ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి గత ప్రభుత్వం పెట్టిన బకాయిలుఅన్నింటినీ నెట్‌వర్క్ ఆస్పత్రులకు చెల్లించాం. ఇకపై ప్రతి మూడు వారాలకు ఒకసారి వైఎస్సార్ ఆరోగ్య శ్రీ బిల్లులు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ కావాలి. ఆ తర్వాత వాటిని వెంటనే మంజూరు చేయాలి.
‘వైఎస్సార్ ఆరోగ్య ఆసరా’ అనే కార్యక్రమాన్ని మన ప్రభుత్వం కొత్తగా ప్రారంభించింది. రోగులు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక తిరిగి పనులు చేసుకునే వరకు వైద్యుల సూచన మేరకు ఆర్థికంగా వారికి సహాయం అందించే ఈ కార్యక్రమం అమలులో ఇబ్బంది రాకుండా చూడాలి.
–సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: అత్యవసర వైద్య సేవలు అందించడంలో ఏ లోటూ లేకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రతి మూడు వారాలకు ఒకసారి వైఎస్సార్ ఆరోగ్య శ్రీ బిల్లులను ఆయా ఆసుపత్రులు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తే.. ఆ వెంటనే మంజూరు చేయాలని చెప్పారు. ఆరోగ్య ఆసరా కార్యక్రమం విషయంలో కూడా ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. కోవిడ్–19 నివారణ చర్యలు.. చేపలు, రొయ్యలకు ధర కల్పించడం తదితర అంశాలపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో అధికారులు వెల్లడించిన అంశాలు, సీఎం జగన్ ఆదేశాలు, సూచనలు ఇలా ఉన్నాయి.
ఇబ్బంది లేకుండా ఎమర్జెన్సీ సేవలు
► సీఎం ఆదేశాల మేరకు ఎమర్జెన్సీ వైద్య సేవలను గుర్తించామని అధికారులు వెల్లడించారు. గర్భిణులు, కీమోథెరఫీ, డయాలసిస్ వంటి ఎమర్జెన్సీ సేవలు అవసరమైన వారందరినీ గుర్తించామన్నారు. షెడ్యూలు ప్రకారం వారికి వైద్య సేవలు అందించడానికి అన్ని రకాల చర్యలు తీసుకున్నామని చెప్పారు.
► షెడ్యూలు సమయానికి వైద్య సిబ్బందే కాల్ చేసి, వైద్య సేవల కోసం వారిని ఆసుపత్రులకు తరలిస్తున్నారని వివరించారు. క్షేత్ర స్థాయిలో ఏఎన్‌ఎంలు, ఆరోగ్య సిబ్బంది అన్ని రకాలుగా వారికి అండగా ఉంటున్నారని తెలిపారు.
► జూలై 1వ తేదీన 108 సర్వీసుల కోసం కొత్తగా కొనుగోలు చేసిన 1,060 వాహనాలను ప్రారంభించాలని నిర్ణయించారు. టెలి మెడిసిన్ కోసం కొత్త బైకులను వెంటనే కొనుగోలు చేయాలని సీఎం ఆదేశించారు.
► కోవిడ్ పరీక్షలు రెండు లక్షలు దాటాయని, యాక్టివ్ కేసుల కంటే కోలుకున్న కేసులు ఎక్కువగా ఉన్నాయని అధికారులు సీఎంకు వివరించారు.
చేపలు, రొయ్యలకు స్థానికంగా మార్కెటింగ్
► రాష్ట్రంలో స్థానికంగా చేపలు, రొయ్యలు విక్రయించేలా చూడాలని సీఎం ఆదేశించారు. దీని కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలన్నారు. కనీసం 30 శాతం స్థానిక వినియోగం ఉండేలా చూడాలని చెప్పారు. దీనిపై ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. చేపలకు ధర, మార్కెటింగ్ విషయాల్లో చర్యలు తీసుకోవాలని మంత్రి మోపిదేవిని ఆదేశించారు.
► రైతులు పండించిన ఇతర ఉత్పత్తులకు కూడా కనీసం 30 శాతం స్థానికంగా వినియోగం ఉండేలా చూడాలని సీఎం ఆదేశించారు.
► ట్రేడర్లకు అవసరమైన మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించాలని, ఇతర రాష్ట్రాల తరహాలో తగిన చర్యలు తీసుకోవాలని సీఎస్‌ను ఆదేశించారు.
► రాయలసీమ తదితర జిల్లాల్లో ఎక్కువగా ఉత్పత్తి అవుతున్న పండ్లు, టమాటాలకు మరింత మార్కెట్ కల్పించాలని సీఎం సూచించారు. కోల్డ్ స్టోరేజీలు, ప్రాసెసింగ్ యూనిట్లు, గోదాముల నిర్మాణంపై దృష్టి పెట్టాలని ఆదేశించారు.
► ఈ సమీక్షలో మంత్రులు ఆళ్ల నాని, మోపిదేవి, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment