Why Do Stones Form In Gallbladder: గాల్‌బ్లాడర్‌ను తెలుగులో పిత్తాశయం అంటారు. ఇది కాలేయం (లివర్)తో పాటు ఉండే కీలకమైన అవయవం. కొందరిలో పిత్తాశయంలో రాళ్లు వస్తాయి. ఇవి ఎందుకు వస్తాయో, అలా వచ్చినప్పుడు పరిష్కారాలేమిటో తెలుసుకుందాం. నిజానికి పైత్యరసం (బైల్ జ్యూస్) కాలేయంలోనే ఉత్పత్తి అవుతుంది. ఇలా లివర్‌లో పుట్టిన ఈ పైత్యరసాన్ని గాల్‌బ్లాడర్ నిల్వ ఉంచుతుంది. అక్కడి నుంచి బైల్ డక్ట్ అనే పైప్ ద్వారా చిన్న పేగుకు సరఫరా అయ్యేలా చూస్తుంది. అక్కడ కొవ్వులు జీర్ణం కావడం కోసం ఈ బైల్ జ్యూస్ ఉపయోగపడుతుంది.
మనం తీసుకునే ఆహారంలో కొవ్వులూ, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే, వాటిని చిన్న చిన్న ముక్కలైపోయి జీర్ణమయ్యేలా ఈ బైల్‌జ్యూస్ చూస్తుంది. ఇలా జరిగే క్రమంలో ఒకవేళ ఆహారంలో కరగకుండా మిగిలిపోయిన కొవ్వులు ఉంటే... వాటిని గాల్‌బ్లాడర్ మళ్లీ స్వీకరించి, తనలో స్టోర్ చేసుకుంటుంది. కొన్నిసార్లు ఆ కొవ్వులు అక్కడే, అలాగే పేరుకుపోయే ప్రమాదం ఉంది. ఇవన్నీ ఒకేచోట పోగుబడి రాళ్లలా మారవచ్చు. ఇలా ఏర్పడే ఈ రాళ్లు పిత్తాశయం నిర్వహించే విధులకు ఆటంకంగా మారవచ్చు. అంటే బైల్‌జ్యూస్ స్రావాలకు అడ్డుపడే ప్రమాదం ఉందన్నమాట.
ఇలా ఎందుకు జరుగుతుందంటే...
మనం తీసుకునే ఆహారంలో ఎక్కువగా కొవ్వులు, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం అనేది మొదటి ప్రధాన కారణం. అలాగే మన జన్యువులు (జీన్స్), ఊబకాయం, పెయిన్‌కిల్లర్స్ ఎక్కువగా వాడటం, ప్రెగ్నెన్సీ రాకుండా మహిళలు వాడే పిల్స్ కూడా గాల్‌స్టోన్స్‌కు కొంతవరకు కారణాలే. డయాబెటిస్, జీర్ణ సమస్యలతో బాధపడేవాళ్లు ఈ గాల్‌బ్లాడర్ స్టోన్స్ సమస్యకు లోనయ్యే అవకాశాలు ఎక్కువ.
ఇక్కడ గుర్తించాల్సిన అంశం ఏమిటంటే... కిడ్నీలో మాదిరిగా ఇవి పూర్తిగా రాళ్లలాంటివి కావు. ఆహారంలో కరగకుండా మిగిలిపోయిన చిన్న చిన్న ఘనపదార్థాలన్నీ ఒక ఉండగా మారి రాళ్లను తలపిస్తుంటాయి. కొందరిలో ఇవి పైత్యరసం ప్రవహించే డక్ట్ (పైత్యవాహిక)కు అడ్డు తగిలి నొప్పిని కలగజేయవచ్చు. మరికొందరిలో ఇవి ఏర్పడినా ఎలాంటి నొప్పీ ఉండకపోవచ్చు. అలా నొప్పి అనిపిస్తేగానీ... ఇవి ఏర్పడ్డ విషయం తెలియదు. కొందరిలో ఇంకేదైనా సమస్య కోసం వైద్య పరీక్షలు చేయించినప్పుడు ఈ సమస్య బయటపడవచ్చు.
చికిత్స ఏమిటి?
నిజానికి గాల్‌బ్లాడర్‌లో స్టోన్స్ వచ్చిన వాళ్లలో ఎలాంటి నొప్పీ లేకపోతే వారికి చికిత్స కూడా ఏమీ అవసరం లేదు. కానీ నొప్పి వచ్చినప్పుడు మాత్రం తప్పనిసరిగా శస్త్రచికిత్స చేసి వీటిని తొలగించాల్సి ఉంటుంది. మందులతో తగ్గడం జరగదు. నొప్పి తీవ్రంగా వచ్చేవారు డాక్టర్ సలహా మేరకు వీలైనంత త్వరగా శస్త్రచికిత్స చేయించుకోవడం అవసరం. అశ్రద్ధ చేస్తే గాల్‌బ్లాడర్‌లో ఇన్ఫెక్షన్ ఏర్పడటం, కామెర్లు (జాండిస్) రావడం, పాంక్రియాస్ వాపునకు గురికావడం లేదా కడుపులో తీవ్రమైన నొప్పి రావచ్చు.
శస్త్రచికిత్స అవసరమనే నిర్ధారణ ఎలా?
తొలుత నిర్వహించిన వైద్య పరీక్షల్లో పిత్తాశయంలో రాళ్లు ఉన్నాయని తెలిసినప్పుడు, మరోసారి అల్ట్రాసౌండ్ లేదా ఎమ్‌ఆర్‌సీపీ స్కాన్ చేసి లివర్, గాల్‌బ్లాడర్‌లలో వాటి తీరుతెన్నులను పరిశీలిస్తారు. అలాగే గాల్‌బ్లాడర్ పనితీరును తెలుసుకునేందుకు ‘హెచ్‌ఐడిఏ’ పరీక్షను కూడా చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు అందుబాటులో ఉన్న ఆధునిక వైద్య పరిజ్ఞానంతో చేసే శస్త్రచికిత్స ద్వారా ఈ సమస్యకు శాశ్వతమైన పరిష్కారాన్ని అందించవచ్చు. ఇది మేజర్ శస్త్రచికిత్స కూడా కాదు.
కేవలం ఒక్కరోజు మాత్రమే ఆసుపత్రిలో ఉంటే చాలు. -డాక్టర్ భవానీరాజు, సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్
Comments
Please login to add a commentAdd a comment