Cancer screening
-
కేన్సర్ కొమ్ము వంచేలా!
సాక్షి, అమరావతి: మహిళల్లో చాపకింద నీరులా కమ్ముకొస్తున్న బ్రెస్ట్ (రొమ్ము) కేన్సర్ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. దీనిపై అవగాహన లేకపోవడంతో మహిళల్లో కొందరు ఈ కేన్సర్ బారినపడుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు. ఈ వ్యాధి సోకిన వారిలో దాదాపు 60 శాతం మంది వ్యాధి ముదిరిన తర్వాతే వైద్యుల వద్దకు పరుగు తీస్తున్నారు. ఈ పరిస్థితిని గుర్తించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం గ్రామస్థాయిలో కేన్సర్ స్క్రీనింగ్ ప్రారంభించింది. ప్రభుత్వాస్పత్రుల్లో రొమ్ము కేన్సర్ నిర్థారణ సదుపాయాలను మెరుగుపరిచింది. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద కేన్సర్ బాధితులందరికీ ఉచితంగా వైద్యసేవలు అందిస్తోంది. ఏఎన్ఎంలు, సీహెచ్‌వోలు, ఫ్యామిలీ డాక్టర్ల ద్వారా ఈ జబ్బు లక్షణాలతోపాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మహిళల్లో అవగాహన కల్పిస్తున్నారు. దేశవ్యాప్తంగా పెరుగుతున్న బాధితులు దేశంలో ఏటా రెండు లక్షల మందికి పైగా మహిళలు రొమ్ము కేన్సర్ బారిన పడుతున్నారు. ఈ విషయాన్ని ఇటీవల కేంద్ర ఆరోగ్య శాఖ లోక్‌సభలో వెల్లడించింది. నేషనల్ కేన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్ గణాంకాల ప్రకారం 2019 నుంచి 2023 మధ్య దేశంలో 8,37,935 మంది మహిళలు రొమ్ము కాన్సర్ బారినపడ్డట్టు వెల్లడైంది. వీరిలో 3.92 లక్షల మంది బాధిత మహిళలు మృత్యువాత పడ్డారు. గత ఏడాదిలోనే దేశంలో 2,21,579 మంది మహిళల్లో ఈ జబ్బు కొత్తగా నిర్థారణ కాగా.. 82,429 మంది మరణించినట్టు గణాంకాలు చెబుతున్నాయి. 2023లో దేశంలోనే అత్యధికంగా యూపీలో 30,781, తమిళనాడులో 15,931, బిహార్‌లో 15,555 చొప్పున కొత్త కేసులు వెలుగు చూశాయి. ఇదిలా ఉండగా ఏపీలో 11,921 కేసులు గత ఏడాది నమోదయ్యాయి. పక్కనున్న కర్ణాటకలో 14,484, తెలంగాణలో 8,066, కేరళలో 8,874 చొప్పున కొత్త కేసులు వెలుగు చూశాయి. రాష్ట్రంలోని పరిస్థితులను గమనించిన ప్రభుత్వం కేన్సర్‌ను తొలి దశలోనే గుర్తించి తక్షణ చికిత్సలు చేయించడం ద్వారా కేన్సర్ నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. 2 జిల్లాల్లో పైలెట్ కార్యక్రమం కేన్సర్ నియంత్రణ చర్యల్లో భాగంగా పెద్దఎత్తున స్క్రీనింగ్ చేపట్టి ప్రారంభ దశలోనే వ్యాధిని గుర్తించి చికిత్సలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా మరణాలను అరికట్టేలా ప్రణాళికలు రచించాం. ఇప్పటికే కేన్సర్ స్క్రీనింగ్ పైలట్ కార్యక్రమం అనకాపల్లి, తిరుపతి జిల్లాల్లో అమలవుతోంది. భవిష్యత్‌లో రాష్ట్రవ్యాప్తంగా స్క్రీనింగ్ కార్యక్రమాన్ని ప్రభుత్వం విస్తరించబోతోంది. – ఆర్.రమేశ్‌బాబు, నోడల్ అధికారి రాష్ట్ర కేన్సర్ నియంత్రణ కార్యక్రమం క్రమం తప్పకుండా స్క్రీనింగ్ చేయించుకోవాలి కుటుంబంలో ఎవరికైనా రొమ్ము కేన్సర్ ఉంటే ఆ కుటుంబంలోని మహిళలు 20 ఏళ్ల వయసు నుంచే స్వయంగా రొమ్ములను పరీక్షించుకోవాలి. క్రమం తప్పకుండా స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి. ఇలా చేయడం ద్వారా కేన్సర్ కణితిని ప్రారంభ దశలోనే గుర్తించడానికి వీలుంటుంది. రొమ్ము పరిమాణంలో మార్పులు, చెయ్యి పెట్టినప్పుడు గడ్డ స్పష్టంగా తగలడం, నొప్పి కలగడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. వయసు మళ్లిన అనంతరం పెళ్లిళ్లు, పిల్లలకు పాలు పట్టకపోవడం, ఊబకాయం వంటి కారణాలు రొమ్ము కేన్సర్‌కు దారితీస్తుంటాయి. ఇలాంటి మహిళలు ముందస్తు జాగ్రత్తలను పాటించాలి. – ఎంజీ నాగకిశోర్, సర్జికల్ అంకాలజిస్ట్, గుంటూరు -
చిరంజీవి గొప్ప మనసు.. ఉచిత కేన్సర్ స్క్రీనింగ్ టెస్టులు ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: సినీ కార్మికులు, సినీ జర్నలిస్టులు, ప్రజల కోసం ఉచిత కేన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని మెగాస్టార్ చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్–స్టార్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఆదివారం(జూలై 9) నగరంలో ప్రారంభించారు. చిరంజీవి బ్లడ్ అండ్ ఐ బ్యాంక్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో దాదాపు 2000 మంది రిజిస్టర్ చేసుకున్నారు. తొలుత మూడు నగరాల్లో స్క్రీనింగ్ క్యాంపులు నిర్వహించనున్నట్టు గతంలో చిరంజీవి ప్రకటించగా మొదటి శిబిరం ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. జూలై 16న విశాఖపట్నం.. జూలై 23న కరీంనగర్ లో ఈ శిబిరాల్ని నిర్వహిస్తారు. ఈ శిబిరాల్లో పాల్గొనే వారికి ఎలాంటి ఖర్చు లేకుండా కేన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు. కార్యక్రమంలో మెగా బ్రదర్ నాగబాబు, స్టార్ హాస్పిటల్ వైద్యులు గోపీచంద్, డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కాశీ విశ్వనాథ్, ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ కుమార్, వి.ఎన్. ఆదిత్య పాల్గొన్నారు. చికిత్సలో కూడా రాయితీ అందేలా కృషి: నాగబాబు సినీనటుడు నాగబాబు మాట్లాడుతూ.. ఇప్పటివరకు రక్తదానం, నేత్రదానం మీద అవగాహన పెంచామని, ఇప్పుడు కేన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేస్తూ ముందుగానే కేన్సర్‌ను అరికట్టేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఇందుకు సహకరించిన డాక్టర్ గోపీచంద్ కి కృతజ్ఞతలు తెలిపారు. కేన్సర్ చికిత్సలో కూడా మెగాస్టార్ చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రాయితీ అందేలా కృషి చేస్తామని నాగబాబు హామీనిచ్చారు. స్టార్ హాస్పిటల్ వైద్యులు గోపీచంద్ మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాలలో సుమారు 20 ప్రాంతాలలో ఇలాంటి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తామని, దానికి మెగాస్టార్ చిరంజీవి అండగా ఉంటామని హామీ ఇచ్చారని చెప్పారు. చదవండి: ఈ వారం రిలీజయ్యే సినిమాలివే! జవాన్ ప్రివ్యూ.. గూస్బంప్స్ పక్కా -
రోజుకు వెయ్యిమందికి క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్: చిరంజీవి
