శనివారం జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. చిత్రంలో మంత్రులు మోపిదేవి, బొత్స , ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ సవాంగ్ తదితరులు
సాక్షి, అమరావతి: కోవిడ్–19 నివారణ చర్యల్లో నిమగ్నమైనప్పటికీ ఇతర వ్యాధులతో సతమతమయ్యే పేషెంట్లకు కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. కిడ్నీ, తలసేమియా రోగులు, గర్భిణీలు తదితర ప్రధాన కేసులకు సంబంధించి వైద్యం అందడంలో ఎలాంటి ఇబ్బంది రాకూడదని.. అటువంటి వారికి వైద్యం నిరాకరించడాన్ని తీవ్రంగా పరిగణించాలని సీఎం సూచించారు. ముఖ్యమైన కేటగిరీలతో కూడిన జాబితాను తయారుచేయాలన్నారు. అలాగే, ప్రస్తుత పరిస్థితుల్లో చికిత్సకయ్యే రేట్లను పెంచితే తీవ్రమైన చర్యలు ఉంటాయని కూడా సీఎం హెచ్చరించారు. ఈ మేరకు అందరికీ సమాచారం పంపాలని అధికారులను ఆదేశించారు. కోవిడ్–19 నివారణ చర్యలపై ముఖ్యమంత్రి శనివారం క్యాంపు కార్యాలయంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, మోపిదేవి వెంకటరమణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, డీజీపీ గౌతం సవాంగ్‌లతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ముఖ్యాంశాలు ఇవీ..
► రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల వివరాలను అధికారులు సీఎంకు వివరించారు.
► ఢిల్లీ వెళ్లిన వారికి, ప్రైమరీ కాంటాక్ట్ అయిన మొత్తం 1900 మందికి పైగా పరీక్షలు నిర్వహిస్తున్నామని అధికారులు తెలిపారు.
► ఇప్పటికే చాలావరకు పరీక్షలు పూర్తయ్యాయని, మిగిలిన వారికీ పరీక్షలు ఒకట్రెండు రోజుల్లో పూర్తిచేయనున్నట్లు వారు తెలిపారు.
ఎప్పటికప్పుడు కరోనా సమస్యల పరిష్కారం
కోవిడ్–19 కారణంగా తలెత్తిన సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, ఆ మేరకు కార్యాచరణతో ముందుకు సాగాలని సంబంధిత అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. ఈ సమయంలో.. రాష్ట్రవ్యాప్తంగా క్యాంపుల్లో ఉన్న వారికి అందుతున్న సదుపాయాలు, సీఎం ఆదేశాలు అమలుచేస్తున్న తీరును అధికారులు సీఎంకు వివరించారు. దీంతో..
► కూలీలైనా.. కార్మికులైనా, వలస కూలీలైనా ఎవ్వరూ ఆకలితో ఉన్నారన్న మాట రాకూడదని వైఎస్ జగన్ వారికి స్పష్టంచేశారు. ఇలాంటి వారు ఎక్కడ ఉన్నా వారిని ఆదుకోవాలని సూచించారు.
► చిన్నచిన్న నివాసాలు ఏర్పాటుచేసుకుని కూలీలు ఎక్కువగా ఉన్నచోట అక్కడే షెల్టర్ ఏర్పాటుచేసి వారికి భోజన సదుపాయాలు కల్పించాలన్నారు.
పంట నూర్పిడి యంత్రాలు సిద్ధం
పంట చేతికొచ్చిన ప్రస్తుత సమయంలో తూర్పు గోదావరిలో 427 నూర్పిడి యంత్రాలు, ‘పశ్చిమ’ంలో 380, ‘కృష్ణా’లో 300 యంత్రాలను సిద్ధంచేశామని సీఎం వైఎస్ జగన్‌కు అధికారులు వివరించారు. ప్రతి గంటకూ రూ.1,800 నుంచి రూ.2,200 మధ్య రేటు ఖరారు చేశామని, ఇంతకుమించి ఎవరైనా రైతుల నుంచి ఎక్కువ వసూలు చేస్తే వాటి లైసెన్సులు రద్దు చేస్తామని తెలిపారు.
1.35 కోట్ల కుటుంబాల సర్వే పూర్తి
రాష్ట్రంలోని 1.45 కోట్ల కుటుంబాలకుగాను 1.35 కోట్ల కుటుంబాల సర్వే పూర్తయ్యిందని, మిగతా ఇళ్ల సర్వే కూడా పూర్తవుతుందని సీఎం వైఎస్ జగన్‌కు అధికారులు తెలిపారు. కరోనా లక్షణాలున్న వారిని గుర్తించి వైద్యులతో పరిశీలన చేయిస్తున్నామని, వీరిలో ఎవరికి టెస్టులు నిర్వహించాలన్న దానిపై వైద్యులు నిర్ణయిస్తున్నారని వారు వివరించారు. కాగా, కోవిడ్ నివారణా చర్యలపై ప్రస్తుతం పనిచేస్తున్న టాస్క్‌ఫోర్స్‌లో వైద్య, ఆరోగ్యం.. వ్యవసాయం, మార్కెటింగ్ శాఖలు చాలా కీలకమని సీఎం ఈ సందర్భంగా స్పష్టంచేశారు.
వ్యవసాయంపై ఇలా..
► పంటలు, ధరలు, వాటి పరిస్థితిపై జరిగిన చర్చలో.. క్షేత్రస్థాయిలోని అగ్రికల్చర్ అసిస్టెంట్, రైతు భరోసా కేంద్రాల సిబ్బంది నుంచి నిరంతరం సమాచారం తెప్పించుకోవాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. అంతేకాక..
► ఈ సమాచారం ఆధారంగా వ్యవసాయం, మార్కెటింగ్, పౌర సరఫరాల అధికారులు చర్యలు తీసుకోవాలని.. నిల్వ చేయలేని పంటల విషయంలో రైతులు నష్టపోకుండా వెంటనే చర్యలు చేపట్టాలని కూడా సూచించారు. అనంతపురం, కడపల నుంచి దాదాపు 200 లారీల ఉత్పత్తులను ఢిల్లీ, హర్యానాకు పంపించగలిగామని అధికారులు ఈ సందర్భంగా సీఎంకు వివరించారు.
► అలాగే, మీ ఆదేశాల ప్రకారం స్థానికంగా ఉన్న మార్కెట్లు, గ్రామాల వారీగా చిన్నచిన్న మార్కెట్లను ఏర్పాటుచేసి రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు సీఎంకు తెలిపారు. ఇతర రాష్ట్రాలకు రవాణా పరంగా ఉన్న ఇబ్బందులను సైతం ఎప్పకటిప్పుడు పరిష్కరిస్తున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment