నాన్నకు పెద్దపేగు క్యాన్సర్... నాకూ వస్తుందా?
నా వయసు 40 ఏళ్లు. గృహిణిని. మా నాన్న పెద్దపేగు క్యాన్సర్‌తో చనిపోయారు. ఈ క్యాన్సర్ వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉందా? అలాగైతే ముందే గుర్తించే అవకాశాలు ఏవైనా ఉన్నాయా?
- వర్ధని, మంచిర్యాల
పెద్దపేగుకు వచ్చే క్యాన్సర్ విషయంలో వంశపారంపర్యంగా వచ్చే అవకాశాలు ఒకింత ఎక్కువే. కాబట్టి మీరు ముందునుంచే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మీకు ప్రస్తుతం క్యాన్సర్ లక్షణాలు లేనప్పటికీ ఒకసారి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోండి. క్యాన్సర్ లక్షణాలు బయటపడకముందే క్యాన్సర్‌ను గుర్తించడాన్ని స్క్రీనింగ్ అంటారు. పెద్దపేగుల క్యాన్సర్‌ను కొలనోస్కోపీ అనే పరీక్ష ద్వారా గుర్తించవచ్చు. కాబట్టి మీరు ఒకసారి కొలనోస్కోపీ చేయించుకోండి. అది నార్మల్‌గా ఉంటే మీరు భయపడాల్సిన అవవసరం లేదు. మళ్లీ పదేళ్ల తర్వాత మరోసారి స్క్రీనింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ జాగ్రత్తలు తీసుకుంటే క్యాన్సర్‌ను ప్రాథమిక దశలోనే గుర్తించవచ్చు.
నా వయసు 30 ఏళ్లు. ఒక నెల క్రితం కడుపులో నొప్పి వస్తే డాక్టర్ దగ్గరకు వెళ్లాను. అక్యూట్ పాంక్రియాటైటిస్ వల్ల నొప్పి వచ్చిందని చెప్పారు. మందులు వాడితే తాత్కాలికంగా నొప్పి తగ్గింది. వారం రోజుల నుంచి మళ్లీ నొప్పి వస్తోంది. నా ఈ సమస్య మందులతో తగ్గుతుందా?
- ఎస్.ఆర్.సీహెచ్.ఆర్, కందుకూరు
మీరు తెలిపిన వివరాల ప్రకారం అక్యూట్ పాంక్రియాటైటిస్ అనేది ఆల్కహాల్ తీసుకోవడం వల్లగానీ, పిత్తాశయంలో రాళ్లు ఉన్నప్పుడు గానీ వస్తుంది. మరి మీకు ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉందా, లేదా అన్న విషయాన్ని మీరు రాయలేదు. పిత్తాశయంలో రాళ్లు ఉన్నాయా అన్న విషయాన్ని కూడా తెలపలేదు. కొంతకాలం నొప్పి తగ్గి, మళ్లీ రావడం మొదలైంది అని అంటున్నారు. అంటే అక్యూట్ పాంక్రియాటైటిస్ వల్ల వచ్చే ఇతర కాంప్లికేషన్స్ వల్ల ఈ నొప్పి వస్తుండవచ్చు. పాంక్రియాటైటిస్ ద్వారా సూడోసిస్ట్ వచ్చే అవకాశం ఉంది. ఒకసారి మీరు అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్ష చేయించుకోవడం వల్ల దీన్ని తెలుసుకోవచ్చు. ఒకవేళ మీకు ఆల్కహాల్ అలవాటు ఉన్నట్లయితే వెంటనే మానేయండి. లేకపోతే మళ్లీ మళ్లీ నొప్పి వచ్చే అవకాశం ఉంది. పాంక్రియాస్ పూర్తిగా దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఆల్కహాల్ పూర్తిగా మానేయండి. డాక్టర్‌ను కలిసి తగిన చికిత్స తీసుకోండి.
డాక్టర్ పి. భవానీ రాజు
కన్సల్టెంట్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్,
కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్,
హైదరాబాద్
గ్యాస్ట్రో కౌన్సెలింగ్
Published Sun, Jul 12 2015 11:02 PM | Last Updated on Sun, Sep 3 2017 5:23 AM
Advertisement
Advertisement