ఆస్పత్రి ఓపీ విభాగం ఎదుట ధర్నా నిర్వహిస్తున్న జూడాలు
హైదరాబాద్: తమకు రక్షణ కల్పించాలని కోరుతూ సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్లు బుధవారం విధులు బహిష్కరించి ఆస్పత్రి ఓపీ విభాగం ఎదుట బైఠాయించి ఆందోళన, ధర్నా నిర్వహించారు. ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రక్షణపై స్పష్టమైన చర్యలు చేపట్టకుంటే గురువారం మధ్యాహ్నం 2 గంటల నుంచి అత్యవసర వైద్యసేవలను బహిష్కరిస్తామని జూడాలు హెచ్చరించారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే సీతాఫల్‌మండి రవీంద్రనగర్‌కు చెందిన చిన్నారి తరుణ్ మృతి చెందాడని ఆరోపిస్తూ పీఐసీయూ అద్దాలు ధ్వంసం చేయడంతోపాటు అక్కడ విధులు నిర్వహిస్తున్న జూనియర్ వైద్యుడు కార్తీక్‌పై మంగళవారం మృతుడి బంధువులు దాడి చేసిన సంగతి విదితమే. దీంతో తమకు రక్షణ కల్పించాలన్న డిమాండ్‌తో మంగళవారం రాత్రి నుంచి విధులు బహిష్కరించిన జూడాలు బుధవారం తమ ఆందోళన కొనసాగించారు.
ఆస్పత్రి ఓపీ విభాగం ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు. ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించేందుకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నార్త్‌జోన్ డీసీపీ కల్మేశ్వర్ సింగన్‌వార్, గోపాలపురం ఏసీపీ శ్రీనివాసరావు, చిలకలగూడ సీఐ బాలగంగిరెడ్డి, డీఐ నర్సింహరాజులు జూడాలతో చర్చలు జరపడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. శాంతియుతంగా ర్యాలీ నిర్వహించేందుకు అనుమతి ఇవ్వడంతో జూడాలు ఆస్పత్రి నుంచి ముషీరాబాద్ చౌరస్తా వరకు ర్యాలీగా వెళ్లి పద్మారావు నగర్ మీదుగా ఆస్పత్రి ప్రాంగణంలోకి చేరుకున్నారు.
స్పందించకుంటే సేవలు నిలిపివేస్తాం
ఆస్పత్రిలో విధులు నిర్వహించే వైద్యులు, జూడాలు, సిబ్బందికి సరైన రక్షణ లేకపోవడంతో తరచూ దాడులు జరుగుతున్నాయని, ప్రభుత్వం తమకు రక్షణ కల్పించేందుకు తగిన చర్యలు చేపట్టాలని జూడాల సంఘం ప్రతినిధులు సంజయ్, శాంతికుమార్, లోహిత్, అర్జున్‌లు డిమాండ్ చేశారు. గురువారం మధ్యాహ్నం 2 లోగా వైద్య శాఖ మంత్రి స్వయంగా గాంధీ ఆస్పత్రికి వచ్చి జరిగిన ఘటనపై ఆరా తీయాలని, రక్షణ చర్యలను వివరించి స్పష్టమైన లిఖితపూర్వక హామీ ఇవ్వాలని కోరారు. లేకుంటే గురువారం మధ్యాహ్నం 2 గంటల తర్వాత నుంచి సాధారణ విధులతోపాటు అత్యవసర సేవలను బహిష్కరిస్తామని జూడాలు హెచ్చరించారు.
ఇబ్బందులకు గురైన రోగులు
జూడాల సమ్మెతో వైద్య సేవల్లో తీవ్ర జాప్యం నెలకొంది. దీంతో నిరుపేద రోగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అత్యవసర విభాగానికి వెళ్లే రహదారి మూసివేయడం, ఓపీ విభాగం వద్ద జూడాలు బైఠాయించడంతో వార్డుల్లోకి ఎలా వెళ్లాలో తెలియక రోగులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. రోగులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టామని ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రవణ్ కుమార్ తెలిపారు. డీఎంఈ రమేశ్‌రెడ్డి ఆస్పత్రి అధికారులు, పీఐసీయూ వైద్యులతో ప్రత్యేకంగా సమావేశమై పలు అంశాలపై చర్చించారు.
Comments
Please login to add a commentAdd a comment