మెగా అభిమానులు, సినీ కార్మికులకు చిరంజీవి బ్లడ్ బ్యాంకులో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయిస్తామని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. షెడ్యూల్ ప్రకారం సినీ కార్మికులకు ఈ స్క్రీనింగ్ చేయిస్తామని తెలిపారు. శుక్రవారం నాడు చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చిరంజీవి మాట్లాడుతూ.. స్టార్ క్యాన్సర్ సెంటర్, చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా క్యాన్సర్ స్క్రీనింగ్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నాడు. జూలై 9 నుంచి రోజుకు వెయ్యి మందికి క్యాన్సర్ పరీక్షలు చేయించనున్నట్లు తెలిపాడు. సినీ కార్మికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చిరంజీవి కోరాడు. చదవండి: ఆ మాస్ సినిమాలన్నీ ఒకే నెలలో! -
గ్యాస్ట్రో కౌన్సెలింగ్
నాన్నకు పెద్దపేగు క్యాన్సర్... నాకూ వస్తుందా? నా వయసు 40 ఏళ్లు. గృహిణిని. మా నాన్న పెద్దపేగు క్యాన్సర్‌తో చనిపోయారు. ఈ క్యాన్సర్ వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉందా? అలాగైతే ముందే గుర్తించే అవకాశాలు ఏవైనా ఉన్నాయా? - వర్ధని, మంచిర్యాల పెద్దపేగుకు వచ్చే క్యాన్సర్ విషయంలో వంశపారంపర్యంగా వచ్చే అవకాశాలు ఒకింత ఎక్కువే. కాబట్టి మీరు ముందునుంచే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మీకు ప్రస్తుతం క్యాన్సర్ లక్షణాలు లేనప్పటికీ ఒకసారి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోండి. క్యాన్సర్ లక్షణాలు బయటపడకముందే క్యాన్సర్‌ను గుర్తించడాన్ని స్క్రీనింగ్ అంటారు. పెద్దపేగుల క్యాన్సర్‌ను కొలనోస్కోపీ అనే పరీక్ష ద్వారా గుర్తించవచ్చు. కాబట్టి మీరు ఒకసారి కొలనోస్కోపీ చేయించుకోండి. అది నార్మల్‌గా ఉంటే మీరు భయపడాల్సిన అవవసరం లేదు. మళ్లీ పదేళ్ల తర్వాత మరోసారి స్క్రీనింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ జాగ్రత్తలు తీసుకుంటే క్యాన్సర్‌ను ప్రాథమిక దశలోనే గుర్తించవచ్చు. నా వయసు 30 ఏళ్లు. ఒక నెల క్రితం కడుపులో నొప్పి వస్తే డాక్టర్ దగ్గరకు వెళ్లాను. అక్యూట్ పాంక్రియాటైటిస్ వల్ల నొప్పి వచ్చిందని చెప్పారు. మందులు వాడితే తాత్కాలికంగా నొప్పి తగ్గింది. వారం రోజుల నుంచి మళ్లీ నొప్పి వస్తోంది. నా ఈ సమస్య మందులతో తగ్గుతుందా? - ఎస్.ఆర్.సీహెచ్.ఆర్, కందుకూరు మీరు తెలిపిన వివరాల ప్రకారం అక్యూట్ పాంక్రియాటైటిస్ అనేది ఆల్కహాల్ తీసుకోవడం వల్లగానీ, పిత్తాశయంలో రాళ్లు ఉన్నప్పుడు గానీ వస్తుంది. మరి మీకు ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉందా, లేదా అన్న విషయాన్ని మీరు రాయలేదు. పిత్తాశయంలో రాళ్లు ఉన్నాయా అన్న విషయాన్ని కూడా తెలపలేదు. కొంతకాలం నొప్పి తగ్గి, మళ్లీ రావడం మొదలైంది అని అంటున్నారు. అంటే అక్యూట్ పాంక్రియాటైటిస్ వల్ల వచ్చే ఇతర కాంప్లికేషన్స్ వల్ల ఈ నొప్పి వస్తుండవచ్చు. పాంక్రియాటైటిస్ ద్వారా సూడోసిస్ట్ వచ్చే అవకాశం ఉంది. ఒకసారి మీరు అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్ష చేయించుకోవడం వల్ల దీన్ని తెలుసుకోవచ్చు. ఒకవేళ మీకు ఆల్కహాల్ అలవాటు ఉన్నట్లయితే వెంటనే మానేయండి. లేకపోతే మళ్లీ మళ్లీ నొప్పి వచ్చే అవకాశం ఉంది. పాంక్రియాస్ పూర్తిగా దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఆల్కహాల్ పూర్తిగా మానేయండి. డాక్టర్‌ను కలిసి తగిన చికిత్స తీసుకోండి. డాక్టర్ పి. భవానీ రాజు కన్సల్టెంట్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్