సాక్షి, అమరావతి: ప్రజారోగ్యానికి పెద్ద ఎత్తున నిధులు వెచ్చించి ప్రభుత్వాస్పత్రుల్లో అన్ని మౌలిక సదుపాయాలు, సిబ్బందిని సమకూర్చిన రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీలోకి మరిన్ని ప్రొసీజర్లను చేర్చడం ద్వారా మరింత మెరుగైన వైద్య చికిత్సలు అందించేందుకు సన్నద్ధమైంది. జిల్లాల్లో వైద్య ఆరోగ్య శాఖ కార్యకలాపాల నిర్వహణలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కీలకం కానున్నాయి. ఈమేరకు బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైద్య, ఆరోగ్య శాఖపై నిర్వహించిన ఉన్నత సమీక్షలో ముఖ్యమంత్రి జగన్ పలు అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలోనూ వైద్య కళాశాల ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సీఎం సమీక్షలోముఖ్యాంశాలు ఇవీ..
డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీని మరింత బలోపేతం చేయడంలో భాగంగా మరో 754 ప్రొసీజర్లను పథకంలో చేరుస్తున్నాం. కొత్తగా చేర్చే వాటితో కలిపి మొత్తం 3,118 ప్రొసీజర్లకు పథకం ద్వారా ప్రజలకు ఉచితంగా వైద్యం అందుతుంది. సెప్టెంబరు 5వతేదీ నుంచి కొత్త ప్రొసీజర్లను అందుబాటులోకి తేవాలి.
– ముఖ్యమంత్రి వైఎస్ జగన్
వైద్య కళాశాల కేంద్రంగా..
గ్రామ స్థాయిలో వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్ మొదలు పీహెచ్‌సీ, సీహెచ్‌సీ, ఏరియా, జిల్లా ఆస్పత్రులు, అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, డీఎంహెచ్‌ఓ, డీసీహెచ్‌ఎస్‌లను ఆయా జిల్లాల్లోని ప్రభుత్వ వైద్య కళాశాల పరిధిలోకి తేవాలి. వైద్య, పరిపాలన కార్యకలాపాలన్నీ వైద్య కళాశాల నుంచే నిర్వహించాలి. పకడ్బందీగా వైద్య సేవలు అందించడంతోపాటు అధికారులు, సిబ్బంది మధ్య సమన్వయానికే ఈ చర్యలన్నీ. దీనికి సంబంధించి ఎవరెవరు ఏం చేయాలి? విధులు, బాధ్యతలు ఏమిటి? అనే అంశాలపై స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్‌వోపీ) రూపొందించాలి. అన్ని జిల్లాల వైద్య కళాశాలల్లో మెడికల్ హబ్స్ ఏర్పాటు చేయాలి. వైద్య కళాశాల నేతృత్వంలోనే హబ్స్ పని చేయాలి. హబ్స్ నుంచి కింది స్థాయి ఆస్పత్రుల్లో చికిత్సలకు అవసరమైన సలహాలు, సూచనలు వైద్యులకు వెళ్లాలి. 6,956 టెలీ మెడిసిన్ స్పోక్స్, 27 హబ్స్ ఏర్పాటు కావాలి.
ఇకపై కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్
ప్రతి విలేజ్ క్లినిక్‌లో ఎంఎల్‌హెచ్‌పీ (మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్), ఒక ఏఎన్‌ఎం, ఒకరు లేదా ఇద్దరు ఆశావర్కర్లు ఉంటారు. ఈ లెక్కన ప్రతి విలేజ్ క్లినిక్‌లో ముగ్గురు నుంచి నలుగురు సిబ్బంది సమకూరుతారు. విలేజ్ క్లినిక్‌లో 67 రకాల మందులు, 14 రకాల పరీక్షలు అందుబాటులో ఉంటాయి. ఎంఎల్‌హెచ్‌పీలను ఇకపై కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్‌గా పిలవాలి.
18 ఏళ్లు నిండిన వారందరికీ ప్రికాషన్ టీకా
కరోనా వైరస్ వ్యాప్తి తగ్గినప్పటికీ నియంత్రణ చర్యల్లో అలసత్వం వహించొద్దు. ప్రికాషన్ డోసు టీకా పంపిణీపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. రెండు డోసులూ టీకా తీసుకుని అర్హులైన 18 ఏళ్లు పైబడిన వారికి ప్రికాషన్ టీకాలు ఇవ్వాలి.
ఫ్యామిలీ డాక్టర్.. 3 అంశాలపై ఫోకస్
ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ను సమర్థంగా అమలు చేసేందుకు ప్రధానంగా మూడు అంశాలపై దృష్టి పెట్టాలి. విలేజ్ క్లినిక్స్, పీహెచ్‌సీల భవనాలు, మానవ వనరులు, తగినన్ని 104 మొబైల్ మెడికల్ యూనిట్స్ అందుబాటులోకి తేవడంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి. ఒక అధికారిని ప్రత్యేకంగా నియమించి పనులు ఎలా ముందుకు సాగుతున్నాయో రోజూ సమీక్షించాలి.
మరో 432 ఎంఎంయూలు..
ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అమలుకు అవసరమైన కసరత్తు పూర్తి చేస్తున్నట్లు ఈ సందర్భంగా అధికారులు వివరించారు. కొత్త విధానాన్ని సంక్రాంతి వరకు ప్రయోగాత్మకంగా పరీక్షించనున్నట్లు చెప్పారు. మరోవైపు పీహెచ్‌సీలతో 104 మొబైల్ మెడికల్ యూనిట్ల మ్యాపింగ్ పూర్తైందని వెల్లడించారు. పీహెచ్‌సీలు, సచివాలయాల మ్యాపింగ్ కూడా పూర్తి చేస్తామన్నారు. 104 ఎంఎంయూలు ఇప్పటికే 656 పని చేస్తున్నాయని, మరో 432 వాహనాలను సమకూరుస్తున్నట్లు చెప్పారు. సమీక్షలో మంత్రి విడదల రజని, సీఎస్ సమీర్‌శర్మ, వైద్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ జె.నివాస్, ప్రత్యేక కార్యదర్శి జి.ఎస్.నవీన్‌కుమార్, ఏపీఎంఎస్‌ఐడీసీ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి, ఎండీ మురళీధర్‌రెడ్డి, వైద్య విధానపరిషత్ కమిషనర్ డాక్టర్ వినోద్‌కుమార్, డ్రగ్ కంట్రోల్ డీజీ రవిశంకర్, ఆరోగ్యశ్రీ సీఈవో హరీంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
చదవండి: బతుకులు మార్చే పథకాలు పప్పుబెల్లాలా?
Comments
Please login to add a commentAdd a comment