Gall bladder
-
ఏకంగా 6110! కడుపా? రాళ్ల గుట్టా? డాక్టర్లే ఆశ్చర్యపోయిన వైనం
రాజస్థాన్‌లోని కోటాలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో అరుదైన సర్జరీ జరిగింది. 70 ఏళ్ల వ్యక్తి పిత్తాశయం (గాల్‌బ్లాడర్) నుండి ఒకటీ రెండూ కాదు ఏకంగా 6,110 రాళ్లను తొలగించడం ఇపుడు సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. బుండి జిల్లా పదంపురకు చెందిన ఒక పెద్దాయన కడుపు నొప్పి, గ్యాస్, ఉబ్బరం, వాంతులు వంటి లక్షణాలతో బాధపడేవారు. దాదాపు సంవత్సర కాలంగా చికిత్స తీసుకుంటున్నా, ఫలితంలేదు. దీంతో ఆయనకు చికిత్స చేస్తున్న వైద్యులు సర్జరీ చేయించుకోవాలని సూచించారు. ఇందులో భాగంగా అతనికి నిర్వహించిన స్కానింగ్‌లో అతిపెద్ద రాళ్లను గుర్తించారు. గ్లాల్ బ్లాడర్ సైజు సాధారంగా 7x4 సెంటీమీటర్లు ఉంటుంది. కానీ 12x4 సెం.మీకి పెరిగిపోయిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. దీంతో అతనికి సర్జరీ నిర్వహించి అతని ప్రాణాలను కాపాడారు.పిత్తాశయం పూర్తిగా రాళ్లతో నిండిపోయిందని, అదే అతని అసౌకర్యానికి ప్రధాన కారణమని లాపరోస్కోపిక్ సర్జన్ డాక్టర్ దినేష్ జిందాల్ తెలిపారు .ఎండో-బ్యాగ్‌ని ఉపయోగించి పిత్తాశయాన్ని తొలగించి, మరిన్ని వైద్య పరీక్షల నిమిత్తం పంపించామని చెప్పారు. సెప్టెంబర్ 5న జరిగిన ఈ ఆపరేషన్‌కు దాదాపు 30 -40 నిమిషాలు పట్టిందట. అంతేకాదు ఈ రాళ్లను లెక్కించేందుకు రెండున్నర గంటలు సమయం పెట్టింది. ఆపరేషన్ తర్వాత ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడని వైద్యులు తెలిపారు. పిత్తాశయంలో రాళ్లు ఎందుకు వస్తాయి?జీర్ణక్రియకు తోడ్పడేలా కాలేయం ఉత్పత్తి చేసే ద్రవం అయిన పిత్తాన్ని తయారు చేసే పదార్థాలలో అసమతుల్యత ఉన్నప్పుడు పిత్తాశయ రాళ్లు ఏర్పడతాయి. కాలేయం క్రింద ఉన్న చిన్న అవయవం పిత్తాశయంలో రాళ్లు సాధారణంగా కొలెస్ట్రాల్ లేదా బిలిరుబిన్ ఎక్కువైనపుడు రాళ్లు వస్తాయి. తయారవుతాయి. ఇవి ఇసుక రేణువులంత చిన్న పరిమాణం నుండి గోల్ఫ్ బాల్ అంత పెద్ద పరిమాణంలో ఏర్పడే అవకాశం ఉంది. ప్రధానంగా జన్యుపరమైన కారణాల వల్ల పిత్తాశయంలో చాలా రాళ్లు వస్తాయి. అతి వేగంగా బరువు తగ్గడం లేదా యో-యో డైటింగ్ కూడా ప్రమాదాన్ని పెంచుతుంది. అలాగే జీవనశైలి, ఆహార అలవాట్లు, అంటే ఫాస్ట్ ఫుడ్, ఫ్యాటీ ఫుడ్ , కొలెస్ట్రాల్ కొవ్వు అధికంగా ఉండే ఆహారం ప్రధాన కారణమని డాక్టర్ జిందాల్ అభిప్రాయపడ్డారు. వీటినిసకాలంలో గుర్తించి చికిత్స తీసుకోకపోతే ప్రమాదకరమైన కేన్సర్‌కు దారి తీయవచ్చని డాక్టర్ దినేష్ జిందాల్ తెలిపారు. -
మహిళ గాల్ బ్లాడర్‌లో 219 రాళ్లు
నరసరావుపేట (పల్నాడు జిల్లా): పట్టణంలోని మాతాశ్రీ హాస్పిటల్ వైద్యులు ఓ మహిళ పిత్తాశయం (గాల్ బ్లాడర్) నుంచి ఏకంగా 219 రాళ్లను వెలికితీశారు. హాస్పిటల్ డాక్టర్ పి.రామచంద్రారెడ్డి శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన 52 ఏళ్ల ఫాతిమా కడుపునొప్పితో తమను సంప్రదించిందన్నారు. హైప్రోస్కోపిక్ ద్వారా ఆమె పిత్తాశయంలో రాళ్లు ఉన్నట్లు గుర్తించామన్నారు. ఆమెకు ఈ నెల 20న ఆపరేషన్ చేసి 219 రాళ్లను వెలికితీశామన్నారు. సాధారణంగా 20 రాళ్లు ఉంటేనే కఠినతరంగా భావిస్తామని, ఏకంగా ఓ మహిళ గాల్ బ్లాడర్ నుంచి ఇన్ని రాళ్లను వెలికితీయటం బహుశా ఇదే మొదటిసారి కావొచ్చని పేర్కొన్నారు. ఆపరేషన్ అనంతరం ఆ మహిళ సురక్షితంగా ఇంటికి వెళ్లారన్నారు. -
పిత్తాశయంలో రాళ్లెందుకు వస్తాయి? పరిష్కారాలేమిటి?
