Secunderabad Gandhi Hospital
-
గాంధీ ఆస్పత్రిలో సమ్మె విరమణ
సాక్షి, హైదరాబాద్: గాంధీ ఆస్పత్రిలో బుధవారం ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతో ప్రభుత్వం చేపట్టిన చర్చలు ఓ కొలిక్కి వచ్చాయి. నర్సులకు 17,500 నుంచి 25 వేల రూపాయల వేతనం ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. కరోనా డ్యూటీ చేస్తున్న వారికి డైలీ ఇన్సెంటివ్‌ల కింద రూ.750 ఇచ్చేందుకు సముఖత వ్యక్తం చేసింది. ఉద్యోగాలను అవుట్ సోర్సింగ్ నుంచి కాంట్రాక్టులోకి మార్చేందుకు ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చింది. నాల్గవ తరగతి ఉద్యోగులకు రోజుకు 300 రూపాయల ఇన్సెంటివ్ ఇవ్వడంతో పాటు ఇకపై వారికి 15 రోజులు మాత్రమే డ్యూటీ ఉంటుందని తెలిపింది. ఈ నేపథ్యంలో ఆందోళన విరమిస్తున్నట్లు నర్సులు ప్రకటించారు. (గాంధీలో నిరవధిక సమ్మె) చదవండి: ప్రైవేటు ఆసుపత్రుల ఇష్టారాజ్యం -
నేటి నుంచి గాంధీలో నిరవధిక సమ్మె
గాంధీ ఆస్పత్రి: కోవిడ్–19 నోడల్ కేంద్రమైన సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి నిరసన సెగ తగిలింది. ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ సిబ్బంది తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ మంగళవారం విధులు బహిష్కరించి ఆందోళన బాట పట్టడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయినా ప్రభుత్వం, వైద్య ఉన్నతాధికారులు స్పందించకపోవడంతో బుధవారం నుంచి నిరవధిక సమ్మె చేపట్టాలని కార్మిక సంఘాలు సీఐటీయూ, ఐఎన్టీయూసీ, బీఎంఎస్, ఏఐటీయూసీ ప్రతినిధులతోపాటు గాంధీ సిబ్బంది జేఏసీ నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం రాత్రి గాంధీ ఆస్పత్రి ప్రాంగణంలో సమావేశం నిర్వహించి నిరవధిక సమ్మె చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగాల రెగ్యులరైజ్ ప్రధాన డిమాండ్‌తో పాటు సమాన పనికి సమాన వేతనం నినాదంతో ఉద్యమ కార్యాచరణ చేపట్టాలని తీర్మానించారు. ఇదిలాఉండగా మంగళవారం ఉదయం నుంచి ఆందోళనకారులు ఆస్పత్రి ఎదుట ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. దీంతో ఆస్పత్రి లోపల, బయట తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. తమను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న 212 మంది నర్సింగ్ సిబ్బంది గత 5 రోజులుగా విధులు బహిష్కరించి ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. మమ్మల్ని పట్టించుకోవట్లేదు..: ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలనే ప్రధాన డిమాండ్‌తో పాటు రూ.34 వేల వేతనం, ఇన్సెంటివ్స్, బీమా సౌకర్యం కల్పించాలని గత ఐదు రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని కాంట్రాక్టు నర్సింగ్ యూనియన్ ప్రతినిధులు సుజాతరెడ్డి, మేఘమాల, ఇందిర, సరళ, మధులతలు ఆవేదన వ్యక్తం చేశారు. డిమాండ్లు పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు. ‘నాల్గవ తరగతి ఉద్యోగులను, 300 ఓసీఎస్ సిబ్బందిని రెగ్యులరైజ్ చేయాలి. వారికి ఉద్యోగ భద్రత కల్పించాలి. ప్రభుత్వమే నేరుగా వేతనాలు చెల్లించాలి. పారిశుధ్య, సెక్యూరిటీ, పేషెంట్ కేర్ టేకర్ల వేతనాలు రూ.20 వేలకు పెంచాలి’అని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని ఐఎన్టీయూసీ గాంధీ యూనిట్ అధ్యక్షుడు శివకుమార్ స్పష్టం చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టామని ఆస్పత్రి అధికారులు తెలిపారు. కాగా, నిరవధిక సమ్మె విషయం తన దృష్టికి రాలేదని గాంధీ సూపరింటెండెంట్ ప్రొఫెసర్ రాజారావు తెలిపారు. బెడ్లపైనే మృతదేహాలు.. డిమాండ్లు నెరవేర్చాలంటూ ఆస్పత్రిలో పనిచేస్తున్న నాల్గవ తరగతి ఉద్యోగులు, వార్డు బాయ్స్, సెక్యూరిటీ గార్డులు, పారిశుధ్య కార్మికులు, పేషెంట్ కేర్ టేకర్లు మంగళవారం మూకుమ్మడిగా విధులు బహిష్కరించడంతో చికిత్స పొందుతున్న సుమారు 900 మంది కరోనా బాధితులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వార్డుల్లో పారిశుధ్య లోపంతో తీవ్ర దుర్వాసనల మధ్య వైద్యులు విధులు నిర్వహించారు. చికిత్స పొందుతూ మరణించిన రోగుల మృతదేహాలను మార్చురీకి తరలించేందుకు అవకాశం లేకపోవడంతో గంటల తరబడి బెడ్లపైనే పడున్నాయి. -
గాంధీ ఆస్పత్రికి వరాల జల్లు
హైదరాబాద్: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని వైద్య ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. దీనికి అవసరమైన మౌలిక వసతుల కల్పనకు కార్యాచరణ సిద్ధం చేసి అమలు చేస్తామన్నారు. గాంధీ ఆస్పత్రి పాలనా యంత్రాంగం, టీఎస్ఎంఎస్ఐడీసీ అధికారులతో నిర్వహించిన సమీక్షలో మంత్రి ఈటల వరాల జల్లు కురిపించారు. వైద్యులు, నర్సింగ్ సిబ్బంది కొరతను అధిగమించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తా మని తెలిపారు. పారామెడికల్ సిబ్బంది, టెక్నీషియన్లతోపాటు అవసరమైన మ్యాన్‌పవర్‌ను కాంట్రాక్టు పద్ధతిన తీసుకోవాలని, దీనికి అవసరమైన జీవోలను రూపొందిస్తామని హామీ ఇచ్చారు. వెంటిలేటర్లు, మోనిటర్లు, వీల్చైర్లు, స్ట్రెచర్లను కొనుగోలు చేయాలని టీఎస్ఎంఎస్ఐడీసీ అధికారులను ఆదేశించారు. ఎమ్మారై, సీటీ, క్యాత్‌ల్యాబ్‌తోపాటు పలు వైద్యపరికరాల కొనుగోలుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఈటల సూచించారు. డ్రైనేజీ సమస్య పరిష్కారానికి కమిటీ.. గాంధీ ఆస్పత్రిలో ప్రధానమైన డ్రైనేజీ సమస్యను పరిష్కరించేందుకు ముంబైకి చెందిన నిపుణుల కమిటీతో అధ్యయనం చేయిస్తానని మంత్రి ఈటల హామీ ఇచ్చారు. గాంధీ ఆస్పత్రిలో పడకల సంఖ్యను 2 వేలకు పెంచాలని ఆస్పత్రి యంత్రాంగం కోరగా, మంత్రి ఈటల సానుకూలంగా స్పందించారు. దశలవారీగా పడకల సంఖ్యను పెంచేందుకు కృషి చేస్తానని, దీనికి సంబంధించిన ఫైల్ ప్రభుత్వం వద్ద ఉందని వివరించారు. -
గాంధీలో కొనసాగుతున్న జూడాల ఆందోళన
