సాక్షి, ముంబై: రైలు ప్రమాదాలకు గురైన వారికి అత్యవసర సమయంలో వైద్యసేవలందించే దిశగా సెంట్రల్ రైల్వే అడుగులు వేస్తోంది. ఇందులోభాగంగా త్వరలో మొత్తం 76 స్టేషన్ల ఆవరణలో అంబులెన్సు పార్కింగ్ సౌకర్యం కల్పించనుంది. రైలు ప్రమాదాలకు గురైన వారిని ‘గోల్డెన్ అవర్’లో సమీప ఆస్పత్రికి తరలించేందుకు సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ గతంలో సామాజిక కార్యకర్తలతోపాటు రైలు ప్రమాదాల బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
సెంట్రల్ రైల్వే పరిధిలోని స్టేషన్ల ఆవరణలో అంబులెన్స్ పార్కింగ్ సౌకర్యం కల్పించినట్టయితే స్వల్ప సమయంలోనే సమీపంలోని ఆస్పత్రులకు క్షతగాత్రులను తరలించొచ్చని అధికారులు పేర్కొన్నారు. ఈ విషయమై సెంట్రల్ రైల్వే ప్రజా సంబంధాల అధికారి అతుల్ రాణే రైల్వేస్టేషన్ ఆవరణలో ఏర్పాటుచేయనున్న ఉచిత అంబులెన్స్‌ల పార్కింగ్ సౌకర్యాన్ని వినియోగించుకోవాల్సిందిగా కార్పొరేట్లతోపాటు ప్రభుత్వేతర సంస్థలకు విజ్ఞప్తి చేశామన్నారు. బాధితులు ఫోన్‌కాల్స్‌ను స్వీకరించాలని, ప్రమాద బాధితులే కాకుండా ఇతరులు కూడా ఈ అంబులెన్సులను ఉపయోగించుకోవచ్చన్నారు. అంబులెన్స్ నిర్వాహకులు తమకు ఓ దరఖాస్తును సమర్పించాల్సి ఉంటుందన్నారు.
ఈ దరఖాస్తులో వాహనపు సంఖ్య, ఫోన్ నంబర్లను స్టేషన్ మాస్టర్‌కు అందజేయాల్సిందిగా తెలిపారు. అత్యవసర సమయంలో స్టేషన్‌మాస్టర్ అంబులెన్సులకు సమాచారమిస్తారన్నారు. అంబులెన్స్ నిర్వాహకులు క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలిస్తే అందుకుగాను సెంట్రల్ రైల్వే వారికి రూ.750 చెల్లిస్తుంది.
పార్కింగ్ స్థలాన్ని రైల్వే స్టేషన్‌లోని తూర్పు లేదా పశ్చిమ దిశలో ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం ఛత్రపతి శివాజీ టెర్మినస్, కుర్లా, ఠాణే, కల్యాణ్, పరేల్, పన్వేల్, ఘాట్కోపర్ తదితర స్టేషన్లలో మాత్రమే అంబులెన్సు పార్కింగ్ సౌకర్యం అందుబాటులో ఉంది.
ఇక తక్షణమే వైద్యసేవలు
Published Thu, Feb 6 2014 2:33 AM | Last Updated on Sat, Sep 2 2017 3:22 AM
Advertisement