Why Do Stones Form In Gallbladder: గాల్‌బ్లాడర్‌ను తెలుగులో పిత్తాశయం అంటారు. ఇది కాలేయం (లివర్)తో పాటు ఉండే కీలకమైన అవయవం. కొందరిలో పిత్తాశయంలో రాళ్లు వస్తాయి. ఇవి ఎందుకు వస్తాయో, అలా వచ్చినప్పుడు పరిష్కారాలేమిటో తెలుసుకుందాం. నిజానికి పైత్యరసం (బైల్ జ్యూస్) కాలేయంలోనే ఉత్పత్తి అవుతుంది. ఇలా లివర్‌లో పుట్టిన ఈ పైత్యరసాన్ని గాల్‌బ్లాడర్ నిల్వ ఉంచుతుంది. అక్కడి నుంచి బైల్ డక్ట్ అనే పైప్ ద్వారా చిన్న పేగుకు సరఫరా అయ్యేలా చూస్తుంది. అక్కడ కొవ్వులు జీర్ణం కావడం కోసం ఈ బైల్ జ్యూస్ ఉపయోగపడుతుంది. మనం తీసుకునే ఆహారంలో కొవ్వులూ, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే, వాటిని చిన్న చిన్న ముక్కలైపోయి జీర్ణమయ్యేలా ఈ బైల్‌జ్యూస్ చూస్తుంది. ఇలా జరిగే క్రమంలో ఒకవేళ ఆహారంలో కరగకుండా మిగిలిపోయిన కొవ్వులు ఉంటే... వాటిని గాల్‌బ్లాడర్ మళ్లీ స్వీకరించి, తనలో స్టోర్ చేసుకుంటుంది. కొన్నిసార్లు ఆ కొవ్వులు అక్కడే, అలాగే పేరుకుపోయే ప్రమాదం ఉంది. ఇవన్నీ ఒకేచోట పోగుబడి రాళ్లలా మారవచ్చు. ఇలా ఏర్పడే ఈ రాళ్లు పిత్తాశయం నిర్వహించే విధులకు ఆటంకంగా మారవచ్చు. అంటే బైల్‌జ్యూస్ స్రావాలకు అడ్డుపడే ప్రమాదం ఉందన్నమాట. ఇలా ఎందుకు జరుగుతుందంటే... మనం తీసుకునే ఆహారంలో ఎక్కువగా కొవ్వులు, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం అనేది మొదటి ప్రధాన కారణం. అలాగే మన జన్యువులు (జీన్స్), ఊబకాయం, పెయిన్‌కిల్లర్స్ ఎక్కువగా వాడటం, ప్రెగ్నెన్సీ రాకుండా మహిళలు వాడే పిల్స్ కూడా గాల్‌స్టోన్స్‌కు కొంతవరకు కారణాలే. డయాబెటిస్, జీర్ణ సమస్యలతో బాధపడేవాళ్లు ఈ గాల్‌బ్లాడర్ స్టోన్స్ సమస్యకు లోనయ్యే అవకాశాలు ఎక్కువ. ఇక్కడ గుర్తించాల్సిన అంశం ఏమిటంటే... కిడ్నీలో మాదిరిగా ఇవి పూర్తిగా రాళ్లలాంటివి కావు. ఆహారంలో కరగకుండా మిగిలిపోయిన చిన్న చిన్న ఘనపదార్థాలన్నీ ఒక ఉండగా మారి రాళ్లను తలపిస్తుంటాయి. కొందరిలో ఇవి పైత్యరసం ప్రవహించే డక్ట్ (పైత్యవాహిక)కు అడ్డు తగిలి నొప్పిని కలగజేయవచ్చు. మరికొందరిలో ఇవి ఏర్పడినా ఎలాంటి నొప్పీ ఉండకపోవచ్చు. అలా నొప్పి అనిపిస్తేగానీ... ఇవి ఏర్పడ్డ విషయం తెలియదు. కొందరిలో ఇంకేదైనా సమస్య కోసం వైద్య పరీక్షలు చేయించినప్పుడు ఈ సమస్య బయటపడవచ్చు. చికిత్స ఏమిటి? నిజానికి గాల్‌బ్లాడర్‌లో స్టోన్స్ వచ్చిన వాళ్లలో ఎలాంటి నొప్పీ లేకపోతే వారికి చికిత్స కూడా ఏమీ అవసరం లేదు. కానీ నొప్పి వచ్చినప్పుడు మాత్రం తప్పనిసరిగా శస్త్రచికిత్స చేసి వీటిని తొలగించాల్సి ఉంటుంది. మందులతో తగ్గడం జరగదు. నొప్పి తీవ్రంగా వచ్చేవారు డాక్టర్ సలహా మేరకు వీలైనంత త్వరగా శస్త్రచికిత్స చేయించుకోవడం అవసరం. అశ్రద్ధ చేస్తే గాల్‌బ్లాడర్‌లో ఇన్ఫెక్షన్ ఏర్పడటం, కామెర్లు (జాండిస్) రావడం, పాంక్రియాస్ వాపునకు గురికావడం లేదా కడుపులో తీవ్రమైన నొప్పి రావచ్చు. శస్త్రచికిత్స అవసరమనే నిర్ధారణ ఎలా? తొలుత నిర్వహించిన వైద్య పరీక్షల్లో పిత్తాశయంలో రాళ్లు ఉన్నాయని తెలిసినప్పుడు, మరోసారి అల్ట్రాసౌండ్ లేదా ఎమ్‌ఆర్‌సీపీ స్కాన్ చేసి లివర్, గాల్బ్లాడర్లలో వాటి తీరుతెన్నులను పరిశీలిస్తారు. అలాగే గాల్‌బ్లాడర్ పనితీరును తెలుసుకునేందుకు ‘హెచ్ఐడిఏ’ పరీక్షను కూడా చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు అందుబాటులో ఉన్న ఆధునిక వైద్య పరిజ్ఞానంతో చేసే శస్త్రచికిత్స ద్వారా ఈ సమస్యకు శాశ్వతమైన పరిష్కారాన్ని అందించవచ్చు. ఇది మేజర్ శస్త్రచికిత్స కూడా కాదు. కేవలం ఒక్కరోజు మాత్రమే ఆసుపత్రిలో ఉంటే చాలు. -డాక్టర్ భవానీరాజు, సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ -
భయానకం: గాల్బ్లాడరా.. రాళ్ల కుప్పనా..!