హైదరాబాద్: తమకు రక్షణ కల్పించాలని కోరుతూ సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్లు బుధవారం విధులు బహిష్కరించి ఆస్పత్రి ఓపీ విభాగం ఎదుట బైఠాయించి ఆందోళన, ధర్నా నిర్వహించారు. ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రక్షణపై స్పష్టమైన చర్యలు చేపట్టకుంటే గురువారం మధ్యాహ్నం 2 గంటల నుంచి అత్యవసర వైద్యసేవలను బహిష్కరిస్తామని జూడాలు హెచ్చరించారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే సీతాఫల్మండి రవీంద్రనగర్‌కు చెందిన చిన్నారి తరుణ్ మృతి చెందాడని ఆరోపిస్తూ పీఐసీయూ అద్దాలు ధ్వంసం చేయడంతోపాటు అక్కడ విధులు నిర్వహిస్తున్న జూనియర్ వైద్యుడు కార్తీక్‌పై మంగళవారం మృతుడి బంధువులు దాడి చేసిన సంగతి విదితమే. దీంతో తమకు రక్షణ కల్పించాలన్న డిమాండ్‌తో మంగళవారం రాత్రి నుంచి విధులు బహిష్కరించిన జూడాలు బుధవారం తమ ఆందోళన కొనసాగించారు. ఆస్పత్రి ఓపీ విభాగం ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు. ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించేందుకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నార్త్‌జోన్ డీసీపీ కల్మేశ్వర్ సింగన్వార్, గోపాలపురం ఏసీపీ శ్రీనివాసరావు, చిలకలగూడ సీఐ బాలగంగిరెడ్డి, డీఐ నర్సింహరాజులు జూడాలతో చర్చలు జరపడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. శాంతియుతంగా ర్యాలీ నిర్వహించేందుకు అనుమతి ఇవ్వడంతో జూడాలు ఆస్పత్రి నుంచి ముషీరాబాద్ చౌరస్తా వరకు ర్యాలీగా వెళ్లి పద్మారావు నగర్ మీదుగా ఆస్పత్రి ప్రాంగణంలోకి చేరుకున్నారు. స్పందించకుంటే సేవలు నిలిపివేస్తాం ఆస్పత్రిలో విధులు నిర్వహించే వైద్యులు, జూడాలు, సిబ్బందికి సరైన రక్షణ లేకపోవడంతో తరచూ దాడులు జరుగుతున్నాయని, ప్రభుత్వం తమకు రక్షణ కల్పించేందుకు తగిన చర్యలు చేపట్టాలని జూడాల సంఘం ప్రతినిధులు సంజయ్, శాంతికుమార్, లోహిత్, అర్జున్‌లు డిమాండ్ చేశారు. గురువారం మధ్యాహ్నం 2 లోగా వైద్య శాఖ మంత్రి స్వయంగా గాంధీ ఆస్పత్రికి వచ్చి జరిగిన ఘటనపై ఆరా తీయాలని, రక్షణ చర్యలను వివరించి స్పష్టమైన లిఖితపూర్వక హామీ ఇవ్వాలని కోరారు. లేకుంటే గురువారం మధ్యాహ్నం 2 గంటల తర్వాత నుంచి సాధారణ విధులతోపాటు అత్యవసర సేవలను బహిష్కరిస్తామని జూడాలు హెచ్చరించారు. ఇబ్బందులకు గురైన రోగులు జూడాల సమ్మెతో వైద్య సేవల్లో తీవ్ర జాప్యం నెలకొంది. దీంతో నిరుపేద రోగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అత్యవసర విభాగానికి వెళ్లే రహదారి మూసివేయడం, ఓపీ విభాగం వద్ద జూడాలు బైఠాయించడంతో వార్డుల్లోకి ఎలా వెళ్లాలో తెలియక రోగులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. రోగులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టామని ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రవణ్ కుమార్ తెలిపారు. డీఎంఈ రమేశ్‌రెడ్డి ఆస్పత్రి అధికారులు, పీఐసీయూ వైద్యులతో ప్రత్యేకంగా సమావేశమై పలు అంశాలపై చర్చించారు. -
‘గాంధీ’లో అంతే!
►నిర్లక్ష్యం వీడని గాంధీ ఆస్పత్రి సిబ్బంది ►ఎమ్మెల్యే సతీమణికి సైతం ఇబ్బందులే.. ►స్వయంగా వీల్‌చైర్‌ను తీసుకెళ్లాల్సిన పరిస్థితి.. గాంధీ ఆస్పత్రి : సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో కింది స్థాయి సిబ్బంది నిర్లక్ష్యం..బాధ్యతారాహిత్యం కారణంగా అధికార పార్టీ ఎమ్మెల్యే సతీమణి సైతం తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఆస్పత్రి అధికారులు పరిస్థితిని చక్కదిద్దారు. వివరాలిలా ఉన్నాయి.. దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి భార్య సుజాత నరాల బలహీనతతో బాధపడుతున్న తన అక్క కుమారుడు భాస్కర్‌రెడ్డిని మంగళవారం గాంధీ ఆస్పత్రికి తీసుకువచ్చారు. అత్యవసర విభాగానికి వెళ్లాల్సిన వీరు..అవుట్ పేషెంట్ విభాగానికి వెళ్లి అక్కడ ఉన్న వీల్‌చైర్‌పై రోగి భాస్కర్‌రెడ్డిని కూర్చోబెట్టారు. అక్కడ సిబ్బంది ఎవ్వరూ కన్పించకపోవడంతో కొంతసేపు వేచి చూశారు. ఫలితం లేకపోవడంతో సుజాత స్వయంగా వీల్‌చైర్‌ను నెట్టుకుంటూ ఓపీ విభాగం లోపలికి వెళ్లారు. అయితే వెళ్లాల్సింది అత్యవసర విభాగానికని తెలుసుకుని అక్కడి నుంచి ఎమర్జెన్సీ విభాగం వద్దకు కూడా వీల్‌ఛైర్‌ను నెట్టుకుంటూ వెళ్లారు. విషయం ఆలస్యంగా తెలుసుకున్న ఆస్పత్రి అధికారులు స్పందించి...రోగిని అత్యవసర విభాగంలో అడ్మిట్ చేసి వైద్యసేవలు అందించారు. అనంతరం ఇన్‌పేషెంట్ విభాగం నాల్గవ అంతస్తులోని వార్డుకు తరలించారు. సమన్వయం లోపం వల్లే... సమన్వయం లోపంతో ఈ ఘటన జరిగినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రొఫెసర్ శ్రవణ్‌కుమార్ మీడియాకు వివరించారు. రోగిని తీసుకువస్తున్న విషయంపై తనకు ముందే సమాచారం ఉందని, నేరుగా ఎమర్జెన్సీ విభాగం వద్దకు రమ్మని చెప్పి, అక్కడ ఇద్దరు సిబ్బందిని ప్రత్యేకంగా నియమించామని, అయితే రోగిని తీసుకుని ఓపీ విభాగం వద్దకు వెళ్లడంతో సమస్య ఉత్పన్నం అయిందన్నారు. గాంధీ ఆస్పత్రి సిబ్బంది పనితీరు గతం కంటే ఎంతో మెరుగుపడిందని, ఎమర్జెన్సీ విభాగం వద్ద ఆరుగురు సిబ్బందిని వీల్ఛైర్లు, స్ట్రెచర్లతో నిరంతరం అందుబాటులో ఉంచామని శ్రవణ్‌కుమార్ స్పష్టం చేశారు. రోగిని వీల్ చైర్‌పై తీసుకువెళ్తున్న ఎమ్మెల్యే రామలింగారెడ్డి సతీమణి సుజాత -
గాంధీకి వాస్తు దోషమా?
గాంధీ ఆస్పత్రి: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఇటీవల తరచూ జరుగుతున్న ఘటనకు వాస్తు దోషమేనని ఆస్పత్రి పాలనయంత్రాంగం భావించింది. వాస్తు సిద్ధాంతులు, నిపుణుల సూచన మేరకు ఆస్పత్రి వెనుక వైపు పద్మారావునగర్ గేట్‌ను సోమవారం తెరిచారు. గాంధీ ఆస్పత్రిలో రాకపోకలు సాగించేందుకు మొత్తం ఆరు ప్రాంతా ల్లో ద్వారాలను ఏర్పాటు చేశారు. పద్మారావునగర్‌కు చెందిన కొంతమంది తమ వెంట కుక్కలను తెస్తూ ఆస్పత్రి పరిసర ప్రాంతాలను అపరిశుభ్రం చేయడం, ఈ మార్గాన్ని సురక్షితమైనదిగా భావించి అసాంఘిక శక్తులు తమ కార్యక్రమాలకు వినియోగించుకోవడం, ఈ ప్రాం తం రాత్రి సమయాల్లో అవాంఛనీయ ఘటలకు వేదికగా మారడంతో సుమారు మూడేళ్ల క్రితం పద్మారావునగర్ వైపు ఉన్న గేటును మూసివేశారు. గేటు తెరవాలని ఈ ప్రాంతవాసులతోపాటు సిబ్బంది కోరినా ఆస్పత్రి పాలనయంత్రాంగం ససేమిరా అంది. అయితే గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా శ్రవణ్‌కుమార్ నూతనంగా బాధ్యతలు చేపట్టడం, తరచూ ఘటనలు జరిగి గాంధీ ఆస్పత్రికి చెడ్డపేరు రావడంతో ఆస్పత్రి పాలనయంత్రాంగం వాస్తును నమ్ముకుంది. వాస్తు నిపుణుల సూచన మేరకు పద్మారావునగర్ వైపు గేటును తెరిచి రాకపోకలకు అనుమతించారు. -
‘గాంధీ’లో ఎలుకలు!
పట్టుకునేందుకు బోన్ల ఏర్పాటు గాంధీ ఆస్పత్రి : సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి పిడియాట్రిక్ వార్డులో శుక్రవారం ఎలుక కలకలం సృష్టించింది. వైద్యులు, సిబ్బంది, ఆస్పత్రి అధికారులకు ముచ్చెమటలు పట్టించింది. అప్పుటే పుట్టిన శిశువులకు వైద్యసేవలు అందించే విభాగంలో మూషికం కనిపించడంతో అంతా అప్రమత్తమయ్యారు. వివరాలు ఇలా ఉన్నాయి.... గాంధీ ఆస్పత్రి ప్రధాన భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్, మొదటి అంతస్థుల్లో పిడియాట్రిక్ వార్డు ఉంది. గ్రౌండ్ ఫ్లోర్‌లోని ఎస్ఎన్సీయూ విభాగంలోని స్టెప్‌డౌన్, అవుట్ బోర్న్, ఇన్‌బోర్న్ వార్డుల్లో అప్పుడే పుట్టిన శిశువులకు వైద్యసేవలు అందిస్తారు. శుక్రవారం ఉదయం విధులు నిర్వహిస్తున్న వైద్యులు, సిబ్బందికి స్టెప్‌డౌన్ వార్డులో ఎలుక, పందికొక్కులు కనిపించాయి. వాటిని పట్టుకునేందుకు సిబ్బంది యత్నించి విఫలమయ్యారు. వారిచ్చిన సమాచారంతో సంబంధిత వైద్యులు ఆస్పత్రి సూపరెంటెండెంట్‌ను కలిసి పరిస్థితిని వివరించారు. ఆయన రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ల (ఆర్ఎంఓ)తో సమావేశం నిర్వహించారు. ఇటీవల గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఎలుకల దాడిలో నవజాత శిశువు మృతిచెందిన సంగతి తెలిసిందే. గాంధీలో అటువంటి ఘటన పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎస్ఎన్సీయూ విభాగానికి ఆనుకొని ఉన్న చెట్ల కొమ్మల మీదుగా కిటికీలు, డ్రైనేజీ పైప్‌లలోంచి ఎలుకలు లోపలకు వస్తున్నట్ల గుర్తించారు. డ్రైనేజీ పైప్‌లైన్ వ్యవస్థ సరిగా లేకపోవడంతో సెల్లార్లో మురుగునీరు పొంగి ప్రవహిస్తోంది. దీంతో ఎలుకలు, పందికొక్కులు విపరీతంగా పెరిగినట్లు గుర్తించారు. ఎలుకలను పట్టుకునేందుకు బోన్లు, గమ్స్టిక్కర్లు ఏర్పాటు చేశారు. పిడియాట్రిక్ వార్డులో ఎలుక సంచరిస్తున్నట్లు సమాచారం అందిన వెంటనే తగిన చర్యలు చేపట్టామని... ఆస్పత్రిలోని పెస్ట్ కంట్రోల్ విభాగాన్ని అప్రమత్తం చేశామని గాంధీ సూపరెంటెండెంట్ వెంకటేశ్వర్లు తెలిపారు. -
సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రితో దారుణం!
హైదరాబాద్: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఓ దారుణం జరిగిపోయింది. అప్పుడే పుట్టిన ఆడ శిశువును బాత్ రూమ్‌లో వదిలేశారు. స్థానికులు చూసేసరికి శిశువు మరణించి వుంది. ఆస్పత్రి సిబ్బంది వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పుట్టిన శిశువు ఆడపిల్ల కావడంతో ఎవరైనా చంపేసి పడేశారా? లేక మృత శిశువును పడేశారా? అనేది తెలియడంలేదు. ప్రభుత్వ ఆస్పత్రిలో ఇటువంటి సంఘటన జరగడంపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ** -
హత్యా.. ఆత్మహత్యా.. ప్రమాదమా..?
భువనగిరి : రియల్టర్ సీస జయరాములు మృతిపై ఎన్నెన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యాదగిరిగుట్ట మండల కేంద్రంలో నివాసం ఉంటున్న జయరాములు ఆదివారం ఉదయం భువనగిరి మండలం వడాయిగూడెంలోని ఉన్న తన గెస్ట్‌హౌస్‌లో అనుమానాస్పదస్థితిలో మృతిచెందిన విషయం తెలిసిందే. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఆర్థిక లావాదేవీల విషయంలోనే హత్య జరిగి ఉంటుందని జయరాములు కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా ఆదివారం జయరాములు మృతదేహానికి భువనగిరి ఏరియా అస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అయితే పోస్టుమార్టం నిర్వహించిన డాక్టర్ మృతిచెందిన విషయాలను స్పష్టం చేయలేకపోవడంతో కుటుంబ సభ్యులు రీపోస్టుమార్టం నిర్వహించాలని భువనగిరి డీఎస్పీ ఎస్.శ్రీనివాస్‌పై ఒత్తిడితెచ్చారు. దీంతో మృతదేహానికి సికింద్రాబాద్ గాంధీ అస్పత్రిలో సోమవారం రెంవసారి పోస్టుమార్టం నిర్వహించారు. మరో రెండు రోజుల్లో నివేదిక రానుంది. కాగా మృతిచెందిన జయరాములు మృతిపై ఇప్పటికే పలు అనుమానాలు ఉన్నాయి. హత్య చేసి ఉంటారని ఒక వాదన బలంగా ఉండగా మరో వైపు ప్రమాదవశాత్తు బంగ్లాపై నుంచి పడి మృతి చెంది ఉంటాడా, లేక ఆత్మహత్య చేసుకుని ఉంటాడా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. వ్యాపారంలో ఆర్థిక ఇబ్బందులు తీవ్రం కావడంతో ఆయనతో లావాదేవీలు నిర్వహిస్తున్న వారు ఒత్తిడి తెచ్చి ఉంటారని ఈ నేపథ్యంలో ఆత్మహత్య చేసుకుని ఉంటాడని వాదన వినిపిస్తోంది. అయితే ఆయన సన్నిహితులు మాత్రం ఆత్మహత్య చేసుకునేంత పిరికి వాడు కాడని పేర్కొంటున్నారు. బంగ్లాపై నుంచి పడడం వెనక ఏదైన ప్రమాదం ఉందా, లేక తనకు తానేపడ్డాడా, ఎవరైనా తోసేసారా అని సందేహాలు వ్యవక్తమవుతున్నాయి. రియల్ ఎస్టెట్ వ్యాపారంలో ఉన్న డబ్బుల వివాదంలో కొందరు వారం పది రోజులుగా అయన గెస్ట్‌హౌస్‌లోనే ఉంటున్నారని, వారితో వివాదం ఉండడం వల్లే హత్య జరిగిందా అని చర్చించుకుంటున్నారు. విచారణ జరుపుతున్న పోలీసులు సైతం హత్యా, ఆత్మహత్య, ప్రమాదమా, లేక ఆరోగ్య సంబంధ సమస్యలతో చనిపోయారా అన్న కోణాల్లో విచారణ జరుపుతున్నారు. కాగా సోమవారం భువనగిరి డీఎస్పీ ఎస్, శ్రీనివాస్,ఇన్స్పెక్టర్ సతీష్‌రెడ్డి, రూరల్ ఎస్ఐ భిక్షపతిలు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీం రప్పించి ఆధారాలు సేకరించారు. ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.