కొత్త 108 వాహనాలకు మోక్షం
రేపు రోడ్డెక్కనున్న 145 కొత్త అంబులెన్సులు
సాక్షి, హైదరాబాద్: కొత్త ‘108’ అంబులెన్సులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. వీటిని గురువారం హైదరాబాద్‌లో ప్రారంభించాలని వైద్య ఆరోగ్యశాఖ తాజాగా నిర్ణయించింది. దాదాపు ఆరు నెలలుగా వీటిపై తాత్సారం చేసిన ప్రభుత్వం ఎట్టకేలకు వీటిని రోడ్డెక్కించనుంది. జీవీకే-ఈఎంఆర్‌ఐ సంస్థకే వీటి నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. కొత్త అంబులెన్సులను అందుబాటులోకి తేవడంలో సుదీర్ఘ జాప్యంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవడం, రోగుల ఇక్కట్లపై ‘సాక్షి’ కథనాలు ప్రచురించడంతో అధికారులు స్పందించారు.
ప్రస్తుతం కండిషన్‌లో ఉన్న 195 అంబులెన్సులతోపాటు 145 కొత్త వాహనాలతో కలిపి మొత్తం 340 అంబులెన్సులను అత్యవసర సేవలకు వినియోగించుకుంటామని ‘108’ ప్రత్యేకాధికారి డాక్టర్ శ్రీనివాసరావు ‘సాక్షి’కి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూర్చుతున్నందున 108 అంబులెన్సులన్నింటినీ ఒకే రకంగా తీర్చిదిద్దుతామన్నారు. కొత్త అంబులెన్సులకు అత్యాధునిక సదుపాయాలు కల్పించారు. వాహనాలన్నింటికీ ట్యూబ్ లెస్ టైర్లు ఏర్పాటు చేశారు. అలాగే సడన్ బ్రేక్ వేసినప్పుడు వాహనాలు అదుపు తప్పకుండా యాంటీ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబీఎస్)ను అమర్చడంతోపాటు ఆటోమెటిక్ వెహికిల్ ట్రాకింగ్ సిస్టమ్ (ఏవీటీఎస్)ను ఏర్పాటు చేశారు. దీనివల్ల వాహనం ఎక్కడుందో నేరుగా కంట్రోల్ రూం నుంచి ఆన్‌లైన్‌లో వీక్షించవచ్చు.