వద్ద జూడాలు బైఠాయించడంతో వార్డుల్లోకి ఎలా వెళ్లాలో తెలియక రోగులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. రోగులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టామని ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రవణ్ కుమార్ తెలిపారు. డీఎంఈ రమేశ్‌రెడ్డి ఆస్పత్రి అధికారులు, పీఐసీయూ వైద్యులతో ప్రత్యేకంగా సమావేశమై పలు అంశాలపై చర్చించారు. -
కుయ్.. కుయ్ నై..నై
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: అత్యవసర వైద్య సేవలు అందించి.. ప్రాణాలను నిలపాల్సిన 108, 104 వాహనాలు మూడు రోజులుగా మూలనపడ్డాయి. ఫోన్‌కాల్ రాగానే కుయ్.. కుయ్‌మంటూ సైరన్ ద్వారా ఆపదలో ఉన్న వారికి ఆపన్నహస్తం అందించేలా సంకేతాలు ఇస్తూ ప్రభుత్వ ఆస్పత్రులకు రయ్.. రయ్‌మని తిరిగే వాహనాలపై పట్టింపు కరువై.. డీజిల్ లేక ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. పేదవారి నేస్తంగా భావించే ఈ వాహనాలకు మూడు రోజులుగా డీజిల్ పోయలేని దుస్థితి నెలకొంది. అత్యవసర సేవలకు చిరునామాగా నిలిచిన 108 వాహనాలు ఖమ్మం జిల్లాలో 14 ఉండగా.. దాదాపు 12 బండ్లు డీజిల్ లేక ఆయా ప్రాంతాల్లో ఆగిపోయాయి. 104 వాహనాలకు 10 రోజులుగా డీజిల్ లేకపోవడంతో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి ప్రాంగణంలోనే నిలిపివేశారు. దీంతో ఆ వాహనాల్లో పనిచేసే సిబ్బంది, డ్రైవర్లు డీజిల్ ఎప్పుడు వస్తుందో..? తెలియక అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. మూడు రోజులుగా 108 కదలట్లే.. అత్యవసర వైద్య సేవలు అందించే 108 వాహనాలను జిల్లాలో ప్రతి రెండు మండలాలకు ఒకటి చొప్పున కేటాయించారు. రోగి ఆరోగ్య పరిస్థితి క్షీణించినప్పుడు, అత్యవసర వైద్య సేవలు అవసరమైనప్పుడు ఉపయోగపడేలా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి 108, 104 వాహనాలను ప్రభుత్వ ఆస్పత్రులకు అనుసంధానం చేస్తూ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఏర్పాటు చేశారు. వేలాది మంది ప్రాణాలను కాపాడి.. సామాన్య ప్రజలకు ఎనలేని సేవలు అందించాయి. ప్రస్తుతం ఆ వాహనాలపై పర్యవేక్షణ లేకపోవడం, మరమ్మతులపై అధికారులు దృష్టి సారించకపోవడం.. చివరకు కనీసం డీజిల్ కూడా పోయని దైన్యం నెలకొనడంతో అసలు సేవలకే ఎసరొచ్చింది. మూడు రోజులుగా 108 వాహనం రోగులకు సేవలు అందించట్లేదని, సైరన్ మోతలు ఆగిపోయాయని ప్రభుత్వ ఆస్పత్రికి అత్యవసర సేవలకు వచ్చిన రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేలకొండపల్లి, కూసుమంచి, తిరుమలాయపాలెం, ఖమ్మంరూరల్, ఖమ్మంఅర్బన్, కామేపల్లి, బోనకల్, కల్లూరు, సత్తుపల్లి, ఏన్కూరు, తల్లాడ, కొణిజర్లలో ఈ వాహనాలు ఉన్నాయి. రోజుకు 150 నుంచి 200 కిలోమీటర్లు వరకు 108 వాహనాలు సేవలు అందించే అవకాశం ఉందని అంచనా. రెండు రోజులకోసారి రూ.2వేల డీజిల్‌ను ఆ వాహనానికి కొట్టిస్తారు. ఖమ్మంలోని పెట్రోల్ బంక్‌లో బిల్లు బకాయి రూ.3లక్షలు పేరుకుపోవడంతో.. డబ్బులు కట్టాల్సిందేనని బంక్ యాజమాన్యం ఇంధనం పోయట్లేదు. 108 వాహనాల పర్యవేక్షణ బాధ్యతను చూసే ఏజెన్సీ.. రెండు రోజుల్లో నగదు చెల్లిస్తామని నచ్చజెప్పినా ఫలితం కరువైంది. ఒక్క మధిరలో ఉన్న వాహనం మాత్రమే అక్కడి పెట్రోల్ బంక్ యాజమాన్యం అప్పు ఇవ్వడానికి అంగీకరించడంతో నిరాటంకంగా నడుస్తోంది. అంతా అయోమయం.. 108 వాహనాల్లో పనిచేసే సిబ్బందికి వేతనాలు సైతం నెలలో ఏ రోజు వస్తాయో..? వాటి కోసం ఎన్ని రోజులు నిరీక్షించాలో..? తెలియని దుస్థితి నెలకొంది. ఇటు ప్రజలకు వైద్య సేవలు అందించలేక.. తమకు సకాలంలో వేతనాలు అందక తీవ్ర ఇబ్బంది పడుతున్నామని ఉద్యోగులు చెబుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులకు గ్రామీణ ప్రాంతాల నుంచి అత్యవసర సేవల కోసం వచ్చే రోగుల సంఖ్య మూడు రోజులుగా తగ్గినా.. వైద్యాధికారులు సైతం 108 వాహనాలు ఎందుకు రోడ్డెక్కడం లేదనే విషయాన్ని పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. 104 వాహనాలు నిర్ణీత ప్రదేశాలకు వెళ్లి గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు వివిధ వ్యాధులకు సంబంధించి సేవలు అందిస్తాయి. వాటికి సైతం డీజిల్ లేకపోవడం.. బడ్జెట్ రాలేదన్న సాకుతో వాహనాలన్నింటినీ జిల్లా కేంద్రంలోనే నిలిపివేయడంతో గ్రామీణ ప్రాంతాల ప్రజలకు వైద్య సేవలు కరువయ్యే పరిస్థితి నెలకొంది. కాగా.. 108 వాహనాలు నిలిచిపోవడంపై వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ వాకాటి కరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై జిల్లా ఆరోగ్య శాఖ అధికారుల నుంచి ఆరా తీశారు. 104 వాహనాలకు డీజిల్ విషయమై ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఇక్కడి అధికారులకు సూచించారు. -
‘108’కు కొత్తగా మరో 145 అంబులెన్సులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ‘108’ అత్యవసర వైద్య సేవలకు కొత్తగా మరో 145 అంబులెన్సులను కొనుగోలు చేసేందుకు వైద్య ఆరోగ్యశాఖ రంగం సిద్ధం చేసింది. వీటి కొనుగోలుకు ఈ-టెండర్లు పిలిచిన ప్రభుత్వం... రెండు మూడు రోజుల్లో వాటిని ఖరారు చేయనుంది. వాస్తవంగా గత ఏడాదే 290 అంబులెన్సులను కొనుగోలు చేయాలనుకున్నారు. మొదటి విడతగా 145 అంబులెన్సులకే టెండర్లు పిలవగా, టాటా మోటార్స్ లిమిటెడ్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ వాహనాలు ఈ వారంలో అందుబాటులోకి రానున్నాయి. మరో 145 వాహనాలకు టెండర్లు ఖరారయ్యాక 3 నెలల్లోగా అందుబాటులోకి తీసుకొస్తామని ‘108’ ప్రత్యేకాధికారి డా.శ్రీనివాసరావు ‘సాక్షి’కి చెప్పారు. ప్రస్తుతం 316 అంబులెన్సులుంటే అందులో 121 వాహనాలు పాడైపోయాయి. సరిగా ఉన్న 195 వాహనాలకు తోడు కొత్తగా వస్తున్న వాటితో కలిపి వీటి సంఖ్య 485కు చేరనుంది. 80 అంబులెన్సుల్లో అత్యాధునిక వసతులు... ‘108’ సర్వీసుల్లో ప్రధానంగా 2 రకాలైన అంబులెన్సులను తీర్చిదిద్దాలని నిర్ణయించారు. కొత్తగా వస్తున్న వాటిలో 210 అంబులెన్సులు సాధారణ అత్యవసర వైద్య సేవలు అందిస్తాయి. వాటిని 75 వేల జనాభాకు ఒకటి చొప్పున కేటాయిస్తారు. ఇక 80 అంబులెన్సుల్లో అత్యాధునిక వైద్య సదుపాయాలు కలిగివుంటాయి. ఇవి 5 లక్షల జనాభాకు ఒకటి చొప్పున కేటాయిస్తారు. ఈ వాహనంలో ఐసీయూతో పాటు గుండె నొప్పి తదితర రోగులను తరలించే సంద ర్భంలో అందించాల్సిన అత్యాధునిక వైద్య సదుపాయాలు ఇందులో ఉంటాయి. రక్తపు బాటిళ్లనూ అందుబాటులో ఉంచుతారు. గర్భిణులను ఆసుపత్రికి తరలిస్తారు. ప్రసవం అనంతరం వారిని ఇంటికి పంపించే నిబంధనను కచ్చితంగా అమలుచేయాలని నిర్ణయిం చారు. జీపీఎస్ సౌకర్యం ఏర్పాటు చేయనున్నందున అంబులెన్సులు ఎక్కడున్నాయో...ఎంత వేగంతో ఆసుపత్రికి తరలిస్తున్నాయో ‘108’ ప్రత్యేకాధికారి సహా ఇతర ఉన్నతాధికారులు పర్యవేక్షించే అవకాశం ఉంటుంది. -
‘108’ అంబులెన్సులపై నిరంతర నిఘా
ఉత్తర్వులు జారీ చేసిన వైద్య ఆరోగ్య శాఖ సాక్షి, హైదరాబాద్: అత్యవసర వైద్య సేవలు అందించే ‘108’ అంబులెన్సులపై నిరంతర తనిఖీలు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ఈ అంబులెన్సుల వైద్య సేవలకు సంబంధించి కొంతకాలంగా వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తనిఖీలకు సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేస్తూ ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ డాక్టర్ బుద్ధప్రకాశ్ ఎం.జ్యోతి ఇటీవల జిల్లాలకు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో 337 అంబులెన్సులు ‘108’ కింద అత్యవసర వైద్య సేవల్లో పాలుపంచుకుంటున్నాయన్నారు. ఒక్కో అంబులెన్సు ప్రతీ రోజూ నాలుగు అత్యవసర కేసుల బాధితులను ఆసుపత్రులకు చేరవేస్తుందన్నారు. అయితే నాలుగే కాకుండా ఇంకా కొన్ని కే సుల్లో బాధితులను తీసుకెళ్లే అవకాశం ఉందన్నారు. రోజువారీ పర్యవేక్షణతోనే ఇది సాధ్యమవుతుందని ఆయన వెల్లడించారు. అందుకోసం ప్రాంతీయ వైద్యాధికారి (ఆర్డీ), జిల్లా వైద్యాధికారి (డీఎంహెచ్‌వో), సామాజిక ఆరోగ్య కేంద్రంలోని సీనియర్ ప్రజారోగ్యాధికారి తనిఖీలు చేయాలని ఆదేశించారు. తన జోన్ పరిధిలో నెలకు కనీసం 10 శాతం అంబులెన్సుల పనితీరును ఆర్డీ తనిఖీలు చేయాలన్నారు. డీఎంహెచ్‌వో నెలకు 25 శాతం తనిఖీ చేయాలన్నారు. సామాజిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని సీనియర్ ప్రజారోగ్యాధికారి నెలలో ప్రతీ అంబులెన్సును తనిఖీ చేయాలన్నారు. తనిఖీల నివేదికను తనకు పంపించాలని ఆదేశించారు. గర్భిణి కేసులకు సంబంధించిన సమాచారాన్ని ఫోన్ వివరాలతో సహా ప్రతీ నెల ఒకటో తేదీన తన పరిధిలోని పర్యవేక్షణ సెల్‌కు మెయిల్ ద్వారా పంపించాలని డీఎంహెచ్‌వోను ఆదేశించారు. అలాగే ప్రతీ నెల జిల్లా పర్యవేక్షణ కమిటీ సమావేశమై 108 పనితీరుపై చర్చించి అందుకు సంబంధించిన మినిట్స్‌తో నివేదికను పంపించాలన్నారు. రాష్ట్ర స్థాయిలోని నోడల్ ఆఫీసర్ జిల్లాల్లో పర్యటిస్తే కనీసం ఒక్క అంబులెన్సునైనా తనిఖీ చేయాలన్నారు. -
కొన్నదే సగం.. వాటిపైనా సంశయం!
సాక్షి, హైదరాబాద్: అత్యవసర వైద్యసేవలు అందించే ‘108’ అంబులెన్స్‌పై వైద్య ఆరోగ్యశాఖ తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. పాత వాహనాల స్థానంలో కొత్తవి ఏర్పాటుచేసేందుకు ఉద్దేశించిన టెండర్లు, కొనుగోలు వ్యవహారం లో తీవ్ర గందరగోళానికి తెరలేపింది. ఒకే కంపెనీకి టెండర్లు ఇచ్చినా.. సగం వాహనాలకే కొనుగోలు ఆర్డర్లు ఇచ్చి మిగిలిన వాటిపై మీనమేషాలు లెక్కిస్తోంది. కొనుగోలు చేసిన వాటి ని కూడా వినియోగించుకోవడంలోనూ నిర్లక్ష్యం చూపుతోంది. దీంతో అత్యవసర వైద్యం డొక్కైపోయిన ‘108’లోనే నడుస్తోంది. 290 వాహనాలకు టెండర్లు... 145కే ఆర్డర్లు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 316 అంబులెన్సులు ‘108’ సేవల్లో నిమగ్నమయ్యాయి. వాటిలో 195 వాహనాలు మాత్రమే కండిషన్లో ఉన్నాయి. 121 వాహనాలు పూర్తిగా పాడైపోయాయి. పాత వాహనాల స్థానే కొత్త వాటిని తీసుకురావడం... పెరుగుతున్న అవసరాలను దృష్టిలో ఉంచుకుని 290 అంబులెన్సు వాహనాలను కొనుగోలు చేయాలని సర్కారు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆ ప్రకారం టెండర్లు పిలవగా టాటా మోటార్స్ లిమిటెడ్ వాటిని దక్కించుకుంది. అయితే, ఆ కంపెనీకి 145 వాహనాలకే ఆర్డర్లు ఇచ్చారు. మిగిలిన 145 వాహనాలకు సంబంధించి ఇప్పటికీ ఎ లాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రభుత్వ పెద్దలు తమకు సంబంధించిన వారికి టెండర్ కట్టబెట్టేందుకే ఇలా చేశారన్న విమర్శలు వచ్చాయి. అయితే, దీనిపై వైద్య ఆరోగ్యశాఖ ఇప్పటికీ స్పష్టమైన జవాబు చెప్పలేకపోతోంది. రోడ్డెక్కించడంలోనూ నిర్లక్ష్యం టాటామోటార్స్ నుంచి కొనుగోలు చేసిన 145 వాహనాలను క్షేత్రస్థాయిలో ప్రవేశపెట్టడంలో నూ వైద్య ఆరోగ్య శాఖ వెనుకాముందాడుతోం ది. ఇప్పుడున్న వాహనాలు చీటికిమాటికి మరమ్మతులకు గురవుతుండడంతో రోగుల తరలింపులో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నా యి. ఒక్కోసారి మధ్యలోనే మొరాయిస్తున్న సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. కానీ, కొత్తవాటిని మాత్రం వినియోగించడంలేదు. వైద్య పరికరాలు పూర్తిగా ఏర్పాటుచేయకపోవడంవల్లే వీటిని వినియోగంలోకి తీసుకురావడంలేదని పేర్కొంటూ అధికారులు తప్పించుకోజూస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. -
నేటి రాత్రి నుంచి 108 సమ్మె
జీవీకేదే బాధ్యతంటూ పట్టించుకోని సర్కార్ చర్చల కోసం ఉద్యోగుల ఎదురుచూపు హైదరాబాద్: అత్యవసర వైద్యసేవలు అందించే ‘108’ అంబులెన్స్‌కు సంబంధించిన ఉద్యోగులు గురువారం రాత్రి నుంచి సమ్మెకు వెళ్లనున్నారు. గత నెలలోనే సమ్మె నోటీసు ఇచ్చిన సంగతి తె లిసిందే. దీంతో ‘108’ వైద్యసేవలు రాష్ట్రవ్యాప్తంగా స్తంభించనున్నాయి. సమ్మెపై ఉద్యోగులతో జీవీకే సంస్థ జరిపిన చర్చలు సఫలం కాలేదు. ఆ తర్వాత జీవీకేతో ప్రభుత్వం సమావేశం నిర్వహించి సమ్మె నిలుపుదలకు ప్రయత్నించాలని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. కార్మికశాఖ ద్వారా చర్చలు జరపాలని ప్రభుత్వం భావించినా ముందడుగు పడలేదు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం బాధ్యత తమది కాదని, జీవీకేనే నియమించుకున్నందున తమకు సంబంధంలేదన్న వైఖరితో సర్కారు ఉంది. మరోవైపు జీవీకే ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించింది. వేతనాలు, ఉద్యోగభద్రత వంటి 15 డిమాండ్లతో ఉద్యోగులు, సిబ్బంది సమ్మెకు వెళ్తున్నారు. ‘108’ వైద్యసేవల కోసం 1,800 మంది ఉద్యోగులు ఉండగా, 316 అంబులెన్స్‌లున్నాయి ఆ వాహనాలకయ్యే మొత్తం ఖర్చును ప్రభుత్వమే భరిస్తోంది. సమ్మెకాలంలో జీవీకేకు సహకరించకుండా చూడాలని క్యాబ్, ఆటో ఇతర డ్రైవర్ల యూనియన్లను తెలంగాణ ‘108’ ఉద్యోగుల సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడు పల్లి అశోక్ కోరారు. -
కుయ్యో.. మొర్రో
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: అత్యవసర వైద్య సేవలందించే 108 వాహనాలకు కష్టాలు పరిపాటిగా మారాయి. నిధుల విడుదలలో సర్కారు వైఖరే ఇందుకు ప్రధాన కారణం. మూడు నెలలుగా వాహనాల నిర్వహణ ఖర్చులు విడుదల చేయకపోవడంతో అవి ఎక్కడికక్కడ పడకేస్తున్నాయి. జిల్లాలో అత్యవసర సేవలందించే వాహనాలు 39 ఉన్నాయి. ఒక్కో వాహనం నిర్వహణకు ప్రభుత్వం నెలకు రూ.1.20 లక్షలు ఖర్చు చేస్తోంది. ఈ లెక్కన జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం ప్రతి నెలా రూ.46.80 లక్షలు వెచ్చిస్తోంది. కానీ గత మూడు నెలలుగా నిధుల విడుదలలో సర్కారు తాత్సారం చేస్తుండడంతో 108 వాహనాల ద్వారా అందించేసేవలు క్రమంగా నిలిచిపోతున్నాయి. నిధులివ్వని సర్కారు.. ప్రస్తుతం 108 వాహనాలు సంకటంలో పడ్డాయి. మూడు నెలలుగా వాహనాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు. ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించి కేవలం సెప్టెంబర్ మాసం నిర్వహణ నిధులు విడుదల కాగా, సిబ్బంది వేతనాల నిధులు మాత్రం అట్టిపెట్టింది. దీంతో నిర్వహణకు బడ్జెట్ లేకపోవడంతో నిర్వాహకులు సేవలు నిలిపివేస్తున్నారు. సోమవారం కందుకూరు మండలం ఆకులమైలారంలో మహిళకు పాముకాటు వేయగా బాధితురాలి సంబంధీకులు 108కి ఫోన్ చేశారు. డీజిల్ లేనందున సేవలందించలేమని తేల్చి చెప్పడంతో అవాక్కయిన వారుప్రైవేటు వాహనాన్ని సమకూర్చుకుని నగరానికి పయనమయ్యారు. -
ఇక తక్షణమే వైద్యసేవలు
సాక్షి, ముంబై: రైలు ప్రమాదాలకు గురైన వారికి అత్యవసర సమయంలో వైద్యసేవలందించే దిశగా సెంట్రల్ రైల్వే అడుగులు వేస్తోంది. ఇందులోభాగంగా త్వరలో మొత్తం 76 స్టేషన్ల ఆవరణలో అంబులెన్సు పార్కింగ్ సౌకర్యం కల్పించనుంది. రైలు ప్రమాదాలకు గురైన వారిని ‘గోల్డెన్ అవర్’లో సమీప ఆస్పత్రికి తరలించేందుకు సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ గతంలో సామాజిక కార్యకర్తలతోపాటు రైలు ప్రమాదాల బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. సెంట్రల్ రైల్వే పరిధిలోని స్టేషన్ల ఆవరణలో అంబులెన్స్ పార్కింగ్ సౌకర్యం కల్పించినట్టయితే స్వల్ప సమయంలోనే సమీపంలోని ఆస్పత్రులకు క్షతగాత్రులను తరలించొచ్చని అధికారులు పేర్కొన్నారు. ఈ విషయమై సెంట్రల్ రైల్వే ప్రజా సంబంధాల అధికారి అతుల్ రాణే రైల్వేస్టేషన్ ఆవరణలో ఏర్పాటుచేయనున్న ఉచిత అంబులెన్స్‌ల పార్కింగ్ సౌకర్యాన్ని వినియోగించుకోవాల్సిందిగా కార్పొరేట్లతోపాటు ప్రభుత్వేతర సంస్థలకు విజ్ఞప్తి చేశామన్నారు. బాధితులు ఫోన్‌కాల్స్‌ను స్వీకరించాలని, ప్రమాద బాధితులే కాకుండా ఇతరులు కూడా ఈ అంబులెన్సులను ఉపయోగించుకోవచ్చన్నారు. అంబులెన్స్ నిర్వాహకులు తమకు ఓ దరఖాస్తును సమర్పించాల్సి ఉంటుందన్నారు. ఈ దరఖాస్తులో వాహనపు సంఖ్య, ఫోన్ నంబర్లను స్టేషన్ మాస్టర్‌కు అందజేయాల్సిందిగా తెలిపారు. అత్యవసర సమయంలో స్టేషన్‌మాస్టర్ అంబులెన్సులకు సమాచారమిస్తారన్నారు. అంబులెన్స్ నిర్వాహకులు క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలిస్తే అందుకుగాను సెంట్రల్ రైల్వే వారికి రూ.750 చెల్లిస్తుంది. పార్కింగ్ స్థలాన్ని రైల్వే స్టేషన్‌లోని తూర్పు లేదా పశ్చిమ దిశలో ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం ఛత్రపతి శివాజీ టెర్మినస్, కుర్లా, ఠాణే, కల్యాణ్, పరేల్, పన్వేల్, ఘాట్కోపర్ తదితర స్టేషన్లలో మాత్రమే అంబులెన్సు పార్కింగ్ సౌకర్యం అందుబాటులో ఉంది.