అధికారులతో సమీక్షలో మంత్రి ఈటల
హైదరాబాద్: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని వైద్య ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. దీనికి అవసరమైన మౌలిక వసతుల కల్పనకు కార్యాచరణ సిద్ధం చేసి అమలు చేస్తామన్నారు. గాంధీ ఆస్పత్రి పాలనా యంత్రాంగం, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ అధికారులతో నిర్వహించిన సమీక్షలో మంత్రి ఈటల వరాల జల్లు కురిపించారు. వైద్యులు, నర్సింగ్ సిబ్బంది కొరతను అధిగమించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తా మని తెలిపారు.
పారామెడికల్ సిబ్బంది, టెక్నీషియన్లతోపాటు అవసరమైన మ్యాన్‌పవర్‌ను కాంట్రాక్టు పద్ధతిన తీసుకోవాలని, దీనికి అవసరమైన జీవోలను రూపొందిస్తామని హామీ ఇచ్చారు. వెంటిలేటర్లు, మోనిటర్లు, వీల్‌చైర్లు, స్ట్రెచర్లను కొనుగోలు చేయాలని టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ అధికారులను ఆదేశించారు. ఎమ్మారై, సీటీ, క్యాత్‌ల్యాబ్‌తోపాటు పలు వైద్యపరికరాల కొనుగోలుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఈటల సూచించారు.
డ్రైనేజీ సమస్య పరిష్కారానికి కమిటీ..
గాంధీ ఆస్పత్రిలో ప్రధానమైన డ్రైనేజీ సమస్యను పరిష్కరించేందుకు ముంబైకి చెందిన నిపుణుల కమిటీతో అధ్యయనం చేయిస్తానని మంత్రి ఈటల హామీ ఇచ్చారు. గాంధీ ఆస్పత్రిలో పడకల సంఖ్యను 2 వేలకు పెంచాలని ఆస్పత్రి యంత్రాంగం కోరగా, మంత్రి ఈటల సానుకూలంగా స్పందించారు. దశలవారీగా పడకల సంఖ్యను పెంచేందుకు కృషి చేస్తానని, దీనికి సంబంధించిన ఫైల్ ప్రభుత్వం వద్ద ఉందని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment