108లో వృద్ధుడికి సెలైన్ ఎక్కించి వైద్యం చేస్తున్న ఈఎంటీ శ్రీనివాస్
నెల్లూరు(అర్బన్): ఏమైందో ఏమోగానీ వారం రోజులుగా ఆ వృద్ధుడు ఇంట్లో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. స్థానికులు చనిపోయాడనుకుని భావిస్తున్న తరుణంలో 108 సిబ్బంది ప్రాణం పోశారు. సాహసంతో వైద్యం చేసి కొన ఊపిరితో ఉన్న వ్యక్తిని బతికించారు. నెల్లూరులో శుక్రవారం జరిగిన ఈ ఘటన 108 సేవల గొప్పతనాన్ని మరోసారి చాటిచెప్పింది. కాశిం అనే వృద్ధుడు వాచ్‌మేన్‌గా పనిచేస్తూ రాజీవ్ గృహకల్ప కాలనీలో ఓ చిన్న గదిని అద్దెకు తీసుకుని జీవనం సాగిస్తున్నాడు. అయితే వారం రోజులుగా ఆ వృద్ధుడి ఇంటి తలుపు మూసే ఉంది. బయట తాళం వేయలేదు. స్థానికులు పెద్దగా పట్టించుకోలేదు. శుక్రవారం ఉదయం ఆ ఇంటి పక్కింటి వారికి దుర్వాసన రావడంతో అనుమానం వచ్చి తలుపు తడితే తీయలేదు.
లోపల గడియ వేసి ఉంది. కిటికీలోంచి చూస్తే వృద్ధుడు అపస్మారక స్థితిలో ఉన్నాడు. వెంటనే 108కి సమాచారం ఇవ్వడంతో ఈఎంటీ (ఎమర్జెన్సీ టెక్నీష్ యన్) శ్రీనివాస్, పైలట్ రమేష్ తో కలిసి వెంటనే ఆ ఇంటి వద్దకు చేరుకున్నారు. తలుపులు పగుల గొట్టారు. వృద్ధుడు మరణించి ఉంటాడని స్థానికులు భావించారు. ఈఎంటీ శ్రీనివాస్ ఆ వృద్ధుడిని పరీక్షించాడు. నాడీ కూడా అందడం లేదు. బీపీ రికార్డు కాలేదు. కొన ఊపిరి ఉందని గ్రహించి ఆస్పత్రి వరకూ వెళ్లకుండా వెంటనే 108 వాహనంలోకి తీసుకెళ్లి వైద్యం చేశాడు. సెలైన్‌లు ఎక్కించడంతో పాటు, అత్యవసర ఇంజెక్షన్లు చేశాడు. దీంతో కాస్త నాడీ దొరకడంతో వెంటనే పెద్దాస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం వృద్ధుడి పరిస్థితి క్రమేపీ మెరుగవుతోంది. 108 సిబ్బంది వృద్ధుడి ప్రాణాన్ని కాపాడిన విషయం తెలుసుకున్న 108 జిల్లా మేనేజర్ పవన్‌కుమార్, నెల్లూరు డివిజన్ సూపర్‌వైజర్ రఫీ.. ఈఎంటీ శ్రీనివాస్‌ను, పైలట్ రమేష్ ను అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment