కుయ్యో.. మొర్రో
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: అత్యవసర వైద్య సేవలందించే 108 వాహనాలకు కష్టాలు పరిపాటిగా మారాయి. నిధుల విడుదలలో సర్కారు వైఖరే ఇందుకు ప్రధాన కారణం. మూడు నెలలుగా వాహనాల నిర్వహణ ఖర్చులు విడుదల చేయకపోవడంతో అవి ఎక్కడికక్కడ పడకేస్తున్నాయి. జిల్లాలో అత్యవసర సేవలందించే వాహనాలు 39 ఉన్నాయి. ఒక్కో వాహనం నిర్వహణకు ప్రభుత్వం నెలకు రూ.1.20 లక్షలు ఖర్చు చేస్తోంది. ఈ లెక్కన జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం ప్రతి నెలా రూ.46.80 లక్షలు వెచ్చిస్తోంది. కానీ గత మూడు నెలలుగా నిధుల విడుదలలో సర్కారు తాత్సారం చేస్తుండడంతో 108 వాహనాల ద్వారా అందించేసేవలు క్రమంగా నిలిచిపోతున్నాయి.
నిధులివ్వని సర్కారు..
ప్రస్తుతం 108 వాహనాలు సంకటంలో పడ్డాయి. మూడు నెలలుగా వాహనాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు. ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించి కేవలం సెప్టెంబర్ మాసం నిర్వహణ నిధులు విడుదల కాగా, సిబ్బంది వేతనాల నిధులు మాత్రం అట్టిపెట్టింది. దీంతో నిర్వహణకు బడ్జెట్ లేకపోవడంతో నిర్వాహకులు సేవలు నిలిపివేస్తున్నారు. సోమవారం కందుకూరు మండలం ఆకులమైలారంలో మహిళకు పాముకాటు వేయగా బాధితురాలి సంబంధీకులు 108కి ఫోన్ చేశారు. డీజిల్ లేనందున సేవలందించలేమని తేల్చి చెప్పడంతో అవాక్కయిన వారుప్రైవేటు వాహనాన్ని సమకూర్చుకుని నగరానికి పయనమయ్యారు.