హత్యా.. ఆత్మహత్యా.. ప్రమాదమా..?
భువనగిరి : రియల్టర్ సీస జయరాములు మృతిపై ఎన్నెన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యాదగిరిగుట్ట మండల కేంద్రంలో నివాసం ఉంటున్న జయరాములు ఆదివారం ఉదయం భువనగిరి మండలం వడాయిగూడెంలోని ఉన్న తన గెస్ట్‌హౌస్‌లో అనుమానాస్పదస్థితిలో మృతిచెందిన విషయం తెలిసిందే.
రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఆర్థిక లావాదేవీల విషయంలోనే హత్య జరిగి ఉంటుందని జయరాములు కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా ఆదివారం జయరాములు మృతదేహానికి భువనగిరి ఏరియా అస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అయితే పోస్టుమార్టం నిర్వహించిన డాక్టర్ మృతిచెందిన విషయాలను స్పష్టం చేయలేకపోవడంతో కుటుంబ సభ్యులు రీపోస్టుమార్టం నిర్వహించాలని భువనగిరి డీఎస్పీ ఎస్.శ్రీనివాస్‌పై ఒత్తిడితెచ్చారు. దీంతో మృతదేహానికి సికింద్రాబాద్ గాంధీ అస్పత్రిలో సోమవారం రెంవసారి పోస్టుమార్టం నిర్వహించారు. మరో రెండు రోజుల్లో నివేదిక రానుంది.
కాగా మృతిచెందిన జయరాములు మృతిపై ఇప్పటికే పలు అనుమానాలు ఉన్నాయి. హత్య చేసి ఉంటారని ఒక వాదన బలంగా ఉండగా మరో వైపు ప్రమాదవశాత్తు బంగ్లాపై నుంచి పడి మృతి చెంది ఉంటాడా, లేక ఆత్మహత్య చేసుకుని ఉంటాడా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. వ్యాపారంలో ఆర్థిక ఇబ్బందులు తీవ్రం కావడంతో ఆయనతో లావాదేవీలు నిర్వహిస్తున్న వారు ఒత్తిడి తెచ్చి ఉంటారని ఈ నేపథ్యంలో ఆత్మహత్య చేసుకుని ఉంటాడని వాదన వినిపిస్తోంది. అయితే ఆయన సన్నిహితులు మాత్రం ఆత్మహత్య చేసుకునేంత పిరికి వాడు కాడని పేర్కొంటున్నారు. బంగ్లాపై నుంచి పడడం వెనక ఏదైన ప్రమాదం ఉందా, లేక తనకు తానేపడ్డాడా, ఎవరైనా తోసేసారా అని సందేహాలు వ్యవక్తమవుతున్నాయి.
రియల్ ఎస్టెట్ వ్యాపారంలో ఉన్న డబ్బుల వివాదంలో కొందరు వారం పది రోజులుగా అయన గెస్ట్‌హౌస్‌లోనే ఉంటున్నారని, వారితో వివాదం ఉండడం వల్లే హత్య జరిగిందా అని చర్చించుకుంటున్నారు. విచారణ జరుపుతున్న పోలీసులు సైతం హత్యా, ఆత్మహత్య, ప్రమాదమా, లేక ఆరోగ్య సంబంధ సమస్యలతో చనిపోయారా అన్న కోణాల్లో విచారణ జరుపుతున్నారు. కాగా సోమవారం భువనగిరి డీఎస్పీ ఎస్, శ్రీనివాస్,ఇన్‌స్పెక్టర్ సతీష్‌రెడ్డి, రూరల్ ఎస్‌ఐ భిక్షపతిలు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీం రప్పించి ఆధారాలు సేకరించారు. ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.