సాక్షి, నిర్మల్: మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనగతితో మానవ శరీరంలోని కిడ్నీల్లో ఒకట్రెండు రాళ్లు తయారుకావడం సహజమే. కానీ ఆమె గాల్‌బ్లాడర్‌లో ఏకంగా 20 వరకు రాళ్లు.. అవి కూడా 20మి.మీ. ఉండటం గమనార్హం. జిల్లాకేంద్రానికి చెందిన నస్రీన్ రెండేళ్లుగా తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్నారు. ఈ క్రమంలో చికిత్సకోసం నిర్మల్, నిజామాబాద్, హైదరాబాద్‌లతోపాటు మహారాష్ట్రలోని నాందేడ్ వరకూ వెళ్లారు. అనేక ప్రైవేటు ఆసుపత్రులు తిరిగారు. సమస్య మాత్రం తీరలేదు. చివరకు నిర్మల్ జిల్లాకేంద్రంలోనే దేవీబాయి ఆస్పత్రి వైద్యుడు అవినాశ్ కాసావార్‌ను కలిశారు. గాల్‌బ్లాడర్‌లో పెద్ద మొత్తంలో రాళ్లు ఉండటం వల్లే కడుపునొప్పి వస్తున్నట్లు ఆయన గుర్తించారు. ఈమేరకు శుక్రవారం ల్యాపరోస్కోపి విధానంలో ఆపరేషన్ చేయగా, ఆమె గాల్‌బ్లాడర్‌లో సుమారు 20రాళ్లు, ఒక్కో రాయి సైజు 20మి.మీ. ఉన్నవి బయటపడ్డాయి. ఇలాంటి అరుదైన ఆపరేషన్ జిల్లాలోనే తొలిసారిగా చేసినట్లు వైద్యుడు అవినాశ్ తెలిపారు. -
గ్యాస్ట్రో కౌన్సెలింగ్
నాన్నకు పెద్దపేగు క్యాన్సర్... నాకూ వస్తుందా? నా వయసు 40 ఏళ్లు. గృహిణిని. మా నాన్న పెద్దపేగు క్యాన్సర్‌తో చనిపోయారు. ఈ క్యాన్సర్ వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉందా? అలాగైతే ముందే గుర్తించే అవకాశాలు ఏవైనా ఉన్నాయా? - వర్ధని, మంచిర్యాల పెద్దపేగుకు వచ్చే క్యాన్సర్ విషయంలో వంశపారంపర్యంగా వచ్చే అవకాశాలు ఒకింత ఎక్కువే. కాబట్టి మీరు ముందునుంచే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మీకు ప్రస్తుతం క్యాన్సర్ లక్షణాలు లేనప్పటికీ ఒకసారి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోండి. క్యాన్సర్ లక్షణాలు బయటపడకముందే క్యాన్సర్‌ను గుర్తించడాన్ని స్క్రీనింగ్ అంటారు. పెద్దపేగుల క్యాన్సర్‌ను కొలనోస్కోపీ అనే పరీక్ష ద్వారా గుర్తించవచ్చు. కాబట్టి మీరు ఒకసారి కొలనోస్కోపీ చేయించుకోండి. అది నార్మల్‌గా ఉంటే మీరు భయపడాల్సిన అవవసరం లేదు. మళ్లీ పదేళ్ల తర్వాత మరోసారి స్క్రీనింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ జాగ్రత్తలు తీసుకుంటే క్యాన్సర్‌ను ప్రాథమిక దశలోనే గుర్తించవచ్చు. నా వయసు 30 ఏళ్లు. ఒక నెల క్రితం కడుపులో నొప్పి వస్తే డాక్టర్ దగ్గరకు వెళ్లాను. అక్యూట్ పాంక్రియాటైటిస్ వల్ల నొప్పి వచ్చిందని చెప్పారు. మందులు వాడితే తాత్కాలికంగా నొప్పి తగ్గింది. వారం రోజుల నుంచి మళ్లీ నొప్పి వస్తోంది. నా ఈ సమస్య మందులతో తగ్గుతుందా? - ఎస్.ఆర్.సీహెచ్.ఆర్, కందుకూరు మీరు తెలిపిన వివరాల ప్రకారం అక్యూట్ పాంక్రియాటైటిస్ అనేది ఆల్కహాల్ తీసుకోవడం వల్లగానీ, పిత్తాశయంలో రాళ్లు ఉన్నప్పుడు గానీ వస్తుంది. మరి మీకు ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉందా, లేదా అన్న విషయాన్ని మీరు రాయలేదు. పిత్తాశయంలో రాళ్లు ఉన్నాయా అన్న విషయాన్ని కూడా తెలపలేదు. కొంతకాలం నొప్పి తగ్గి, మళ్లీ రావడం మొదలైంది అని అంటున్నారు. అంటే అక్యూట్ పాంక్రియాటైటిస్ వల్ల వచ్చే ఇతర కాంప్లికేషన్స్ వల్ల ఈ నొప్పి వస్తుండవచ్చు. పాంక్రియాటైటిస్ ద్వారా సూడోసిస్ట్ వచ్చే అవకాశం ఉంది. ఒకసారి మీరు అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్ష చేయించుకోవడం వల్ల దీన్ని తెలుసుకోవచ్చు. ఒకవేళ మీకు ఆల్కహాల్ అలవాటు ఉన్నట్లయితే వెంటనే మానేయండి. లేకపోతే మళ్లీ మళ్లీ నొప్పి వచ్చే అవకాశం ఉంది. పాంక్రియాస్ పూర్తిగా దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఆల్కహాల్ పూర్తిగా మానేయండి. డాక్టర్‌ను కలిసి తగిన చికిత్స తీసుకోండి. డాక్టర్ పి. భవానీ రాజు కన్సల్టెంట్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్