‘గాంధీ’లో ఎలుకలు!
పట్టుకునేందుకు బోన్ల ఏర్పాటు
గాంధీ ఆస్పత్రి : సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి పిడియాట్రిక్ వార్డులో శుక్రవారం ఎలుక కలకలం సృష్టించింది. వైద్యులు, సిబ్బంది, ఆస్పత్రి అధికారులకు ముచ్చెమటలు పట్టించింది. అప్పుటే పుట్టిన శిశువులకు వైద్యసేవలు అందించే విభాగంలో మూషికం కనిపించడంతో అంతా అప్రమత్తమయ్యారు. వివరాలు ఇలా ఉన్నాయి.... గాంధీ ఆస్పత్రి ప్రధాన భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్, మొదటి అంతస్థుల్లో పిడియాట్రిక్ వార్డు ఉంది. గ్రౌండ్ ఫ్లోర్‌లోని ఎస్‌ఎన్‌సీయూ విభాగంలోని స్టెప్‌డౌన్, అవుట్ బోర్న్, ఇన్‌బోర్న్ వార్డుల్లో అప్పుడే పుట్టిన శిశువులకు వైద్యసేవలు అందిస్తారు. శుక్రవారం ఉదయం విధులు నిర్వహిస్తున్న వైద్యులు, సిబ్బందికి స్టెప్‌డౌన్ వార్డులో ఎలుక, పందికొక్కులు కనిపించాయి.
వాటిని పట్టుకునేందుకు సిబ్బంది యత్నించి విఫలమయ్యారు. వారిచ్చిన సమాచారంతో సంబంధిత వైద్యులు ఆస్పత్రి సూపరెంటెండెంట్‌ను కలిసి పరిస్థితిని వివరించారు. ఆయన రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ల (ఆర్‌ఎంఓ)తో సమావేశం నిర్వహించారు. ఇటీవల గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఎలుకల దాడిలో నవజాత శిశువు మృతిచెందిన సంగతి తెలిసిందే. గాంధీలో అటువంటి ఘటన పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎస్‌ఎన్‌సీయూ విభాగానికి ఆనుకొని ఉన్న చెట్ల కొమ్మల మీదుగా కిటికీలు, డ్రైనేజీ పైప్‌లలోంచి ఎలుకలు లోపలకు వస్తున్నట్ల గుర్తించారు.
డ్రైనేజీ పైప్‌లైన్ వ్యవస్థ సరిగా లేకపోవడంతో సెల్లార్‌లో మురుగునీరు పొంగి ప్రవహిస్తోంది. దీంతో ఎలుకలు, పందికొక్కులు విపరీతంగా పెరిగినట్లు గుర్తించారు. ఎలుకలను పట్టుకునేందుకు బోన్లు, గమ్‌స్టిక్కర్లు ఏర్పాటు చేశారు. పిడియాట్రిక్ వార్డులో ఎలుక సంచరిస్తున్నట్లు సమాచారం అందిన వెంటనే తగిన చర్యలు చేపట్టామని... ఆస్పత్రిలోని పెస్ట్ కంట్రోల్ విభాగాన్ని అప్రమత్తం చేశామని గాంధీ సూపరెంటెండెంట్ వెంకటేశ్వర్లు తెలిపారు.