నేటి రాత్రి నుంచి 108 సమ్మె
జీవీకేదే బాధ్యతంటూ పట్టించుకోని సర్కార్
చర్చల కోసం ఉద్యోగుల ఎదురుచూపు
హైదరాబాద్: అత్యవసర వైద్యసేవలు అందించే ‘108’ అంబులెన్స్‌కు సంబంధించిన ఉద్యోగులు గురువారం రాత్రి నుంచి సమ్మెకు వెళ్లనున్నారు. గత నెలలోనే సమ్మె నోటీసు ఇచ్చిన సంగతి తె లిసిందే. దీంతో ‘108’ వైద్యసేవలు రాష్ట్రవ్యాప్తంగా స్తంభించనున్నాయి. సమ్మెపై ఉద్యోగులతో జీవీకే సంస్థ జరిపిన చర్చలు సఫలం కాలేదు. ఆ తర్వాత జీవీకేతో ప్రభుత్వం సమావేశం నిర్వహించి సమ్మె నిలుపుదలకు ప్రయత్నించాలని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. కార్మికశాఖ ద్వారా చర్చలు జరపాలని ప్రభుత్వం భావించినా ముందడుగు పడలేదు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం బాధ్యత తమది కాదని, జీవీకేనే నియమించుకున్నందున తమకు సంబంధంలేదన్న వైఖరితో సర్కారు ఉంది.
మరోవైపు జీవీకే ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించింది. వేతనాలు, ఉద్యోగభద్రత వంటి 15 డిమాండ్లతో ఉద్యోగులు, సిబ్బంది సమ్మెకు వెళ్తున్నారు. ‘108’ వైద్యసేవల కోసం 1,800 మంది ఉద్యోగులు ఉండగా, 316 అంబులెన్స్‌లున్నాయి ఆ వాహనాలకయ్యే మొత్తం ఖర్చును ప్రభుత్వమే భరిస్తోంది. సమ్మెకాలంలో జీవీకేకు సహకరించకుండా చూడాలని క్యాబ్, ఆటో ఇతర డ్రైవర్ల యూనియన్లను తెలంగాణ ‘108’ ఉద్యోగుల సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడు పల్లి అశోక్ కోరారు.