S. srinivas
-
హత్యా.. ఆత్మహత్యా.. ప్రమాదమా..?
భువనగిరి : రియల్టర్ సీస జయరాములు మృతిపై ఎన్నెన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యాదగిరిగుట్ట మండల కేంద్రంలో నివాసం ఉంటున్న జయరాములు ఆదివారం ఉదయం భువనగిరి మండలం వడాయిగూడెంలోని ఉన్న తన గెస్ట్‌హౌస్‌లో అనుమానాస్పదస్థితిలో మృతిచెందిన విషయం తెలిసిందే. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఆర్థిక లావాదేవీల విషయంలోనే హత్య జరిగి ఉంటుందని జయరాములు కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా ఆదివారం జయరాములు మృతదేహానికి భువనగిరి ఏరియా అస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అయితే పోస్టుమార్టం నిర్వహించిన డాక్టర్ మృతిచెందిన విషయాలను స్పష్టం చేయలేకపోవడంతో కుటుంబ సభ్యులు రీపోస్టుమార్టం నిర్వహించాలని భువనగిరి డీఎస్పీ ఎస్.శ్రీనివాస్‌పై ఒత్తిడితెచ్చారు. దీంతో మృతదేహానికి సికింద్రాబాద్ గాంధీ అస్పత్రిలో సోమవారం రెంవసారి పోస్టుమార్టం నిర్వహించారు. మరో రెండు రోజుల్లో నివేదిక రానుంది. కాగా మృతిచెందిన జయరాములు మృతిపై ఇప్పటికే పలు అనుమానాలు ఉన్నాయి. హత్య చేసి ఉంటారని ఒక వాదన బలంగా ఉండగా మరో వైపు ప్రమాదవశాత్తు బంగ్లాపై నుంచి పడి మృతి చెంది ఉంటాడా, లేక ఆత్మహత్య చేసుకుని ఉంటాడా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. వ్యాపారంలో ఆర్థిక ఇబ్బందులు తీవ్రం కావడంతో ఆయనతో లావాదేవీలు నిర్వహిస్తున్న వారు ఒత్తిడి తెచ్చి ఉంటారని ఈ నేపథ్యంలో ఆత్మహత్య చేసుకుని ఉంటాడని వాదన వినిపిస్తోంది. అయితే ఆయన సన్నిహితులు మాత్రం ఆత్మహత్య చేసుకునేంత పిరికి వాడు కాడని పేర్కొంటున్నారు. బంగ్లాపై నుంచి పడడం వెనక ఏదైన ప్రమాదం ఉందా, లేక తనకు తానేపడ్డాడా, ఎవరైనా తోసేసారా అని సందేహాలు వ్యవక్తమవుతున్నాయి. రియల్ ఎస్టెట్ వ్యాపారంలో ఉన్న డబ్బుల వివాదంలో కొందరు వారం పది రోజులుగా అయన గెస్ట్‌హౌస్‌లోనే ఉంటున్నారని, వారితో వివాదం ఉండడం వల్లే హత్య జరిగిందా అని చర్చించుకుంటున్నారు. విచారణ జరుపుతున్న పోలీసులు సైతం హత్యా, ఆత్మహత్య, ప్రమాదమా, లేక ఆరోగ్య సంబంధ సమస్యలతో చనిపోయారా అన్న కోణాల్లో విచారణ జరుపుతున్నారు. కాగా సోమవారం భువనగిరి డీఎస్పీ ఎస్, శ్రీనివాస్,ఇన్స్పెక్టర్ సతీష్‌రెడ్డి, రూరల్ ఎస్ఐ భిక్షపతిలు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీం రప్పించి ఆధారాలు సేకరించారు. ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
నర్సీపట్నంలో 11 తిరస్కరణ
యలమంచిలిలో నామినేషన్లన్నీ సక్రమమే 18 తేదీ వరకు ఉపసంహరణకు గడువు నర్సీపట్నం/యలమంచిలి,న్యూస్‌లైన్: మున్సిపల్ ఎన్ని కల రెండో ఘట్టం ముగిసింది. నర్సీపట్నంలోని 27 వార్డులకు 160, యలమంచిలిలోని 24 వార్డులకు 135 మంది నామినేషన్లు దాఖలయ్యాయి. వాటిని ఎన్నికల అధికారితోపాటు అసిస్టెంట్ ఎన్నికల అధికారులు, ఎంపీడీవో, సిబ్బంది శనివారం నిశితంగా పరిశీలించా రు. నామినేషన్ పత్రాలతో సమర్పించిన కుల ధ్రువీకరణ పత్రాలు, పన్నుల బకాయిలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. ఈ సమయంలో అభ్యర్థులను మాత్రమే అనుమతించారు. యలమంచిలిలో 135 నామినేషన్లు సక్రమంగా ఉన్నట్టు ఎన్నికల అధికారి ఎస్.శ్రీనివాస్ తెలిపారు. వివిధ కారణాల రీత్యా నర్సీపట్నంలో 11 నామినేషన్లను తిరస్కరించినట్టు అక్కడి ఎన్నికల అధికారి పి.సింహాచలం తెలిపా రు. ఇక్కడ 8 మంది అభ్యర్థులు రెం డేసి సెట్ల నామినేషన్ వేయడం తో పాటు, రెండు నామినేషన్లలో ఒకే వ్య క్తి ఇద్దరిని ప్రతిపాదించడం, వయ స్సు సరిపోకపోవడంతో మరొకటి తిరస్కరించారు. ఉపసంహరణ కు 18వ తేదీ సాయంత్రం 3గంటల వర కు గడువు ఉంది. పార్టీ ప్రాతిపదికన ఎన్నికలు జరుగుతున్నందున ఆయా అభ్యర్థులు బీ-ఫారంలను సమర్పించాలని అధికారులు సూచించా రు. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం అభ్యర్థులకు గుర్తుల కేటాయిస్తారు. ఈ సందర్భంగా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. -
సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకు అనుమతి రద్దు చేయాలి: తెలంగాణ న్యాయవాదులు
