ప్రత్యేక చర్యలు చేపట్టిన ఏపీ సర్కార్
దేశంలో ఏటా రెండు లక్షలకు పైగా రొమ్ము కేన్సర్ కేసులు
2019–23 మధ్య 8.37 లక్షల కొత్త కేసులు వెలుగులోకి
2023లో 2.21 లక్షల కేసులు, 8 వేల మరణాలు
సాక్షి, అమరావతి: మహిళల్లో చాపకింద నీరులా కమ్ముకొస్తున్న బ్రెస్ట్ (రొమ్ము) కేన్సర్ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. దీనిపై అవగాహన లేకపోవడంతో మహిళల్లో కొందరు ఈ కేన్సర్ బారినపడుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు. ఈ వ్యాధి సోకిన వారిలో దాదాపు 60 శాతం మంది వ్యాధి ముదిరిన తర్వాతే వైద్యుల వద్దకు పరుగు తీస్తున్నారు. ఈ పరిస్థితిని గుర్తించిన సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం గ్రామస్థాయిలో కేన్సర్ స్క్రీనింగ్ ప్రారంభించింది. ప్రభుత్వాస్పత్రుల్లో రొమ్ము కేన్సర్ నిర్థారణ సదుపాయాలను మెరుగుపరిచింది. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద కేన్సర్ బాధితులందరికీ ఉచితంగా వైద్యసేవలు అందిస్తోంది. ఏఎన్‌ఎంలు, సీహెచ్‌వోలు, ఫ్యామిలీ డాక్టర్ల ద్వారా ఈ జబ్బు లక్షణాలతోపాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మహిళల్లో అవగాహన కల్పిస్తున్నారు.
దేశవ్యాప్తంగా పెరుగుతున్న బాధితులు
దేశంలో ఏటా రెండు లక్షల మందికి పైగా మహిళలు రొమ్ము కేన్సర్ బారిన పడుతున్నారు. ఈ విషయాన్ని ఇటీవల కేంద్ర ఆరోగ్య శాఖ లోక్‌సభలో వెల్లడించింది. నేషనల్ కేన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్ గణాంకాల ప్రకారం 2019 నుంచి 2023 మధ్య దేశంలో 8,37,935 మంది మహిళలు రొమ్ము కాన్సర్ బారినపడ్డట్టు వెల్లడైంది. వీరిలో 3.92 లక్షల మంది బాధిత మహిళలు మృత్యువాత పడ్డారు. గత ఏడాదిలోనే దేశంలో 2,21,579 మంది మహిళల్లో ఈ జబ్బు కొత్తగా నిర్థారణ కాగా.. 82,429 మంది మరణించినట్టు గణాంకాలు చెబుతున్నాయి.
2023లో దేశంలోనే అత్యధికంగా యూపీలో 30,781, తమిళనాడులో 15,931, బిహార్‌లో 15,555 చొప్పున కొత్త కేసులు వెలుగు చూశాయి. ఇదిలా ఉండగా ఏపీలో 11,921 కేసులు గత ఏడాది నమోదయ్యాయి. పక్కనున్న కర్ణాటకలో 14,484, తెలంగాణలో 8,066, కేరళలో 8,874 చొప్పున కొత్త కేసులు వెలుగు చూశాయి. రాష్ట్రంలోని పరిస్థితులను గమనించిన ప్రభుత్వం కేన్సర్‌ను తొలి దశలోనే గుర్తించి తక్షణ చికిత్సలు చేయించడం ద్వారా కేన్సర్ నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టింది.
2 జిల్లాల్లో పైలెట్ కార్యక్రమం
కేన్సర్ నియంత్రణ చర్యల్లో భాగంగా పెద్దఎత్తున స్క్రీనింగ్ చేపట్టి ప్రారంభ దశలోనే వ్యాధిని గుర్తించి చికిత్సలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా మరణాలను అరికట్టేలా ప్రణాళికలు రచించాం. ఇప్పటికే కేన్సర్ స్క్రీనింగ్ పైలట్ కార్యక్రమం అనకాపల్లి, తిరుపతి జిల్లాల్లో అమలవుతోంది. భవిష్యత్‌లో రాష్ట్రవ్యాప్తంగా స్క్రీనింగ్ కార్యక్రమాన్ని ప్రభుత్వం విస్తరించబోతోంది. – ఆర్.రమేశ్‌బాబు, నోడల్ అధికారి రాష్ట్ర కేన్సర్ నియంత్రణ కార్యక్రమం
క్రమం తప్పకుండా స్క్రీనింగ్ చేయించుకోవాలి
కుటుంబంలో ఎవరికైనా రొమ్ము కేన్సర్ ఉంటే ఆ కుటుంబంలోని మహిళలు 20 ఏళ్ల వయసు నుంచే స్వయంగా రొమ్ములను పరీక్షించుకోవాలి. క్రమం తప్పకుండా స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి. ఇలా చేయడం ద్వారా కేన్సర్ కణితిని ప్రారంభ దశలోనే గుర్తించడానికి వీలుంటుంది. రొమ్ము పరిమాణంలో మార్పులు, చెయ్యి పెట్టినప్పుడు గడ్డ స్పష్టంగా తగలడం, నొప్పి కలగడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. వయసు మళ్లిన అనంతరం పెళ్లిళ్లు, పిల్లలకు పాలు పట్టకపోవడం, ఊబకాయం వంటి కారణాలు రొమ్ము కేన్సర్‌కు దారితీస్తుంటాయి. ఇలాంటి మహిళలు ముందస్తు జాగ్రత్తలను పాటించాలి. – ఎంజీ నాగకిశోర్, సర్జికల్ అంకాలజిస్ట్, గుంటూరు
Comments
Please login to add a commentAdd a comment