‘108’కు కొత్తగా మరో 145 అంబులెన్సులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ‘108’ అత్యవసర వైద్య సేవలకు కొత్తగా మరో 145 అంబులెన్సులను కొనుగోలు చేసేందుకు వైద్య ఆరోగ్యశాఖ రంగం సిద్ధం చేసింది. వీటి కొనుగోలుకు ఈ-టెండర్లు పిలిచిన ప్రభుత్వం... రెండు మూడు రోజుల్లో వాటిని ఖరారు చేయనుంది. వాస్తవంగా గత ఏడాదే 290 అంబులెన్సులను కొనుగోలు చేయాలనుకున్నారు. మొదటి విడతగా 145 అంబులెన్సులకే టెండర్లు పిలవగా, టాటా మోటార్స్ లిమిటెడ్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ వాహనాలు ఈ వారంలో అందుబాటులోకి రానున్నాయి. మరో 145 వాహనాలకు టెండర్లు ఖరారయ్యాక 3 నెలల్లోగా అందుబాటులోకి తీసుకొస్తామని ‘108’ ప్రత్యేకాధికారి డా.శ్రీనివాసరావు ‘సాక్షి’కి చెప్పారు. ప్రస్తుతం 316 అంబులెన్సులుంటే అందులో 121 వాహనాలు పాడైపోయాయి. సరిగా ఉన్న 195 వాహనాలకు తోడు కొత్తగా వస్తున్న వాటితో కలిపి వీటి సంఖ్య 485కు చేరనుంది.
80 అంబులెన్సుల్లో అత్యాధునిక వసతులు...
‘108’ సర్వీసుల్లో ప్రధానంగా 2 రకాలైన అంబులెన్సులను తీర్చిదిద్దాలని నిర్ణయించారు. కొత్తగా వస్తున్న వాటిలో 210 అంబులెన్సులు సాధారణ అత్యవసర వైద్య సేవలు అందిస్తాయి. వాటిని 75 వేల జనాభాకు ఒకటి చొప్పున కేటాయిస్తారు. ఇక 80 అంబులెన్సుల్లో అత్యాధునిక వైద్య సదుపాయాలు కలిగివుంటాయి. ఇవి 5 లక్షల జనాభాకు ఒకటి చొప్పున కేటాయిస్తారు. ఈ వాహనంలో ఐసీయూతో పాటు గుండె నొప్పి తదితర రోగులను తరలించే సంద ర్భంలో అందించాల్సిన అత్యాధునిక వైద్య సదుపాయాలు ఇందులో ఉంటాయి. రక్తపు బాటిళ్లనూ అందుబాటులో ఉంచుతారు. గర్భిణులను ఆసుపత్రికి తరలిస్తారు. ప్రసవం అనంతరం వారిని ఇంటికి పంపించే నిబంధనను కచ్చితంగా అమలుచేయాలని నిర్ణయిం చారు. జీపీఎస్ సౌకర్యం ఏర్పాటు చేయనున్నందున అంబులెన్సులు ఎక్కడున్నాయో...ఎంత వేగంతో ఆసుపత్రికి తరలిస్తున్నాయో ‘108’ ప్రత్యేకాధికారి సహా ఇతర ఉన్నతాధికారులు పర్యవేక్షించే అవకాశం ఉంటుంది.