‘గాంధీ’లో అంతే!
►నిర్లక్ష్యం వీడని గాంధీ ఆస్పత్రి సిబ్బంది
►ఎమ్మెల్యే సతీమణికి సైతం ఇబ్బందులే..
►స్వయంగా వీల్‌చైర్‌ను తీసుకెళ్లాల్సిన పరిస్థితి..
గాంధీ ఆస్పత్రి : సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో కింది స్థాయి సిబ్బంది నిర్లక్ష్యం..బాధ్యతారాహిత్యం కారణంగా అధికార పార్టీ ఎమ్మెల్యే సతీమణి సైతం తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఆస్పత్రి అధికారులు పరిస్థితిని చక్కదిద్దారు. వివరాలిలా ఉన్నాయి.. దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి భార్య సుజాత నరాల బలహీనతతో బాధపడుతున్న తన అక్క కుమారుడు భాస్కర్‌రెడ్డిని మంగళవారం గాంధీ ఆస్పత్రికి తీసుకువచ్చారు. అత్యవసర విభాగానికి వెళ్లాల్సిన వీరు..అవుట్ పేషెంట్ విభాగానికి వెళ్లి అక్కడ ఉన్న వీల్‌చైర్‌పై రోగి భాస్కర్‌రెడ్డిని కూర్చోబెట్టారు. అక్కడ సిబ్బంది ఎవ్వరూ కన్పించకపోవడంతో కొంతసేపు వేచి చూశారు. ఫలితం లేకపోవడంతో సుజాత స్వయంగా వీల్‌చైర్‌ను నెట్టుకుంటూ ఓపీ విభాగం లోపలికి వెళ్లారు. అయితే వెళ్లాల్సింది అత్యవసర విభాగానికని తెలుసుకుని అక్కడి నుంచి ఎమర్జెన్సీ విభాగం వద్దకు కూడా వీల్‌ఛైర్‌ను నెట్టుకుంటూ వెళ్లారు. విషయం ఆలస్యంగా తెలుసుకున్న ఆస్పత్రి అధికారులు స్పందించి...రోగిని అత్యవసర విభాగంలో అడ్మిట్ చేసి వైద్యసేవలు అందించారు. అనంతరం ఇన్‌పేషెంట్ విభాగం నాల్గవ అంతస్తులోని వార్డుకు తరలించారు.
సమన్వయం లోపం వల్లే...
సమన్వయం లోపంతో ఈ ఘటన జరిగినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రొఫెసర్ శ్రవణ్‌కుమార్ మీడియాకు వివరించారు. రోగిని తీసుకువస్తున్న విషయంపై తనకు ముందే సమాచారం ఉందని, నేరుగా ఎమర్జెన్సీ విభాగం వద్దకు రమ్మని చెప్పి, అక్కడ ఇద్దరు సిబ్బందిని ప్రత్యేకంగా నియమించామని, అయితే రోగిని తీసుకుని ఓపీ విభాగం వద్దకు వెళ్లడంతో సమస్య ఉత్పన్నం అయిందన్నారు. గాంధీ ఆస్పత్రి సిబ్బంది పనితీరు గతం కంటే ఎంతో మెరుగుపడిందని, ఎమర్జెన్సీ విభాగం వద్ద ఆరుగురు సిబ్బందిని వీల్‌ఛైర్లు, స్ట్రెచర్లతో నిరంతరం అందుబాటులో ఉంచామని శ్రవణ్‌కుమార్ స్పష్టం చేశారు.
రోగిని వీల్ చైర్‌పై తీసుకువెళ్తున్న ఎమ్మెల్యే రామలింగారెడ్డి సతీమణి సుజాత