సాక్షి, హైదరాబాద్: శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉన్నందున ఈ నెల 7వ తేదీన ఏపీఎన్జీవోలు నిర్వహించ తలపెట్టిన సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకు అనుమతి రద్దు చేయాలని తెలంగాణ న్యాయవాదులు టి.శ్రీరంగారావు, ఎస్.శ్రీనివాస్‌లు హైకోర్టును కోరారు. ఈ మేరకు గురువారం మధ్యాహ్నం అత్యవసరంగా లంచ్‌మోషన్ రూపంలో పిటిషన్ దాఖలు చేశారు. ఎల్బీ స్టేడియంలో ఏపీఎన్జీవోల సభకు అనుమతి మంజూరు చేస్తూ డీసీసీ కమలాసన్‌రెడ్డి ఇచ్చిన ఉత్తర్వులను వారు సవాల్ చేశారు. ఈ వ్యాజ్యాన్ని జస్టిస్ నూతి రామ్మోహనరావు విచారించారు. పిటిషనర్ల తరఫున గండ్ర మోహన్‌రావు వాదనలు వినిపించారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ మాత్రమే నిర్ణయం తీసుకుందని, కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. దీనికీ, ఉద్యోగస్తులకు ఎటువంటి సంబంధం లేదని, అయినా ఏపీఎన్జీవోలు గత నెల 12 నుంచి నిరవధిక సమ్మె చేస్తున్నారని, ఇలా సమ్మె చేసే హక్కు వారికి లేదని అన్నారు. ఇక్కడ ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వమని, విభజనకూ, రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు కాబట్టి, ఏపీఎన్జీవోలు చేస్తున్న సమ్మె ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకం ఎలా అవుతుందని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఏపీఎన్జీవోలు ప్రత్యక్షంగా రాజకీయ కార్యకపాల్లో పాల్గొంటున్నారని, ఈ నెల 7న సభ కూడా నిర్వహిస్తున్నారని మోహన్‌రావు చెప్పారు. న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ.. ‘30 ఏళ్ల తరువాత ప్రభుత్వ ఉద్యోగులెవరికీ ఎటువంటి పెన్షన్, గ్రాట్యుటీ, ఇతర పదవీ విరమణ ప్రయోజనాలు కల్పించబోమని, కేవలం పనిచేసిన రోజులకు మాత్రమే జీతం ఇస్తానంటూ ఓ రాజకీయ పార్టీ తమ ఎజెండాలో భాగంగా ప్రకటన ఇచ్చిందనుకున్నాం. ఆ ప్రకటన ఇచ్చింది ఓ రాజకీయ పార్టీ కాబట్టి, దానికి వ్యతిరేకంగా ఉద్యోగులు సమ్మె, ఆందోళనలు కార్యక్రమాల్లో పాల్గొంటే అది చట్ట విరుద్ధం అవుతుందా..? భవిష్యత్తరాలకు అన్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతో ఇప్పుడున్న ఉద్యోగులు సమ్మె, ఆందోళనలు చేయడం సరికాదంటారా..? అది అన్యాయం అవుతుందా.?’ అని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన రాజకీయ పార్టీ వెంటనే తమ ఎజెండాలోని అంశాలను అమలు చేస్తుందని, ఇదే రీతిలో ప్రపంచ బ్యాంకు విధానాలను అమలు చేయడాన్ని అందరం చూశామంటూ వ్యాఖ్యానించారు. గతంలోనూ హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయని, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల ధ్వంసం జరిగిందని, అటువంటి పరిస్థితులు పునరావృతం కాకూడదనే తాము 7వ తేదీ సభకు అనుమతిని రద్దు చేయాలని కోరుతున్నామని మోహన్‌రావు చెప్పారు. న్యాయమూర్తి స్పందిస్తూ.. ‘ఈ మొత్తం వ్యవహారానికి అనవసర ప్రాముఖ్యతను ఇస్తున్నామని మీకు అనిపించడం లేదా..?’ అని ప్రశ్నించారు. మీరేమంటారని హోంశాఖ తరఫు న్యాయవాది జానకిరామిరెడ్డిని అడిగారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తరువాతనే, ఏపీఎన్జీవోల సభకు అనుమతినిచ్చామని ఆయన తెలిపారు. సభకు వచ్చే ప్రతి ఉద్యోగి గుర్తింపు కార్డును పరిశీలించడం జరుగుతుందని, గుర్తింపు కార్డు ఉన్న వారిని మాత్రమే సభకు అనుమతినిస్తారని, ఆ మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని ఆయన వివరించారు. ‘ప్రభుత్వ ఉద్యోగులకు ఓ స్పష్టమైన నియమావళి ఉంది. ప్రజల నుంచి వసూలు చేసిన పన్నుల ద్వారా వచ్చిన దాంట్లో నుంచే వారికి ప్రభుత్వం జీతాలు చెల్లిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయపరమైన సమావేశాలు, సభలు నిర్వహించవచ్చా..? రాజకీయ కార్యకలాపాల్లో ప్రత్యక్షంగా పాల్గొనవచ్చా..? సభకు ఉద్యోగులు మాత్రమే హాజరు కావాలని ఎందుకు స్పష్టమైన షరతు విధించలేదు.’ అని న్యాయమూర్తి ప్రశ్నించారు. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు.